అమెరికా ఎన్నికలు 2024: కమలా హారిస్, డోనల్డ్‌‌ ట్రంప్‌ల గురించి మీకు ఇప్పటి వరకు తెలియని విషయాలు, చూడని ఫోటోలు...

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌ల చిన్ననాటి ఫోటోలు.

అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు చెందిన అనేక ఫోటోలు, వీడియోలు అక్కడి ఓటర్లకు దర్శనమిస్తున్నాయి. అందులో పోడియం వద్ద నిల్చున్నవి, ప్రజలకు విషెస్ చెబుతున్నవి, విమానాల నుంచి దిగుతున్నవి...ఇలా చాలా ఉన్నాయి.

అయితే, మీరు ఇక్కడ భిన్న కోణాలను స్పృశించే ఆ ఇద్దరి ఫోటోలను చూస్తే వారెవరు? నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో అర్ధం చేసుకోగలుగుతారు.

పైన కనిపించే ఫోటో కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌ల చిన్ననాటిది. ఇందులో ఇద్దరి వయస్సు మూడేళ్లు. ఆ వయసులో వాళ్లకు వైట్‌హౌస్ అంటే ఏమిటో కూడా తెలియదు.

డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ బాల్యం ఓక్లాండ్, కాలిఫోర్నియాలలో గడిచింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలో పెరిగారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌ల కుటుంబాలు

ఫొటో సోర్స్, Kamala Harris / @realDonaldTrump

ఫొటో క్యాప్షన్, తల్లి శ్యామల గోపాలన్, చెల్లి మాయా(ఎరుపు రంగు జాకెట్ )లతో కమలా హారిస్, తల్లిదండ్రులతో ట్రంప్ (ఆర్మీ డ్రెస్సులో)

భారతీయురాలైన తల్లి శ్యామల గోపాలన్ దగ్గర పెరిగారు హారిస్, ఆమె సోదరి మాయ. శ్యామల క్యాన్సర్ పరిశోధకురాలు. సామాజిక కార్యకర్త కూడా.

డోనల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ జర్మన్ వలసదారుల కుమారుడు. ట్రంప్ తల్లి పేరు మేరీ ఆనే మాక్లియోడ్ ట్రంప్. ఆమె స్కాట్లాండ్‌లో పుట్టారు. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో 13 సంవత్సరాల వయస్సులోనే ట్రంప్‌ పేరును నమోదు చేయించారు.

హారిస్ కెనడాలో మాంట్రియల్‌లో ఉన్న ఓ హైస్కూలులో ఐదేళ్లు చదివారు. ఆ సమయంలో ఆమె తల్లి మెక్‌గిల్ యూనివర్సిటీలో పాఠాలు చెబుతుండేవారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో హారిస్ అడ్మిషన్ తీసుకున్నారు.

తాను 1959లో అకాడమీలో చేరానని, అక్కడ ఐదేళ్లు సైనిక శిక్షణ లభించిందని, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అది సహాయపడిందని ట్రంప్ చెప్పారు. ఎముకకు గాయం, చదువు కారణాలతో వియత్నాం యుద్ధంలో ట్రంప్ పాల్గొనలేదు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌

ఫొటో సోర్స్, Alamy

పౌర హక్కుల ఉద్యమం ప్రాముఖ్యత గురించి చిన్నప్పటి నుంచి హారిస్‌కు ఆమె తల్లి నేర్పించారు. 2004లో వాషింగ్టన్‌లో జరిగిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఫ్రీడమ్ మార్చ్‌లో హారిస్ పాల్గొన్నారు.

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుంచి ట్రంప్ డిగ్రీ పాసయ్యారు. కుటుంబ వ్యాపార బాధ్యతలు నిర్వహించడానికి తండ్రి ఆయన్ను ఎంచుకున్నారు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌

ఫొటో సోర్స్, Getty Images

హారిస్ కాలిఫోర్నియాకు తిరిగి వచ్చారు. అక్కడ ఆమె తక్కువ సమయంలోనే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అనంతరం 2016లో అమెరికా సెనేట్‌కు పోటీ చేసి గెలిచారు.

ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చిన సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. అప్పట్లో హిల్లరీ క్లింటన్‌ను ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ట్రంప్.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ఫొటో సోర్స్, White House / Getty Images

మూడు సంవత్సరాల తరువాత అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోసం ప్రయత్నాలు చేశారు హారిస్. కానీ సక్సెస్ కాలేదు.

అయితే డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ రేసులో గెలిచిన జో బైడెన్.. హారిస్‌ను తన రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నారు. వారిద్దరూ ట్రంప్, మైక్ పెన్స్‌లను ఓడించగల సత్తా ఉన్న నేతలుగా నిరూపించుకున్నారు.

ట్రంప్ పదవీ కాలం ముగిసి, బైడెన్-హారిస్ ద్వయం పదవీకాలం ప్రారంభమైన తర్వాత అమెరికాలో పరిస్థితులు చాలా మారాయి. జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపడం, కోవిడ్ లాక్‌డౌన్‌లు, మాస్క్ ఆదేశాలు, సామాజిక అశాంతి వంటివి ఇందులో ఉన్నాయి.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌

ఫొటో సోర్స్, Getty Images / Reuters

హారిస్ వైస్ ప్రెసిడెంట్‌గా 2021లో తన మొదటి అంతర్జాతీయ పర్యటన చేశారు. ఆమె గ్వాటెమాలాను సందర్శించారు. మెక్సికో, అమెరికా దక్షిణ సరిహద్దుకు చేరుకునే లాటిన్ అమెరికన్ వలసదారుల సంఖ్యను తగ్గించే బాధ్యతను ఆమెకు అప్పగించారు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ, యుక్రెయిన్, గాజాలలో యుద్ధం వంటి అనేక విదేశాంగ విధాన సమస్యలు ఆమె పదవీకాలంలో చోటుచేసుకున్నాయి.

అధ్యక్షుడిగా ట్రంప్ తన మొదటి విదేశీ పర్యటనను 2017లో చేశారు. మొదటగా ఆయన సౌదీ అరేబియాను సందర్శించారు. విదేశీ సంఘర్షణల నుంచి దేశాన్ని దూరంగా ఉంచడం, అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి విధానాలను ట్రంప్ సమర్థించారు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌ కుటుంబాలు

ఫొటో సోర్స్, Alamy / AP

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్(పైన) , డోనల్డ్ ట్రంప్‌‌ (కింద) కుటుంబాలు

డగ్ ఎమ్‌హాఫ్‌ను హారిస్ వివాహం చేసుకున్నారు. ఆయన హారిస్ కోసం ప్రచారం చేశారు. ఎమ్‌హాఫ్ మొదటి భార్యకు పుట్టిన కాల్, ఎల్లాలకు హారిస్ సవతి తల్లి. వాళ్లిద్దరినీ ఆమె ‘మోమాల’ అని పిలుస్తుంటారు.

ట్రంప్ కుటుంబ సభ్యులు ఆయన రాజకీయ జీవితంలో కీలకంగా ఉన్నారు. కానీ ఆయన భార్య మెలానియా 2024 ప్రచారంలో ఎక్కువగా కనిపించలేదు.

ట్రంప్‌కు మొదటి భార్య ఇవానా నుంచి ముగ్గురు పిల్లలున్నారు. డోనల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ అన్నవి వారి పేర్లు. ట్రంప్ రెండో భార్య పేరు మార్లా మాపుల్స్. వారికి ఒక కూతురు ఉన్నారు. పేరు టిఫనీ. 2005లో మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నారు, వారికి బారన్ అనే కుమారుడు ఉన్నారు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌‌

ఫొటో సోర్స్, Reuters / EPA-EFE

హారిస్ 2024 అధ్యక్ష రేసులోకి ఆలస్యంగా ప్రవేశించారు. బైడెన్ తప్పుకోవడంతో ఆమె పోటీలోకి వచ్చారు. అధ్యక్ష పదవికి నామినేట్ అయిన మొదటి నల్లజాతి, ఏషియన్-అమెరికన్ మహిళగా హారిస్ చరిత్ర సృష్టించారు.

ఇల్లినాయిస్‌లోని షికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆమె ప్రసంగించారు.

మరోవైపు, డోనల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున మూడోసారి అధ్యక్ష పదవి పోటీ కోసం టికెట్ సంపాదించారు. హత్యాయత్నం నుంచి బయటపడిన ట్రంప్ చెవికి కట్టు కట్టుకొని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)