బాలాజీ శ్రీనివాసన్: కొత్త కంపెనీలాగే కొత్త ‘దేశాన్ని’ ఏర్పాటు చేయాలంటున్న పారిశ్రామికవేత్త

బాలాజీ శ్రీనవాసన్, క్రిప్టో కరెన్సీ, స్టార్టప్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక దేశాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చు: ఔత్సాహిక టెక్ పారిశ్రామికవేత్త బాాలాజీ శ్రీనివాసన్ తన పుస్తకం ది నెట్‌వర్క్ స్టేట్‌ను 2022లో ప్రచురించారు.
    • రచయిత, గేబ్రియల్ గేట్‌హౌస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు మీ జిమ్ మెంబర్‌షిప్‌లాగే మీ దేశ పౌరసత్వాన్ని కూడా ఎంచుకోగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంతో దూరంలో లేని అలాంటి భవిష్యత్‌ గురించిన ఆలోచనను ముందుకు తెచ్చారు బాలాజీ శ్రీనివాసన్.

మడోన్నా మాదిరిగా బాలాజీ కూడా ఆయన ముందు పేరుతోనే సుప్రసిద్ధుడు. క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో స్టార్.

సాంకేతిక ప్రపంచంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారుడు. ప్రభుత్వాలు ప్రస్తుతం చేస్తున్నదాన్ని సాంకేతికత ఇంకా బాగా చెయ్యగలదని ఆయన నమ్ముతారు.

ఆమ్‌స్టర్‌డామ్ శివార్లలోని పెద్ద కాన్ఫరెన్స్ రూమ్‌లో తన ఆలోచన ‘లాస్ట్‌ఫాల్‌’కు సంబంధించిన స్కెచ్‌ను గియ్యడాన్ని నేను చూశాను.

“మనం గూగుల్ వంటి కొత్త కంపెనీలను సృష్టిస్తాం. ఫేస్‌బుక్ లాంటి కొత్త కమ్యూనిటీలను సృష్టిస్తాం. బిట్‌ కాయిన్, ఎథెరమ్ వంటి కొత్త కరెన్సీలను సృష్టిస్తాం. అలాంటిది కొత్త దేశాలను సృష్టించలేమా” అని లూజుగా ఉన్న టై, వదులుగా ఉన్న సూట్‌ వేసుకుని స్టేజ్ మీద నడుస్తూ ఆయన ఈ ప్రశ్న అడిగారు.

ఆయనకు రాక్‌స్టార్ ఇమేజ్ ఉన్నా, అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మధ్య స్థాయి మేనేజర్‌గా కనిపిస్తారు.

జాయింట్ వెంచర్ క్యాపిటల్ సంస్థ అండ్రీసెన్ హోరోవిట్జ్‌లో బాలాజీ శ్రీనివాసన్ మాజీ భాగస్వామి. ఆయనకు బాగా సంపన్నులైన స్పాన్సర్లు ఉన్నారు.

సిలికాన్ వ్యాలీ ఇలాంటి ఆలోచనలను ఇష్టపడుతుంది. టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లు చాలా కాలంగా సంప్రదాయ వ్యాపార విధానాలను మార్చేస్తున్నాయి. ప్రస్తుతం అవి విద్య, ఆర్థికం, అంతరిక్ష ప్రయాణం లాంటి ఇతర రంగాల్లోకి కూడా అడుగు పెడుతున్నాయి.

“వెయ్యి వేర్వేరు రకాల స్టార్టప్‌లు, అందులో ప్రతీది ఒక సంప్రదాయ వ్యవస్థ స్థానంలో కొత్తగా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి” అని బాలాజీ శ్రీనివాసన్ తన ఎదుట ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు.

“ఇప్పటికే ఉన్న వ్యవస్థలకు సమాంతరంగా కొత్త స్టార్టప్‌లు వస్తే, అవి యూజర్లను తమ వైపు తిప్పుకుంటాయి. అవి కొత్తవిగా మారే వరకు శక్తి పుంజుకుంటూనే ఉంటాయి” అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బిట్ కాయిన్, బాలాజీ శ్రీనివాసన్, నెట్‌వర్క్ స్టేట్, ఇంటర్నెట్ ప్రొవైడర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆన్‌లైన్ ద్వారా బిట్ కాయిన్‌తో వ్యాపారం చేస్తున్నట్లే ఆన్‌లైన్‌లోనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయవచ్చని బాలాజీ శ్రీనివాసన్ ప్రతిపాదిస్తున్నారు.

ఉన్న దేశాల స్థానంలో కొత్త దేశాలు

ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వ్యవస్థలను స్టార్టప్‌లు భర్తీ చేయగలిగినప్పుడు, దేశాల స్థానంలో కొత్త దేశాలు ఎందుకు రాకూడదని బాలాజీ ప్రశ్నిస్తున్నారు.

ఈ ఆలోచనను ఆయన “నెట్‌వర్క్ స్టేట్: ఎమర్జింగ్ నేషన్స్” అని అంటున్నారు. అదెలా పని చేస్తుందో ఆయన వివరించారు. ఈ కొత్త దేశంలో ఒకే రకమైన ప్రయోజనాలు లేదా విలువలు ఉన్నవారు మొదట ఇంటర్నెట్‌ ద్వారా ఆ దేశంలో భాగం అవుతారు.

తర్వాత వాళ్లకు భూమిని కేటాయిస్తారు. దీంతో సొంత చట్టాలతో భౌతికంగా ‘దేశాలు’ ఏర్పడతాయి. ఇవి ఇప్పటికే ఉన్న దేశాలతో కలిసి పని చేస్తాయి. తర్వాత పూర్తిగా ఆయా దేశాల స్థానంలో ఇవే దేశాలుగా మారతాయి.

మీరు మీ ఇంటర్నెట్ ప్రొవైడర్‌ను ఎంచుకున్నట్లే మీకు కావల్సిన దేశాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్నట్లుగానే సైబర్ దేశపు రాజ్యంలో మీరు పౌరుడు కావచ్చు.

దేశాలు, రాష్ట్రాల వ్యవహారాల్లో కార్పోరేట్‌లు మితిమీరిన ప్రభావం చూపించడం కొత్తేమీ కాదు.

అమెరికన్ కంపెనీ యునైటెడ్ ఫ్రూట్ 1930ల నుంచి గ్వాటెమాలాను పరిపాలించిన తీరు నుంచి ‘బనానా రిపబ్లిక్’ అనే పదం వచ్చింది.

యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ గ్వాటెమాలలో అధిక భూభాగాన్ని సొంతం చేసుకోవడంతో పాటు దేశంలో రైళ్లు, రోడ్లు, పోస్టల్ సేవలు నిర్వహణను చేపట్టింది. గ్వాటెమాల ప్రభుత్వం ఈ సంస్థను తమ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగానే సీఐఏ ఒక తిరుగుబాటును ప్రోత్సహించడం ద్వారా యునైటెడ్ ఫ్రూట్‌కు సాయం చేసింది.

అయితే, ప్రస్తుతం బాలాజీ చెబుతున్న ఈ ఉద్యమానికి చాలా పెద్ద లక్ష్యాలు కనిపిస్తున్నాయి. కంపెనీలు సొంత వ్యవహారాలను నిర్వహించుకునేలా ప్రస్తుత ప్రభుత్వాలతో విధేయంగా ఉండటమే కాకుండా ప్రభుత్వాలను కంపెనీలతో భర్తీ చేయాలనేది బాలాజీ శ్రీనివాసన్ ఆలోచన.

బాలాజీ శ్రీనివాసన్, బిట్ కాయిన్, అమెరికా, నెదర్లాండ్స్, అమ్‌స్టర్‌డామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ఉన్న దేశాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చెయ్యడమే నెట్‌వర్క్ స్టేట్ అని చెబుతున్న బాలాజీ శ్రీనివాసన్

నెట్‌వర్క్ స్టేట్

"నెట్‌వర్క్ స్టేట్" ఆలోచనను నయా వలసవాద ప్రాజెక్టుగా భావిస్తున్నవారు ఉన్నారు. ఇందులో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను తమతో పాటు షేర్ హోల్టర్ల ప్రయోజనాల కోసం పని చేసే కార్పోరేట్ నియంతలతో భర్తీ చేస్తుంది.

అయితే కొంతమంది మాత్రం ఇది నియంత్రిత ఆధునిక పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

కొత్త దేశాలు అనే ఆలోచన టెక్ వ్యవస్థాపకుడి ఊహా ప్రపంచంలా అనిపిస్తోందా? అలా ఏమీ కాదు, అవి ఇప్పటికే ఉన్నాయంటున్నారు బాలాజీ.

ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రతిపాదించిన “స్టార్టప్ సొసైటీస్”ను ఆవిష్కరించింది.

‘నెట్‌వర్క్ సిటీ ఆఫ్ మాడ్రన్ విలేజెస్’ను నడుపుతున్న క్యాబిన్ అనే సంస్థకు అమెరికా, పోర్చుగల్ లలో శాఖలున్నాయి. అరిజోనాకు చెందిన కల్డెసాక్ సంస్థ కమ్యూనిటీ డిజైన్డ్ నెట్ వర్క్ సంస్థ. ఈ రెండూ బాలాజీ ఆలోచనపై పని చేస్తున్నాయి.

బాలాజీ ప్రతిపాదించిన ‘నెట్‌వర్క్ స్టేట్’ భావన “చార్టర్ నగరాలు” అనే ఆలోచనపై ఆధారపడింది. చార్టర్ నగరాలు అంటే ప్రత్యేక ఆర్థిక మండలి మాదిరిగా ఉండే పట్టణ ప్రాంతాలు

నైజీరియా, జాంబియా సహా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి.

లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన ర్యాలీలో ప్రసంగించిన డోనల్డ్ ట్రంప్, ఈసారి తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే, కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి, సరసమైన గృహాలను నిర్మించడానికి, ఉద్యోగాల కల్పనకు "అతి తక్కువ పన్నులు, నిబంధనలు ఉండే ప్రత్యేక జోన్లను సృష్టించేందుకు” నెవాడాలోని కేంద్ర ప్రభుత్వ భూములను విడిపిస్తానని హామీ ఇచ్చారు.

ఈ ప్రణాళిక "అమెరికన్ కలల స్ఫూర్తిని" పునరుజ్జీవింపజేస్తుందని ఆయన అన్నారు.

కల్డెసాక్, క్యాబిన్ అనే సంస్థలు ప్రధానంగా ఆన్‌లైన్ కమ్యూనిటీలు.

అయితే ప్రోస్పెరా పని తీరు భిన్నం. ఇది హోండురాస్ తీరంలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పడిన “ప్రైవేట్ నగరం”గా తనను తాను ప్రకటించుకుంది.

ప్రోస్పెరా సంస్థ వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి ప్రయోగాత్మక, క్రమబద్ధీకరించని జన్యు చికిత్సలకు సంబంధించిన పరిశోధన చేస్తోంది.

అమెరికాలోని డెలావేర్‌లో ఉన్న లాభాపేక్షలేని సంస్థ నిర్వహిస్తున్న ప్రోస్పెరాకు దాని సొంత చట్టాలను తయారు చేసుకోవడానికి గత హోండురాస్ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా ఇచ్చారు.

అయితే ప్రస్తుత హొండూరాస్ అధ్యక్షురాలు జియోమారా కాస్ట్రో, ఈ సంస్థను తమ దేశం నుంచి పంపించేయాలని భావిస్తున్నారు. ప్రోస్పెరాకు గత ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను ఆమె తొలిస్తున్నారు.

దీంతో ప్రోస్పెరా తనకు 10.8 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించాలని హొండూరస్ ప్రభుత్వంపై కోర్టులో దావా వేసింది.

బాలాజీ శ్రీనివాసన్, బిట్ కాయిన్, అమెరికా, నెదర్లాండ్స్, అమ్‌స్టర్‌డామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇదంతా టెక్ పారిశ్రామికవేత్తల ఊహా మాదిరిగా అనిపిస్తున్నా, "నెట్‌వర్క్ స్టేట్" అంశాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

ఫ్రీ మార్కెట్ క్రిప్టో సిటీ కోసం ప్రతిపాదన

ఆమ్‌స్టర్‌డామ్‌లో రోజంతా జరిగిన పరిచయ కార్యక్రమంలో గోధుమ రంగు హుడీ ధరించిన ఓ యువకుడు స్టేజ్ అంతా కలియతిరగడం మొదలు పెట్టాడు.

ఆయన పేరు డ్రైడెన్ బ్రౌన్. తాను కూడా మధ్యధరా సముద్రం తీరంలో కొత్త నగర రాజ్యాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఆ నగరాన్ని అధికార యంత్రాంగం పాలించదని, క్రిప్టో కరెన్సీ సాంకేతికకు మూలమైన బ్లాక్ చైన్ పరిపాలిస్తుందని చెప్పారు.

ఈ నగర స్థాపనలో ప్రధాన సూత్రాలు “తేజము, వీరత్వం.” ఇవి పురాతన గ్రీకు పదం యాక్షన్ నుంచి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ కొత్త దేశంలోకి తొలి పౌరుడు 2026 నాటికి అడుగు పెడతారని తెలిపారు.

ఈ దేశం ఎక్కడ ఏర్పాటవుతుంది? అందులో మౌలిక వసతుల కల్పన ఎలా? దాని నిర్వహణను ఎవరు పర్యవేక్షిస్తారు అనే దాని గురించి తన దగ్గర ప్రస్తుతం స్పష్టమైన వివరాల్లేవని బ్రౌన్ చెప్పారు.

ఈ సమావేశంలో ఆయన ఒక స్లైడ్ వేసి చూపించారు. తనకు వందల బిలియన్ డాలర్ల సొమ్ము ఉన్న ఫండ్ల మద్దతు ఉందని చెప్పారు.

అయితే ప్రస్తుతానికి ఆయన చెబుతున్న “ప్రాక్సిస్ కమ్యూనిటీ” అంతా ఇంటర్నెట్‌లోనే ఉంది. ఈ కమ్యూనిటీ వెబ్‌సైట్ ద్వారా ఇందులో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే అందులో ఉన్న పౌరులు ఎవరు అనే దానిపై స్పష్టత రాలేదు. డ్రైడెన్ మరో స్లైడ్ వేసి చూపించారు. అదొక కప్పకు సంబంధించిన మీమ్. విచారంగా కనిపిస్తున్న ఆ కప్ప బొమ్మ 2016లో ట్రంప్ ప్రచారానికి మస్కట్‌.

కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రపంచంలో ప్రాక్సిస్ సమూహానికి మంచి గుర్తింపు ఉంది.

కార్పోరేట్ చక్రవర్తులు పాలించే ఈ నిరంకుశ దేశాల గురించి ప్రముఖ బ్లాగర్ కుర్టిస్ యర్విన్ లాంటి వాళ్లు వాదించారు. మన్‌హట్టన్ పెంట్ ‌హౌస్‌లలో జరిగే క్యాండిల్‌లైట్ సాయంత్రాల్లోనూ కొత్త దేశాల గురించి చర్చ జరిగింది.

బ్రౌన్ ఆలోచనలు నియంతృత్వానికి ప్రతీకలా ఉన్నాయని కొంతమంది వర్ణించారు. అయితే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైనవారు దీన్ని గోప్యంగా ఉంచుతామని సంతకం చేశారు. ఈ మీటింగ్‌కు జర్నలిస్టులను పిలవలేదు.

ఆయన ప్రజంటేషన్ పూర్తైన తర్వాత నేను డ్రైడెన్ బ్రౌన్‌తో మాట్లాడాను. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. నాకు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను ఆయనతో మాట్లాడేందుకు రెండు మెసేజ్‌లు పంపాను. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు.

ఆరు నెలల తర్వాత నేను ఎక్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రకటన చూశాను. అందులో “ రేపు రాత్రి ప్రాక్సిస్ మేగజైన్ ప్రారంభం” అని ఉంది.

అయితే ఆ ప్రకటనలో ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలేమీ లేవు. ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే సైన్ ఇన్ చేయాలంటూ ఒక లింక్ ఇచ్చారు.

నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నాను. ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత రోజు ఉదయం నేను బ్రౌన్‌కు ఒక సందేశం పంపించాను. ఆశ్చర్యంగా ఆయన వెంటనే స్పందించారు. “సాయంత్రం పది గంటలకు” అని అందులో ఉంది.

బాలాజీ శ్రీనివాసన్, బిట్ కాయిన్, అమెరికా, నెదర్లాండ్స్, అమ్‌స్టర్‌డామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెట్‌వర్క్ స్టేట్ కాన్సెప్ట్ ప్రకారం , ఆన్‌లైన్ ద్వారా ఏర్పడిన సమూహాలు ప్రాంతాల అభివృద్ధికి సామూహికంగా నిధులు సమకూరుస్తాయి.

కొత్త దేశమా? నియంతల ప్రపంచమా?

ఆ కార్యక్రమం మన్‌హట్టన్‌లోని ఎల్లా ఫంట్‌ను నైట్‌క్లబ్‌గా మార్చేసింది.

దీన్ని గతంలో క్లబ్ 82గా పిలిచేవారు. ఇది న్యూయార్క్‌లో సమ లైంగికులకు ప్రత్యేక ప్రాంతం. 1950ల్లో రచయితలు, కళాకారులు అక్కడకు వెళ్లి మద్యం తాగేవారు. సూటు వేసుకున్న మహిళలు అక్కడ కాక్‌టెయిల్ మద్యాన్ని అందించేవారు. తర్వాత ఆ భవనం అండర్ గ్రౌండ్‌లో అర్థనగ్న ప్రదర్శనలు చూసేవారు.

కొత్త దేశంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్న వారి కోసం బ్రౌన్ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఎలాగోలా నాకు ఆ పార్టీకి ఆహ్వనం లభించింది.

అయితే ఆయన మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యుటాలో ఉన్నారు. ఆయన దగ్గరకు సమయానికి చేరాలంటే విమానంలో వెంటనే బయల్దేరాలి.

అందరి కంటే ముందు నేనే వచ్చాను. అక్కడంతా ఖాళీగా ఉంది. ప్రాక్సిస్‌కు చెందిన కొంతమంది మేగజైన్ కాపీలను బార్‌లోని టేబుళ్ల మీద అమర్చుతున్నారు.

మేగజైన్ తీసుకుని దాన్ని తిరగేశాను. అది చాలా ఖరీదైన పేపర్. మేగజైన్ నిండా ప్రకటనలు ఉన్నాయి. అందులో పెర్‌ఫ్యూమ్‌లు, త్రీడీ ప్రింటెడ్ తుపాకులు, ఒకటి మాత్రం పాలకు సంబంధించిన ప్రకటన ఉంది.

ఏడుస్తున్న కప్ప బొమ్మ మాదిరిగా పాలు కూడా ఇంటర్నెట్‌ మీమ్ లాంటిది. తెల్ల దొరల ఆధిపత్యానికి గుర్తుగా కొన్ని ఆర్టికల్స్‌లో తెల్లటి మిల్క్ బాటిల్ ఎమోజీని ప్రచురిస్తారు.

మేగజైన్ చదివేవారు అందులో పేజీలను ఫోటో కాపీలు తీసుకుని వాటిని పట్టణంలో అన్ని చోట్లా అతికించాలని కోరుతూ ఒక ప్రకటన ప్రచురించారు. దీని కోసమే బార్‌ లోపలకు జెరాక్స్ మిషన్ తీసుకువచ్చారు.

ఇంతలో యువకుల బృందం ఒకటి లోపలకు వచ్చింది. అందులో కొంతమంది కౌబాయ్ బూట్లు వేసుకున్నారు. అయినప్పటికీ వాళ్లు వినోదాన్ని అందించడానికి వచ్చిన వారిలా కనిపించలేదు.

నేను అందులో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. అతను తన పేరు జాక్ అని చెప్పారు. తాను ఇంగ్లండ్‌లోని మిల్టన్ కీనెస్‌లో ఉంటానని చెప్పారు.

“నేను అమెరికన్ వైల్డ్ వెస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. మేమంతా సరిహద్దుల్లో ఉంటాము” అని చెప్పారు.

అనేక మంది క్రిప్టో కరెన్సీ స్కాముల్లో చిక్కుకున్నారు: ఇది తీవ్ర స్థాయిలో ఎగుడు దిగుళ్లు ఉండే ఇంటర్నెట్ డబ్బు. రాత్రికి రాత్రే దీని విలువ పడిపోతుంది.

అయితే నెట్‌వర్క్ స్టేట్ ప్రపంచం మాత్రం క్రిప్టో కరెన్సీని ఇష్టపడుతుంది. భవిష్యత్‌ మనీ ఇదే అని వాళ్లు భావిస్తున్నారు. అయితే ఈ డబ్బుని ప్రభుత్వాలు నియంత్రించలేవు.

తర్వాత నేను అజి అనే వ్యక్తితో మాట్లాడాను. చివరి పేరేంటని అడిగా. అతను మండియాస్ అని నవ్వుతూ చెప్పారు.

అజి మండియాస్ అంటే రాజులకు రాజు అని ఇంగ్లీష్ రచయిత పెర్సీ బైషే షెల్లీ ఒక చోట ప్రస్తావించారు.

క్రిప్టో ప్రపంచంలో రహస్యానిది చాలా పెద్ద పాత్ర. ఈ పార్టీలో ఏ ఒక్కరు కూడా తమ నిజమైన పేర్లు చెబుతారని నాకు అనిపించలేదు.

మండియాస్ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి. అయితే అతను న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో పెరిగారు. అభివృద్ధి చెందుతున్న ఒక టెక్నాలజీ స్టార్టప్‌కు వ్యవస్థాపకుడు.

500 ఏళ్ల క్రితం యూరప్‌లో భూస్వామ్య వ్యవస్థ పతనానికి ప్రింటింగ్ ప్రెస్ దోహదపడినట్లే, నేడు కొత్త టెక్నాలజీలు (క్రిప్టోకరెన్సీలు, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రజాస్వామ్య దేశాలు, రాజ్యాల పతనానికి కారణమవుతాయని మండియాస్ నమ్ముతున్నారు.

"ప్రజాస్వామ్యం గొప్పది," అని ఆయన అన్నారు. “కానీ ఉత్తమ పాలకుడు మాత్రం నైతికత విలువలు ఉన్న నియంతే . కొంతమంది ఆయన్ని ఫిలాసఫర్ కింగ్ అని పిలుస్తారు" అని చెప్పారు.

బాలాజీ శ్రీనివాసన్, బిట్ కాయిన్, అమెరికా, నెదర్లాండ్స్, అమ్‌స్టర్‌డామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "నెట్‌వర్క్ స్టేట్‌" ప్రపంచంలో అందరూ బిట్‌కాయిన్‌ను ఇష్టపడతారు. బిట్ కాయిన్లను భవిష్యత్ ధనంగా భావిస్తున్నారు. డబ్బును ప్రభుత్వాలు నియంత్రించకూడదనేది వారి ఆలోచన.

కార్పోరేట్ రారాజు ఎదుగుదల

“తర్వాతి పునరుజ్జీవంగా భావిస్తున్న దానిలో భాగం అవుతున్నందుకు” తనకు చాలా ఉత్సాహంగా ఉందని అజి చెప్పారు.

అయితే ఈ పునరుజ్జీవానికి ముందు కొత్త సాంకేతికతలను వ్యతిరేకించే వారు ఉద్యమిస్తారని దాని వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకస్వామ్యం ఏర్పడుతుందని అజి అంచనా వేశారు.

నూతన సాంకేతికతను వ్యతిరేకించేవారు విఫలం అవుతారని ఆయన అన్నారు. మనిషి సంఘ జీవితం మార్పు జరిగే కాలంలో “తర్వాతి దశ”గా భావిస్తున్న సమయం నెట్‌వర్క్ స్టేట్ చాలా హింసాత్మకంగా, డార్వీనియన్‌గా ఉంటుందని అజి భావిస్తున్నారు.

“ప్రజాస్వామ్యం కూలిపోయిన తర్వాత ఆ బూడిదలో నుంచి కొత్త రాజులు పుట్టుకొస్తారు. కార్పోరేట్ నియంతలు తమ నెట్‌వర్క్ సామ్రాజ్యాలను పాలిస్తారు” అనే ఆలోచన పట్ల అజి చాలా ఉత్సాహంగా ఉన్నారు.

నేను బార్‌ లోపల కొంత దూరం వెళ్లి నా డ్రింక్ తెచ్చుకున్నాను. ఈ క్రిప్టో ప్రపంచానికి సంబంధం లేని వ్యక్తులుగా కనిపించిన ఇద్దరు యువతులతో మాట్లాడాను.

దగ్గర్లో ఉన్న మరో నైట్ క్లబ్‌లో ఎజ్రా మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆమె స్నేహితురాలు డిలన్ ఒక విద్యార్థిని. ఈ కార్యక్రమానికి కాస్త ఆకర్షణ తీసుకు వచ్చేందుకు వారిని ఆహ్వనించినట్లు అనిపించింది. క్రిప్టో పారిశ్రామికవేత్తలు, కంప్యూటర్ నిపుణులు ఉన్న పార్టీకి ఇలాంటివి తప్పనిసరి. అయితే నెట్‌వర్క్ స్టేట్ అనే ఆలోచన గురించి వారికి కొన్ని ఐడియాలు ఉన్నాయి.

“స్కూలు లేదా ఆసుపత్రిలో పిల్లల్ని చూసుకోవడానికి తగినంత మంది సిబ్బంది లేకపోతే ఏం చేస్తారు” అని డిలన్ ప్రశ్రించారు.

“ప్రభుత్వం లేకుండా ఒక నగరాన్ని నడిపించడం అనేది వాస్తవంలో సాధ్యం కాదు” అని ఎజ్రా చెప్పారు.

ఆ సమయంలో ప్రాక్సిస్ సహ వ్యవస్థాపకుడు డ్రైడెన్ బ్రౌన్ కనిపించారు. ఆయన సిగరెట్ కోసం బయటకు వెళ్లినప్పుడు నేను తన వెంట వెళ్లాను.

కొత్త సంస్కృతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ప్రాక్సిస్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అది వీరోచితమైనదని అన్నారు.

నెట్‌వర్క్ స్టేట్ ప్రాజెక్టు గురించి నేను ఆయననను కొన్ని సూటి ప్రశ్నలు అడగాలని అనుకున్నాను. ఈ కొత్త దేశంలో పౌరులు ఎవరు?. ఆ దేశాన్ని ఎవరు పాలిస్తారు?. అతివాద భావాలున్న మీమ్‌ల ఉద్దేశం ఏంటి?. ఈ ప్రశ్నలన్నింటితో పాటు డిలన్ నన్ను అడిగిన ఆసుపత్రుల్లో ఎవరు పని చేస్తారు అన్న ప్రశ్నను కూడా అడిగాను.

అయితే బార్‌లోకి అతిధులు వస్తూ ఉండటంతో మా సంభాషణ సవ్యంగా సాగలేదు. దీంతో తర్వాతి రోజు ప్రాక్సిస్ ఎంబసీకి రావాలని నన్ను ఆహ్వానించారు.

మేమ్ గుడ్‌బై చెప్పుకుని లోపలకు వెళ్లాం. పార్టీ చాలా వైల్డ్‌గా మారింది. ఎజ్రా, డిలన్, మోడల్స్‌లా కనిపిస్తున్న కొంతమంది యువతులు ఫోటో కాపీయర్ ఎక్కినట్లు కనిపించారు.

వాళ్లు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. మేగజైన్ కాపీ ఒకటి తీసుకుని నేను బయటకు వచ్చాను.

చైనీస్ సూపర్‌మార్కెట్ దగ్గర ఉన్న నా చిన్న గదికి వచ్చిన తర్వాత మేగజైన్‌ను తిరగేశాను. అందులో మీమ్‌లు, ప్రకటనలతో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దాన్ని స్కాన్ చేస్తే జీవితంలో ఉన్న శూన్యత గురించి 20 నిముషాల షార్ట్ ఫిల్మ్ వచ్చింది.

బాలాజీ శ్రీనివాసన్, బిట్ కాయిన్, అమెరికా, నెదర్లాండ్స్, అమ్‌స్టర్‌డామ్, నెట్‌వర్క్ స్టేట్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే నెవడాలోని కేంద్ర ప్రాంతాలను " తక్కువ పన్నులు, నియంత్రణలు ఉండే ప్రత్యేక జోన్లు"గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

కష్టాల్లో ప్రజాస్వామ్యం?

తర్వాతి రోజు, నేను బ్రాడ్‌వేలోని ఒక పెద్ద పెంట్‌హౌస్‌లో ఉన్న "ప్రాక్సిస్ ఎంబసీ"కి వెళ్లాను.

నేను ప్రవేశించిన గదిలో ఏర్పాటు చేసిన అరల్లో నీషే, నెపోలియన్ జీవిత విశేషాలను తెలిపే పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పెద్ద పుస్తకం మీద “ది డిక్టేటర్ హ్యాండ్ బుక్” అని రాసిన పుస్తకాల వాల్యూమ్ ఉంది. నేను అక్కడ కాసేపు ఆగాను. అయితే నాకక్కడ డ్రైడెన్ బ్రౌన్ కనిపించలేదు.

అంతకు ముందు రోజు రాత్రి నేను చూసిన దాని గురించి ఆలోచించి ఆశ్చర్యపోయాను. భవిష్యత్ తాలూకు చిహ్నం ఇదేనా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలను కార్పోరేట్ సొసైటీలనే సాలెగూళ్లలోకి లాగేస్తున్నారా?. చిన్న సైబర్ దేశంలో పౌరుడుగా మారడమే ఈ కార్పోరేట్ సొసైటీల లక్ష్యమా?

అలా కాకుంటే బ్రౌన్ అతని స్నేహితులైన కొంతమంది టెక్ పారిశ్రామికవేత్తలు అతివాదుల్ని ఎగతాళి చేసేందుకు వారిని పార్టీకి పిలిచారా? అని ఆలోచించాను.

డ్రైడెన్ బ్రౌన్ ఏదో ఒక రోజు సీఈఓ కింగ్ అవుతారా? మధ్యధరా సముద్రం పొడవునా విస్తరించే అతివాదా సామ్రాజ్యపు ఫ్రాంచైజీకి ఆయన రాజవుతారా?

ప్రజాస్వామ్యం కష్టాల్లో ఉంటే, నెట్‌వర్క్ స్టేట్ ఉద్యమం రెక్కలు తొడుక్కుని ఎగిరేందుకు ఎదురు చూస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)