బట్టమేక: 200 కిలోమీటర్ల దూరంలోని మగ పక్షి వీర్యంతో ఆడ పక్షికి కృత్రిమ గర్భధారణ

ఫొటో సోర్స్, Radheshyam Pemani Bishnoi
- రచయిత, చెరిలాన్ మొలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
భారత్‌లో అంతరించిపోతున్న బట్టమేక పక్షిని కాపాడే ప్రయత్నాలలో శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేశారు.
రాజస్థాన్‌లోని అటవీ అధికారులు కృత్రిమ గర్భధారణ విధానంలో తొలిసారి బట్టమేక పక్షి పిల్ల జన్మించేలా చేశారు.
జైసల్మేర్ నగరంలో ఒక బట్టమేక సంతానోత్పత్తి కేంద్రంలో ఉన్న పక్షికి ఆడ పక్షితో కలవకుండానే వీర్యం ఉత్పత్తి చేసేలా శిక్షణ ఇచ్చారు.
అలా ఉత్పత్తి చేసిన వీర్యాన్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలాంటి మరో కేంద్రంలో ఉన్న ఆడ పక్షికి కృత్రిమ పద్ధతిలో ఎక్కించి గర్భం దాల్చేలా చేశారు.
ఇది చాలా కీలకమైన ప్రక్రియ అని అటవీ అధికారులు చెప్పారు. స్పెర్మ్ బ్యాంక్ ఏర్పాటుకు ఇది అవకాశం కల్పించనుందని తెలిపారు.


ఫొటో సోర్స్, Desert National Park
అనువైన నివాసాలు లేకపోవడం, వేటకు గురికావడం, విద్యుత్ తీగలు తగలడంతో బట్టమేక పక్షుల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోతోంది. భారత్‌లో 1960ల్లో వెయ్యికి పైగా ఉన్న ఈ పక్షుల సంఖ్య ఇప్పుడు 150కి చేరింది.
ప్రస్తుతం ఉన్నవాటిలో చాలావరకు జైసల్మేర్‌లోనే ఉన్నాయి. రాయలసీమలోని రోళ్లపాడు అటవీప్రాంతంలోనూ ఈ పక్షులు కొద్ది సంఖ్యలో ఉన్నాయి.
జైసల్మేర్ నగరంలో ఈ పక్షుల ఆవాసాలను సంరక్షించాలని పర్యావరణవేత్తలు అంటున్నారు.
కానీ, ఈ ప్రాంతం రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకు ప్రధానమైన స్థలంగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో బట్టమేక పక్షుల సంరక్షణలో అధికారులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
‘‘భారత జాతీయ పక్షి నెమలి మాదిరి బట్టమేక పక్షి అంత ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. కానీ, ఇది కూడా ప్రత్యేకమైన పక్షి’’ అని పదేళ్లుగా ఈ పక్షులపై అధ్యయనం చేస్తున్న పర్యావరణవేత్త సుమిత్ దూకియా అన్నారు.
భారీగా కనిపించే ఈ పక్షి బరువు 15 కేజీల నుంచి 18 కేజీల మధ్య ఉంటుంది. భారత్‌లో ఎగిరే అతిపెద్ద పక్షులలో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Radheshyam Pemani Bishnoi
దేశంలో ఒకప్పుడు ఈ పక్షులు బాగా కనిపించేవి. సుమారు 11 రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉండేది. ఇప్పుడు రాజస్థాన్‌లో మాత్రమే కనిపిస్తుంటాయి. కర్ణాటకలో కొన్ని, గుజరాత్‌లో కొన్నింటిని గుర్తించవచ్చు.
ఎలుకలు, పాములు, ఇతర జీవుల నుంచి పంట పొలాలను రక్షించడంలో ఈ పక్షి కీలకపాత్ర పోషిస్తుంది.
రాజస్థాన్ రాష్ట్ర పక్షి కూడా బట్టమేకనే. ఆ రాష్ట్ర ప్రజలు ఈ పక్షిని ‘గోదావన్’ అని పిలుచుకుంటారు.
బట్టమేక పక్షి దూరంగా చూడగలదు కానీ సాధారణంగా ఎదురుగా చూడలేదు. దీంతో గాల్లో ఎగురుతున్నప్పుడు విద్యుత్ తీగలకు సమీపంగా వచ్చేవరకు వాటిని గుర్తించలేవు. గుర్తించిన తరువాత తప్పించుకోవడానికి తాము ఎగురుతున్న దిశ మార్చుకోవడం కూడా వీటికి కష్టం. భారీ పరిమాణం వల్ల అది సాధ్యం కాక తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోతున్నాయి.
‘‘ఈ పక్షులు భూమిపైనే ఎక్కువ సమయం గడపడం వల్ల వాటి దృష్టి ఈ విధంగా ఉండి ఉండొచ్చు’’ అని దూకియా అన్నారు.
ఈ పక్షులు భూమిపైనే గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టేందుకు ప్రత్యేకంగా గూడు తయారుచేసుకోవు.. అలాగే గుడ్లు పెట్టాక వాటిని కనిపెట్టుకుని ఉండవు అని దూకియా చెప్పారు.
బట్టమేక పక్షులు పిల్లల్ని కనే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ పక్షి ఒకసారి ఒక గుడ్డును మాత్రమే పెడుతుంది. ఆ తర్వాత, రెండేళ్ల పాటు తన సంతానం కోసం గడుపుతుంది.

ఫొటో సోర్స్, Desert National Park
ఇది తన జీవితంలో కేవలం నాలుగు నుంచి ఐదు గుడ్లు మాత్రమే పెడుతుంది.
గత కొన్నేళ్లుగా జైసల్మేర్‌లో బట్టమేక పక్షులు ఆవాసాలను సోలార్, విండ్ ఎనర్జీ ఫామ్‌లు ఆక్రమిస్తున్నాయి. దీంతో, ఈ పక్షులు ప్రమాదాలకు గురికావడం పెరుగుతోంది.
‘ఈ పక్షులు ఉండే ప్రాంతాలలో మనుషుల ఉనికి పెరగడంతో వాటికి సమస్యలొస్తున్నాయి. కొన్నిసార్లు వీధికుక్కలు వాటి గుడ్లు తినేస్తుంటాయి’ అని దూకియా అన్నారు.
ఈ పక్షుల సంఖ్యను పెంచేందుకు, 2018లో సామ్ సిటీలో కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో రాజస్థాన్ ప్రభుత్వం కలిసి పనిచేసింది.
మరో సంతానోత్పత్తి కేంద్రాన్ని 2022లో రామ్‌దేవరా గ్రామంలో ఏర్పాటు చేసినట్లు జైసల్మేర్ అటవీ అధికారి అశీశ్ వ్యాస్ చెప్పారు.
తొలుత పరిశోధకులు అడవిలో ఉండే ఈ పక్షుల గుడ్లను సేకరిస్తారు. వాటిని ఇంక్యుబేషన్ సెంటర్లలో ఉంచి పొదిగిస్తారు.
‘‘ఈ రెండు కేంద్రాలలో ప్రస్తుతం 45 పక్షి పిల్లలు ఉన్నాయి. వాటిల్లో 14 పక్షి పిల్లలు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలలో పుట్టినవి. వీటిల్లో ఒకటే కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టింది’’ అని అశీశ్ వ్యాస్ తెలిపారు.
ఈ పక్షుల సంఖ్యను మరింత పెంచాలనుకుంటున్నారు. ఈ పక్షి పిల్లల్ని మెల్లమెల్లగా అడవుల్లో వదలనున్నారు.
ఈ సంతానోత్పత్తి కేంద్రాలలో పుట్టిన పిల్లలు సంరక్షకులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటున్నాయి. దీంతో, అడవిలో ఇవి మనుగడ సాధించే సామర్థ్యాన్ని 60 శాతం నుంచి 70 శాతం కోల్పోతున్నాయని దూకియా చెప్పారు.

ఫొటో సోర్స్, Desert National Park
‘‘ఈ పక్షి పిల్లలకు ఆహారం పెట్టేందుకు, వాటిని సంరక్షిచేందుకు సంరక్షకులు తప్పనిసరి. మనుషులకు అలవాటు పడి అవి వాటి సహజ ప్రవృత్తిని కోల్పోతున్నాయి. వాటిని తిరిగి అటవీ జీవనానికి సిద్ధం చేయడం చాలా సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా వాటిని వదిలిపెట్టేందుకు ఎలాంటి ప్రత్యేక ఆవాసాలు లేనప్పుడు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ’’ అని దూకియా అన్నారు.
వాటి ఆవాసాలను కోల్పోతుండటం కూడా ఈ పక్షులకు మరో రకమైన సమస్య. అంతకుముందు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లే ఈ పక్షులు, ఇప్పుడు పూర్తిగా అలా చేయడం మానేశాయని పరిశోధకులు గుర్తించారు.
జైసల్మేర్‌లో కూడా రెండు ప్రాంతాల్లో ఈ పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుందని దూకియా తెలిపారు.
ఎగురుతున్నప్పుడు జరిగే ప్రమాదాల వల్ల దూర ప్రాంతాలకు ఈ పక్షులు వెళ్లడం తగ్గింది. దీనివల్ల ఇన్‌బ్రీడింగ్(వివిధ జాతుల్లో దగ్గర వాటి మధ్య జరిగే కలయిక) ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా పిల్లలు లోపాలతో పుడతాయి.
‘‘వాటి సహజసిద్ధమైన ఆవాసాలను కాపాడటం మాత్రమే బట్టమేక పక్షులను సంరక్షించేందుకు ఉన్న ఏకైక పరిష్కారం’’ అని దూకియా చెప్పారు.

ఫొటో సోర్స్, Radheshyam Pemani Bishnoi
ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పర్యావరణవేత్తలను తీవ్ర అసహనానికి గురి చేసింది.
బట్టమేక పక్షులు ఆవాసాలుండే ప్రాంతాల్లో భూగర్భంలో విద్యుత్ తీగలను వేసేలా రాజస్థాన్, గుజరాత్‌లకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ ఉత్తర్వులతో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, పరోక్షంగా వాటి వ్యాపారాలను దెబ్బతీసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
విద్యుత్ తీగలను తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీ వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పును కార్పొరేట్ సంస్థలు స్వాగతించగా.. ఒక దాని కోసం మరో మంచి కార్యక్రమాన్ని పక్కనపెట్టడం సమస్యాత్మకం అని పర్యావరణ వేత్తలు, మరికొంతమంది న్యాయ నిపుణులు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














