కెనడాలోని హిందూ ఆలయంలో భక్తులపై దాడి, జస్టిన్ ట్రూడో ఏమన్నారు?

Hindu sabha temple

ఫొటో సోర్స్, hindusabhatemple

కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో భక్తులపై దాడి జరిగింది. నవంబర్ 3న కెనడాలోని భారత హైకమిషన్‌కు చెందిన అధికారులు ఆ ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంలో ఈ దాడి జరిగింది.

ఈ దాడిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు ప్రతిపక్షాలు కూడా ఖండించాయి.

ఈ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ దాడిని ఖండించే సందర్భంలో ఈ ఘటనకు సంబంధించిన బాధ్యుల గురించి గానీ, అరెస్టు గురించి ప్రధాని ట్రూడో ప్రస్తావించలేదు.

“ఈ రోజు బ్రాంప్టన్‌లో హిందూ ఆలయం దగ్గర జరిగిన హింసాత్మక ఘటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. కెనడాలోని ప్రతి పౌరుడూ పూర్తి భద్రతతో తమ మత విశ్వాసాలను ఆచరించే హక్కు ఉంది” అని ట్రూడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడాలోని భారత హైకమిషన్ స్పందించింది.

“నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో భారత వ్యతిరేక శక్తులు హింసను సృష్టించాయి. ఆలయ నిర్వాహకుల పూర్తి సహకారంతో రాయబార కార్యాలయం నిత్యం నిర్వహించే కార్యక్రమంలో ఈ తరహా అంతరాయం కలగడం బాధాకరం” అని భారత హైకమిషన్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కెనడా, భారత్, ఖలిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖలిస్తానీ వేర్పాటు వాదుల ఆందోళనలు (ఫైల్ ఫొటో)

దీపావళి రోజున హిందూ ఆలయాన్ని సందర్శించిన ట్రూడో

బ్రాంప్టన్‌లో దాడికి గురైన దేవాలయం కెనడాలోని టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటన తరువాత ఆలయానికి భద్రతను పెంచారు.

ఈ ఆలయంపై దాడి వెనుక ఖలిస్తానీ వేర్పాటువాదులు ఉన్నట్టు కెనడా హిందూ ఎంపీ చంద్ర ఆర్య ఆరోపించారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు.

“ఖలిస్తానీ వేర్పాటువాదులు ఈ రోజు తమ హద్దులు దాటారు. కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి హిందూ-కెనడియన్ భక్తులపై జరిగిన దాడి నిదర్శనం” అని ఆయన సోషల్ మీడియాలో అన్నారు.

“భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఫ్రీ హ్యాండ్ లభించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తమ కమ్యూనిటీని రక్షించుకోవడానికి, తమ హక్కుల కోసం, నాయకులను జవాబుదారీగా ఉంచేందుకు హిందూ-కెనడియన్లు ముందుకు రావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

భారత హై కమిషన్, కెనడా

ఫొటో సోర్స్, @HCI_Ottawa/X

ఫొటో క్యాప్షన్, భారత హైకమిషన్ ఈ ఆలయం దగ్గర ఏటా సమావేశాలు నిర్వహిస్తోంది

గతవారం, దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని జస్టిన్ ట్రూడో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో భాగంగా, గడిచిన కొన్ని నెలల్లో కెనడాలోని మూడు హిందూ దేవాలయాలకు వెళ్లానని ట్రూడో చెప్పారు.

దీపావళి వేడుకల్లో ట్రూడో పాల్గొని, ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

“ఇండో- కెనడియన్లలో దీపావళి పండుగ ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. కెనడాలోని హిందూవులు తమ మత విశ్వాసాలను సగర్వంగా, సురక్షితంగా పాటించేందుకు మేము అండగా నిలబడతాం. ఇండో-కెనడియన్ కమ్యూనిటీ లేకపోతే కెనడాలో దీపావళి సంబరాలు లేవు” అని అప్పుడు ట్రూడో అన్నారు.

పియర్రె పోయిలీవ్రే, కన్జర్వేటివ్ పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పియర్రె పొయిలీవ్రే

కెనడాలోని ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

హిందూ దేవాలయంపై దాడిని కెనడాలోని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి.

కెనడా ప్రతిపక్ష నాయకుడైన కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పియర్రె పొయిలీవ్రే ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

“బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయం దగ్గర భక్తులపై జరిగిన దాడి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతి ఒక్కరూ తమ మత విశ్వాసాలు పాటించే స్వేచ్ఛ కెనడాలో ఉంది. ఈ హింసాత్మక ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటివి జరగకుండా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తాను” అని ఆయన అన్నారు.

“బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. దీనిపై మనం ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైవిధ్యమే మన బలం” అని పీపుల్స్ పార్టీ నాయకుడు మ్యాక్సిమ్ బెర్నియర్ అన్నారు.

ఒత్తిడికి గురికావొద్దు వైవిధ్యమే మన బలం” అని ఎగతాళిగా ట్రూడో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మ్యాక్సిమ్ బెర్నియర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రూడో ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేసే ఈయన సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

ప్రధాని మోదీ, జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ -కెనడా మధ్య ముదురుతున్న వివాదం

భారత్ -కెనడా మధ్య దౌత్య వివాదం ఏంటి?

గతేడాది జూన్‌లో కెనడాలోని వాంకోవర్ సమీపంలో ఖలీస్తాని మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.

ఈ ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితమైన అంశంగా మారాయి. ఇరు దేశాలు ఒక దేశ దౌత్యవేత్తలను మరొక దేశం బహిష్కరించాయి.

ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అమెరికా ఆరోపించిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ రెండు కేసులు ఒకే కుట్రలో భాగమని కెనడా ఆరోపిస్తోంది.

అమెరికాలోని న్యూ యార్క్‌లో నివసిస్తున్న పన్నూ ఒక న్యాయవాది. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ వ్యవస్థాపకులు.

ఆయన నిజ్జర్ సహచరుడు. ఆయన కెనడా, అమెరికా రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారు.

అక్టోబర్ 14న అమెరికా వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌లో ఒక రిపోర్టు ప్రచురితమైంది.

“కెనడాలో సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పని చేయాలని భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు” అని తమ సోర్సులు ధ్రువీకరించాయని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన వార్తను తామే ధ్రువీకరించామని కెనడా ప్రభుత్వం కూడా ఒప్పుకుంది.

భారత హోం మంత్రిపై కెనడా విదేశాంగ సహాయ మంత్రి చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

అమిత్ షాపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలిస్తాన్ వేర్పాటు వాదులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన ట్రూడో

ఈ వివాదంపై నిపుణులు ఏమంటున్నారు?

ఇండియా, కెనడాల మధ్య తాజా వివాదాలపై సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ “దిల్ సే కపిల్ సిబల్” యూట్యూబ్ చానల్‌లో వివిధ నిపుణులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా...

“ప్రస్తుతం ఇండియా, కెనడాల మధ్య వివాదం అత్యంత సంక్లిష్టంగా మారింది. దానికి కారణం కెనడా” అని మాజీ దౌత్యవేత్త వివేక్ కట్జు అన్నారు.

“ఒక క్రిమినల్ కేసుతో భారత హైకమిషనర్‌కు ముడిపెడుతూ ఆయన్ను విచారించాలని, ఆయనకున్న అధికారాలను తొలగించాలని కెనడా కోరింది. సాధారణంగా ఇలాంటిది జరగదు. అయినప్పటికీ కెనడా ఆ చర్యకు దిగింది. నాకు తెలిసి ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు” అని ఆయన అన్నారు.

“కెనడాలో భారతీయ దౌత్యవేత్తలు ఏం చేస్తున్నారో ఇది వారి వృత్తిలో భాగమే” అని భారత విదేశాంగ శాఖ మాజీ అధికారి భాస్వతి ముఖర్జీ అన్నారు.

“కెనడా ప్రభుత్వం పాత రోజులను గుర్తు చేస్తోంది. 1989లోనూ భారత దౌత్యవేత్తలు కెనడాను విడిచి రావాల్సి వచ్చింది” అని కాంగ్రెస్ నాయకుడు, చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు.

“దురదృష్టవశాత్తు, భారత రక్షణ వ్యవహారాలను సున్నితమైన అంశంగా కెనడా పరిగణించట్లేదు. ప్రస్తుతం ట్రూడో ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదని, ఈ వివాదాన్ని భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికలకు చాలా మంది ముడిపెడుతున్నారు. ఈ వివాదంలో కచ్చితంగా రాజకీయ కోణం దాగుంది” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)