కమలా హారిస్ ఎందుకు ఓడిపోయారు?

kamala harris

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోర్ట్నీ సుబ్రమణియన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

సుమారు నెల కిందట ఏబీసీ న్యూస్ నిర్వహించిన ‘ది వ్యూ’ టీవీ షోకు వచ్చిన కమలా హారిస్‌, తన గురించి మరింత తెలుసుకోవాలనుకున్న అమెరికన్ల కోసం ఒక స్నేహపూర్వకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు.

కానీ, ఆ ఇంటర్వ్యూలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే మీరు భిన్నంగా ఏం చేస్తారనే ప్రశ్నకు ‘ఏమో నాకేమీ తోచడంలేదు’ అని ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ విస్మయపరిచింది.

హారిస్ చెప్పిన ఈ సమాధానం రిపబ్లికన్లకు అస్త్రంగా మారింది. హారిస్‌పై వారు విమర్శలు చేయడానికి పదేపదే అవకాశం ఇచ్చింది. చివరకు మంగళవారం ఆమె ఓటమికి దారి తీసింది.

ఓటమిని అంగీకరించిన కమలా హారిస్.. నిరాశ చెందొద్దంటూ తన మద్దతుదారులకు చెప్పారు.

అయితే, డెమొక్రాట్లు వేలెత్తి చూపిస్తుండటం, పార్టీ భవిష్యత్‌పై ప్రశ్నలు వస్తుండటంతో, ఎక్కడ తప్పు జరిగింది? ఇంకేం చేసి ఉండొచ్చు? అనే దానిపై ఆత్మపరిశీలన చేసుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బుధవారం ఉదయం అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళి దాదాపు తెలిసిపోగానే, హారిస్ మద్దతుదారులంతా మౌనంగా ఉండిపోయారు.

కొందరైతే తమ దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘ఓడిపోవడం తీరని బాధను కలిగించింది. ఇది చాలా కష్టమైంది’ అని హారిస్ క్యాంపెయిన్ మేనేజర్ జెన్ ఓ మాల్లీ డిలాన్ అన్నారు.

దీనిపై బుధవారం తన స్టాఫ్‌కు ఈమెయిల్ ద్వారా ఓ లేఖ రాశారు. ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలాకాలం పడుతుందన్నారు.

హారిస్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమల ఓటమిని జీర్ణించుకోవడానికి కొద్దికాలం పడుతుందని ఆమె మద్దతు దారులు చెబుతున్నారు

బైడెన్‌పై వ్యతిరేకతే కారణమా?

డిబేట్లలో సరైన ప్రదర్శన కనపర్చకపోవడంతో రేసు నుంచి బైడెన్ తప్పుకున్నారు. దీంతో, కమలా హారిస్ డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.

ఎలాంటి ఓటింగ్ ప్రక్రియ జరగకుండా, ప్రాథమిక పరిశీలనను దాటవేసి, ఆమెను ఈ రేసుకు ఎంపిక చేశారు.

‘‘నాయకత్వంలో కొత్త తరం’’ అనే వాగ్దానంతో తన 100 రోజుల క్యాంపెయిన్‌ను కమలా హారిస్ ప్రారంభించారు.

గర్భధారణ హక్కులపై మాట్లాడుతూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పెరుగుతున్న ధరలు, ఇళ్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి పలు ఆర్థిక అంశాలపై దృష్టిసారిస్తూ ‘వర్కింగ్ క్లాస్ ఓటర్లను’ ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఎన్నికల తేదీకి సరిగ్గా మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో మీమ్స్, టేలర్ స్విఫ్ట్ వంటి సెలబ్రిటీలతో ఎండార్స్‌మెంట్లు, రికార్డు స్థాయిలో విరాళాల వెల్లువతో తన ప్రచారాన్ని ఊపందించారు.

కానీ, చాలా మంది ఓటర్లలో అప్పటికే నాటుకుపోయిన బైడెన్ వ్యతిరేకతను మాత్రం ఆమె పోగొట్టలేకపోయారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బైడెన్‌పై ఉన్న వ్యతిరేకతను ప్రచారంలో ప్రస్తావించడానికి కమల ఇష్టపడలేదు.

తానే ఎందుకు నడపాలో చెప్పలేదు

బైడెన్ విధానాలను వ్యతిరేకించేందుకు హారిస్ అయిష్టత చూపారు. ప్రచార సమయంలో వాటిని ఎక్కువగా ప్రస్తావించలేదు.

కానీ తానే దేశాన్ని ఎందుకు నడపాలి అనే అంశంపై కమలా తన వాదనను సరైన రీతిలో ప్రజలకు తెలియజేయడంలో విఫలమయ్యారు.

ఆర్థిక వ్యవస్థలోని సమస్యలను, వలసలతో చెలరేగిన ఆందోళనలను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారో కమలా హారిస్ తెలియజేయలేకపోయారు.

ప్రతి పది మంది ఓటర్లలో ముగ్గురు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి పడిపోతోందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం ఈ ఓటర్ల సంఖ్య పదిలో రెండుగా ఉండేదని ఏపీ డేటాలో వెల్లడైంది.

షికాగో యూనివర్సిటీలో ఎన్ఓఆర్‌సీ 1,20,000 మంది అమెరికా ఓటర్లపై ఓట్‌కాస్ట్ అనే సర్వేను నిర్వహించింది.

ఆ సర్వేలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు.

అదే సర్వేలో అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపాలని పది మందిలో నలుగురు చెప్పారు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాను గెలిస్తే బైడెన్ కంటే భిన్నంగా ఏం చేయగలనో కమల వివరించలేకపోయారు

కిందటిసారికంటే తక్కువ ఓట్లు

బైడెన్ గెలుపు కోసం సహకరించిన ఓటర్లను తిరిగి తమ వైపు తిప్పుకోవచ్చని హారిస్ క్యాంపెయిన్ ఆశించింది. నల్లజాతీయులు, లాటినోలకు చెందిన కీలకమైన డెమొక్రాట్ల స్థానాలను దక్కించుకుంటామని, యువ ఓటర్లను, విద్యాధికులైన పట్టణప్రాంత ఓటర్లను పొందుతామని భావించింది.

కానీ, ఈ కీలకమైన ఓటింగ్ ప్రాంతాల్లో కూడా ఆమె సరైన ప్రదర్శన కనబర్చలేకపోయారు. లాటినో ఓటర్లతో 13 పాయింట్లు, నల్లజాతీయుల ఓటర్లతో రెండు పాయింట్లు, 30 కంటే తక్కువ వయసున్న ఓటర్లతో ఆరు పాయింట్లు కోల్పోయినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక దీనిలో మార్పు ఉండొచ్చు.

2016లో డెమొక్రటిక్ అధ్యక్ష ప్రైమరీని హిల్లరీ క్లింటన్‌ వల్ల, 2020 ప్రైమరీని బైడెన్‌ వల్ల వదులుకోవాల్సి వచ్చిన వెర్మాంట్ స్వతంత్ర సెనేటర్ బెర్నీ శాండర్స్ దీనిపై మాట్లాడారు. వర్కింగ్ క్లాస్ ఓటర్లు ఈ పార్టీని విడిచిపెట్టడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు.

‘‘తొలుత ఇది వైట్ వర్కింగ్ క్లాస్, ఇప్పుడు లాటినో, బ్లాక్ వర్కర్లకు కూడా. డెమొక్రటిక్ నాయకత్వం ‘స్టేటస్ కో’ను సమర్ధించుకుంటూ ఉండొచ్చు. కానీ, అమెరికా ప్రజలు కోపంతో ఉన్నారు. వారు మార్పును కోరుకుంటున్నారు’’ అని చెప్పారు. వారే సరైన వారన్నారు.

అబార్షన్‌ అనేది మహిళల చట్టబద్ధత హక్కు కాదని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. సంతానోత్పత్తి హక్కులపై హారిస్ చేసిన పోరాటం విజయాన్ని అందిస్తుందని డెమొక్రాట్లు భావించారు.

ప్రస్తుతం 54 శాతం మహిళా ఓటర్లు హారిస్‌కు ఓటేశారని, 2020లో బైడెన్‌కు వేసిన మహిళా ఓటర్లు 57 శాతమని ఎగ్జిట్ పోల్ డేటాలో వెల్లడైంది. ఈ లెక్కన చూసుకుంటే, గతసారితో పోలిస్తే డెమొక్రాట్ల వైపు మొగ్గుచూపిన మహిళా ఓటర్ల శాతం కొంచెం తగ్గింది.

కమలా హారిస్ అగ్రస్థానానికి రాకముందు, ఈ రేసు బైడెన్‌పై కాకుండా ట్రంప్‌పై రెఫరెండెంగా భావించారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్‌పై విమర్శలతో సరి

కాలిఫోర్నియా మాజీ ప్రాసిక్యూటర్‌గా తనకున్న అనుభవాన్ని ఆమె ట్రంప్ వాదనలను ఎదుర్కోవడానికి ఉపయోగించారు. వృత్తిగత జీవితంలో ఎన్నో కఠినమైన కేసులను ఆమె వాదించారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఆమె బైడెన్ ప్రధాన వాదననే తన ప్రచారానికి కూడా వాడారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటూ, వ్యక్తిగత స్వేచ్ఛను, మధ్య తరగతి వర్గ ప్రజలను కాపాడతాననే స్నేహపూర్వకమైన సందేశాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.

చివరిగా, రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైతే ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలనే వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన్ను ఫాస్టి‌స్ట్‌గా వర్ణించారు.

‘‘కమలా హారిస్ పూర్తిగా డోనల్డ్ ట్రంప్‌ను విమర్శించడంపైనే దృష్టి పెట్టడంతో ఓడిపోయారు’’ అని ప్రముఖ రిపబ్లికన్ పోల్‌స్టర్ ఫ్రాంక్ లుంట్జ్ మంగళవారం చెప్పారు.

‘‘ఓటర్లకు ట్రంప్ గురించి పూర్తిగా తెలుసు. తొలి గంటలో, రోజులో, నెలలో, ఏడాదిలో హారిస్ పాలన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రజలు మరింత ప్రయత్నించారు’’ అని తెలిపారు.

‘‘హారిస్ సొంత ఆలోచనల కంటే ట్రంప్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఆమె ఓడిపోయారు’’ అని లుంట్జ్ అన్నారు.

అయితే, డెమొక్రాట్లను ఓటర్లు నిరాకరించడం కేవలం ప్రజాదరణ లేని అధ్యక్షురాలి కంటే పార్టీలోనే లోతైన సమస్య ఉందని అర్థమవుతోంది. దానిపై పార్టీ దృష్టిసారించాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)