శివ్ నాడార్: దానంలో అంబానీ, అదానీలను మించిన ఈ వ్యాపారవేత్త ఎవరు, తెలుగువారిలో టాప్ ప్లేస్ ఎవరికి?

శివ్ నాడార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రూ.2,153 కోట్లు దానం చేసిన శివ్‌ నాడార్‌

భారత్‌లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే, వారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారో తెలుసా?

‘ఎడెల్‌గివ్‌- హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ - 2024’ అత్యధికంగా దానాలు చేసిన వ్యక్తుల జాబితాను ప్రకటించింది.

ఈ లిస్ట్‌లో అంబానీ, అదానీలను మించి దానం చేసిన వ్యాపారవేత్త ఎవరు? ఆయన ఎన్ని కోట్లు దానం చేశారు? టాప్-10 లిస్ట్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెక్కువ విరాళం ఇచ్చారు? మహిళల్లో టాప్ ఎవరు వంటి ఆసక్తికర అంశాలు ఈ కథనంలో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎడెల్‌గివ్‌- హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ - 2024

ఫొటో సోర్స్, Edelgive-Hurun India Philanthropy List 2024

ఫొటో క్యాప్షన్, ఎక్కువ దానం చేసిన వారి టాప్-10 లిస్ట్

శివ్ నాడార్ తరువాతే అంబానీ, అదానీ

2023-2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో వ్యాపారవేత్తలు చేసిన విరాళాలకు సంబంధించి ‘ఎడెల్‌గివ్‌- హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ - 2024’ను రూపొందించారు.

ఈ జాబితా ప్రకారం...దాతృత్వ కార్యక్రమాలకు అత్యధికంగా వెచ్చించిన వారిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులైన శివ్‌ నాడార్‌ కుటుంబం టాప్‌లో ఉంది. వారు రూ.2,153 కోట్లు దానం చేశారు. అంటే సగటున రోజుకు 5.9 కోట్లు.

గతేడాదితో పోల్చితే 5 శాతం ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. ప్రధానంగా విద్యాభివృద్ధి కోసం ఈ కుటుంబం ఎక్కువగా విరాళాలు ఇచ్చింది.

గడిచిన 5 ఏళ్లుగా ‘ఎడెల్‌గివ్‌- హురున్‌ ఇండియా’ దాతల జాబితాలో మూడుసార్లు ఈయనే టాప్‌లో ఉన్నారు.

ఇక, రూ.407 కోట్లతో ముకేశ్ అంబానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది. గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం ఎక్కువగా దానం చేశారు. ప్రధానంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చారు.

బజాజ్ కుటుంబం రూ.352 కోట్ల విరాళంతో 3వ స్థానంలో ఉంది. వీరు ప్రధానంగా ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చారు.

కుమార్ మంగళం బిర్లా కుటుంబం రూ. 334 కోట్ల దానంతో 4వ స్థానంలో ఉంది. వీరు కూడా ఎక్కువగా విద్య కోసం విరాళాలు అందించారు.

రూ.330 కోట్లతో 5వ స్థానంలో గౌతమ్ అదానీ కుటుంబం ఉంది. మారుమూల గ్రామాల్లో విద్యాభివృద్ధి కోసం అదానీ కుటుంబం అధికంగా విరాళాలు ఇచ్చింది.

ఇక వరుసగా తరువాతి స్థానాల్లో రూ.307 కోట్లతో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, రూ. 228 కోట్లతో ఇండో ఎమ్‌ఐఎమ్ చైర్మన్ కృష్ణ చివుకుల, రూ.181 కోట్లతో వేదాంత గ్రూప్‌ అధిపతి అనిల్‌ అగర్వాల్‌, రూ.179 కోట్లతో మైండ్ ట్రీ సంస్థ వ్యవస్థాపకులు సుస్మిత, సుబ్రతో బాగ్చీ, రూ.154 కోట్లతో రోహిణి నీలేకని ఉన్నారు.

రోహిణి నీలేకని

ఫొటో సోర్స్, @RNP_Foundation/X

ఫొటో క్యాప్షన్, రూ.154 కోట్లు విరాళమిచ్చిన రోహిణి నీలేకని

దాతల్లో మహిళలు ఎంత మంది ఉన్నారు?

ఏడాదిలో రూ.5 కోట్లు లేదా అంత కంటే ఎక్కువ మొత్తం దానం చేసిన వారితో ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 203 మందికి చోటు దక్కింది. వారిలో 21 మంది మహిళలు ఉన్నారు.

రూ.154 కోట్ల దానంతో రోహిణి నీలేకని మహిళల జాబితాలో టాప్‌లో ఉన్నారు. ఈమె రోహిణి నీలేకని ఫిలాంత్రఫీస్ చైర్మన్.

 కృష్ణ చివుకుల

ఫొటో సోర్స్, @iitmadras/X

ఫొటో క్యాప్షన్, ఐఐటీ మద్రాసుకు రూ.228 కోట్లు విరాళం ఇచ్చిన కృష్ణ చివుకుల

తెలుగు వాళ్లు ఎంత మంది?

ఈ దాతల జాబితాలో కొత్తగా 96 మందికి చోటు దక్కింది.

వారిలో రూ.228 కోట్ల దానంతో కృష్ణ చివుకుల టాప్‌లో ఉన్నారు. ఈయన అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి.

ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న ఆయన, ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం ఇచ్చారు.

ఇక, ఈ జాబితాలో హైదరాబాద్ నుంచి 10 మందికిపైగా ఉన్నారు. అందులో రూ.33 కోట్లతో మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పీవీ కృష్ణా రెడ్డి టాప్‌లో ఉన్నారు.

ఈ జాబితా ప్రకారం 18 మంది రూ.100 కోట్ల కంటే ఎక్కువగా దానం చేశారు. 2018లో ఈ కేటగిరీలో ఇద్దరే ఉన్నారు.

రూ. 50 కోట్ల కంటే ఎక్కువగా దానం చేసిన వారు 30 మంది ఉండగా, రూ.20 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చిన వారు 61 మంది ఉన్నారు.

మొత్తంగా, విరాళాలు ఇచ్చిన వారిలో ఫార్మా రంగానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. జాబితాలో 16శాతం మంది వారే.

వివిధ రంగాల్లోని స్థితిగతులు మెరుగయ్యేందుకు దాతలు ఇలా విరాళాలు ఇచ్చారు.

‘ఎడెల్‌గివ్‌- హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్ - 2024’ ప్రకారం విద్యా రంగానికి అత్యధికంగా రూ.3,680 కోట్ల విరాళాలు అందాయి. అందులో రూ.1,936 కోట్ల విరాళంతో శివ్ నాడార్ కుటుంబం టాప్‌లో ఉంది.

ఆ తరువాత వరుసగా వైద్యారోగ్య రంగానికి రూ.626 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.331కోట్లు, పర్యావరణం కోసం రూ. 177 కోట్లు, ఎకో సిస్టమ్ బిల్డింగ్ కోసం రూ.202 కోట్లు విరాళాలు వచ్చాయి.

ముకేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీఎస్‌ఆర్ కార్యక్రమాల కోసం రూ.900 కోట్లు ఖర్చు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

సీఎస్‌ఆర్‌లో టాప్‌లో ముకేశ్ అంబానీ

భారత్‌లోని చట్టాల ప్రకారం వాణిజ్య సంస్థలు ‘కార్పొరేట్‌ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ (సీఎస్‌ఆర్‌) కింద తమ ఆర్థిక సంవత్సర నికర లాభాల్లో కనీసం 2 శాతం డబ్బును కేటాయించాలి.

సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీల జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టాప్‌లో ఉంది. వారు 2023-24లో రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరువాతి స్థానంలో రూ.228 కోట్లతో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)