ప్రపంచంలో యుద్ధాలను ఆపడానికి ట్రంప్ చొరవ చూపుతారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ బాట్‌మెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న డోనల్డ్ ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధాలు వంటి అంశాల్లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలున్నాయి.
స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో డోనల్డ్ ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆధారంగా ఆ వాగ్దానాలు చేశారు.
2017 నుంచి 2021 మధ్య కాలంలో పనిచేసిన తీరు, ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల ఆధారంగా విదేశాంగ విధానంపై డోనల్డ్ ట్రంప్ ఎలా ప్రభావం చూపనున్నారో కొంతమేర అంచనా వేయొచ్చు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తారా?
తాను అధికారంలోకి వస్తే రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ అనేక సార్లు చెప్పారు.
అయితే, ఒక్క రోజులోనే ఎలా ఆపేస్తారు అన్న ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి కచ్చితమైన సమాధానం రాలేదు.
ట్రంప్ హయాంలో పని చేసిన ఇద్దరు మాజీ జాతీయ భద్రత చీఫ్‌లు రాసిన ఒక పరిశోధన పత్రం మే నెలలో బయటికి వచ్చింది.
అందులో వాళ్లు అనేక అంశాలు పేర్కొన్నారు.
“రష్యాతో శాంతి చర్చలకు రావాలనే షరతుతో యుక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయాలి. శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించడానికి, ‘నేటో’లో ఇప్పట్లో యుక్రెయిన్‌ను చేర్చుకోమని యూరప్ దేశాలు హామీ ఇవ్వాలి.
రష్యా ఆక్రమించిన తన భూభాగాన్ని తిరిగి పొందాలనే ఆశను యుక్రెయిన్ కోల్పోకూడదు. కానీ, ప్రస్తుతం ఫ్రంట్ లైన్స్ ఆధారంగా చర్చలు జరపాలి” అని అందులో ఉంది.
అయితే, రష్యా అధినేత పుతిన్‌తో తనకున్న స్నేహం కారణంగా యుక్రెయిన్ లొంగిపోవాలనే విధంగానే ట్రంప్ వ్యవహార శైలి ఉంటుందని ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇది యూరప్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందని వారు అన్నారు.
యుద్ధాన్ని ఆపి ఇతర దేశాలకు తరలివెళ్తున్న అమెరికా వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
అయితే, ట్రంప్ ఆలోచనలను ఆ మాజీ సలహాదారుల కథనం ఎంత వరకు ప్రతిబింబిస్తుందో చెప్పలేం కానీ, ఆయన ఎలాంటి సలహాలు పొందుతారో దీనిని బట్టి అంచనా వేయొచ్చు.
యుద్ధం ముగించడానికి ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానం నేటో భవిష్యత్‌పై వ్యూహాత్మక సమస్యలకు దారితీస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన వివిధ దేశాల సైనిక కూటమి ఈ నేటో.
అమెరికా ఖర్చుతో యూరప్ దేశాలు ఉచితంగా రక్షణ పొందుతున్నాయని నేటో కూటమిపై ట్రంప్ అనేక సార్లు విమర్శలు గుప్పించారు.
‘నేటో’ నుంచి అమెరికా వైదొలిగేలా ట్రంప్ చర్యలు ఉంటాయా? అన్న చర్చలు మొదలయ్యయాయి. అదే కనుక జరిగితే, ఈ శతాబ్దంలో అట్లాంటిక్ దేశాల మధ్య రక్షణపరమైన సంబంధాల్లో ఇదో కీలక మార్పుగా నిలుస్తుంది.
అయితే, ట్రంప్ మాటల వెనుక దాగి ఉన్న వ్యూహం నేటో నుంచి వైదొలగడం కాదు. రక్షణ కోసం సభ్య దేశాలు కేటాయించే నిధుల వాటాల్లో మార్పులు తీసుకురావడమే ఆయన ఉద్దేశమని ట్రంప్ సన్నిహితులు చెబుతున్నారు.
కానీ, ట్రంప్ విజయంతో నేటో భవిష్యత్ ఎలా మారనుంది? అన్నదానిపై సభ్య దేశాలు తీవ్రంగానే ఆందోళన చెందుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
పశ్చిమాసియాలో ట్రంప్ మార్క్ ఉంటుందా?
పశ్చిమాసియాలోనూ శాంతిని నెలకొల్పుతానని ట్రంప్ హామీ ఇచ్చారు.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్, లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధాలను ఆపేస్తానని ట్రంప్ తెలిపారు. కానీ, ఎలా చేస్తారో స్పష్టం చేయలేదు.
ఒకవేళ జో బైడెన్ స్థానంలో తాను అధికారంలో ఉండుంటే హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి సాహసించేది కాదని ట్రంప్ చాలా సార్లు అన్నారు. ఎందుకంటే, హమాస్‌కు నిధులు చేకూర్చే ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేవాడినని ఆయన తెలిపారు.
ఇవన్నీ చూస్తుంటే, తిరిగి పాత ఒప్పందాల వైపు ట్రంప్ మొగ్గుచూపుతున్నారని అర్థమవుతోంది.
అంటే, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొగలడం, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించడం, ఆ దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ జనరల్ సులేమానీని చంపడం వంటివి.
ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించి యూఎస్ రాయబార కార్యాలయాన్ని అక్కడికి మార్చారు.
“ఇప్పటి వరకు వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్‌కు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్” అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు.
కానీ, ట్రంప్ విధానాలతో ఆ ప్రాంతంలో అస్థిరత నెలకొందని విమర్శకులు అంటున్నారు.
ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించడంతో ట్రంప్ పరిపాలనను పాలస్తీనియన్లు బహిష్కరించారు.
ఇజ్రాయెల్‌కు ఇతర అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో పాలస్తీనా ఆ ప్రాంతంలో మరింత ఒంటరైంది.
ఇజ్రాయెల్‌ను గుర్తించినందుకుగానూ ఆయా దేశాలకు అధునాతన అమెరికా ఆయుధాలు లభించాయి.
దీంతో, చరిత్రలోనే తొలిసారిగా పాలస్తీనా ఏకాకిగా మిగిలిపోయింది.
ట్రంప్ మాత్రం గాజా యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు ప్రచారంలో అనేక సార్లు చెప్పారు. అయితే, హమాస్‌తో సంబంధాలు కలిగిన అరబ్ దేశాలతోనూ ట్రంప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒక వైపు గాజా యుద్ధానికి ఆపడానికి ప్రయత్నిస్తూనే ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ట్రంప్ ఎలా బలపరుస్తారు అన్నది అస్పష్టంగానే ఉంది.
హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదలకు బదులుగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి జో బైడెన్ హయాంలో చేసిన ప్రయత్నాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ట్రంప్ నిర్ణయించుకోవాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు చెక్ పెడతారా?
అమెరికా విదేశాంగ విధానంలోని కీలకమైన అంశాలలో చైనాతో సంబంధాలు ఒకటి. ప్రపంచ రక్షణ, వాణిజ్యంపై ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలమైన ప్రభావం చూపిస్తాయి.
అయితే, చైనా తమకు వ్యూహాత్మకమైన పోటీదారు అంటూ అమెరికాకు ఎగుమతయ్యే చైనా వస్తువులపై ట్రంప్ తన హయాంలో అనేక ఆంక్షలు విధించారు.
దీంతో, చైనా కూడా అమెరికా వస్తువులపై ఆంక్షలు విధించింది.
వాణిజ్యపరమైన ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ, కరోనా మహమ్మారి రాకతో… దానిని ‘చైనా వైరస్’గా ట్రంప్ అభివర్ణించడంతో ఆ చర్చల ఊసే లేకుండా పోయింది.
చైనాతో బాధ్యతాయుతమైన సంబంధాలను కొనసాగిస్తామని జో బైడెన్ సర్కారు చెప్పినప్పటికీ, ట్రంప్ హయాంలో విధించిన సుంకాలను చాలా వరకు కొనసాగించింది.
అమెరికాలోని స్థానికుల ఉద్యోగ భద్రతపై ఈ వాణిజ్య విధానాలు ప్రభావం చూపిస్తాయి. దీంతో, ఈ విధానాలు ఓటర్లపై ప్రభావం చూపిస్తాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలివైన వారు అలాగే ప్రమాదకరమైన వారని ట్రంప్ అన్నారు. ఉక్కు పిడికిలితో 140 కోట్ల మందిని కంట్రోల్ చేస్తున్న లీడర్‌గా ఆయనను అభివర్ణించారు.
అయితే, జో బైడెన్ సర్కార్ విధానాలను పక్కన పెట్టి, చైనాకు చెక్ పెట్టేలా వివిధ దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని నెలకొల్పే దిశగా ట్రంప్ ప్రయత్నించవచ్చు.
స్వతంత్ర పాలనలో ఉన్న తైవాన్‌కు అమెరికా మిలటరీ సాయాన్ని అందిస్తోంది. తైవాన్ తమ నుంచి విడిపోయిన ఒక ప్రావిన్స్, అది తమలో అంతర్భాగమే అన్నది చైనా వాదన.
ఒక వేళ తాను అధికారంలోకి వస్తే చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌కు మద్దతుగా మిలిటరీ బలగాన్ని ఉపయోగించబోనని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు.
“నా గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బాగా తెలుసు. ఒకవేళ చైనా తైవాన్‌పై చర్యకు దిగితే చైనా దిగుమతులపై భరించలేని స్థాయిలో సుంకాలు విధిస్తాను” అని ట్రంప్ స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














