విజయవాడ-శ్రీశైలం సీ ప్లేన్: ఈసారైనా ఎగురుతుందా? గతంలో ఏం జరిగింది?

విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ట్రయల్ రన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీ ప్లేన్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

సీ ప్లేన్స్ విషయం మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో తెరపైకి వచ్చింది. శనివారం(నవంబరు 9) విజయవాడ పున్నమి ఘాట్‌ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్‌’‌ను ప్రయోగాత్మకంగా నడపనున్నారు.

సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి అదే సీ ప్లేన్‌లో విజయవాడకు తిరిగి వస్తారని అధికారులు తెలిపారు.

చంద్రబాబు పర్యటన దృష్యా ఇప్పటికే విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం పాతాళ గంగ వరకు సీ ప్లేన్ రిహార్సల్స్ నిర్వహించారు.

‘‘ శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్లో దాదాపు కిలోమీటర్ మేర సీ ప్లేన్లో ప్రయాణించి, పాతాళ గంగ వద్దకు సీఎం చేరుకుంటారు. అక్కడినుంచి రోప్ వే ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు’’ అని అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీ ప్లేన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఫ్లోటింగ్ జెట్టీ

2017 డిసెంబర్‌లో తొలిసారి సీప్లేన్‌ టెస్ట్‌ రైడ్‌

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో స్లీ ప్లేన్ నడుస్తుంది. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ‌ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లడానికి 40 నిమిషాల టైం పడుతుందని మారీటైమ్ బోర్డు సీఈవో చెప్పారు.

వాస్తవానికి ఆరేళ్ల కిందట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ సీప్లేన్‌ టెస్ట్‌ రైడ్‌ నిర్వహించారు. 2017 డిసెంబర్‌ 13న విజయవాడ కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్‌ వద్ద స్పైస్‌ జెట్‌కు చెందిన సీ ప్లేన్‌లో చంద్రబాబు ప్రయాణించారు. పున్నమి ఘాట్‌ నుంచి కృష్ణానదిలో విహరించారు.

చంద్రబాబుతో పాటు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, నాటి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అఖిల ప్రియతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఆ ప్లేన్‌లో ప్రయాణించారు.

ఆ సమయంలో మాట్లాడిన చంద్రబాబు..అంతకు ముందు రోజే ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి నది వద్ద సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు.

మన రాష్ట్రంలో త్వరలోనే ఈ సీ ప్లేన్‌లను పర్యటకులకు అందుబాటులోకి తెస్తామని అప్పట్లో ప్రకటించారు. చిన్న తరహా ఉభయచర విమానాలతో మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు అవకాశం ఏర్పడుతుందని, రాష్ట్రంలో పర్యటక రంగ అభివృద్ధికి ఇవి దోహదపడతాయని అప్పుడు చంద్రబాబు చెప్పారు.

సీ ప్లేన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీ ప్లేన్ ట్రయల్ రన్ ఫోటో

అప్పుడు ట్రయల్ రన్ తర్వాత ఏం జరిగిందంటే...

2019 మే వరకు చం‌ద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ 2017 డిసెంబర్ టెస్ట్‌ రైడ్‌ తర్వాత సీ ప్లేన్ల ప్రస్తావన మళ్లీ వినిపించలేదు.

నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి టీడీపీ తప్పుకున్న దరిమిలా ఈ ప్రాజెక్టులో కీలకమైన పౌరవిమానయాన శాఖ నుంచి స్పందన రాకపోవడంతోనే అప్పట్లో సీ ప్లేన్ల అంశం మరుగున పడిందని పర్యటక శాఖలో పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి బీబీసీకి చెప్పారు.

‘‘కేంద్రంతో విభేదాల వల్లే సీ ప్లేన్‌ ప్రాజెక్టు పక్కన పడిందనేది వందశాతం తప్పు. 2017 చివర్లో విజయవంతంగా టెస్ట్‌ రైడ్‌ నిర్వహించాం. అన్ని ఏర్పాట్లు చేసి పర్యటకులకు అందుబాటులోకి తెచ్చేలోగా ఎన్నికలు వచ్చాయి. ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో జాప్యం జరిగింది.’’ అని నాటి రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ బీబీసీతో అన్నారు.

కానీ, ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదని అఖిల ప్రియ విమర్శించారు.

అయితే, తమ పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటకంగా బాగా అభివృద్ధి చెందిందని వైఎస్సార్‌సీపీ పాలనలో టూరిజం మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా అన్నారు.

‘‘టీడీపీ ప్రభుత్వంలో మాటలకు చేతలకు తేడా ఉంటుంది. మేం అలా కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పింది చేసి చూపించాం’’ అని బీబీసీతో రోజా చెప్పారు.

‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఇటువంటి ప్రతిపాదనలెప్పుడూ మా వద్దకు రాలేదు’’ అని అప్పట్లో మారీటైమ్ బోర్డు చైర్మన్‌గా పనిచేసిన వైఎస్సార్‌సీపీ నేత కాయల వెంకటరెడ్డి బీబీసీతో అన్నారు.

సీ ప్లేన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎగురుతున్న సీ ప్లేన్

ఈ సారి కమర్షియల్‌ ఆపరేషన్స్‌ మొదలవుతాయా?

‘‘2017లో మన రాష్ట్రంలో కమర్షియల్‌ ఆపరేషన్లు మొదలు కాలేదు. కానీ అప్పుడు గుజరాత్‌లో మొదలయ్యాయి. ఈసారి ఏపీలో పర్యటకులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కమర్షియల్‌ ఆపరేషన్లు త్వరలోనే మొదలు పెడతాం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌), ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్‌ ఆదిత్య బీబీసీకి తెలిపారు.

‘‘సీ ప్లేన్‌ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమవుతుంది. రాబోయే రోజుల్లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్‌ సర్వీసులు కచ్చితంగా ప్రారంభమవుతాయి. ముందుగా విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నాం. ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ పర్యటక ప్రాంతాల్లో దశల వారీగా సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.’’ అని ఆదిత్య అన్నారు.

సీ ప్లేన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఫ్లోటింగ్ జెట్టీ దగ్గర సీ ప్లేన్

అసలు సీ ప్లేన్‌ సర్వీసెస్‌ అంటే...

‘నీటిపై ప్రయాణించడంతో పాటు గాలిలోనూ ఎగిరే జల వాయు విహంగమే సీ ప్లేన్‌.. ఈ సర్వీసులకు పెద్ద రన్‌వే అవసరం లేదు.. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే లోనే కాకుండా నీళ్లలోనూ ల్యాండ్‌ అవుతుంది. 300 మీటర్ల పొడవున రెండు మూడు అడుగుల నీళ్లు ఉంటే చాలు.. నీళ్లలో సురక్షితంగా ల్యాండ్‌ అవుతుంది. ఇక ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు, 300 మీటర్ల మట్టి రోడ్డు రన్‌ వే ఉన్నా ల్యాండ్‌ చేసుకోవచ్చు’’ అని మారీటైమ్ బోర్డ్‌కి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

సీ ప్లేన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఫ్లోటింగ్ జెట్టీ

ఫ్లోటింగ్‌ జెట్టీల ఏర్పాటు

కృష్ణా నదిలో పున్నమి ఘాట్‌ వద్ద ఇప్పటికే ఫ్లోటింగ్‌ జెట్టీ ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే సీ ప్లేన్‌ బయలుదేరి శ్రీశైలం వెళుతుందని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) డివిజనల్‌ మేనేజర్‌ కృష్ణ చైతన్య బీబీసీకి తెలిపారు.

శ్రీశైలంలోని పాతాళ గంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న పాత జెట్టీపై సీ ప్లేన్‌ దిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, సీఎం చంద్రబాబు సీ ప్లేన్‌ దిగి.. 60 మెట్లు ఎక్కిన తర్వాత రోప్‌ వే నుంచి శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీటీడీసీ కర్నూలు డీవీఎం చంద్రమౌళి రెడ్డి బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)