'లక్కీ భాస్కర్' రివ్యూ : మిడిల్ క్లాస్ మ్యాన్‌గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?

దుల్కర్ సల్మాన్

ఫొటో సోర్స్, @dulQuer/X

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

మలయాళ నటుడైనప్పటికీ మహానటి, సీతారామం వంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసిన నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఇదే రూట్‌లో తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా ‘లక్కీ భాస్కర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

‘సార్’ సినిమాతో తెలుగు హీరోలే కాదు, ఇతర ఇండస్ట్రీల్లోని హీరోలతో కూడా మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే దర్శకుడిగా నిరూపించుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం కూడా తోడవ్వడంతో ఈ సినిమా దీపావళి రేసులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంతకు సినిమా ఎలా ఉందంటే?

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్

ఫొటో సోర్స్, @SitharaEnts/X

కథ ఏంటి?

భాస్కర్ ఒక మధ్యతరగతి మనిషి. అవసరాల కోసం, కుటుంబం సంతోషంగా ఉండటం కోసం అతను ఎలాంటి మోసాలు చేశాడు? చివరకు వాటి నుంచి తప్పించుకోగలిగాడా? లేదా? అన్నదే కథ.

టాలీవుడ్, దీపావళి, సినిమా

ఫొటో సోర్స్, @SitharaEnts/X

ఫొటో క్యాప్షన్, 'లక్కీ భాస్కర్'లో మధ్య తరగతి మనిషిగా నటించిన దుల్కర్ సల్మాన్

ఎవరు ఎలా నటించారు?

మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ సల్మాన్ చాలా సాదాసీదాగా కనిపించే పాత్రలో నటించారు.

ఒక బాధ్యత గల భర్తగా, తండ్రిగా, తోబుట్టువుగా, కొడుకుగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా మెప్పించారు ఈ పాత్రలో.

భాస్కర్ భార్య సుమతిగా మీనాక్షి చౌదరి నటించారు. తనకున్న స్క్రీన్ ప్రజెన్స్‌లో బాగా నటించినప్పటికీ, ఇంకా ప్రాధాన్యత ఉండేలా ఈ పాత్రను తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

భాస్కర్ మిత్రుడు సాంబ పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి ఎనర్జిటిక్‌గా నటించారు. రాంకీ, సాయి కుమార్ , హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రొడ్యూసర్ నాగవంశీ, ముంబయి

ఫొటో సోర్స్, @SitharaEnts/X

ఫొటో క్యాప్షన్, దీపావళి రేసులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న 'లక్కీ భాస్కర్' సినిమా

సినిమా ఎలా ఉంది?

ఇప్పటికే ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద అనేక సినిమాలు వచ్చాయి. అదే తరహాలో వచ్చిన సినిమా ఇది .

1989లో జరిగిన ఈ పీరియాడిక్ కథ కొత్తది కాదు. అలాగే, థ్రిల్లర్‌లో పెద్దగా మలుపులు లేవు. కథ జోనర్ పరంగా పీరియాడిక్ థ్రిల్లరైన ఈ సినిమాలో దానికన్నా మిడిల్ క్లాస్ మ్యాన్‌నే ఆడియన్స్‌కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ప్రొజెక్ట్ చేశారు వెంకీ అట్లూరి. ఈ ఎమోషన్ మాత్రం బాగా వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి.

ఒక మధ్యతరగతి మనిషి వివిధ పరిస్థితుల్లో ప్రవర్తించే తీరును చక్కగా చూపించిన సినిమా ఇది. మధ్యతరగతి మనుషులకు సమాజంలో ఎదగాలన్న తపన ఉంటుంది. దానికి అనేకసార్లు ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు.

అలాగే, ఈ వాతావరణంలో పెరిగే పిల్లలకు తమ కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చేసి తన కుటుంబాన్ని ఇంకా ఆర్థికంగా మెరుగైన స్థితికి తీసుకువెళ్లాలని కుటుంబ పెద్దకు ఉంటుంది. అలాంటి బాధ్యతలను నిర్వహిస్తున్నవాడే భాస్కర్.

ఇలాంటి మధ్యతరగతి మనిషికి డబ్బు సంపాదించడానికి వక్ర మార్గాలు కనిపిస్తే ఆ ప్రలోభాలకు ఎలా లోనవుతాడు? డబ్బు అవసరంగా ఉన్నప్పుడు ఒకలా, సంపాదన వ్యసనంగా మారాక ఇంకోలా ఎలా మారిపోతాడు? అన్నది ఇందులో చూపిస్తారు.

ఇక మెయిన్ స్టోరీలో ఉన్నది ఫైనాన్షియల్ క్రైమ్స్. ఒక బ్యాంకు ఇంకో బ్యాంకుకి లోన్ ఇచ్చినప్పుడు, కొందరు బడా బాబులు ఎలా ఆ రెండు బ్యాంకులను ఉపయోగించుకుని ఫేక్ సెక్యూరిటీని సృష్టించి స్టాక్ మార్కెట్స్ , ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ప్రభావితం చేస్తారు? ఈ వలలో బ్యాంకులు ఎలా చిక్కుకుంటాయి? అలాగే షేర్స్ రిగ్గింగ్ ఎలా జరుగుతుంది? ఇలాంటి ఎన్నో సీరియస్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

ఇదంతా ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో 1989 లో జరిగే కథ. కానీ, ఈ మెయిన్ స్టోరీ సైడ్ ట్రాక్‌గా మారి, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ముందుకెళ్లడంతో ‘ఫీల్ గుడ్ వైబ్స్’ ఇచ్చినప్పటికీ...మెయిన్ స్టోరీ మాత్రం తేలిపోయిందనే చెప్పాలి.

ముంబయి బ్యాక్‌డ్రాప్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేది. ఇప్పటికే ఈ నేపథ్యంతో అటు హాలీవుడ్, ఇటు ఇండియాలో అనేక సినిమాలు వచ్చి ఉండటంతో, పాత కథనే కొత్తగా చూసిన భావన కలుగుతుంది.

సెకండాఫ్‌లో అయినా ఎమోషనల్ ఫ్యామిలీ ట్రాక్ నుంచి మెయిన్ స్టోరీ వైపు ఎక్కువ దృష్టిపెట్టి ఉంటే సినిమా కథ పరంగా ఇంకా బలంగా ఉండేది. అలాగే, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల చిత్రీకరణ వాస్తవానికి దూరంగా, మరీ అసహజంగా ఉంది.

'లక్' కలిసి రాలేదా?

సినిమా టైటిల్‌కి తగ్గట్టు ఇందులో భాస్కర్ పాత్ర ఏ ఘర్షణా లేకుండా చాలా అదృష్టవశాత్తు క్లిష్టమైన సమస్యల నుండి బయటపడినట్టు కొన్నిసార్లు చూపించడం సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ లేకుండా చేసింది.

తెలివైన హీరో పాత్రకు అతని తెలివితేటలను పూర్తిగా ప్రదర్శించే స్కోప్ స్క్రీన్ ప్లేలో లేకపోవడంతో హీరోయిక్ ఎలిమెంట్‌గా 'లక్' కొన్ని సన్నివేశాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సినిమాకు ప్లస్ కాలేదు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి, మలయాళం ఇండస్ట్రీ, తెలుగు సినిమా

ఫొటో సోర్స్, @SitharaEnts/X

ఫొటో క్యాప్షన్, దుల్కర్ సల్మాన్‌తో డైరెక్టర్ వెంకీ అట్లూరి

ఇతర అంశాలు ఎలా ఉన్నాయి?

ఈ సినిమాకు సంగీతం, పాటలు ప్లస్ పాయింట్స్. ‘లక్కీ భాస్కర్’ టైటిల్ సాంగ్, శ్రీమతి గారు పాటలు బాగున్నాయి. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

1)ఎమోషనల్ డ్రామా

2)పాటలు -సంగీతం

3)దుల్కర్ సల్మాన్ నటన

మైనస్ పాయింట్స్ :

1) కథ కొత్తగా లేకపోవడం

2) ముంబయి నేపథ్యం బలంగా చిత్రీకరించకపోవడం

3)కాన్‌ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం

కథ కొత్తగా లేకపోయినా, దుల్కర్ సల్మాన్ నటన, వెంకీ అట్లూరి ఎమోషనల్ డ్రామాతో ఓ మేరకు మెప్పించిన సినిమానే 'లక్కీ భాస్కర్'.

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)