19 భారతీయ కంపెనీలపై అమెరికా ఎందుకు ఆంక్షలు విధించింది? భారత్ ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహకరించాయనే ఆరోపణలతో 19 భారతీయ కంపెనీలపై, ఇద్దరు భారతీయులపై అమెరికా అక్టోబరు 30న ఆంక్షలు విధించింది. భారతీయ కంపెనీలతో పాటు మొత్తం 400 కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికా గడ్డపై కుట్ర జరిగిందని, ఆ కుట్రలో భారత పౌరుడి పాత్ర ఉందని అమెరికా కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో తాజా ఆంక్షలను అమెరికా ప్రకటించింది.
ఈ కంపెనీలపై, ప్రజలపై తమ విదేశాంగ విభాగం, ట్రెజరీ విభాగం, కామర్స్ విభాగం ఆంక్షలు విధించినట్టు అమెరికా ప్రకటన విడుదల చేసింది.
భారత్‌తో పాటు చైనా, మలేషియా, థాయిలాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా పలు దేశాల కంపెనీలు, వ్యక్తులపై అమెరికా ఈ ఆంక్షలను విధించింది.
ఈ కంపెనీలు రష్యాకు వస్తువులు సరఫరా చేస్తున్నాయని, యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా వాటిని ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపించింది.
ఈ వస్తువులతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ఐటెమ్స్... అత్యధిక ప్రాధాన్యత కలిగిన వస్తువుల జాబితా(CHPA)లో ఉన్నాయి.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ బ్యూరోతో పాటు బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్ ఈ వస్తువులను గుర్తించాయని అమెరికా ఆరోపించింది.
భారతీయ కంపెనీలను అమెరికా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు రష్యా సైన్యానికి సహాయం చేసిందని ఆరోపిస్తూ 2023 నవంబర్‌లో భారతీయ కంపెనీపై నిషేధం కూడా విధించింది.


ఫొటో సోర్స్, ascending flight
ఏఏ భారతీయ కంపెనీలపై ఆంక్షలు?
అమెరికా ఆంక్షలు విధించిన భారతీయ కంపెనీలు ఏవి? ఆ భారతీయులు ఎవరు? అమెరికా ఆంక్షలు విధించడానికి కారణం ఏంటి? అనేవి ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్నలు.
ఆంక్షలు విధించిన 120 కంపెనీల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. నాలుగు భారతీయ కంపెనీలపై ఉన్న ఆరోపణల వివరాలను కూడా వెల్లడించింది.
అసెండ్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మాస్క్ ట్రాన్స్, టీఎస్‌ఎండీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫూట్‌రెవో.. తదితర కంపెనీలు అందులో ఉన్నాయి.
2023 మార్చి నుంచి 2024 మార్చి మధ్య ఏడాది కాలంలో అసెండ్ ఏవియేషన్... రష్యాకు చెందిన కంపెనీలకు 700లకు పైగా షిప్‌మెంట్‌లను పంపినట్టు అమెరికా ఆరోపించింది.
ఇందులో రూ.1 కోటీ 70 లక్షలకు పైగా విలువైన సీహెచ్‌పీఏ వస్తువులు ఉన్నాయి.
2023 జూన్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య మాస్క్ ట్రాన్స్ కంపెనీ 2 కోట్ల 5 లక్షల రూపాయల విలువైన వస్తువులను పంపిందని, రష్యా వాటిని విమానయాన సంబంధిత అవసరాలకు ఉపయోగించిందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది.
టీఎస్‌ఎండీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రష్యా కంపెనీలకు 3 కోట్ల 6 లక్షల రూపాయలకు పైగా విలువైన వస్తువులు సరఫరా చేసిందని అమెరికా ఆరోపించింది.
ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, కెపాసిటర్‌లు వంటి వాటిని టీఎస్‌ఎండీ అందించిందని తెలిపింది.
ఈ జాబితాలో ఉన్న మరో కంపెనీ ఫూట్‌రెవో 2023 జనవరి నుంచి 2024 ఫిభ్రవరి మధ్య రష్యాకు దాదాపు రూ.12 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను సరఫరా చేసినట్టు అమెరికా ఆరోపిస్తోంది. డ్రోన్‌లను తయారుచేసే కంపెనీకి ఈ వస్తువులు అందించినట్టు ఆరోపణలున్నాయి.
వీటితో పాటు భారత్‌కు చెందిన అబ్‌హార్ టెక్నాలజీస్, సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డెన్‌వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈఎంఎస్‌వై టెక్, గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్, ఇనోవియో వెంచర్స్, కేడీజీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఖుష్బూ ప్రైవేట్ లిమిటెడ్‌పై అమెరికా ఆంక్షలు విధించింది.
లోకేష్ మెషీన్స్ లిమిటెడ్, ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్‌ఎల్‌పి, పాయింటర్ ఎలక్ట్రానిక్స్, ఆర్‌ఆర్‌జి ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, షార్ప్‌లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్, శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ పౌరులపైనా ఆంక్షలు
అమెరికా ఆంక్షలు విధించిన ఇద్దరు భారతీయుల పేర్లు వివేక్ కుమార్ మిశ్రా, సుధీర్ కుమార్.
వివేక్ కుమార్ మిశ్రా, సుధీర్ కుమార్ అసెండ్ ఏవియేషన్ కో డైరెక్టర్లు, పాక్షిక వాటాదారులని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది.
అసెండ్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దిల్లీకి చెందిందని, విమానయాన పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో విడిభాగాలు, లూబ్రికెంట్లు సరఫరా చేస్తోందని కంపెనీ వెబ్‌సైట్ తెలియజేస్తోంది.
ఈ కంపెనీ 2017లో మార్చిలో ఏర్పాటైంది.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ దేశాలు రష్యాపై 16,500లకు పైగా ఆంక్షలు విధించాయి.
ఈ ఆంక్షల వల్ల రష్యా విదేశీ మారక నిల్వలలో దాదాపు సగం అంటే 276 బిలియన్ డాలర్లు స్తంభించిపోయాయి.
వీటితోపాటు యూరోపియన్ యూనియన్ రష్యన్ బ్యాంకుల ఆస్తులలో 70 శాతం స్తంభింపజేసింది. వాటిని స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మినహాయించింది.
SWIFT అంటే 'సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్. ఈ వ్యవస్థతో అంతర్జాతీయంగా వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణలో దీని ఉపయోగం ఎంతో ఉంది.
‘‘కంపెనీలపై విధించిన నిషేధం వల్ల అవి స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో బ్లాక్‌లిస్ట్‌లో ఉంటాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో ఆ కంపెనీలు లావాదేవీలు చేయలేవు’’ అని విదేశీ వ్యవహారాల నిపుణులు, 'ది ఇమేజ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్' అధ్యక్షులు రవీంద్ర సచ్‌దేవ్ చెప్పారు.
నిషేధానికి అనుకూలంగా ఉన్న దేశాల్లో ఈ కంపెనీలకు ఉన్న ఆస్తులను కూడా స్తంభింపచేయవచ్చని ఆయన తెలిపారు.
‘‘రష్యా వెన్నువిరిచే ఉద్దేశంతోనే అమెరికా ఇలా చేస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను, రక్షణ వ్యవస్థను బలహీనపరచాలన్నది అమెరికా కోరిక’’ అని సచ్‌దేవ్ చెప్పారు.
కంపెనీలపై ఇలా విధించే ఆంక్షలతో భారత్, అమెరికా సంబంధాలపై పెద్దగా ప్రభావం ఉండదని, ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని సచ్‌దేవ్ విశ్లేషించారు.
యూరోపియన్ దేశాల ఆంక్షల వల్ల రష్యాకు పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
చమురు ఎగుమతితో రష్యా చాలా డబ్బు సంపాదించిందని అమెరికన్ థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ విశ్లేషించింది.
రష్యా ప్రతిరోజూ 8 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోందని, రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారులుగా భారత్, చైనా ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.
అదే సమయంలో రష్యా అనేక నిషేధిత వస్తువులను జార్జియా, బెలారస్, కజకిస్థాన్ వంటి దేశాల సాయంతో దిగుమతి చేసుకుంటోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
అమెరికా ఆంక్షలపై భారత ప్రభుత్వ స్పందనేంటి?
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
"19 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షల గురించి రిపోర్టులు చూశాం. వ్యూహాత్మక వాణిజ్యం, ఆయుధాల వ్యాప్తి నిరోధంపై భారత్‌కు న్యాయ, నియంత్రణ పరిధి ఉంది. మేం మూడు కీలక ఆయుధాల వ్యాప్తి, ఎగుమతి నియంత్రణ వ్యవస్థల్లో సభ్యులుగా ఉన్నాం. వాసినార్ ఎరేంజ్‌మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్ క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో భారత్ భాగస్వామిగా ఉంది. యూఎన్ఎస్‌సీ ఆంక్షలను, ఆయుధాల వ్యాప్తి నిరోధంపై యూఎన్ఎస్‌సీ తీర్మానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. కంపెనీల లావాదేవీలు, భారతీయ చట్టాలను ఉల్లంఘించేలా లేవు. అయినప్పటికీ ఆయుధాల వ్యాప్తి నియంత్రణను అమలుపరిచే దేశంగా, ఎగుమతి నియంత్రణ నిబంధనలపై భారత కంపెనీలకు అవగాహన కల్పించడానికి, సంబంధిత విభాగాలతో, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయ కంపెనీలపై ప్రభావం చూపే చర్యల గురించి తెలియజేస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














