డోనల్డ్ ట్రంప్: రెండోసారి ఎలా గెలిచారు, ఏ అంశాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి?

ట్రంప్

ఫొటో సోర్స్, AP

    • రచయిత, సారా స్మిత్
    • హోదా, నార్త్ అమెరికా ఎడిటర్

అమెరికా చరిత్రలోనే ఇదో అత్యంత నాటకీయ పరిణామం. వైట్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చేసిన నాలుగేళ్ల తర్వాత డోనల్డ్ ట్రంప్ మరోసారి లోపలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లక్షలాది మంది అమెరికన్లు ఆయనకు ఓటేసి రెండోసారి అధ్యక్షుడయ్యే అవకాశం ఇచ్చారు.

ఈసారి జరిగిన ఎన్నికల ప్రచారం చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోతుంది. రెండుసార్లు హత్యాయత్నాల నుంచి బయటపడటం ఒక ఎత్తు అయితే .. తన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కేవలం కొన్ని నెలల ముందు పోటీ నుంచి తప్పుకోవడం మరో ప్రత్యేక సందర్భం.

ఓట్ల తుది లెక్కింపు ఇంకా జరుగుతున్నప్పటికీ కీలకమైన బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో మెజారిటీ అమెరికన్లు ఆర్థిక వ్యవస్థ, ఇమిగ్రేషన్ అంశాలనే ప్రధానంగా చూస్తూ ఆయనకే మద్దతునిచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్ మద్దతుదారుల ఆనందోత్సాహం

ఫొటో సోర్స్, AP

పనైపోయిందనే స్థాయి నుంచి

ట్రంప్ పనైపోయింది అనే స్థాయి నుంచి ఆయన పడి లేచిన కెరటంలా విజయం సాధించారు. 2020 ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో బైడెన్ గెలిచారు. అధికారంలో కొనసాగడానికి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారనే అభియోగాలపై ట్రంప్ పాత్రపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది.

యూఎస్ కేపిటల్ భవనంపై 2021 జనవరి 6న జరిగిన హింసాత్మక దాడి వెనక ట్రంప్ పాత్ర ఉందనే అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. అలాగే వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే నేరం నిరూపణై, దోషిగా తేలిన మొట్టమొదటి అధ్యక్షుడిగా కూడా ఆయన పేరు అమెరికా చరిత్రలోకెక్కింది.

ఆయన అంత ఎక్కువ ప్రభావవంతమైన వ్యక్తిగా ఎలా మారారో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు.

ఆయన ప్రచారం అంతటా రాజకీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టే మాటలతో, తీవ్రమైన పదాలతో అవహేళన చేస్తూ, ప్రతీకారం, బెదిరింపులు ధ్వనించేలా మాట్లాడారు.

ఆర్థిక వ్యవస్థపై వ్యాఖ్యలు కదిలించాయి

ట్రంప్ విషయంలో కొందరు తటస్థంగా ఉన్నారు. ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను మాట్లాడిన చాలామంది ఓటర్లు ట్రంప్ నోటికి తాళం వేసుకోవాలని కోరుకున్నారు. కానీ వారు ఆ విషయాన్ని దాటి ఆలోచించారు.

ప్రతి ర్యాలీలో రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మీ పరిస్థితి మెరుగైందా అని ఆయన అడిగిన ప్రశ్నపై వాళ్లు దృష్టి సారించారు.

డోనల్డ్ ట్రంప్‌కు ఓటేసిన చాలా మంది ప్రజలు నాతో మళ్లీ మళ్లీ చెప్పిన విషయం ఏంటంటే... “ఆయన అధికారంలో ఉండగా ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు మా అవసరాలు తీర్చుకోవడం కష్టంగా ఉంది.” ద్రవ్యోల్బణం పెరుగుదలకు బయటి అంశాలు అంటే... కోవిడ్ 19 మహమ్మారి వంటివి కారణమైనప్పటికీ ప్రస్తుత పరిపాలనను వారు విమర్శిస్తున్నారు.

అక్రమ వలసల విషయంలో ఓటర్లు చాలా ఆందోళన చెందారు. బైడెన్ హయాంలో ఈ వలసలు రికార్డు స్థాయికి చేరాయి. అయితే వారు సాధారణంగా జాత్యహంకార అభిప్రాయాలు ఎప్పుడూ వ్యక్త పరచరు. అలాగే ట్రంప్, ఆయన మద్దతుదారులు చెప్పిన అమెరికా ప్రజలకు దక్కాల్సినవాటిని వలసదారులు లాక్కుంటున్నారనే మాటలను వారు నమ్మలేదు కానీ, సరిహద్దు భద్రత మాత్రం మరింత గట్టిగా ఉండాలని కోరుకున్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఫస్ట్.. ట్రంప్ రెండోసారి

అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ చెప్పే మరో నినాదం. అది ఓటర్లను బాగా ఆకట్టుకుంది. యుక్రెయిన్‌కు వందల కోట్ల డాలర్లు సాయంగా అందించడంపై పార్టీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడాన్ని నేను గమనించాను. ఆ డబ్బంతా తమ దేశం కోసమే ఖర్చుపెట్టి ఉంటే బాగుండేదని వారి అభిప్రాయం.

చివరకు, వాళ్లు బైడెన్ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షురాలిగా ఉన్న హారిస్‌కు ఓటెయ్యలేదు. బైడెన్ స్థానంలో హారిస్ అధ్యక్షురాలైనా పరిస్థితి ఇలానే ఉంటుందని వాళ్లు భావించారు. మార్పు కోరుకున్నారు.

దారుణం ఏంటంటే... ప్రస్తుతం మార్పు కోసం పరితపించిన వ్యక్తి నాలుగేళ్ల క్రితం స్వయంగా అధికారంలో ఉన్నారు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.

ట్రంప్ మొదటిసారి 2016లో అధికారం చేపట్టినప్పుడు ఆయన రాజకీయాలకు చెందని వ్యక్తి. కొంత కాలం పాటు ఆయన చుట్టూ సలహాదారులు, సహాయక సిబ్బంది ఉండేవారు. వాళ్లే ఆయనకు మార్గదర్శనం చేశారు. కొన్ని చర్యలను నియంత్రించారు. కానీ ఇప్పుడు ఆయనకు నిబంధనల ప్రకారం గేమ్ ఆడటంపై ఆసక్తి ఉన్నట్లు కనిపించట్లేదు.

అప్పటి సలహాదారులు, సిబ్బందిలో చాలా మంది ఆయన్ను ఓ అబద్దాల కోరు, ఫాసిస్టు, అసమర్థుడు అని దూషించారు.

“ఆయన చుట్టూ భజనపరులు చేరితే ఇక ఆయన తీసుకునే తీవ్ర నిర్ణయాలను అడ్డుకునేవారు ఎవరూ ఉండరు, ఆయన అలాగే చేయచ్చు కూడా” అని వాళ్లు హెచ్చరించారు.

ట్రంప్ గెలుపు

ఫొటో సోర్స్, AFP

అభియోగాలపై ఏం చేస్తారు?

ట్రంప్ పదవి నుంచి దిగిపోయాక... కేపిటల్ బిల్డింగ్‌పై దాడిలో పాత్రపైన, జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల నిర్వహణకు సంబంధించిన అంశంలోను, పోర్న్ స్టార్‌కు చేసిన రహస్య చెల్లింపుల కేసులో క్రిమినల్ నేరాభియోగాలు ఎదుర్కొన్నారు.

కానీ అధికారంలో ఉండగా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలపై విచారణ నుంచి ఆయనకు న్యాయపరమైన రక్షణ ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఆయన మరోసారి పాలనా పగ్గాలు చేపడుతున్నారు. దీంతో ఆయనపై అభియోగాలు మోపడం ప్రాసిక్యూషన్‌కు పెద్ద సమస్యే అని చెప్పొచ్చు.

జనవరి 6 అల్లర్లకు సంబంధించి తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను కొట్టేయాలని జస్టిస్ డిపార్ట్‌మెంట్‌ను అధ్యక్షుడిగా ఆయన ఆదేశించొచ్చు. అంటే జైలు శిక్ష పడుతుందనే ఆందోళన ఆయనకు అవసరం లేదు. అదే సమయంలో కేపిటల్ బిల్డింగ్ దాడి కేసులో అరెస్టై జెలు శిక్ష అనుభవిస్తున్న వందల మందికి ఆయన క్షమాభిక్ష పెట్టొచ్చు.

చివరగా.. ఓటర్ల ముందు అమెరికాను రెండు పద్ధతులలో చూపించారు.

“మన దేశం అన్నింట్లో విఫలమవుతోంది, నేను మాత్రమే మళ్లీ అమెరికాను గొప్పగా మార్చగలను” అని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

అయితే, ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే అమెరికా ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని కమలా హారిస్ హెచ్చరించారు. అయితే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కానీ ప్రచార సమయంలో ట్రంప్ చెప్పిన మాటలు ప్రజల భయాలను పూర్తిగా తొలగించలేదు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి వారిని ఆయన ప్రసంగాల్లో పొగిడారు. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లు ఉన్నత స్థాయిలో ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మీడియాలో తనపై వస్తున్న విమర్శలను అణిచివేసే ప్రయత్నాలపై కూడా ఆయన మాట్లాడారు. “మీడియాలో పనిచేసే వారెవరైనా ప్రాణాలు కోల్పోయినా నేను పట్టించుకోను” అని అర్థం వచ్చేలా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన వ్యాఖ్యానించారు.

కుట్ర సిద్ధాంతాలను తీవ్రం చేయడం, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన కొనసాగించారు. చివరకు ఎన్నికల్లో విజయం ఆయనకే దక్కింది.

ఏమైనా ట్రంప్.. ట్రంప్‌లానే ఉంటారు. అందుకే ప్రచార సమయంలో ఆయన ఇష్టారీతిన ఎన్ని మాటలు మాట్లాడారో ఇప్పుడు ఓటర్లు తెలుసుకుంటారు. మరో విషయం... ట్రంప్ రెండోసారి అధికారం చేపడుతున్న వాస్తవాన్ని అంగీకరించాల్సింది కేవలం అమెరికన్లు మాత్రమే కాదనేది గుర్తుంచుకోవాలి.

అమెరికా ఫస్ట్ అంటే ఏంటో మిగిలిన ప్రపంచానికి కూడా ఇప్పుడు తెలుసుకుంటుంది. అమెరికా దిగుమతులపై 20శాతం టారిఫ్ ప్రతిపాదనల అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం నుంచి యుక్రెయిన్, పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేస్తానని చెప్పడం వరకు అన్ని అంశాల్లో దీని ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు నెగ్గారనేది అప్రస్తుతం.

ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో అనుకున్న అన్ని ప్రణాళికలనూ అమలు చేయలేకపోయారు. రెండోసారి ఇప్పుడు అవకాశం రావడంతో, ఇప్పుడు ఆయన ఏం చేయగలరో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలూ చూస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)