‘క‌’ మూవీ రివ్యూ: కిరణ్‌ అబ్బవరం తాజా సినిమా ఎలా ఉందంటే..

తెలుగు సినిమా, దీపావళి, కిరణ్ అబ్బవరం

ఫొటో సోర్స్, @Kiran_Abbavaram/X

ఫొటో క్యాప్షన్, 'క' సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమాలు చేయనని కిరణ్ అబ్బవరం సవాల్ చేశారు
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్రధాన పాత్రలో న‌టించిన తాజా చిత్రం 'క‌'.

టైటిల్, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆకట్టుకున్నాయి. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగానే చేశారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో కిర‌ణ్ ఇచ్చిన స్పీచ్ 'టాక్ ఆఫ్ ది టౌన్' గా మారింది.

త‌న‌ని తొక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, తాను ఎద‌గ‌డం కొంత‌మందికి ఇష్టం లేదంటూ బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు.

అంతే కాదు, 'క‌' ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోతే, సినిమాలే మానేస్తానని స‌వాల్ విసిరాడు. ఈ నేప‌థ్యంలో ‘క‌’ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.

మ‌రి ఇంతకూ ఈ సినిమా ఎలా ఉంది? కిర‌ణ్ అబ్బవరం ఈ క‌థ‌పై ఇంత న‌మ్మ‌కం పెట్టుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క మూవీ, కిరణ్ అబ్బవరం

ఫొటో సోర్స్, KIRANABBAVARAM/X

ఫొటో క్యాప్షన్, దీపావళి సందర్భంగా విడుదలైన 'క' సినిమా

మ‌ధ్యాహ్న‌పు చీక‌ట్లు

కృష్ణ‌గిరి అనే ప‌చ్చ‌ని ప‌ల్లెటూరి క‌థ ఇది. ఇక్కడ ప్ర‌తీ గ‌డ‌ప‌కూ ఓ ఆడ‌పిల్ల ఉంటారు.

చుట్టూ ఎత్తైన కొండ‌లు ఉండటంతో మ‌ధ్యాహ్నం మూడైతే చీక‌టి ప‌డిపోతుంది. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లతో పాటు ఓ భ‌యం కూడా పొంచి ఉంది.

కృష్ణ‌గిరిలో వ‌రుస‌గా అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోతుంటారు. వాళ్లేమైపోయారో పోలీసులు కూడా క‌నిపెట్ట‌లేరు.

అలాంటిది ఈ ఊర్లో అడుగుపెట్టిన ఓ పోస్ట్‌‌మ్యాన్ అభిన‌య వాసుదేవ్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) ఈ మిస్ట‌రీ ఛేదించ‌డానికి న‌డుం క‌డతాడు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం నెర‌వేరిందా? లేదా? మ‌ధ్య‌లో ఎదురైన ఆటంకాలేమిటి? ఆ ఊర్లో స‌త్య‌భామ (న‌య‌న్ సారిక‌)తో న‌డిచిన ప్రేమ‌ క‌థ‌కు ఎలాంటి ముగింపు వ‌చ్చింది? అనేదే ఈ `క‌`థ‌.

విన‌డానికి చాలా సింపుల్‌గా ఉన్న క‌థ ఇది. కానీ, ఇందులోనే కొన్ని మెరుపులు ఉన్నాయి. ఈ సింపుల్ క‌థ‌ని ఎంత కొత్త‌గా చెప్పాలి? అనే విష‌యంలో ద‌ర్శ‌క ద్వ‌యం బాగా క‌స‌ర‌త్తు చేసింది. ముందుగా అభిన‌య వాసుదేవ్ క్యారెక్ట‌ర్ ద్వారానే ఆస‌క్తి క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు.

అభినయ వాసుదేవ్ ఓ అనాథ‌. త‌న‌కెవ‌రూ లేరు. అయితే ప‌క్క‌వాళ్ల‌కు వ‌చ్చిన ఉత్త‌రాలను దొంగ‌త‌నంగా చ‌ద‌వ‌డం అలవాటు చేసుకుంటాడు. అందులోనే త‌న అమ్మానాన్న‌నీ, తోబుట్టువుల్ని, బంధువుల్నీ చూసుకుంటాడు.

ఉత్త‌రాలు ఎక్కువ‌గా చ‌ద‌వ‌డానికి పోస్ట్‌మ్యాన్ అవ‌తారం ఎత్తుతాడు. అలా ఓ ఊరికి వ‌చ్చిన ఉత్తరాల్లో ఒక మిస్ట‌రీని క‌నిపెడ‌తాడు.

అక్క‌డి నుంచి అతని అన్వేష‌ణ మొద‌ల‌వుతుంది. ఒక పాత్ర‌ని క‌థ‌తో క‌నెక్ట్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు రాసుకున్న ఆస‌క్తిక‌ర‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ ఇది.

మ‌ధ్యాహ్న‌మే చీక‌టి ప‌డిపోయే ఊరు, అమ్మాయిల మిస్సింగ్ ఇవ‌న్నీ క‌థ‌నాన్ని మ‌రింత ఆస‌క్తి క‌లిగించేలా మార్చాయి. వాటితో పాటు ఈ క‌థ‌ని ఓ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ తరహాలో చెప్పుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల స్క్రీన్ ప్లే ప‌రంగా కొత్త‌గా అనిపించింది.

ఇంటర్వెల్‌ ట్విస్ట్, క్లైమాక్స్‌లో ఈ క‌థ‌ని ముగించిన ప‌ద్ధ‌తి, ఓ క్రైమ్ సినిమాని తాత్విక కోణంలో చూపించే ప్రయత్నంతో ఒక సాదాసీదా కథే కొత్త రంగులు పులుముకుని ‘సీతాకోక‌ చిలుక’ అయ్యింది.

'క' మూవీ, కిరణ్ అబ్బవరం

ఫొటో సోర్స్, KIRANABBAVARAM/X

ముసుగులో చేసిన మాయ‌

అభిన‌య వాసుదేవ్‌, రాధల‌ను ఇద్ద‌రు ముసుగు వ్య‌క్తులు అపహరించి రెండు వేర్వేరు చీక‌టి గ‌దుల్లో బంధిస్తారు. మ‌రో ముసుగు మ‌నిషి.. వాసుదేవ్‌ని ఇన్వెస్టిగేట్ చేయ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది.

అభినయ వాసుదేవ్ త‌న గ‌తాన్ని పూర్తిగా మ‌ర్చిపోవ‌డం, ఓ కాల‌చ‌క్రం స‌హాయంతో త‌న జీవితంలో జ‌రిగిన విష‌యాల‌న్నీ ఒక్కొక్క‌టిగా గుర్తు తెచ్చుకోవ‌డంతో ‘క‌’ క‌థ మొద‌ల‌వుతుంది.

మొద‌టి ప‌ది నిమిషాలూ ఆస‌క్తిగా మొద‌లెట్టిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర‌వాత కృష్ణ‌గిరి అనే ప్రాంతంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లాడు.

చుట్టూ కొండ‌లు, మ‌ధ్య‌లో ఊరు, 1977 నాటి సెట‌ప్‌... వీటితో తెర‌కు అందం వ‌చ్చింది.

అభిన‌య వాసుదేవ్‌, స‌త్య‌భామ‌ల ప్రేమ‌క‌థ రొటీన్‌గా అనిపిస్తుంది. ఆ ప్రేమ‌క‌థ, పోస్టాఫీస్ చుట్టూ న‌డిచే వినోదం ఏమాత్రం అత‌క‌లేదు. ఆ స‌న్నివేశాల‌న్నీ క‌థ‌ని డీవియేట్ చేస్తుంటాయి.

ఎవ‌రూ లేని ఓ ఇంటికి త‌ర‌చూ ఉత్త‌రం రావ‌డం, ఆ ఉత్త‌రం వెనుక ఏదో మ‌ర్మం ఉంద‌ని వాసుదేవ్ భావించ‌డం ద‌గ్గ‌ర్నుంచి క‌థ క్రైమ్ జోన‌ర్‌లోకి వెళ్తుంది. కొన్ని పాత్ర‌ల‌పై అనుమానాలు మొద‌ల‌వుతాయి.

అమ్మాయిలు త‌ప్పిపోవ‌డం వెనుక ఎవ‌రు ఉన్నారు? అనే ప్ర‌శ్న‌కు ప్రేక్ష‌కుల‌కూ అక్క‌డ‌క్క‌డ 'క్లూ' దొరుకుతుంటుంది. అయితే ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌లో నమ్ముకున్నది ఇంటర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్‌. వీటి మ‌ధ్య వ‌చ్చే ట్విస్టులు క‌నిపెట్టినా పెద్ద‌గా ప్ర‌మాదం ఉండ‌దు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఆ మ‌లుపు ఊహించ‌నిదే.

క్లైమాక్స్ ట్విస్ట్, ఇంటర్‌వెల్ బ్యాంగ్, స్క్రీన్ ప్లే

ఫొటో సోర్స్, @Kiran_Abbavaram/X

ఫొటో క్యాప్షన్, 'క' సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్న క్లైమాక్స్ ట్విస్ట్

వీడిన చిక్కుముళ్లు

ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు రాసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో, దాని ముడి విప్పేట‌ప్పుడూ అంతే లాజిక‌ల్‌గా ఆలోచించ‌డం ముఖ్యం.

ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఆ ముసుగు వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యంలో క్లారిటీ వ‌స్తుంది. కానీ, ఆ పాత్ర వెనుక మ‌ర్మం చివ‌రి వ‌ర‌కూ దాచి పెట్టాడు. ఎందుకంటే అది క్లైమాక్స్ ట్విస్ట్ కాబ‌ట్టి.

ద్వితీయార్ధంలో రెండు మూడు బ‌ల‌మైన మలుపులు ఉన్నాయి. కోర్టు ద‌గ్గ‌ర ఓ వ్య‌క్తిని హీరో ప్రాణాల‌తో కాపాడాల‌ని అనుకోవ‌డం, ఆ ఎపిసోడ్‌కీ, రాధ క‌థ‌కూ లింకు పెట్ట‌డం బాగుంది.

క‌థానాయ‌కుడి ఉత్త‌రాలు చ‌దివే అల‌వాటు చుట్టూనే మ‌లుపులు రాసుకోవ‌డం బాగా ఉప‌యోగ‌ప‌డిన అంశం. దాంతో క‌థ నుంచి ద‌ర్శ‌కుడు ఎక్క‌డా డైవ‌ర్ట్ కాలేదు.

అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవ‌రున్నారు? అనేది పెద్ద ట్విస్ట్ కాదు. అది రివీల్ చేసిన వెంట‌నే మ‌నం ముందే ఊహించాం క‌దా అని ప్రేక్ష‌కుడు భావిస్తాడు. ఆ వెంట‌నే మ‌రో మ‌లుపు ఇచ్చి ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేశాడు ద‌ర్శ‌కుడు.

క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా డిజైన్ చేశారు. అయితే చివ‌రి 20 నిమిషాల్లో రాసుకున్న మాట‌లు, చీక‌టి గ‌దికీ, ఇన్వెస్టిగేష‌న్‌కీ ఇచ్చిన క్లారిఫికేష‌న్‌తో ద‌ర్శ‌కుడు ఇంత ఆలోచించాడా? ఈ డైలాగుల వెనుక‌, ఈ స‌న్నివేశాల వెనుక ఇంత మర్మం ఉందా? అనిపిస్తుంది.

‘క‌’ అంటే అర్థం ఏమిటో కూడా చివ‌ర్లోనే చెప్పారు. దాంతో టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ దొరికేస్తుంది.

మ‌ధ్య మ‌ధ్య‌లో ల్యాగ్ అయిన ఫీలింగ్ కూడా క్లైమాక్స్ చూశాక‌ ప‌టాపంచ‌లైపోతుంది. కొన్ని డైలాగుల‌ను, స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు డీ కోడ్ చేసిన ప‌ద్ధ‌తి బాగుంది.

కొన్ని క‌థ‌లు క్లైమాక్స్ నుంచే పుడ‌తాయి అని ర‌చ‌యిత‌లు చెబుతుంటారు. ఈ క‌థ కూడా అలానే పుట్టిందా? అనిపిస్తుంది.

కిరణ్ అబ్బవరం, 'క' సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, @Kiran_Abbavaram/X

ఎవరెలా నటించారు?

కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లో చాలా ముఖ్య‌మైన చిత్ర‌మిది. ఎందుకంటే ఇటీవ‌ల వ‌రుస ప‌రాజ‌యాలు అత‌న్ని బాగా ఇబ్బంది పెట్టాయి. పైగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చాలెంజ్ కూడా చేశాడు. ఇవ‌న్నీ అత‌నిపై ఒత్తిడి పెంచేవే.

అయితే, న‌టుడిగా త‌న పాత్ర‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. త‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో, ఎంత స్వేదం చిందించాడో.. తెర‌పై అభిన‌య వాసుదేవ్ పాత్ర‌ని చూస్తే అర్థం అవుతుంది.

త‌న లుక్స్ బాగున్నాయి. యాక్ష‌న్ స‌న్నివేశాల్ని స‌హ‌జంగా చేశాడు. క్లైమాక్స్‌లో న‌ట‌న మ‌రింత ఆక‌ట్టుకుంటుంది. త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ప్రదర్శనగా చెప్పొచ్చు.

‘ఆయ్‌’ ఫేమ్ న‌య‌న్ సారిక నటన బాగుంది. కాక‌పోతే.. త‌న స్క్రీన్ స్పేస్ త‌క్కువ‌.

ద్వితీయార్ధంలో రాధ పాత్ర‌లో క‌నిపించిన త‌న్విరామ్ కీల‌క పాత్ర పోషించింది. త‌న‌ది రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర కాదు.

త‌మిళ హాస్య‌న‌టుడు రెడిన్ పాత్ర స‌రిగా రాసుకోలేదు. ఆయ‌న్నుంచి ఆశించే వినోదం కాస్త కూడా పండ‌లేదు.

అచ్యుత్ కుమార్‌ది కూడా రొటీన్ పాత్రే. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి, వివిధ భాష‌ల్లోంచి న‌టీన‌టుల్ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో వాళ్లు ఈ సినిమాలో చోటు సంపాదించుకున్నారు. అంతకు మించి ఏమీ లేదు.

KiranAbbavaramActor

ఫొటో సోర్స్, FB/KiranAbbavaramActor

సాంకేతికంగా..

కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది. కృష్ణ‌గిరి ప్రాంతాన్ని చూపించిన విధానం న‌చ్చుతుంది. ఇలాంటి సినిమాల‌కు ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేయ‌డం చాలా క‌ష్టం. బ‌డ్జెట్ ప‌రిమితులు ఉంటాయి. అందులోనే క్వాలిటీ చూపించాలి.

సౌండ్ డిజైనింగ్ ఆక‌ట్టుకుంది. జాత‌ర పాటలో ఊపుంది. అయితే స‌రైన ప్లేస్‌మెంట్‌లో రాలేద‌నిపిస్తుంది.

ఈ సినిమాతో సుజిత్-సందీప్ దర్శ‌కులుగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి సినిమాతోనే ఇంత కాంప్లికేటెడ్ స‌బ్జెక్ట్ డీల్ చేయ‌డం మాట‌లు కాదు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో వారిద్ద‌రికీ పూర్తిగా మార్కులు ప‌డిపోతాయి. ఈ క‌థ స్వ‌రూప‌మే మార్చేసిన సీన్ అది.

అవే కాదు, క‌థ‌ని చెప్పే విధానంలో కూడా కొంత‌మేర కొత్త‌గా ఆలోచించారు.

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)