ఈ చైనా అమ్మాయి మ్యాథ్స్ మేధావి అని అంతా పొగిడారు, అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

17 ఏళ్ల అమ్మాయి.. మ్యాథ్స్‌లో ఆమెలాంటి ప్రతిభావంతురాలు మరొకరు లేరన్నట్లు ప్రపంచమంతా నమ్మింది. రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.

ఇక సోషల్ మీడియా ఆ అమ్మాయిని ఏ స్థాయిలో పొగిడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి చూస్తే, టీచర్‌తో కలిసి ఆమె చేసిన మోసం బట్టబయలు కావడంతో పొగిడిన వారే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మ్యాథమేటిక్స్ పోటీల్లో మేధావిగా నిలిచిన చైనాకు చెందిన 17 ఏళ్ల బాలిక జియాంగ్ పింగ్, మోసం చేసి ఈ పోటీల తొలి రౌండ్‌లో గెలిచిందని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ పోటీ తుది రౌండ్ ఫలితాలపై ఎన్నో నెలలుగా నెలకొన్న ఉత్కంఠ చివరకు తెరపడింది. తుది రౌండ్‌లో ఆమెకు స్థానం దక్కలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్ జియాంగ్ పింగ్.

చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నిర్వహించిన అంతర్జాతీయ గణిత పోటీల్లో క్వాలిఫయర్స్‌లో 12వ స్థానాన్ని దక్కించుకుని, జూన్‌లో వార్తల్లో హెడ్‌లైన్‌గా నిలిచారు.

2018లో ఈ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి వొకేషనల్ స్కూల్ నుంచి ఫైనలిస్ట్‌గా నిలిచిన తొలి అమ్మాయి ఈమేనని చైనా మీడియా రిపోర్టు చేసింది.

ఫైనల్‌కు చేరుకున్న 800 మందిలో ఎక్కువగా ప్రముఖ యూనివర్సిటీల నుంచి వచ్చినవారే.

ప్రిలిమినరీ పరీక్షలో జియాంగ్ సాధించిన ర్యాంక్ ఆమెను రాత్రికి రాత్రే సెన్సేషన్‌ చేశాయి. ‘గణిత మేధావి’ అంటూ సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా కూడా పొగడ్తలు కురిపించింది.

చైనాలో కఠినమైనదిగా చెప్పుకునే విద్యావ్యవస్థలో ఈ అమ్మాయి ఆ స్థాయిలో ప్రతిభ చూపించడంతో చాలా మంది ప్రశంసించారు. ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్లకు చెందిన విద్యార్థులు కూడా విద్యలో ప్రతిభ చూపించగలరని జియాంగ్ ఫలితాలే రుజువని చాలామంది అన్నారు.

అయితే, ఆమె సామర్థ్యాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

గత ఆదివారం వెల్లడించిన తుది పరీక్ష ఫలితాల్లో, 86 మంది విజేతల్లో జియాంగ్‌ లేదు.

ప్రపంచ ప్రముఖ విద్యా సంస్థల ఫైనలిస్టులతో పోటీ పడ్డారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతి ఏడాది నిర్వహించే ఈ గణిత పోటీల్లో పాల్గొనవచ్చు. అలీబాబా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డామో అకాడమీ దీన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది జియాంగ్సు లియాన్‌షుయ్ సెకండరీ వొకేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి జియాంగ్, ప్రపంచ ప్రసిద్ధ పెకింగ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అత్యంత ప్రముఖ సంస్థల పోటీదారులతో పోటీపడ్డారు. వారందరిలో జియాంగ్ అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. ప్రాథమిక పరీక్షలో మంచి ర్యాంక్ సాధించారు.

జియాంగ్‌కు ఫ్యాషన్ డిజైన్‌పై ఆసక్తి ఉండటంతో ఆమె వొకేషనల్ స్కూల్‌లో చేరారు. అంతేకాక, ఆమె సోదరి, స్నేహితులు కూడా ఆ వొకేషనల్ స్కూల్‌లో చదువుతున్నారని స్థానిక మీడియా వార్తా సంస్థలు చెప్పాయి.

డామో అకాడమీ రూపొందించిన వీడియోలో ఆమె కథనం వచ్చింది. ఆ దేశవ్యాప్తంగా వార్తా సంస్థలలో ఆమె ఇంటర్వ్యూ ప్రచురితమైంది.

‘‘మ్యాథ్స్ చదవడం కష్టమే. కానీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను పరిష్కరించిన ప్రతిసారి నేను చాలా ఆనందపడేదాన్ని’’ అని చైనా ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీలో అన్నారామె. భవిష్యత్‌ ఏదైనా, తాను నిత్య విద్యార్థినని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా జియాంగ్ టీచర్ వాంగ్ రంక్వియు కూడా వెలుగులోకి వచ్చారు. మ్యాథ్స్‌లో జియాంగ్‌కు ఉన్న ఆసక్తిని చూసి ఒక టీచర్‌గా తాను ఆమెను ప్రోత్సహించినట్లు తెలిపారు.

‘అధునాతన గణితాన్ని కూడా తనకు తానుగా నేర్చుకునే విద్యార్థిని’ అంటూ ఆయన మీడియా ముందు జియాంగ్‌ను పొగిడారు.

మ్యాథ్స్ నేర్చుకునే సమయంలో ఆమె ఎదుర్కొనే చాలా సమస్యలను తాను గుర్తించి, పరిష్కరించినట్లు తెలిపారు.

చైనా విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

‘ఆమె మాస్టర్‌మైండ్ కాదు’

జియాంగ్ ప్రతిభ ఒక్కసారిగా దేశమంతా వెల్లువెత్తిన సమయంలోనే, ఆమె నైపుణ్యాలపై సందేహాలు, విమర్శలు మొదలయ్యాయి.

జూన్ నెలలో జరిగిన ప్రిలిమినరీ టెస్టులో జియాంగ్ సాధించిన ర్యాంకుపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ 12 మంది ఇతర ఫైనలిస్టులు పోటీలను నిర్వహించిన కమిటీకి సంయుక్తంగా లేఖ రాశారు.

ప్రిలిమినరీ పరీక్షలో ఆమె రాసిన సమాధానాలను బయటపెట్టాలని వారు కోరారు.

జియాంగ్ తన ఆన్‌లైన్ వీడియోలోనే ఎన్నో తప్పులు రాసిందని ఫైనలిస్టులు ఆరోపించారు. ఆమెకు మ్యాథ్స్‌లో చాలా సింబల్స్ ఏంటో కూడా తెలియదని వారు ఆరోపించారు.

ప్రాథమిక పరీక్షలో పోటీదారులు ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడేందుకు అనుమతి ఉంటుంది. కానీ, చివరి రౌండ్‌లో పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు తమ సొంత మెటీరియల్, వనరులు వాడుకోవడానికి వీలు లేకుండా జరిగే క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది.

ఈ పోటీ ఫలితాలను ఆగస్టులోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ ఆరోపణల కారణంతో పలు నెలల పాటు ఫలితాలు వాయిదాపడ్డాయి.

చిట్టచివరికి గత ఆదివారం ఫలితాల ప్రకటన వచ్చింది. ఫైనల్ రౌండ్‌లో విజేతలుగా ప్రకటించిన 86 మందిలో జియాంగ్ లేదు.

జియాంగ్ ప్రాథమిక దశ పోటీలో నిబంధనలను ఉల్లంఘించారని, తన టీచర్ సాయం పొందారని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రపంచమంతా షాకైంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె టీచర్ వాంగ్ కూడా ఆ పోటీల్లో పాల్గొన్నారు.

‘‘ఇది కాంపిటీషన్ ఫార్మాట్‌లో కచ్చితత్వం లేదన్న విషయాన్ని బయటపెట్టింది. పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతుంది. దీనికి మేం క్షమాపణ చెబుతున్నాం’’ అని పోటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రిలిమినరీ పరీక్షలో ఆమెతోపాటు పాల్గొన్న టీచర్ పరీక్షలో ఆమెకు సాయం చేశారని ఆమె స్కూలు కూడా ధ్రువీకరించింది. ఈ ఏడాది అధ్యాపకులకు ఇచ్చే అవార్డుల నుంచి టీచర్ వాంగ్‌పై వేటు వేస్తున్నట్లు స్కూల్ తెలిపింది.

దీనిపై జియాంగ్ కుటుంబాన్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించినా ఫలితం లేదు. ఆమె తల్లి వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్ కూడా ప్రస్తుతం యాక్టివ్‌లో లేదు.

ఆమె తండ్రి ఫోన్ నెంబర్ డీయాక్టివేట్‌లో ఉంది. జియాంగ్ స్కూల్‌కు బీబీసీ పలుమార్లు ఫోన్ చేయగా, ఎవరూ ఆ ఫోన్‌ను ఎత్తలేదు. జియాంగ్ గ్రామ అధికారులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

ఫలితాల ప్రకటన తర్వాత జియాంగ్, ఆమె టీచర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ తప్పుకు బాధ్యతంతా ఆమె స్కూల్, టీచర్‌పైనే ఉందని అంటున్నారు.

‘‘జియాంగ్ పింగ్ అమాయకురాలు కాదు. దానిలో సందేహం లేదు. కానీ, దీనిలో ఎక్కువగా తప్పు చేసింది ఎవరు?’’ అని ఒకరు సోషల్ మీడియా వీబోలో పోస్టు చేశారు.

‘‘ఈ మొత్తమంతా ఫేక్ అయినప్పటికీ, దీని వెనుకాల ఉన్న మాస్టర్‌మైండ్ మాత్రం జియాంగ్ పింగ్ కాదు. ఆమెను పణంగా పెట్టకూడదు ’’ అని మరొకరు రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)