అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్ గెలిస్తే ఇమ్రాన్‌ ఖాన్ జైలు నుంచి విడుదలవుతారా?

ఇమ్రాన్‌ఖాన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోహన్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ మధ్యలో గట్టి పోటీ ఉంది.

వైట్‌హౌస్‌లో తర్వాత కూర్చోబోయే అధ్యక్షులు ఎవరనే దానిపై కేవలం అమెరికన్లు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం వేచిచూస్తోంది.

అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య బంధం ఎప్పుడూ ఒడిదొడుకుల్లోనే ఉంటుంది. అయినప్పటికీ, పాకిస్తాన్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఈసారి కూడా, పాకిస్తానీ నేతలు అమెరికా ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) ఈ ఎన్నికలపై ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌తో ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న సంబంధం

2019లో ఇమ్రాన్‌ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వైట్‌హౌస్‌ను సందర్శించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

ఈ ఇరువురి నేతల భేటీ కెమెరా ముందు చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. ఈ సమావేశం సందర్భంగా, జర్నలిస్టుల ముందు మాట్లాడిన ట్రంప్, ఇమ్రాన్‌ఖాన్‌ తనకు మంచి స్నేహితుడని అన్నారు.

ఆ తర్వాత ఏడాది 2020లో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ ఓడిపోయారు. జో బైడెన్ వచ్చారు.

జో బైడెన్ రాకతో పాకిస్తాన్, అమెరికాల మధ్య మళ్లీ సంబంధాలు స్తంభించాయి. ఇమ్రాన్‌ ఖాన్, బైడెన్ కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడుకోలేదు.

ఆ తర్వాత, 2022లో పాకిస్తాన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో, ఇమ్రాన్‌ ఖాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

తన ప్రభుత్వం పడిపోవడానికి కారణం అమెరికా అంటూ అప్పట్లో ఆయన ఆరోపించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్తాన్‌లో చాలా కేసులున్నాయి. ఆయన గత ఏడాది ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తమ పార్టీ చీఫ్‌కు సమస్యలు కాస్త తగ్గవచ్చని పీటీఐకు చెందిన కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు.

ఒకవేళ డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే, తన ‘మంచి స్నేహితుడు’ ఇమ్రాన్‌ ఖాన్‌ను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తారని పీటీఐ సీనియర్ నేతలు భావిస్తున్నారు.

ఇమ్రాన్‌ ఖాన్

ఫొటో సోర్స్, Betsy Joles/Bloomberg via Getty Images

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, ఇమ్రాన్‌ ఖాన్‌ను విడిపించడంలో కీలకపాత్ర పోషిస్తారని మీకనిపిస్తుందా? అని పీటీఐ నేత, నేషనల్ అసెంబ్లీ సభ్యులు లతీఫ్ ఖోసాను పాకిస్తాన్ టీవీ చానల్ డాన్ ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు స్పందించిన లతీఫ్ ఖోసా, ‘‘100 శాతం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్‌లో కూడా ప్రజల గొంతుకను ఆయన వినాలనుకుంటున్నారు.’’ అని అన్నారు.

పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్ ఎదుర్కొనే ఎన్నో న్యాయపరమైన సమస్యలను అమెరికాలో చర్చించారు. చాలాసార్లు, అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని కోరారు.

డెమొక్రటిక్ పార్టీకి చెందిన 60 మందికి పైగా సభ్యులు ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.

‘‘ఇమ్రాన్‌ఖాన్‌ను, ఇతర రాజకీయ ఖైదీలను విడిపించడానికి, మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించేందుకు పాకిస్తాన్‌పై అమెరికా తన పలుకుబడిని ఉపయోగించుకోవాలి’’ అని ఆ లేఖలో కోరారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ లేఖను తిరస్కరించింది. పాకిస్తాన్‌లో రాజకీయ పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని ఈ లేఖ రాసినట్లు పేర్కొంది.

ఇటీవలే, పాకిస్తానీ అమెరికన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ తాము డోనల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్, అమెరికా మధ్యలో సంబంధాలను ట్రంప్ మెరుగుపరుస్తారని ఆశిస్తున్నట్లు ఆ కమిటీ పేర్కొంది.

పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వాన్ని అధ్యక్షుడు బైడెన్ కార్యాలయం దింపేసిందని ఆరోపించింది.

ఈ ఆరోపణలను ఎన్నోసార్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం కొట్టివేస్తూ వస్తోంది.

ట్రంప్, కమలా హారిస్

ఫొటో సోర్స్, Tayfun Coskun/Anadolu via Getty Images

పాకిస్తాన్ రాజకీయాలపై అమెరికా ఎన్నికల ప్రభావమెంత?

పాకిస్తాన్, అమెరికా మధ్య పరిస్థితులను సునిశితంగా గమనిస్తోన్న నిపుణులు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ, పాకిస్తాన్ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నారు.

‘‘ఎన్నికల తర్వాత కమలా హారిస్ కానీ, ట్రంప్ కార్యాలయం కానీ పాకిస్తాన్ కోసం ఏం చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు. ఇప్పటి వరకు ఏ అభ్యర్థి కూడా పాకిస్తాన్ విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారో సంకేతాలు ఇవ్వలేదు’’ అని వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన అనలిస్ట్ మదీహా అఫ్జల్ అన్నారు.

పాకిస్తాన్‌లో రాజకీయ పరిస్థితులు, పీటీఐ మద్దతుదారుల అంచనాలపై స్పందించిన మదీనా అఫ్జల్, అమెరికా ప్రయత్నాలతో ఇమ్రాన్‌ఖాన్ విడుదల అవుతారని తాను అనుకోవడం లేదని చెప్పారు.

ఎందుకంటే, పాకిస్తాన్‌లో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన విడుదలకు ఆర్మీపై ఎక్కువగా ఒత్తిడి పెట్టాల్సి ఉంటుందన్నారు.

‘‘అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ పదవీ కాలంలో చివరి రెండేళ్లు ఇమ్రాన్‌ ఖాన్‌కు, ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. కానీ, సాధారణంగా ప్రజాస్వామిక సిద్ధాంతాలకు ట్రంప్ అనుకూలురు కారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంతృత్వ పాలకుల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు’’ అని మదీనా అఫ్జల్ అన్నారు.

ఇదే సమయంలో, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థికి తాము సపోర్టు చేయడం లేదని మరికొంతమంది పీటీఐ నేతలు అంటున్నారు.

‘‘మేం విధానాలను చూస్తాం, వ్యక్తులను కాదు’’ అని బ్రిటన్‌కు చెందిన పీటీఐ నేత జుల్ఫి బుఖారి బీబీసీతో అన్నారు.

కానీ, ఇమ్రాన్‌ ఖాన్, అధ్యక్షుడు ట్రంప్ మధ్యలో మంచి స్నేహం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

అమెరికాలో ఉన్న పీటీఐ నేత అతీఫ్ ఖాన్ కూడా జుల్ఫి బుఖారి మాదిరిగానే అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘ఇమ్రాన్‌ఖాన్‌ విడుదల కోసం అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇటీవల లేఖ రాసిన ప్రతినిధుల సభలోని 62 మంది సభ్యులు డెమొక్రటిక్ పార్టీకి చెందినవారు’’ అని అతీఫ్ ఖాన్ చెప్పారు.

ప్రతినిధుల సభ, సెనేట్ నుంచి డెమొక్రటిక్ నేతల మద్దతు పీటీఐకు ఉందని ఆయన అంటున్నారు.

‘‘ఐదు వారాల కిందట, ఒక ప్రభావవంతమైన పాకిస్తానీని ట్రంప్ కలిశారని, ఆ సమావేశంలో తన స్నేహితుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ చెప్పినట్లు అతీఫ్ ఖాన్ తెలిపారు.

ఆ ప్రభావవంతమైన పాకిస్తానీ ఎవరని అడగగా, ఆయన పేరు చెప్పేందుకు నిరాకరించారు. ఆయన పీటీఐకు చెందిన వ్యక్తి కాదని అన్నారు. ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ కూడా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

‘‘పీటీఐ నేతగా అందరూ ట్రంప్‌కు ఓటేయమని అమెరికాలో నివసించే పాకిస్తానీలకు నేను చెప్పలేను’’ అని అతీఫ్ ఖాన్ చెప్పారు.

‘‘ఒకే బాస్కెట్‌లో అన్ని గుడ్లను పెట్టాలని పాకిస్తానీలకు నేను చెప్పను. ప్రస్తుతం కమలా హారిస్, ట్రంప్‌కు గెలిచే అవకాశాలు 50-50 శాతంగా ఉన్నాయి’’ అని అన్నారు.

పీటీఐ నేతలు చెప్పేవి ఎలా ఉన్నప్పటికీ, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఆయన ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతు ఇస్తారో? లేదో? ఇప్పుడే చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల తర్వాత పాకిస్తాన్ విషయంలో అమెరికా విధానంలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని పాకిస్తాన్‌లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన ఎలిజబెత్ థ్రెల్‌కెల్డ్ అన్నారు. ఎలిజబెత్ ప్రస్తుతం స్టిమ్సన్ సెంటర్‌లోని దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)