‘‘నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’’ అని పవన్ కల్యాణ్ ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, facebook
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
‘‘నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’’ అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
‘‘పోలీసు అధికారులకు, డీజీపీకి చెబుతున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు, జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లకు చెబుతున్నాను. అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. దయచేసి దీన్ని మర్చిపోకండి. మాతో పదిసార్లు చెప్పించుకోకండి. మా బంధువండి, మా రక్తమండి అంటే.. మడతపెట్టి కొట్టండి వాడిని. హోం మంత్రి అనిత గారికి కూడా చెబుతున్నాను. హోం మినిష్టర్ మీరు. నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం శాఖకు మీరు బాధ్యత వహించండి. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ చెబుతున్నాను.. అధికారులు ఇలాగే నిశ్చలంగా, ఏం చేయకుండా ఉంటే.. నేను హోం శాఖ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో అన్నారు.

స్వయంగా ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్, తమ ప్రభుత్వ అధికారులపై, హోం మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
అయితే, పవన్ కల్యాణ్ అలా అనడంలో తప్పేమీ లేదని, ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసని, త్వరలోనే ఆయనతో మాట్లాడతానని హోంమంత్రి వంగలపూడి అనిత బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, facebook
‘అరెస్టులకు కులం సమస్య ఎందుకొస్తోంది?’
గొల్లప్రోలు జెడ్పీ బాలుర హై స్కూల్‌లో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతపై, తిరుపతిలో మూడేళ్ల బాలికపై హత్యాచారం జరగడంపై మాట్లాడుతూ ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే పోలీస్ శాఖ ఏం చేస్తోందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కులం పేరు చెప్పి క్రిమినల్స్‌ని వదిలేస్తారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతే గత ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో అధికారులు ప్రదర్శించిన అలసత్వం వారసత్వంగా వచ్చింది. గత మూడు నెలల నుంచీ, మొదటి రోజు నుంచీ, మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నేను ఒకటే చెప్పాను. అసెంబ్లీలో కూడా చూశారు. లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టమన్నాను. అధికారులకు అలవాటైపోయింది. ఇదివరకు అసలు నియంత్రణే లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చేశారు. ఇప్పుడు ధర్మబద్ధంగా చెయ్యండి.. అంటే ఆలోచిస్తున్నారు. మీన మేషాలు లెక్కిస్తున్నారు. దేనికి మీనమేషాలు లెక్కపెడుతున్నారో అర్థం కావడం లేదు. క్రిమినల్‌కు కులం ఉండదు, మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకు? ఒకరిని అరెస్టు చేయాలంటే కులం సమస్య వస్తుంది. అసలు కులం సమస్య ఎందుకొస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులం అని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్‌లు కదా చదువుకుంది? ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది మీకు? భారతీయ శిక్ష్మాస్మృతి ఏం చెబుతోంది మీకు? క్రిమినల్స్‌ను వెనకేసుకుని రమ్మని చెబుతోందా? ఇళ్లల్లోకి వచ్చి అత్యాచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అవీ ఇవీ మాట్లాడడం భావ ప్రకటనా స్వేచ్ఛ అట వైసీపీ వాళ్లకు. తెగేదాకా లాగకండి. ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతకు పదింతలు ఉంది. అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనం. చేతకాక కాదు. నేను హోం శాఖ తీసుకోలేక కాదు. మీకు ఎలా ఉండాలంటే.. క్రిమినల్స్‌కి ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు చేయాలి మీ అందరికీ. అప్పుడు గానీ మాట వినరు మీరు. అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు మా అందరినీ మీరు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఫొటో సోర్స్, facebook
తిరుపతిలో ఏం జరిగింది?
‘‘తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో గత శుక్రవారం ఓ 22 ఏళ్ల యువకుడు తన దగ్గరి బంధువైన మూడేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లారు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను చంపేసి పూడ్చిపెట్టారు. రాత్రి బాగా పొద్దుపోయినా బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చుట్టుపక్కల వెతికినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్యాచారం సంగతి బయటపడింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసు అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులకీ వెంటనే శిక్ష పడేలా చేస్తామని హోం మంత్రి అనిత అన్నారు.

ఫొటో సోర్స్, FB/janasenaparty
కూటమి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?
మరోవైపు పిఠాపురంలో చేసిన ప్రసంగంలో కూటమి ఎమ్మెల్యేలపైనా పవన్ విమర్శలు చేశారు.
కూటమి ఎమ్మేల్యేలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ‘‘మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? నాకు డిప్యూటీ సీఎం పదవి ఎమ్మెల్యే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎమ్మెల్యేలుగా మీరు ఏం చేస్తున్నారు? వసతి గృహాల్లో ఉండే ఆడపిల్లలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు? ఇసుకలో ఎంత వస్తుంది? అని కొంతమంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అంతే తప్ప ఇటువంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు” అని పవన్ మండిపడ్డారు.
హోం మంత్రిత్వ శాఖను ఉద్దేశించి పవన్ అన్న మాటలపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.
అయితే, పవన్ మాటల్లో ప్రత్యేక అర్థాలేమీ లేవని, ఆయన సహజంగానే మాట్లాడారని టీడీపీ మంత్రులు చెబుతున్నారు.
“డిప్యూటీ సీఎంగా అక్కడ జరిగిన దానిని బేస్ చేసుకుని ఆయన చెప్పారు. హోం మంత్రి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు. హోం శాఖ తీసేసుకుంటానని పవన్ చెప్పలేదు కదా. సీఎంలు, డిప్యూటీ సీఎంలు వేరే శాఖలో ఏదైనా జరిగితే కామెంట్ చేయడం సహజం. ఆటోమేటిక్‌గా అలర్ట్ అవుతాం’’ అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.
పవన్ మాటలపై హోం మంత్రి స్పందనేంటి?
పవన్ మాటలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
"పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో మాట్లాడతా. పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయం లేదని నాకు తెలుసు’’ అని హోం మంత్రి అనిత బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, FB/AmbatiOfficial
పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఏమంటోంది?
పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘హోం మంత్రికి హోంలోనే(కూటమిలో)అసంతృప్తి’’ అంటూ కామెంట్ చేశారు.
‘‘హోం శాఖ తీసుకుని ప్రతాపం చూపాలి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో.. కిల్ బిల్ పాండే అవుతారో కాలమే నిర్ణయిస్తుంది’’ అంటూ అంబటి రాంబాబు మరో పోస్ట్ పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాజకీయ నిపుణుల అభిప్రాయమేంటి?
‘‘పవన్ కల్యాణ్ మెల్లగా కూటమి కామన్ ఎజెండా నుంచి దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తానూ కూటమి సభ్యుడినే అన్న స్పృహ ఆయన వ్యాఖ్యల్లో కనిపించడం లేదు. తాను డిప్యూటీ సీఎంని అన్న విషయం కూడా ఆయన మర్చిపోతున్నారు. ఆయన మనసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బొమ్మ కదులుతున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్‌లో అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏపీ వేరు, ఉత్తరప్రదేశ్ వేరు. ఆయన్ను ఎవరో ఎగదోస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ ధోరణి ముందు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది’’ అని రాజకీయ విశ్లేషకులు జింకా నాగరాజు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, FB/janasenaparty
కూటమి పొత్తుకు ఢోకా లేదు: పవన్ కల్యాణ్
అయితే, పిఠాపురంలో హోం శాఖ గురించి మాట్లాడుతూనే కూటమి పొత్తు గురించీ పవన్ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏపీలో ఎన్డీఏ కూటమి స్థిరమైనది. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయి. కూటమిని ఎవరూ చెడగొట్టలేరు. వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే ఏమీ చేయలేరని అనుకోకండి. నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీతో ఉన్నాం. ఈ పొత్తు స్థిరమైంది. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు మా పొత్తును దెబ్బతీయలేవు” అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














