అమెరికా ఎన్నికలు: బంగ్లాదేశ్ హిందువులకు, మోదీకి అనుకూలంగా ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్ల కోసం హారిస్, ట్రంప్ ప్రయత్నాలు
- బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు జరుగుతున్నాయన్న ట్రంప్
- తమ దేశంపై ట్రంప్ కామెంట్లను విమర్శించిన బంగ్లాదేశీ సంస్థ
- తన భారత, ఆఫ్రికన్ మూలాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్న హారిస్
- మోదీకి, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
- స్వింగ్ స్టేట్స్‌లో భారతీయుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారే అవకాశం
- అందుకే భారతీయులను, హిందువులను ఆకర్షించేందుకు ట్రంప్ ప్రయత్నాలు
- మొదట్లో డెమొక్రాట్లకు అనుకూలంగా కనిపించిన భారతీయులు క్రమంగా రిపబ్లికన్లవైపు మొగ్గు
బంగ్లాదేశ్ హిందువులకు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా సంతతి ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన చూస్తే ఇదే అర్థమవుతోంది.
డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తోన్న కమలా హారిస్ ఇప్పటికే తన భారత, ఆఫ్రికన్ మూలాల గురించి మాట్లాడుతూ దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ట్రంప్ ఏం పోస్టు చేశారు?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’పై దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్, ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లరి మూక వారిపై దాడి చేసింది. వారిని దోచుకుంది. ఇది పూర్తిగా అరాచకం.’’ అంటూ ట్వీట్ చేశారు.
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇదే పోస్టులో ట్రంప్ విరుచుకుపడ్డారు.
‘‘నా పదవీ కాలంలో ఇలా ఎప్పటికీ జరిగేది కాదు. కమలా, జో బైడెన్‌లు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను పక్కనపెట్టారు. ఇజ్రాయెల్ నుంచి యుక్రెయిన్ వరకు, సొంత దేశంలోని దక్షిణ సరిహద్దులో అలజడికి వారు కారణమయ్యారు. కానీ, మళ్లీ మనం అమెరికాను బలంగా మార్చుకుందాం. ఈ బలం ద్వారా శాంతిని పున: స్థాపించుకుందాం’’ అని ట్రంప్ పిలుపునిచ్చారు.
‘‘రాడికల్ లెఫ్ట్‌కు చెందిన మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లను రక్షిస్తాం. మీ స్వేచ్ఛ కోసం పోరాడతాం. భారత్‌తో, నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో ఉన్న ఉన్నతమైన భాగస్వామ్యాన్ని నా పాలనలో మరింత పటిష్టం చేసుకుంటాం.’’ అని ట్రంప్ చెప్పారు.
‘‘చెడుపై మంచి గెలుపొందేందుకు ఈ దీపావళి పండుగ దారిచూపుతుందని ఆశిస్తున్నా..’’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
విద్యార్థుల నిరసనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన ప్రధాని పదవిని వీడి, ఆ దేశం విడిచి వచ్చేశారు. ఆ తర్వాత హిందువులతో సహా మైనార్టీలపై ఆ దేశంలో దాడులు జరుగుతున్నాయంటూ వస్తోన్న రిపోర్టులపై స్పందించాలంటూ అమెరికాపై ఒత్తిడి నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ప్రకటనపై స్పందనలేంటి?
‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలు పడుతున్న బాధను అర్థం చేసుకున్నందుకు, హిందువుల విలువలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నందుకు బహుముఖ ప్రజ్ఞాశాలియైన నాయకుడు డోనల్డ్ ట్రంప్‌ను నేను అభినందిస్తున్నా.’’ అంటూ ట్రంప్‌ను కొనియాడుతూ త్రిపుర మంత్రి సుధాంగ్షు దాస్ సోషల్ మీడియాలో రాశారు.
‘‘ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ప్రయత్నించి ఉండొచ్చు. కానీ, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడిన తొలి అతిపెద్ద అమెరికా రాజకీయవేత్త ట్రంప్. హిందూ మూలాలు ఉన్నప్పటికీ, ఈ విషయంలో కమలా హారిస్ మౌనం వహించారు. ఒకవేళ ట్రంప్ గెలిస్తే, బైడెన్ ప్రోద్బలంతో యూనస్ ఆడిన ఆటలు ముగియవచ్చు.’’ అని రక్షణ నిపుణులు బ్రహ్మ చెల్లాని అన్నారు.
దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయూబ్ కూడా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు.
‘‘మోదీ-ట్రంప్ ద్వయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందూ జాతీయవాదులు, భారత్‌లో ట్రంప్ మద్దతుదారులు ఈ ట్వీట్‌తో మరింత ఉత్సాహంగా ఉన్నారు’’ అంటూ ట్రంప్ పోస్టు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
‘‘బంగ్లాదేశ్‌లో అనాగరిక హింస ఎదుర్కొంటున్న హిందువుల దుస్థితి గురించి మాట్లాడిన అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌కు గ్లోబల్ హిందూ కమ్యూనిటీ కృతజ్ఞతలు చెబుతోంది’’ అని ‘స్టాప్ హిందూ జినోసైడ్’ అనే సంస్థ పేర్కొంది.
అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన దీపావళి బహుమతి కేవలం అమెరికా హిందువులకు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసమని తెలిపింది.
మరోవైపు ట్రంప్ ట్వీట్‌పై బంగ్లాదేశ్ నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి.
‘‘ట్రంప్, మీరు బంగ్లాదేశ్‌ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జరిపినట్లు చెబుతున్న దాడులు ధ్రువీకరించని ప్రాపగాండా మాత్రమే. పౌరులందర్ని దేశం సంరక్షిస్తోంది. హిందూ ఓట్లపై ఫోకస్ పెడుతూ మీరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీని వల్ల అమెరికాలో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి’’ అని స్వాధీన్ బంగ్లా బేతర్ కేంద్ర అనే సంస్థ పోస్టు చేసింది. ఇది తనకు తాను ఫ్యాక్ట్ చెకర్‌గా అభివర్ణించుకుంటుంది.
‘‘దీపావళి రోజున, సరిగ్గా ఎన్నికలకు ఐదు రోజుల ముందు ట్రంప్ పంపిన మెసేజ్ స్పష్టంగా అర్థమవుతోంది. స్వింగ్ రాష్ట్రాలలో భారతీయ అమెరికన్ల ఓట్లు చాలా కీలకం’’ అని జర్నలిస్ట్ రాహుల్ శివశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో హిందూ సంస్థల ప్రచారం
బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడుల అంశాలను అమెరికాలో నివసిస్తున్న చాలా హిందూ సంస్థలు ప్రజా వేదికలపైకి తీసుకెళ్లాయి. ‘స్టాప్ హిందూ జినోసైడ్’ అనే సంస్థ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎకనామిక్ బాయ్‌కాట్‌కు డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులను రక్షించాలని కోరుతూ, ఒక విమానం సాయంతో న్యూయార్క్‌లో ఈ సంస్థ బ్యానర్‌ను ప్రదర్శించింది. ఈ సంస్థ వెబ్‌సైట్‌ను చూస్తే, ఇది సంఘ్ పరివార్‌లో భాగమైన విశ్వ హిందూ పరిషత్‌కు చెందినదని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ...సంఘ్ పరివార్ నుంచే ఆవిర్భవించారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ అమెరికాలోని రాజకీయవేత్తల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా ప్రయత్నిస్తోంది.
ఈ హిందూ సంస్థ భారత ప్రభుత్వం నుంచి సాయం పొందుతోందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ఫౌండేషన్ ఖండిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత సంతతి ఓటర్లు ఎందుకు ఇంత కీలకం?
అమెరికా సెన్సస్ బ్యూరో గణాంకాల ప్రకారం 2020 నాటికి భారత సంతతి అమెరికన్లు సుమారు 44 లక్షల మంది ఉన్నారని అంచనా. అదేవిధంగా, భారత సంతతి ఓటర్ల సంఖ్య సుమారు ఒక శాతం ఉంటుందని అంచనావేశారు.
అమెరికాలోని ఎలక్టోరల్ గణాంకాల ప్రకారం, ఈ ఒక శాతం ఓటర్లు కూడా చాలా కీలకం.
అమెరికాలో స్వింగ్ రాష్ట్రాలుగా పిలిచే ఏడు రాష్ట్రాలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఈ రాష్ట్రల్లో వీరి పాత్ర చాలా కీలకం.
సర్వేల సగటు ఆధారంగా చూస్తే...ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత లేదు.
ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో అత్యధిక ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రం పెన్సిల్వేనియా. అందుకే రెండు పార్టీలకు ఈ రాష్ట్రం ఎంతో కీలకం. ఇక్కడ ఆధిక్యత కనబరిస్తే మ్యాజిక్ ఫిగర్ 270 సాధించడం సులువు అవుతుంది.
2024 ఏఏపీఐ డేటా ఓటర్ సర్వే ప్రకారం, ఇండియన్ అమెరికన్ ఓటర్లలో సగం మందికి పైగా అంటే 55 శాతంమంది డెమొక్రాట్ల వైపు ఉండగా, 26 శాతం రిపబ్లికన్ల వైపు ఉన్నట్లు తెలిసింది.
రిజిస్టర్డ్ ఇండియన్ అమెరికన్ ఓటర్లలో 61 శాతం మంది హారిస్‌కు ఓటేయాలని ప్లాన్ చేస్తున్నారని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యూగవ్ విడుదల చేసిన సర్వేలో తెలిసింది. అలాగే, 32 శాతంమంది ట్రంప్‌కు ఓటేయాలనుకుంటున్నారని తెలిపింది.
ఇండియన్ అమెరికన్లు డెమొక్రాట్ల వైపు ఉన్నప్పటికీ, 2020 నుంచి చూసుకుంటే మాత్రం ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య కాస్త తగ్గింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














