హిమాచల్ ప్రదేశ్: సీఎం సమోసాలు ఎవరు తిన్నారో తేల్చేందుకే సీఐడీ విచారణ జరుగుతోందా, ఏమిటీ వివాదం?

సమోసాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్‌లో సమోసాల వివాదం నడుస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కోసం తెచ్చిన సమోసాలను ఆయన సిబ్బందికి వడ్డించిన వివాదం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

దీనిపై సీఐడీ విచారణ కొనసాగుతోందని ఈ ఉదంతంలో ఐదుగురు పోలీసులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని, అవి హాస్యాస్పదంగా ఉన్నాయని హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతిపక్ష బీజేపీ నేత జైరాం ఠాకూర్ ఓ వీడియో ప్రకటనలో విమర్శించారు. సీఎం కోసం తెచ్చిన సమోసాలు మధ్యలో మాయమయ్యాయని, ఇప్పుడు ఇదో పెద్ద సీరియస్ విషయమంటూ ప్రభుత్వం దాని మీద విచారణ జరుపుతోందని జైరాం ఠాకూర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సుఖ్విందర్ సింగ్ సుఖు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు

అసలు ఏం జరిగింది?

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అక్టోబర్ 21న సైబర్ వింగ్‌లోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్)ను ప్రారంభించడానికి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

అయితే సీఎం కోసం తెప్పించిన సమోసాలు, ఆయన భద్రతా సిబ్బందికి వడ్డించడం సీఐడీ అంతర్గత విచారణకు దారితీసింది. ఈ విషయాన్ని పోలీసు ప్రధాన కార్యాలయం కాకుండా, సీఐడీ విచారిస్తోందని డీజీపీ అతుల్ వర్మ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

సీఎం కోసమని హోటల్ రాడిసన్ బ్లూ నుంచి మూడు బాక్సుల సమోసా, కేకు తెప్పించాల్సిందిగా ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయి అధికారి ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. హోటల్ నుంచి తెప్పించిన ఈ తినుబండారాలను వారు ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌కు అందచేశారు.

సీఎం సీఐడీ ప్రధాన కార్యాలయానికి హాజరైనప్పుడు, ఆ కార్యక్రమానికి వచ్చినవారి జాబితా చాలా పెద్దగా ఉంది. వారిలో సీఐడీ డీఐజీ, డీఐజీ క్రైమ్, సైబర్‌క్రైమ్ డీఐజీ తదితరులు ఉన్నారు. సుఖు వెంట స్థానిక ఎమ్మెల్యే హరిశ్ జనార్ద, పంచాయతీరాజ్ మంత్రి అనిరుధ్ సింగ్ హాజరయ్యారు.

ఐదుగురికి షోకాజ్ నోటీసులు

సమోసాలు ఏమయ్యాయనే వివాదంలో ఐదుగురు పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. సీఎం కోసం తెచ్చిన మూడు బాక్సుల సమోసాలను, కేకును నిర్లక్ష్యపూరితంగా వినియోగించడమే కాక, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టుగా సీఐడీ విచారణ పేర్కొంది.

‘‘షోకాజ్ నోటీసులు అందుకున్న పోలీసులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన డిఎస్పీ స్థాయి అధికారి విక్రమ్ చౌహన్ ముందు ఆ ఐదుగురు, తుది వాంగ్మూలాలు ఇచ్చే పనిలో ఉన్నారు’’ అని ఇండియన్ ‌ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది. అక్టోబర్ 25న సీఐడీ ఐజీకి విచారణ నివేదికను సమర్పించారు.

డిఎస్పీ విక్రమ్ చౌహాన్ తన విచారణా నివేదికలో తెలిపిన వివరాల్లో కొన్ని తినుబండారాలు తీసుకురావాల్సిందిగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ఐజీ ఆదేశించారని, ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఓ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌కు, హెడ్‌కానిస్టేబుల్‌కు ఆ పని పురమాయించారని, వారు హోటల్ నుంచి మూడు సీల్డ్ బాక్సులలో తినుబండారాలు తీసుకువచ్చి ఎస్ఐకు తెలియజేశారని పేర్కొన్నారు.

అయితే సీఎంకు సమోసాలు వడ్డించాల్సిందిగా తాము పర్యటక శాఖ ( సీఎంకు ఈ శాఖ సిబ్బందే తినుబండారాలు వడ్డిస్తారు) సిబ్బందికి చెప్పామని, కానీ ముఖ్యమంత్రికి వడ్డించిన తినుబండారాలలో సమోసాలు లేవని పర్యటక శాఖ సిబ్బంది చెప్పారని, షోకాజ్ నోటీసు అందుకున్న ఐదుగురిలో ఇద్దరు పోలీసులు విచారణాధికారికి చెప్పారు.

అయితే మూడుబాక్సులలో తెచ్చిన సమోసాలు సీఎం కోసమనే విషయం కేవలం సబ్‌‌ఇన్‌స్పెక్టర్‌కు మాత్రమే తెలుసని విచారణలో తెలిసింది.

ఇక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌, తన సీనియర్ అధికారి అనుమతి లేకుండానే తినుబండారాలను మెకానికల్ ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌కు పంపారు. డీఎస్పీ ముందు వాంగ్మూలం ఇచ్చిన మరో పోలీసు, తనకు ఐజీ కార్యాలయంలో కూర్చుని ఉన్న 10, 12మందికి తినుబండారాలు అందించమని చెబితేనే తాను వారికి వడ్డించానని చెప్పారు.

ఈ వ్యవహారంలో ఐదుగురు పోలీసు అధికారులపై అభియోగాలు మోపడమే కాక, వారు తమ సొంత ఎజెండా ప్రకారం సీఐడీ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ధోరణిలో వ్యవహరించారని, తద్వారా వీఐపీలకు తినుబండారాలు అందకుండా చేశారని దర్యాప్తు నివేదిక ఆరోపించింది.

‘ఆ విచారణ సమోసాలపై కాదు’

సమోసాలు, కేకులపై సీఐడీ విచారణా వివాదంపై హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వివరణ ఇచ్చారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘అలాంటివేమీ జరగడం లేదు. అది ప్రవర్తనా నియమావళికి సంబంధించి సీఐడీ జరుపుతున్న విచారణ అది. మీడియా మాత్రం సమోసా చుట్టు తిరుగుతోంది.’’ అని చెప్పారు.

మరోపక్క సీఐడీ డిప్యూటీ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా అది సీఐడీ అంతర్గత విషయమని, దానిని రాజకీయం చేయవద్దని చెప్పారు.

‘‘ఇది పూర్తిగా సీఐడీ అంతర్గత విషయం. అది ఎంతమాత్రం రాజకీయం కాకూడదు. సీఎం సమోసాలు తినలేదు. మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. మేం కేవలం ఏం జరిగిందో కనుక్కోవాలనుకున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఈ సమాచారం బయటకు ఎలా పొక్కిందో మేం విచారణ జరుపుతున్నాం.’’ అని ఓజా చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.

ఈ విషయంలో సీఎంను నిందించలేమని సుఖు సన్నిహితుడు ఒకరు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా సమోసాలు, పకోడాలు మొదలైన వాటిని సుఖు ఆహారం నుండి దూరంగా ఉంచుతారని, నూనె వస్తువులకు ఆయన దూరంగా ఉంటారని ఈ విషయం ఆయనను ఆహ్వానించే దాదాపు ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి, శాఖకు తెలుసని చెప్పినట్టు పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)