అమెరికా ఎన్నికలు 2024: ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?

శ్వేత సౌధాన్ని పాలించేది ఎవరో త్వరలో తెలుస్తుంది
ఫొటో క్యాప్షన్, శ్వేత సౌధం
    • రచయిత, సామ్ కాబ్రల్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

నవంబరు 5న జరిగే ఎన్నికల్లో అమెరికన్లు తమ తదుపరి ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. అమెరికా ఎన్నికల ఫలితాలు కొన్నిసార్లు పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ప్రకటిస్తారు. అయితే ఈ సారి తీవ్రమైన పోటీ వల్ల ఫలితాల కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సి రావొచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కమలా హారిస్, ట్రంప్ మధ్య పోటాపోటీ
ఫొటో క్యాప్షన్, ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది

ఫలితాలు ఎప్పుడు రావచ్చు..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో విజేత పేరును కొన్నిసార్లు ఎన్నికలు జరిగిన రోజు రాత్రికి లేదంటే మరుసటి రోజు ఉదయానికే ప్రకటించేవారు.

కానీ ఈసారి తీవ్ర పోటీ కారణంగా ఎవరు గెలుస్తారనే అంచనా వేయడానికి మీడియా సంస్థలు ఎక్కువ సమయం ఎదురుచూడాల్సి రావచ్చు.

ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమొక్రాట్‌ అభ్యర్థిగా, మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షపదవి కోసం కొన్ని వారాల నుంచి పోటాపోటీ‌గా తలపడుతున్నారు.

తక్కువ మెజార్టీతో విజయం నమోదైతే రీకౌంటింగ్ జరగాల్సిన పరిస్థితులుంటాయి. కీలక స్వింగ్ రాష్ట్రమైన పెన్సిల్వేనియా విషయానికొస్తే...గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య అర పాయింట్ శాతం తేడా వస్తే రాష్ట్రవ్యాప్తంగా రీ కౌంటింగ్ జరపాల్సివస్తుంది.

2020లో గెలుపోటములకు మధ్య ఓట్ల తేడా 1.1శాతం పాయింట్లు మాత్రమే.

న్యాయపరమైన సవాళ్లకు కూడా అవకాశముంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి వందకుపైగా న్యాయపరమైన పిటిషన్లు దాఖలయ్యాయి. ఓటర్ల అర్హత, రిపబ్లికన్ల ఓటర్ల నమోదు కార్యక్రమం సహా అనేక అంశాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే ఇబ్బందులు సహా ఇతర ఎన్నికల సంబంధమైన సమస్యలూ ఫలితాలను ఆలస్యం చేయవచ్చు.

అదే సమయంలో మిషిగన్ వంటి కీలక రాష్ట్రంతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు వేగంగా జరిగే అవకాశముంది. కరోనా కారణంగా గత ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించారు. అయితే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెయిల్ ద్వారా ఓట్లు వేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

కమలా హారిస్, ట్రంప్ మధ్య పోటాపోటీ

ఫొటో సోర్స్, Reuters / EPA-EFE

ఫొటో క్యాప్షన్, కమలాహారిస్ రేసులోకి వచ్చాక అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ ఉత్కంఠగా మారింది

గతంలో ఫలితాలు ఎప్పుడు ప్రకటించారు..?

కిందటిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో మంగళవారం నవంబరు 3న జరిగాయి. కానీ శనివారం నవంబరు 7వతేదీ ఉదయం పెన్సిల్వేనియా ఫలితాలపై స్పష్టత వచ్చేవరకు అమెరికా టీవీ నెట్‌వర్క్స్ జో బైడెన్‌ను విజేతగా ప్రకటించలేదు.

అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఫలితాలు కోసం ఇంతసేపు ఎదురుచూడాల్సిన అవసరం రాలేదు.

2016లో ట్రంప్ అధ్యక్షునిగా గెలిచినప్పుడు ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రానికే ఆయన అధ్యక్షునిగా ఎన్నికయినట్టు ప్రకటించారు.

2012లో బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షునిగా గెలిచినప్పుడు పోలింగ్ జరిగిన రోజు అర్ధరాత్రికే ఫలితాలు వచ్చేశాయి.

2000లో జార్జి డబ్ల్యు బుష్, అల్ గోర్‌కు మధ్య జరిగిన ఎన్నికలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఫ్లోరిడాలో రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో డిసెంబరు 12వరకు విజేత ఎవరో నిర్ణయించలేదు. అయితే అమెరికా సుప్రీం కోర్టు రీకౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాతే బుష్‌ను విజేతగా ప్రకటించి వైట్ హౌస్‌ను ఆయనకు అప్పగించారు.

ఓట్ల లెక్కింపు ఎలా?

అమెరికా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి మొదటిదశ పోలింగ్ ముగుస్తుంది బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు చివరిదశ పోలింగ్ ముగుస్తుంది.

సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను లెక్కిస్తారు.

కాన్వాసింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు (కొన్నిసార్లు ఈ అధికారులను నియమిస్తారు, కొన్నిసార్లు ఎన్నుకుంటారు) ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. అర్హత గల ప్రతి ఓటునూ లెక్కించేలా చూడటమే వీరి పని.

ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి అనేది కూడా పోలుస్తూ బ్యాలెట్లను పరిశీలిస్తారు. ప్రతి బ్యాలెట్‌ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. బ్యాలెట్‌పై కన్నీళ్లు, మరకలు వంటివి ఉన్నాయా..వేరే రూపంలో బ్యాలెట్‌ ఏమన్నా పాడయిందా వంటివన్నీ గమనిస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు.

కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్‌గానూ లెక్కిస్తారు. కొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు.

కాన్వాస్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై ప్రతి రాష్ట్రం, ప్రాంతంలో కఠిన నిబంధనలుంటాయి. ఏ ఓట్లను లెక్కిస్తారు...ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏ భాగం ప్రజలకు బహిర్గతం చేస్తారు, పరిశీలకులు కౌంటింగ్‌ను ఎలా పర్యవేక్షిస్తారు...వంటివాటన్నిటికీ నిబంధనలుంటాయి.

2020లో ట్రంప్ మద్దతుదారుల ర్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 ఎన్నికల ఫలితాల తరువాత ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ హిల్స్‌పై దాడి చేశారు

ఫలితాలను సవాల్ చేస్తే ..?

అర్హత ఉన్న ప్రతి ఓటునూ లెక్కించిన తర్వాత ఎలక్టోరల్ కాలేజీ అనే ప్రక్రియ రంగంలోకి వస్తుంది. అమెరికాలో అధ్యక్ష పదవిని గెలుచుకోవడం అంటే ఎక్కువ ఓట్లు పొందడమే కాకుండా ప్రతి రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన కేటాయించే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో మెజారిటీని సాధించడం.

సాధారణంగా ఎక్కువ ఓట్లు సాధించినవారికి రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లన్నీ దక్కుతాయి. అమెరికా కొత్త కాంగ్రెస్ జనవరి 6న సమావేశమై ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లెక్కించి కొత్త ప్రెసిడెంట్‌‌ గెలుపును ధృవీకరిస్తుంది.

2020 ఎన్నికల ఫలితాల వేళ, బైడెన్ విజయాన్ని ధృవీకరించడానికి కాంగ్రెస్ సమావేశమైనప్పుడు ట్రంప్ అంగీకరించలేదు. ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్స్‌పైకి దండెత్తారు. ఈ ఫలితాలను తిరస్కరించాల్సిందిగా ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్‌ను కోరినప్పటికీ ఆయన అంగీకరించలేదు.

అల్లర్లు సద్దుమణిగి, కాంగ్రెస్ సభ్యులు తిరిగి సమావేశమైన తర్వాత కూడా 147 మంది రిపబ్లికన్లు ట్రంప్ ఓటమిని అంగీకరించమంటూ ఓట్లు వేశారు.

అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల నుంచి తమకు పంపిన సర్టిఫైడ్ ఫలితాలపై చట్టసభ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం కష్టతరంగా మారింది. ఎలక్టోరల్ ఓట్లను ఏకపక్షంగా తిరస్కరించే అధికారం ఉపాధ్యక్షుడికి లేదని వారు స్పష్టం చేశారు.

ఏదేమైనా 2024 ఓట్ల లెక్కింపును జాప్యం చేసే ప్రయత్నాలు స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో జరిగే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.

తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరిస్తామనే విషయాన్ని ట్రంప్, ఆయన సహచరుడు జేడీ వాన్స్, క్యాపిటల్ హిల్ లోని రిపబ్లికన్ అగ్రనేతలు పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా నిరాకరించారు.

ప్రమాణస్వీకారం ఎప్పుడు?

యూఎస్ క్యాపిటల్ సముదాయంలో 2025 జనవరి 20వ తేదీ సోమవారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత కొత్త ప్రెసిడెంట్ పదవీకాలం మొదలవుతుంది.

అమెరికా చరిత్రలో ఇది 60వ ప్రెసిడెంట్ ప్రమాణస్వీకార కార్యక్రమం అవుతుంది.

ఈ కార్యక్రమంలో కొత్త ప్రెసిడెంట్ రాజ్యాంగాన్ని అమలుచేస్తానని ప్రతిజ్ఞచేసి తరువాత ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)