దోమలకు చెవుడు తెప్పించి, సెక్స్‌కు దూరం చేసిన శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

దోమల వ్యాప్తిని అడ్డుకునే ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మగ దోమల వినికిడి శక్తి ని అడ్డుకుంటే దోమల వ్యాప్తి తగ్గుతుందంటున్న శాస్త్రవేత్తలు
    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ న్యూస్, డిజిటల్ హెల్త్ ఎడిటర్

దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, ఎల్లో ఫీవర్,జైకా లాంటి వ్యాధులను నివారించేందుకు శాస్త్రవేత్తలు ఓ చమత్కారమైన ఉపాయాన్ని కనుగొన్నారు. మగదోమల వినికిడి శక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా వాటి సంభోగానికి అడ్డుకట్ట వేసి, సంతానోత్పత్తికి అవకాశం లేకుండా చేయడమే ఆ ఉపాయం.

దోమలు గాలిలో ఎగురుతూనే సంభోగంలో పాల్గొంటాయి. ఇందుకోసం అవి ఆడదోమలు చేసే రెక్కలచప్పుడు ఆధారంగా వాటి వెంటపడతాయి. దీంతో ఆడదోమల రెక్కలచప్పుడు మగదోమలకు వినపడకుండా చేస్తే సమస్య తీరుతుందని శాస్త్రవేత్తలు భావించారు.

ఇందుకోసం వారు ఒక ప్రయోగం చేశారు.మగ దోమల్ని ఆడ దోమల్ని ఒకే చోట బంధించి, మగ దోమల వినికిడిని నియంత్రించేలా వాటిలో ఒక జన్యుపరమైన మార్పు చేశారు. దీంతో వాటికి ఆడదోమల రెక్కల చప్పుడు వినపడక, మూడు రోజులైనా అవి ఆడ దోమల జోలికి పోలేదు.

వ్యాధులను వ్యాపింపజేసేది ఆడ దోమలే కాబట్టి వాటిని గుడ్లు పెట్టనీయకుండా చేస్తే, మొత్తం దోమల సంఖ్యనే తగ్గించచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చెవిటి మగదోమలు

యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఇర్వైన్ పరిశోధనా బృందం ఏడిస్ ఈజిప్టై జాతి దోమలపై అధ్యయనం చేసింది. ఈ దోమలు ఏడాదికి దాదాపు 40 కోట్ల మందికి వైరస్‌లను వ్యాప్తిచేస్తాయి.

కొన్ని సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధిలో పూర్తయ్యే దోమల లైంగిక చర్యలను దగ్గరగా గమనించి వాటి లైంగిక ప్రక్రియకు జన్యుపరంగా ఎలా అంతరాయం కలిగించచ్చో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

దోమల్లో వినికిడికి అత్యవసరమైన టీఆర్పీవీఏ (trpVa) ప్రోటీన్‌‌ను పరిశోధకులు లక్ష్యంగా చేసుకున్నారు. జన్యు పరమైన మార్పు చెందిన మగ దోమల్లో శబ్దాలను గ్రహించే న్యూరాన్లు ఆడ దోమల రెక్కల్ల చప్పుళ్లకు స్పందించలేదు.

ఆడ దోమల ఆకర్షణీయ శబ్దాలను చెవిటి మగ దోమలు గ్రహించలేకపోయాయి.

జన్యుపరంగా మార్పులు చెందని మగదోమలు, ఆడ దోమల శబ్దాలు విన్న వెంటనే పలు సార్లు సంభోగంలో పాల్గొన్నాయి.

ఈ జన్యుపరమైన మార్పు వల్ల చెవిటి మగ దోమలు సంభోగంలో పాల్గొనడం పూర్తిగా ఆపేశాయి అని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధనా బృందం పీఎన్ఏఎస్ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో తెలిపింది.

దోమలపై పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images

‘మరింత అధ్యయనం జరగాలి’

దోమల లైంగిక అలవాట్లకు సంబంధించిన అంశాలపై నిపుణులైన జర్మనీలోని యూనివర్సిటీ అఫ్ ఓల్డెన్‌బర్గ్‌కు చెందిన డాక్టర్ జార్జ్ ఆల్బర్ట్‌ను ఈ పరిశోధన పై స్పందించమని బీబీసీ అడిగింది.

దోమల బెడదను నియంత్రించేందుకు వాటి వినికిడి శక్తికి ఆటంకం కలిగించడం చక్కటి విధానమని అయితే దానిపై మరింత అధ్యయనం జరగాలని ఆయన చెప్పారు.

దోమల పునరుత్పత్తికి వినికిడిశక్తి తప్పనిసరని సూచించే పరీక్షను మొదటిసారి ఈ అధ్యయనంలో నిర్వహించారు.

చెవుడు కారణంగా మగ దోమలు ఆడ దోమలు చేసే శబ్దాలను వెంబడించడం ఆపేస్తే... ఆడ దోమలు అంతరించిపోయే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.

మరోవైపు దోమలు వ్యాధులను వ్యాపింపచేసినప్పటికీ..ప్రకృతిలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చేపలు, పక్షులు, గబ్బిలాలు, కప్పలకి ఆహారంగా ఉపయోగపడతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)