డిజిటల్ అరెస్ట్: 22 రోజులు వీడియో కాల్‌లో పెట్టి, రూ.51 లక్షలు కొట్టేశారు....

సారాంశం
  • డిజిటల్ అరెస్టు మోసానికి పరాకాష్ఠగా నిలిచిన హరినాథ్ ఉదంతం
  • ప్రభుత్వ అధికారులమంటూ బెదిరించిన సైబర్ దుండగులు
  • ఆర్బీఐ, సీబీఐ, సుప్రీంకోర్టు అంటూ హడలగొట్టిన సైబర్ ముఠా
  • వీడియోకాల్‌లో పెట్టి కదలికలను నిరంతరం గమనిస్తూ డబ్బు వసూలు
  • డబ్బు పంపుతున్నట్లు ఇంట్లో తెలియనివ్వద్దంటూ ఆదేశాలు
  • మోసానికి గురైనట్లు అర్ధమయ్యాక సైబర్ పోలీసులకు హరినాథ్ ఫిర్యాదు
  • అవగాహనతోనే ఇలాంటి మోసాలను అడ్డుకోవాలన్న పోలీసులు
    • రచయిత, నవజోత్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
బాధితుడు హరినాథ్
ఫొటో క్యాప్షన్, అక్టోబరు 2 నుంచి 24వ తేదీ వరకు హరినాథ్ రూ. 51 లక్షలు మోసపోయారు.

"అతను నాతో 22 రోజులపాటు వీడియో కాల్‌లోనే ఉన్నారు. బాత్‌రూమ్‌కి వెళ్లే ముందు కూడా నేను చెప్పాల్సి వచ్చేది"

ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో ఇటీవల డిజిటల్ అరెస్ట్ అయిన చండీగఢ్ వాసి హరినాథ్ కథ ఇది.

‘‘ రోజూ లేదా రెండు రోజులకోసారి బ్యాంకుకు వెళ్లి లక్షల రూపాయలు పంపేవాడిని. ఇలా రూ.51 లక్షల 2 వేల రూపాయలు మోసపోయాను’’ అని హరినాథ్ చెప్పారు.

అక్టోబరు 2 నుంచి 24వ తేదీ వరకు సైబర్ మోసగాళ్ల సూచనలను పాటించి, 22 రోజుల పాటు వారికి డబ్బులు పంపుతూనే ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే కూడా మెసేజ్ చేసేవారని హరినాథ్ చెప్పారు.

దేశంలో డిజిటల్ అరెస్ట్ తీవ్రతను అక్టోబర్ 27న 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు డిజిటల్ అరెస్ట్ బాధితులు అవుతున్నారని, కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయం కారణంగా కోల్పోతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హరినాథ్
ఫొటో క్యాప్షన్, హరినాథ్ స్వస్థలం భోపాల్

డిజిటల్ అరెస్ట్ ఎలా జరిగింది?

భోపాల్‌కు చెందిన హరినాథ్ గత ఏడేళ్లుగా చండీగఢ్‌లో నివసిస్తున్నారు.

"నేను ఒక వార్తాపత్రికలో ఫోటో ఎడిటర్‌గా పనిచేశాను. 2017లో ఈ పని కోసం చండీగఢ్ వచ్చాను" అని హరినాథ్ బీబీసీతో చెప్పారు.

కరోనా సమయంలో హరినాథ్ ఉద్యోగం కోల్పోయారు. ఆయన భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె ఇంట్లో ట్యూషన్ కూడా చెబుతుంటారు. ఉద్యోగం లేకపోవడంతో భార్యతో కలిసి ఇంట్లో పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టారు హరినాథ్.

డిజిటల్ అరెస్ట్ గురించి హరినాథ్ మాట్లాడుతూ "అక్టోబర్ 2న అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఒక అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని, రెండు గంటల తర్వాత మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందన్నారు. ఆగస్టు 30న ముంబయిలో మీ ఆధార్ కార్డ్‌పై మొబైల్ సిమ్ జారీ చేశారని, ఈ సిమ్ కార్డ్‌పై మోసం చేసినట్లు ఏడు ఫిర్యాదులు, ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆ అమ్మాయి చెప్పింది" అని అన్నారు.

“నాకు ముంబయిలో ఎవరూ తెలియదని, చండీగఢ్‌లో ఉంటానని చెప్పాను. తర్వాత వారు ఒక (నకిలీ) పోలీసు అధికారితో మాట్లాడించారు’’ అని గుర్తుచేసుకున్నారు హరినాథ్. ఆ పోలీసు తనను బెదిరించారని హరినాథ్ చెప్పారు.

ఆ పోలీసు అధికారి ‘‘ఏం చేశావ్? పెద్ద మోసం చేస్తున్నావు. నరేష్ గోయల్ అనే వ్యక్తి పెద్ద మోసం చేశారు. నీ పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచారు. ఈ ఖాతా నుంచి రూ.6 కోట్ల 80 లక్షల లావాదేవీ జరిగింది. ఇందులో 10 శాతం నీ పేరు మీద ఉంది. నీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నిన్ను అరెస్ట్ చేసేందుకు రెండు గంటల్లో పోలీసులు వస్తున్నారు.’’ అని అన్నట్లు హరినాథ్ చెప్పారు.

"నేను భయపడ్డాను. అదంతా జరిగిందో లేదో తెలుసుకోలేదు. ఈ విషయం చాలా సీరియస్ అని నకిలీ పోలీసు నాతో చెప్పారు. కేసును ఆర్బీఐ, సీబీఐ, సుప్రీంకోర్ట్ దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సీబీఐ అధికారితో మాట్లాడిస్తామన్నారు" అని హరినాథ్ చెప్పారు.

దీని తరువాత హరినాథ్‌ను ఒక నకిలీ సీబీఐ అధికారి విచారించారు.

‘‘వీలైనంత త్వరగా ముంబయికి రావాలని అడిగారు. ఇంత త్వరగా ముంబయికి ఎలా వస్తానని చెప్పాను. నా భార్యాపిల్లల బాధ్యత నాపై ఉందన్నాను’’ అని హరినాథ్ బీబీసీతో చెప్పారు.

ముంబయికి రాలేకపోతే వేరే మార్గం ఉందని, ఇంట్లోనే ఉండి విచారణకు సహకరించాలంటూ సూచించారని హరినాథ్ అన్నారు.

అనంతరం వాళ్లు హరినాథ్‌తో ‘‘మీరు ఎల్లప్పుడూ మొబైల్ ద్వారా మాతో కనెక్ట్ అయి ఉండాలి. రేపు ఉదయం 10 గంటలకు మాట్లాడతాం. మీ ఆస్తుల వివరాలు మాకు చెప్పాలి. మీ ఖాతాలు, డిపాజిట్లపై ఆర్బీఐ దర్యాప్తు చేస్తుంది. మీరు నిర్దోషులుగా తేలితే, మిమ్మల్ని విడుదల చేస్తారు." అని అన్నారు.

హరినాథ్‌కు వాట్సాప్ సందేశాలు పంపేవారు.
ఫొటో క్యాప్షన్, ఆర్బీఐ, సీబీఐలు కేసును దర్యాప్తు చేస్తున్నాయని బాధితుడిని మోసగాళ్లు బెదిరించారు.

ఆ తర్వాత ఏమైందంటే..

మరుసటి రోజు అంటే అక్టోబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు వీడియో కాల్ చేశారని హరినాథ్ చెప్పారు. ఈ కాల్‌లో సైబర్ దుండగులు హరినాథ్‌కు ఎంత డబ్బు, ఆస్తి ఉందని అడిగారు. రూ.9 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పినట్లు హరినాథ్ తెలిపారు.

వెంటనే బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు పంపించాలని అడిగారని, దీంతో అదే రోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ బ్రేక్ చేశానని హరినాథ్ చెప్పారు. మరుసటి రోజు 4వ తేదీన మళ్లీ ఆన్‌లైన్ మీటింగ్ పెట్టారని అన్నారు.

‘‘బ్యాంక్‌కి వెళ్లాక కూడా మీ ఫోన్‌లో వీడియో కాల్‌ ఆన్‌లోనే ఉంటుందని చెప్పారు. డబ్బు ఎందుకు, ఎవరికి పంపుతున్నారో వారికి చెప్పవద్దన్నారు. బ్యాంకులో ఎవరితోనూ మాట్లాడవద్దని మీటింగ్‌లో ఆయన నాకు సూచించారు" అని హరినాథ్ చెప్పారు.

ఆ వ్యక్తులు ఎవరు? ఆర్‌బీఐ, సీబీఐ అంటూ వాట్సాప్‌ల ద్వారా నన్ను ఎందుకు సంప్రదిస్తారని అనుమానించకపోవడం పెద్ద తప్పయిందని హరినాథ్ అన్నారు.

‘‘నాకు భయమేసింది. వాళ్లు ఏది అడిగితే అది చేశాను.’’ అని ఆయన అన్నారు.

పిల్లలకు పాఠాలు చెప్పడం, వంట చేయడం నుంచి, గుడిలో దీపం వెలిగించడం వరకు ఏ పని చేయబోతున్నా భార్యకు చెబుతారు హరినాథ్. కానీ, ఈ విషయం మాత్రం భార్యకు చెప్పలేదు. ఎందుకు?

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

'కుటుంబ సభ్యులతో మాట్లాడకు'

‘మొదట్లో వాళ్లు నిజంగా ఆర్బీఐ, సీబీఐ వాళ్లనుకున్నా, అనుమానించలేదు’ అన్నారు హరినాథ్.

"వీడియో కాల్స్‌లో నన్ను నిత్యం చూస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు. ఎవరికీ ఏమీ చెప్పవద్దన్నారు. నా భార్య పదేపదే అడిగినప్పటికీ నేను ఏ ఉచ్చులో ఉన్నానో ఆమెకు చెప్పలేదు" అని అన్నారు.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

డబ్బులు పంపడం కొనసాగింది

బ్యాంకు ద్వారా డబ్బులు పంపాలంటూ అడిగారని, మొదటగా అక్టోబర్ 4న ఆర్టీజీఎస్ ద్వారా రూ.9 లక్షల 80 వేలు పంపించానని హరినాథ్ చెప్పారు.

‘‘రెండోసారి అక్టోబర్ 5న రూ.20 లక్షలు పంపాను. అక్టోబర్ 7న మొదట రూ.9 లక్షల 80 వేలు, తర్వాత మరో రూ.50 వేలు పంపాను. అనంతరం అక్టోబర్ 9న మళ్లీ రూ.5 లక్షలు పంపాను’’ అని హరినాథ్ పేర్కొన్నారు.

ఈ డబ్బు పంపే ప్రక్రియ ఇలా కొనసాగింది.

‘‘అక్టోబరు 13న 99 వేల 999 రూపాయలు పంపాను. మరుసటి రోజు అంటే అక్టోబర్ 14న 2 లక్షల 80 వేలు పంపాను’’ అని హరినాథ్ చెప్పారు.

దీని తర్వాత సైబర్ దుండగులు హరినాథ్‌తో మాట్లాడుతూ.. ‘నీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటే మరో రూ.2 లక్షలు చెల్లించాలి’ అని చెప్పారు.

‘అక్టోబరు 16న అతనికి రూ.88,000 పంపాను’ అని హరినాథ్ చెప్పారు.

''దీని తర్వాత ఆర్‌బీఐ విచారణ పూర్తి చేసిందని, దాని రుసుము రూ.1.5 లక్షలనీ చెప్పారు. నా డబ్బు తిరిగి కావాలంటే, డబ్బులు చెల్లించాలని అనుకున్నా. అందుకే అక్టోబరు 22న వారి ఖాతాలో మరో రూ.1.5 లక్షలు వేశాను.’’ అని అన్నారు.

ఇదంతా జరిగాక తాను మోసపోయినట్లు హరినాథ్‌కు అర్థమైంది.

"నేను మా కుటుంబంతో మాట్లాడాను. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. సైబర్ సెల్‌ను సంప్రదించాలని వారు సూచించారు. సెక్టార్ 17లోని సైబర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశా" అని హరినాథ్ అన్నారు.

అక్టోబర్ 24న ఫిర్యాదు చేయగా, వీలైనంత త్వరగా ఫోన్ స్విచాఫ్ చేయాలని పోలీసులు సూచించారని చెప్పారు.

కేసుపై దర్యాప్తు జరుగుతున్నట్లు చండీగఢ్ సైబర్ పోలీస్ సూపరింటెండెంట్ కేతన్ బన్సల్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశామని, ప్రజలకు అవగాహన కల్పించడమే కీలకమని చెప్పారు.

రూ. 51 లక్షలు ఎలా తెచ్చారు?

హరినాథ్ చండీగఢ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పానిపట్‌లో రెండు ఫ్లాట్‌లు ఉన్నాయని, వాటిని అమ్మేసి మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశానని చెప్పారు.

‘‘ఉద్యోగం మానేసిన తర్వాత 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు పొదుపు చేశాను. నా కారును రూ.1.71 లక్షలకు అమ్మేశాను. ఇది కాకుండా నా దగ్గర రూ.12-13 లక్షలు ఉన్నాయి. మరో ఫ్లాట్‌ కూడా అమ్మేశాను’’ అని చెప్పారు.

డిజిటల్ అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

ఇది ఆన్‌లైన్ మోసంలో కొత్త పద్ధతి. ఇందులో కొంతమంది వ్యక్తులు తమను తాము పోలీసులు లేదా ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకుంటూ ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తారు.

వీడియో కాల్ ద్వారా వ్యక్తి కదలికలను గమనిస్తారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.

ఒక రకంగా చెప్పాలంటే వీడియో కాల్ సహాయంతో ఈ మోసగాళ్లు బాధితులను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. అరెస్టు అవుతారని భయపెడతారు. ఈ అరెస్టును నివారించడానికి బాధితులు వారి ఆదేశాలను పాటిస్తుంటారు.

అనంతరం, ఈ మోసగాళ్లు క్రమంగా దర్యాప్తు పేరుతో భయపెడుతూ డబ్బు బదిలీ చేయాలని సూచిస్తారు. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మవద్దని, ఎవరికైనా అలాంటి కాల్ వస్తే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని బాధితుడు హరినాథ్ ప్రజలకు సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)