'ఆ ఒక్క అడుగుతో నా కాలు పోయింది’

ఫొటో సోర్స్, Amensisa Negera / BBC
- రచయిత, కాల్కిడాన్ యిబెల్టల్
- హోదా, బీబీసీ న్యూస్, టిగ్రే
హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు.
ఉత్తర ఇథియోపియాలోని టిగ్రేలో మారుమూల పర్వత ప్రాంతానికి చెందిన పదహారేళ్ల బెర్హానే హైల్ ఈ ఏడాది మొదట్లో స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన పేలుడు ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది.
పేలుడు పదార్థంపై అడుగుపెట్టడంతో బెర్హానే ఎడమ కాలి ఎముకలు విరిగిపోయి, మాంసం తునకలై, తీవ్ర రక్తస్రావమైంది. నరకయాతన అనుభవించారు బెర్హానే.
''పేలుడుతో ఎగిరి వెనక్కిపడ్డాను. ఎక్కడ చూసినా రక్తం. ఆ శబ్దం విని జనం నావైపు పరుగెత్తుకుంటా వచ్చారు'' అని బెర్హానే బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో చెప్పారు.

ఆ తర్వాత ఆయన తండ్రి, గ్రామ ప్రజలు కలిసి కాలినడకన రెండుగంటల పాటు కొండలను దాటుకుంటూ బెర్హానేను అడ్వా పట్టణానికి తీసుకెళ్లారు.
టిగ్రే రాజధాని మెకెల్లేకి ఉత్తరాన సుమారు 162 కిలోమీటర్ల దూరంలో, ఎరిట్రియా బోర్డర్‌కు సమీపంలో ఈ పట్టణం ఉంటుంది.
అక్కడి వైద్యులు బెర్హానే ప్రాణాలను కాపాడగలిగారు కానీ, ఆయన కాలుని మాత్రం తీసేయాల్సి వచ్చింది. ఆయన చేతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బెర్హానేది టిగ్రే పర్వతప్రాంతంలో మారుమూలన ఉండే సెయాబో గ్రామం.
2022లో ముగిసిన అంతర్యుద్ధంతో ఈ గ్రామమంతా ఫైటర్లు వాడకుండా వదిలేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రితో నిండిపోయింది.

ఫొటో సోర్స్, Amensisa Negera / BBC
అంతర్యుద్ధం ముగిసి రెండు వర్గాల ఫైటర్లు అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో భారీస్థాయిలో గ్రనేడ్లు, షెల్స్, ఇతర ఆయుధాలు అక్కడ పోగుపడ్డాయి. అయితే, ఈ ప్రాంతంలో మందుపాతరలు మాత్రం లేవని భావిస్తున్నారు.
రెండేళ్ల పాటు కొనసాగిన ఈ ఘర్షణలతో లక్షల మంది ఇళ్లను వదిలి పారిపోయి సహాయ శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఆఫ్రికాలో తలెత్తిన సంక్షోభాల్లో ఇది కూడా ఒకటి.
ఈ ప్రాంతంపై పట్టు కోసం ఇథియోపియన్ - ఎరిట్రియన్ సంయుక్త దళాలకు, స్థానిక టిగ్రే ఫైటర్స్‌కు మధ్య 2020 చివర్లో ఈ యుద్ధం మొదలైంది.
ఆఫ్రికన్ యూనియన్ అంచనాల ప్రకారం, ఈ అంతర్యుద్ధం, దాని కారణంగా తలెత్తిన సంక్షోభంతో దాదాపు 5 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా.
ఈ యుద్ధం ముగిసి రెండేళ్లు గడుస్తున్నా, యుద్ధం నాటి అవశేషాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం వంటి ఘటనలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి.
స్కూల్ నుంచి ఇంటికొస్తున్న సమయంలో.. మేత మేసుకుంటూ దూరంగా వెళ్తున్న తమ మేకలను చూసి వాటిని ఆపేందుకు బెర్హానే కాలిబాటను వదిలి, కొద్దిదూరం పక్కకు వెళ్లారు. ఆ సమయంలో అనుకోకుండా పేలుడు పదార్థంపై కాలువేశారు.
2023 నుంచి ఇలాంటి పేలుడు ఘటనల్లో గాయాలపాలైన దాదాపు 400 మందికి సాయం అందించినట్లు రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది.
వారిలో 80 శాతం చిన్నారులేనని పేర్కొంది. అయితే, ఇలా గాయపడినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది రెడ్‌క్రాస్ అంచనా.

ఫొటో సోర్స్, Amensisa Negera / BBC
అడ్వాకి సమీపంలోని నెవి డిస్ట్రిక్ట్‌లో జరిగిన పేలుడులో నిగ్‌స్తి గిడే భర్త చనిపోయారు. అప్పటికి ఆమె ఐదు నెలల గర్భంతో ఉన్నారు.
తమ గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో సాయమందించేందుకు వెళ్లిన ఆమె భర్త అనుకోకుండా అక్కడ పడివున్న పేలుడు పదార్ధంపై అడుగేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.
''ఎటుచూసినా బాంబులే'' అని ఆయన భార్య బీబీసీతో చెప్పారు. ''రోడ్డుపై పడివున్న ఎలాంటి లోహపు వస్తువులను తాకవద్దని అధికారులు చెబుతున్నారు'' అని ఆమె అన్నారు.
అడ్వా ప్రధాన రహదారి పక్కనున్న గొరెరో వంటి గ్రామాల్లో పడివున్న ఆయుధాలను సేకరించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అక్కడి పొలాలు, భూముల్లో అధికారులు పేలుడు పదార్థాల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు.
అయితే, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం అంత సులభం కాదు.
ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి ఆ ప్రాంతంలో పడివున్న ఆయుధాలను గుర్తించి పేలకుండా చేసేందుకు మరింత మంది అవసరమవుతారని స్ధానిక పోలీస్ చీఫ్ హదుష్ గెబ్రెమెదిన్ ఉన్నతాధికారులను కోరారు.

ఫొటో సోర్స్, Amensisa Negera / BBC
కానీ, ఉన్నతాధికారుల నుంచి ఆయనకు ఎలాంటి జవాబూ రాలేదు. పరిమిత వనరులు, బాంబులను నిర్వీర్యం చేసే నిపుణుల కొరతే దానికి కారణంగా చెప్పొచ్చు.
తాము గుర్తించిన పేలుడు పదార్ధాల ఫ్యూజులను తొలగించామని, అయితే విపరీతమైన వేడి లేదా, అగ్నిప్రమాదాల వంటివి జరిగితే అవి పేలిపోయే అవకాశం ఉందని హదుష్ చెప్పారు.
బాంబులను కనిపెట్టి, నిర్వీర్యం చేసే అనుభవం కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఉంది.
కానీ, అవి రంగంలోకి దిగాలంటే వ్యవస్థలతో సమన్వయం అవసరమవుతుంది.
అడ్వాలో బాంబులను సురక్షితంగా నిర్వీర్యం చేసే అవకాశాలు లేకపోవడంతో అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వాటిని స్థానిక కార్యాలయంలో భద్రపరుస్తున్నారు.
ఒకప్పుడు తుపాకీ శబ్దాల ప్రతిధ్వనితో బెర్హానే గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణం ఇప్పుడు లేదు.
యుద్ధం సమయంలో సెయాబోతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల్లో నిలిచిపోయిన విద్యుత్, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సేవల పునరుద్ధరణతో ఇప్పుడిప్పుడే జనజీవనం కుదురుకుంటోంది.
అంతర్యుద్ధం ముగిసిన కొన్నినెలల తర్వాత బెర్హానే పాఠశాలకు వెళ్లగలిగారు. అయితే, ఆయనకు ప్రమాదం జరగడానికి ముందు కూడా వారి కుటుంబ జీవనం అంత సాఫీగా ఏమీ సాగలేదు.

ఫొటో సోర్స్, Amensisa Negera / BBC
టిగ్రే ఫైటర్‌గా ఉన్న ఆయన అన్నయ్య ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.
తన అక్క కూడా ఒక ఫైటర్. ఆమె తీవ్రగాయాలతో ఇప్పటికీ మెకెల్లెలో చికిత్స పొందుతున్నారు.
టిగ్రేలోని మరో ప్రాంతంలో నివసిస్తున్న ఆయన మరో సోదరి ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే, ఆమె ఉంటున్న పట్టణం కూడా ఇరువర్గాలు పట్టు కోసం ప్రయత్నించిన వివాదాస్పద టిగ్రే, అమ్హారా ప్రాంతంలోనే ఉంది.
దీంతో నిరాశ్రయురాలిగా మారిన ఆమె బెర్హానేకి సాయంగా వచ్చేవరకు ఒక సహాయ శిబిరంలోనే గడిపారు.
తనకు ఓ స్వచ్ఛంద సంస్థ కృత్రిమ కాలుని, చేతికర్రను అందించాయని బెర్హానే చెప్పారు.
అయితే, బెర్హానే తిరిగి తన సొంతూరు సెయాబో వెళ్లలేకపోయారు. అక్కడ కఠినమైన పర్వతప్రాంతాల గుండా కాలినడకన తిరగాల్సి ఉంటుంది.
ఆయన పాఠశాలకు వెళ్లేందుకు సాధారణంగా 20 నిమిషాలు పడుతుంది, కానీ ఇప్పుడు దాదాపు గంట సమయం పడుతుంది. అందువల్ల ఆయన అడ్వాకి మారిపోయారు. అక్కడ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు.
తాను చదువు కొనసాగించడానికి ఇదే అత్యుత్తమ మార్గమని బెర్హాన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














