డోనల్డ్ ట్రంప్ : మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రాత్మక విజయం

డోనల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారు. మరోసారి ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టనున్నారు. అమెరికా అపూర్వమైన, శక్తిమంతమైన విజయాన్ని అందించిందని ఫ్లోరిడాలో ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు.

అంతకుముందు అమెరికాకు ఇది ‘గోల్డెన్ ఏజ్’ అని ట్రంప్ అన్నారు.

భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆయనకు అభినందనలు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

మరోసారి..

డోనల్డ్ ట్రంప్ మరోసారి సాధించారు. హిల్లరీ క్లింటన్‌పై ఆశ్చర్యకరమైన విజయం సాధించిన ఎనిమిదేళ్ల తర్వాత, జో బైడెన్ చేతిలో ఓడిన నాలుగేళ్లకు ట్రంప్ మరోసారి వైట్‌హౌస్‌లో కూర్చోబోతున్నారు.

బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జుర్చర్ మాట్లాడుతూ.. ఈ విజయం ట్రంప్‌కు పెద్ద పునరాగమనం. జనవరి 6 నాటి సంఘటనలతో అపఖ్యాతి మూటగట్టుకొని ట్రంప్ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించారు. డెమొక్రట్లు, కొంతమంది రిపబ్లికన్ల నుంచి ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత నాలుగేళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు.

ట్రంప్‌ ప్రసంగాలు మొరటుగా ఉండేవి. కానీ, ఆయన చుట్టూ నైపుణ్యం గల బృందం ఉంది. ఈ ఎన్నికలలో మొదటి రెండు అంశాలైన వలస, ఆర్థిక వ్యవస్థపై అమెరికన్లు ట్రంప్‌ను విశ్వసించారని ఫలితాలు చూపించాయి. ఆయన క్యాంపెయిన్ కూడా వీటిపై బలంగా దృష్టి పెట్టింది.

బైడెన్ తప్పుకొని కమలా హారిస్‌ను పోటీలోకి తేవడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే అనిశ్చితి ట్రంప్ బృందానికి ఉంది, కానీ ట్రంప్ చివరికి సాధించారు. ఇప్పుడు ఆయనకు మరో నాలుగేళ్ల సమయం ఉంది. ఈసారి బలమైన రాజకీయ బృందంతో తన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Narendra Modi/X

మోదీ ఏమన్నారంటే..

డోనల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

''మిత్రుడు డోనల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ - అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

''చారిత్రాత్మక పునరాగమనానికి శుభాకాంక్షలు. మీరు వైట్‌హౌస్‌కి తిరిగిరావడం అమెరికాకు నూతన అధ్యాయం, ఇజ్రాయెల్ - అమెరికా కూటమిని మరింత శక్తివంతం చేస్తుంది'' అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

డోనల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని స్టార్మర్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ విజయం సాధించబోతున్నారని ఫాక్స్ న్యూస్ అంచనాలు విడుదల చేయడంతో ట్రంప్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన మద్దతుదారులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

అమెరికా అంతటా రిపబ్లికన్లు సంబరాలు చేసుకుంటున్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్లోరిడాలో మద్దతుదారుల ఆనందోత్సాహాల నడుమ ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

భార్య మెలానియా ట్రంప్, సహచరుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రచార సిబ్బందితో సహా వేదికపైకి వచ్చారు.

అందరూ వేదికపైకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభించారు.

రాజకీయ విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

''అమెరికా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మేం దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం'' అని ట్రంప్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)