మూవీ రివ్యూ : నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఎలా ఉంది ?

ఫొటో సోర్స్, Sri Venkateswara Cine Chitra/FB
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
'హ్యాపీ డేస్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, 'కార్తికేయ-2' తో పాన్ ఇండియా క్రేజ్‌ను సాధించారు. ఓ పక్క 'స్వయంభూ', 'ద ఇండియా హౌస్' లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ హీరో నటించిన తాజా సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
'క్రైం జోనర్‌లో సినిమాలు తీయడంలో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ. ఇప్పటికే నిఖిల్, సుధీర్ కాంబినేషన్ లో వచ్చిన 'స్వామి రా రా', 'కేశవ' విభిన్న సినిమాలుగా టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా సైలెంట్‌గా ఏ భారీ ప్రమోషన్స్ లేకుండా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో, ఈ కాంబినేషన్ మ్యాజిక్ పని చేసిందో లేదో చూద్దాం.


ఫొటో సోర్స్, Sri Venkateswara Cine Chitra/FB
కథ ఏంటి?
కార్ రేసర్ కావాలనే కలతో లండన్‌కు వెళతాడు రుషి (నిఖిల్). అనుకోని పరిస్థితుల్లో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. చివరకు ఆ హత్య మిస్టరీని ఛేదించగలిగాడా లేదా అనేదే కథ.
ఒక థ్రిల్లర్ ఎలిమెంట్‌తో సినిమా మొదలవుతుంది. ఆ ఎలిమెంట్‌ని కనెక్ట్ చేసే నేపథ్యం సినిమా మొదట్లో స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సీరియస్ జోనర్ క్రైం నుంచి లవ్, కామెడీకి కథ మొదట్లోనే షిఫ్ట్ అయ్యింది. దీనితో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపించలేదు.
ముఖ్య కథను డైవర్ట్ చేసేలా కామెడీ, లవ్ ట్రాక్ లు ఉండటంతో రుషి(నిఖిల్ ) పాత్ర తేలిపోయింది. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో 'లవ్ స్టోరీ' లకు పర్ఫెక్ట్ హీరోయిన్ అన్నంతగా మెప్పించిన తార (రుక్మిణి) పాత్ర కూడా పేలవంగా ఉండటంతో ఈ సినిమాలో రుషి -తారల లవ్ ట్రాక్ కూడా బలంగా లేదు.

ఫొటో సోర్స్, Sri Venkateswara Cine Chitra/FB
కామెడీతో మ్యాజిక్
ఈ సినిమాను కొంత వరకు నిలబెట్టింది కామెడీ ట్రాక్స్ అనే చెప్పొచ్చు. 'మత్తు వదలరా' సినిమాతో హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సత్య డైలాగ్ డెలివరీ; సుదర్శన్, వైవా హర్ష లాంటి హాస్య నటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. మెయిన్ స్టోరీ తేలిపోయినా ఈ కామెడీ కొంత వరకూ మ్యాజిక్ చేసింది.
మెయిన్ స్టోరీ వెనుకబడిందా?
లండన్‌లో ఒక లోకల్ డాన్ (బద్రి నారాయణ పాత్ర), అతను డబ్బు కోసం చేసే నేరాలు కథలో ఓ పక్క ఉంటే; మంచి యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉండే రేసింగ్ ఇంకో పక్క ఉంది. డాన్‌గా జాన్ విజయ్, అతని కుడి భుజంగా అజయ్ లాంటి సీనియర్ నటులు నటించారు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఇంత మంచి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. కానీ వీటికి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వకపోవడం, సీరియస్‌గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇవి సినిమాకు బలం కాలేకపోయాయి.
దర్శకత్వం :
క్రైం జోనర్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తీసే సుధీర్ వర్మ ఈ సినిమాలో మాత్రం తన డైరెక్షన్ మార్క్‌ను చూపలేకపోయారు. కథను చెప్పడంలో గందరగోళం ఉండటం; స్క్రీన్ ప్లే లో ఓవర్ డ్రామా, అసహజ పాత్రల చిత్రీకరణతో సినిమా నిరాశపరిచింది. మంచి కాస్టింగ్‌ను కూడా సరిగ్గా వినియోగించుకోలేదు.
పాటలు -సంగీతం:
పాటలు పర్లేదనిపించాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
1) సంగీతం
2) సినిమాటోగ్రఫీ
3)కామెడీ ట్రాక్స్
మైనస్ పాయింట్స్ :
1) గందరగోళమైన స్క్రీన్ ప్లే
2) ముఖ్య పాత్రల పేలవ చిత్రణ
3)మెయిన్ స్టోరీ తేలిపోవడం
4) లవ్ ట్రాక్ అసహజంగా ఉండటం
5) లాగింగ్
రేసర్ గా ఈ సినిమాతో బరిలోకి దిగిన నిఖిల్ మంచి కథతోనే వచ్చినా స్క్రీన్‌ప్లేలో గందరగోళం; కొన్నిచోట్ల కథ అసహజంగా ఉండటంతో ఈ సినిమా నిరాశపరిచింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














