బర్డ్ ఆఫ్ ది ఇయర్: సిగ్గుపడే ఈ అరుదైన పెంగ్విన్‌ను చూశారా?

ఫొటో సోర్స్, Dunedin NZ
- రచయిత, యివెట్ టాన్
- హోదా, బీబీసీ న్యూస్
అందంగా సిగ్గుపడే పసుపు కళ్ల పెంగ్విన్ బర్డ్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ని గెలుచుకోవడానికి న్యూజీలాండ్‌లో ఎక్కువసార్లు పోటీపడిన పక్షులలో ఒకటిగా నిలిచింది.
ఈ పోటీలో 50 వేలకంటే ఎక్కువ మంది ఓటు వేశారు. గత సంవత్సరం, హాస్యనటుడు జాన్ ఆలివర్ పక్షుల సంరక్షణ కోసం ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఆయన పక్షిలాగా దుస్తులు ధరించి కనిపించారు.
గత ఏడాది పూటేకెటేకే అని పిలిచే పక్షి ‘బర్డ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది.
ప్రపంచంలోని అరుదైన పెంగ్విన్ జాతులలో ఒకటిగా చెప్పే హోయిహో న్యూజీలాండ్‌లో మాత్రమే కనిపిస్తుంది.

పోటీని నిర్వహించే సంస్థ ఫారెస్ట్ & బర్డ్ ప్రకారం, హోయిహో 6,328 ఓట్లతో విజయం సాధించింది.
హోయిహో పోటీలో గెలుపొందడం ఇది రెండవసారి. 2019లో కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఆ సంవత్సరం ఒక రష్యన్ పాత్ర ఉండడం వల్లే హోయిహో గెలిచినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ పక్షికి వందలాది ఓట్లు రష్యా నుండి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఇవి మోసపూరిత ఓట్లు కావని, రష్యన్ పక్షి శాస్త్రవేత్తల నుండి వచ్చినవి అని ఫారెస్ట్ & బర్డ్ పేర్కొంది.
2018లో ఆస్ట్రేలియన్లు షాగ్ - కార్మోరెంట్ జాతి పక్షిగెలుపునకు అనుకూలంగా పోటీ నిర్వహించడానికి ప్రయత్నించారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకారం, ఇది అంతరించిపోతున్న పక్షి జాతి. వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
"సరైన సమయంలోనే దీనికి గుర్తింపు దక్కింది లేదంటే ఈ ఐకానిక్ పెంగ్విన్ మన కళ్ల ముందే అయోటెరోవా (న్యూజీలాండ్) భూభాగం నుండి అదృశ్యమయ్యేది" అని ఫారెస్ట్ & బర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నికోలా టోకీ అన్నారు.
"అవి తరచుగా వలల్లో చిక్కుకుంటున్నాయి. వాటికి ఆహారం కూడా సరిగా దొరకడం లేదు" ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.














