ట్రంప్: అక్రమ వలసదారుల్ని విమానాలు ఎక్కించి పంపించేస్తారా, ఇది సాధ్యమయ్యేదేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్స్ డెబ్స్‌మన్, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం (డిపోర్టేషన్) పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదన్నారు.
‘‘జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దులను బలంగా, శక్తిమంతంగా మార్చడం నా ప్రాధాన్యాంశం.’’ అని తన విజయం తర్వాత జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ అన్నారు.
‘‘ఎంత ఖర్చవుతుందనే ప్రశ్నే లేదు. వాస్తవంగా చెప్పాలంటే మా దగ్గర మరో మార్గం లేదు” అని ఎన్‌బీసీ న్యూస్‌తో ట్రంప్ చెప్పారు.
అయితే, అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా?


ఫొటో సోర్స్, Getty Images
న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలేంటి?
ప్రస్తుతం అమెరికాలో 1 కోటి, 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్, ప్యూ రీసర్చ్ లెక్కలు చెబుతున్నాయి. 2005 నుంచి ఈ సంఖ్య దాదాపు స్థిరంగా ఉంటూ వస్తోంది.
వీరిలో అనేకమంది చాలాకాలంగా ఉంటున్నారు. ఐదింట నాలుగొంతుల మంది పదేళ్లకు పైగా అమెరికాలో జీవిస్తున్నారు.
సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించి, అక్రమంగా నివసిస్తున్నప్పటికీ, ఆశ్రయం కోరే హక్కు వారికి ఉంటుంది. వారిని తిరిగి వారి దేశానికి పంపడాన్ని సవాల్ చేస్తూ అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చు.
వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం మొదలు పెడితే ఇమిగ్రేషన్ కోర్టు వ్యవస్థను మరింత విస్తరించాల్సి రావచ్చు. దీనివల్ల చాలా కేసులు పేరుకుపోతాయి.
ఇప్పటికే అనేక మంది అక్రమ వలసదారుల్ని తిప్పి పంపించేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా కాకుండా స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, అమెరికాలోని అనేక పెద్ద నగరాలు, పట్టణాలు స్థానిక పోలీసులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సహకరించడాన్ని నిరోధిస్తూ చట్టాలు చేశాయి.
అక్రమ వలసదారులకు “ఆశ్రయం ఇస్తున్న నగరాలపై చర్యలు తప్పవని” డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోని స్థానిక, రాష్ట్ర, కేంద్ర చట్టాలు ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం కనిపిస్తోంది.
అక్రమ వలసదారుల్ని మూకుమ్మడిగా వెనక్కి పంపించాలంటే స్థానిక అధికారులు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య సమన్వయం పెద్ద సమస్యని వాషింగ్టన్‌కు చెందిన మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్‌ట్యూట్‌లో విధాన విశ్లేషకుడు కథ్లీన్ బుష్ జోసెఫ్ అన్నారు.
“స్థానిక న్యాయ అధికారులు సహకరిస్తే జైళ్లలో ఉన్న వారిలో అక్రమ వలసదారుల్ని గుర్తించి పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) అధికారులకు తేలిగ్గా ఉంటుంది. లేకపోతే వారి కోసం ఇమిగ్రేషన్ అధికారులు వెతకాల్సి వస్తుంది.” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారుల సహకారం తప్పనిసరి
ఉదాహరణకు, ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రోవార్డ్, పామ్‌బీచ్ కౌంటీల్లో షెరీఫ్ ఆఫీసులు(పోలీస్ డిపార్ట్‌మెంట్), అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపే కార్యక్రమానికి అధికారులను నియమించేది లేదని 2024 ఆగస్టులో తీర్మానం చేసిన విషయాన్ని బుష్ జోసెఫ్ గుర్తు చేశారు
“అక్రమ వలసదారుల్ని మూకుమ్మడిగా వెనక్కి పంపించాలన్న ట్రంప్ ప్రణాళికకు సహకరించేందుకు అధికారులు సిద్ధంగా లేరు. వారు సహకరించకపోతే ఈ హామీ నెరవేర్చడం చాలా కష్టం” అని ఆమె అన్నారు.
మూకుమ్మడిగా బయటకు పంపే కార్యక్రమంగా మొదలైతే ఇమిగ్రేషన్, మానవ హక్కుల కార్యకర్తలు తక్షణం స్పందిస్తారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో న్యాయపరమైన సవాళ్లు ఎదురు కావచ్చు.
2022 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, స్థానిక కోర్టులు ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాల మీద ఇంజెక్షన్ (తిప్పి పంపడాన్ని నిలిపివేసే ఆర్డర్) జారీ చెయ్యకూడదు. దీనర్థం ఎవరైనా డిపోర్టేషన్‌ను సవాల్ చేస్తూ ఫిర్యాదు చేసినప్పటికీ, ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవహారాలు చట్టప్రకారం కొనసాగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
రవాణా సాధ్యమేనా?
అక్రమ వలసదారుల్ని మూకుమ్మడిగా తిప్పి పంపే విషయంలో అమెరికా ప్రభుత్వం చట్టపరంగా ముందుకెళితే, వారిని పంపడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేయడం అధికారులకు సమస్య కావచ్చు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని సరిహద్దుల్లోనే ఆపేందుకు బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.
నేర చరిత్ర ఉన్నవారు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన వారిని సరిహద్దులకు దూరంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సమీకరించి బయటకు పంపించారు.
ట్రంప్ పరిపాలనా కాలంలో వివిధ పని ప్రదేశాల్లో అక్రమ వలసదారుల కోసం రెయిడ్స్ జరగ్గా, 2021 నుంచి అలాంటివి ఆగిపోయాయి.
అమెరికాలో అరెస్ట్ చేసి, వారి దేశాలకు తిప్పి పంపిన వారి సంఖ్య దశాబ్ధ కాలంలో దాదాపు లక్ష. అంతకు ముందు ఒబామా కాలంలో ఇది పతాక స్థాయిలో ఉండేది. అప్పట్లో 2 లక్షల 30 వేల మందిని వెనక్కి పంపారు.
“ఈ సంఖ్యను ఒక ఏడాదిలో పది లక్షలకు పెంచాలంటే విస్తృతమైన మానవ వనరులు కావాలి. ప్రస్తుతం ఆ స్థాయిలో వనరులు లేవు” అని అమెరికన్ ఇమిగ్రేషన్ పాలసీ కౌన్సిల్ డైరెక్టర్ ఆరోన్ రిక్లెన్ మెల్‌నిక్ చెప్పారు.
ప్రచారంలో భాగంగా ట్రంప్ చెప్పిన లక్షల మంది అక్రమ వలసదారుల్లో వేల మందిని గుర్తించి తిప్పి పంపడం కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో 20 వేల మంది ఏజెంట్లు, ఇతర అధికారుల వల్ల అవుతుందా అని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వ్యక్తిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారమని, ఇందులో సుదీర్ఘ ప్రక్రియ ఉందని ఆరోన్ రిక్లెన్ మెల్‌నిక్ చెప్పారు
అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వాళ్లను ఇమిగ్రేషన్ కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు వారికి నివాస సౌకర్యం కల్పించాలి లేదా నిర్బంధ కేంద్రాలకు తరలించాలి. వారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని నిరూపించి వెనక్కి పంపడానికి న్యాయ ప్రక్రియ పూర్తి కావడానికి ఏళ్లు పడుతుందని మెల్‌నిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అవసరమైతే సైన్యం సాయం...’
ఈ ప్రక్రియ అంతా పూర్తైన తర్వాతే అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పంపించవచ్చు. అలాగే అక్రమ వలసదారుల్ని తిప్పి పంపేటప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారైతే ఆ దేశపు ప్రభుత్వాల నుంచి వారిని స్వీకరించేందుకు దౌత్యపరమైన సహకారం కూడా అవసరం
“ఇలా ప్రతీ నిబంధనను అనుసరించి లక్షల మందిని తిప్పి పంపించేందుకు కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దగ్గర తగినంత సామర్థ్యం లేదు” అని మెల్‌నిక్ చెప్పారు.
డిపోర్టేషన్ల కోసం అవసరమైతే జాతీయ భద్రత బలగాలు లేదా అమెరికన్ సైనిక బలగాల సాయం తీసుకుంటానని ట్రంప్ చెప్పారు
అయితే, గతాన్ని చూస్తే, అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసల్ని నిరోధించడంలో అమెరికన్ సైన్యం పాత్ర చాలా పరిమితంగా ఉంది.
సైన్యాన్ని ఉపయోగించడం పక్కన పెడితే, స్థానిక పోలీసులను ఉపయోగించడం ద్వారా అక్రమ వలసదారుల్ని సామూహికంగా ఎలా తిప్పి పంపవచ్చనే దానిగురించి ట్రంప్ కొన్ని ప్రణాళికలను ప్రస్తావించారు.
2024 తొలి నాళ్లలో టైమ్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో “మరిన్ని డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, లిబరల్ గ్రూప్స్ లేదా ప్రోగ్రెసివ్ గ్రూప్స్ విచారణ నుంచి పోలీసులకు రక్షణ కల్పించడం” లాంటి అంశాల గురించి ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే స్థానిక, రాష్ట్ర పోలీసులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, సహకరించని వారికి కోతలు పెట్టడం లాంటి చర్యలు చేపట్టవచ్చని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
“మనం ఇది చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇది మన దేశానికి మేలు చేసే విషయం కాదు” అని అన్నారు.
సరిహద్దుల్లో భద్రతను రెట్టింపు చేసినప్పుడే దేశం లోపల ఏదైనా డిపోర్టేషన్ కార్యక్రమం ప్రభావవంతంగా ఉంటుందని కఠిన ఇమిగ్రేషన్ చట్టాలు కావాలని వాదించే నంబర్స్ యూఎస్ఏ అనే సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఎరిక్ రువాక్ అన్నారు.
“అది అసలు ప్రాధాన్యం. అలా చెయ్యకపోకే దేశంలో మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు.” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అక్రమ వలసదారులకు ఉద్యోగాలిచ్చిన కంపెనీలపైనా చర్యలు తీసుకోవడం అవసరమని రువాక్ వాదిస్తున్నారు.
“వాళ్లు ఉపాధి కోసం వచ్చారు. ఇక్కడ వాళ్లు ఉద్యోగం చేయగలుగుతున్నారంటే క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ విఫలమైందని చెప్పాలి.” అని రువాక్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఆర్థికంగా, రాజకీయంగా చెల్లించాల్సిన మూల్యం
పది లక్షల మందికి పైగా అక్రమ వలసదారుల్ని తిప్పి పంపాలంటే వందల కోట్ల డాలర్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2023లో అక్రమ వలసదారుల తిప్పిపంపేందుకు అయ్యే రవాణా కోసం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి 420 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 353 కోట్లు ) బడ్జెట్ కేటాయించారు. ఆ సంవత్సరంలో ఈ విభాగం లక్ష 40 వేల మందిని అమెరికా నుంచి వెనక్కి పంపించింది.
కోర్టుల్లో విచారణలు పెండింగ్‌లో ఉండటంతో వేల మంది వలసదారులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారి కోసం భారీ క్యాంపు లాంటిది ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రచారంలో సూచించారు.
వీరిని తిప్పి పంపడం కోసం ఉపయోగించే విమాన సర్వీసులను విస్తృత స్థాయిలో పెంచాల్సి ఉంటుంది.
తొలగించిన విమానాల సేవల్ని కూడా నాటకీయంగా విస్తరించాల్సి ఉంటాంది. ఈ రద్దీని తట్టుకోవడానికి సైనిక విమానాల్ని కూడా ఉపయోగించాల్సి రావచ్చు.
విమానాలు, కోర్టులు, పోలీసులు, ఐస్ ఏజంట్లు ఇలా ఏ విభాగాన్ని విస్తరించాలన్నా ఆ మేరకు ఖర్చులు కూడా పెరుగుతాయి.
“చిన్న మార్పు తేవాలన్నా లక్షల, కోట్ల డాలర్లు అవసరం” అని రిక్లెన్ మెల్‌నిక్ చెప్పారు.
అక్రమ వలసదారులు దేశంలోకి రాకుండా సరిహద్దుల్ని కట్టుదిట్టం చేసేందుకు అవసరమైన గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు, ఫెంటనిల్(ఒక మత్తు పదార్ధం) దేశంలోకి రాకుండా సముద్ర మార్గంలో భద్రత పెంచడం, వేల మంది సైనికుల్ని సరిహద్దులకు తరలించడానికి అయ్యే ఖర్చులకు ఈ ఖర్చులు అదనం.
“మూకుమ్మడిగా తిప్పి పంపడం అనేది పీడకలలాంటి. దీని వల్ల ట్రంప్ ప్రభుత్వానికి ప్రజా సంబంధాల కోణంతో పాటు రాజకీయంగానూ ఇబ్బందికరంగా మారుతుంది.” అని వలసలు, సరిహద్దు అంశాల నిపుణుడు ఆడమ్ ఇసాక్‌సన్ చెప్పారు.
“టీవీల్లో మీకు పిల్లలు, కుటుంబాలు ఏడుస్తున్న బాధాకరమైన దృశ్యాలు కనిపించవచ్చు. ఇది బలవంతంగా కుటుంబాలను విడదీయడం లాంటిదే” అని ఇసాక్ సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో వలసదారుల్ని మూకుమ్మడిగా తిప్పి పంపారా?
నాలుగేళ్ల ట్రంప్ పరిపాలనలో దేశం లోపల, సరిహద్దుల నుంచి దాదాపు 15 లక్షల మంది అక్రమ వలసదారుల్ని వారి దేశాలకు పంపించారు.
బైడెన్ పాలనా కాలంలో 2024 ఫిబ్రవరి వరకు 11 లక్షల మందిని పంపించారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
ఒబామా ఎనిమిదేళ్లపాలనా కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎనిమిదేళ్లలో దాదాపు 30లక్షల మందికి పైగా అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపారు. వలసలకు సంబంధించి ఒబామా చేసిన సంస్కరణలతో ఆయనకు ‘డిపోర్టర్- ఇన్- చీఫ్’ అనే పేరు కూడా వచ్చింది.
అమెరికా చరిత్రలో అతి పెద్ద డిపోర్టేషన్ అంటే 1954లోనే 13 లక్షల మందిని వెనక్కి పంపిన సంఘటన గురించి చెప్పుకోవాలి. ‘ఆపరేషన్ వెస్ట్‌బ్యాక్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మెక్సికన్లను అవమానించేందుకు ఉపయోగించే పేరుని ఈ కార్యక్రమానికి పెట్టారు. అయితే ఈ సంఖ్య విషయంలో చరిత్రకారులు సందేహాలు లేవనెత్తడంతో ఇది వివాదాస్పదమైంది.
ఐసెన్ హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా ప్రజల్లో ఎక్కువ మంది వేరే దేశాల నుంచి వచ్చిన వారే కావడంతో దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పాటు లక్షల మందిని తిప్పి పంపేందుకు అప్పట్లో అవసరమైన నిధులు కూడా లేవు. 1955లో ఆపరేషన్ వెస్ట్ బ్యాక్ ఆగిపోయింది.
1953లో నిర్వహించిన మాస్ డిపోర్టేషన్ కార్యక్రమం మెక్సికన్ జాతీయులను లక్ష్యంగా చేసుకుని సాగింది. అయితే ప్రస్తుతం మాస్ డిపోర్టేషన్‌కు సంబంధించి సరైన విధి విధానాలు లేకపోవడంతో దాన్ని దీంతో పోల్చే పరిస్థితి లేదు.
“అప్పట్లో, అంటే 1950ల్లో కేవలం మెక్సికన్లను మాత్రమే వెనక్కి పంపించారు” అని కథ్లీన్ బుష్ జోసెఫ్ చెప్పారు.
“ఇప్పుడు, వలసవచ్చిన వారిలో అనేక మంది పోర్టుల ద్వారా వచ్చారు. వాళ్లంతా మెక్సికన్లు కాదు. అలాగే సెంట్రల్ అమెరికా నుంచి వచ్చిన వారు కూడా కాదు. అందుకే వాళ్లను తిప్పి పంపడం చాలా కష్టం. నాటి పరిస్థితుల్ని నేటితో పోల్చి చూడకూడదు” అని బుష్ జోసెఫ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














