కోబ్రా రక్తం తాగడం, పామును వండుకుని తినడం.. నియంతల చిత్రమైన అలవాట్లు, క్రూరమైన ఆదేశాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ హిందీ
నియంతలు తమ చుట్టూ ఉన్న సొంతవాళ్ల విషయంలోనే భయపడుతుంటారని చెబుతారు.
కానీ, ఇందులో మరో నిజమేంటంటే ప్రతి నియంతకీ ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయం తర్వాత, నియంత పతనం ఖాయం.
చైనాకి చెందిన మావో, పాకిస్తాన్‌కి చెందిన జియా ఉల్ హక్, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, లిబియా నియంత కల్నల్ గడాఫీ, యుగాండాకి చెందిన ఈదీ అమీన్ ఇలా ప్రపంచంలో ఎందరో నియంతలున్నారు.
అనేక దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన రాజీవ్ డోగ్రా రాసిన పుస్తకం 'ఆటోక్రాట్స్, చరిష్మా, పవర్ అండ్ దెయిర్ లైవ్స్' ఇటీవల ప్రచురితమైంది.
ఇందులో ప్రపంచ నియంతల మనస్తత్వం, పనితీరు, వారి జీవితాల గురించి నిశితంగా పరిశీలించారు.

తాను భారత రాయబారిగా రొమేనియాకు వెళ్లిన సమయానికి నియంత నికొలస్ చాచెస్కూ చనిపోయి అప్పటికి దశాబ్దం దాటిందని.. అయినా, అక్కడి ప్రజలు తమ నీడను చూసి కూడా భయపడేవారని డోగ్రా చెప్పారు.
''తమను ఎవరైనా వెంబడిస్తున్నారా అని ప్రజలు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండేవారు'' అని రాజీవ్ డోగ్రా తన పుస్తకంలో రాశారు.
''పార్క్‌లో నడుస్తూ కూడా, ఎవరైనా బెంచ్ మీద కూర్చుని ముఖానికి న్యూస్‌పేపర్ అడ్డుపెట్టుకుని తమను గమనిస్తున్నారా? ఒకవేళ ఎవరైనా న్యూస్‌పేపర్ చదువుతున్నా, దానికి ఏదైనా రంధ్రం ఉందా? అందులో నుంచి తమను గమనిస్తున్నారా? అని చూసుకుంటూ ఉండేవారు''

ఫొటో సోర్స్, Getty Images
వ్యతిరేకతను నియంతలు సహించలేరు
రొమేనియాకి చెందిన ప్రముఖ ఫిల్మ్, థియేటర్ యాక్టర్ ఇవాన్ కరామిత్రు నియంతృత్వం నాటి రోజులను వివరించారని డోగ్రా రాశారు.
''మేం నిత్యం నిఘాలోనే ఉండేవాళ్లం. మా ప్రతి కదలికపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది.. మేం ఎవరిని కలవొచ్చు, ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఏం కొనాలి, ఏం కొనకూడదనేవి కూడా ప్రభుత్వమే నిర్ణయించేది. మీకు ఏది మంచిదో కూడా ప్రభుత్వమే చెప్పేది'' అని ఇవాన్ చెప్పినట్లు డోగ్రా తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యంలోనే నియంతృత్వ బీజాలు
నియంత క్రూరత్వానికి బాల్యం, లేదా చిన్ననాటి సంఘటనలు కారణమని చెబుతారు.
లెవిన్ అరెడ్డీ, ఆడమ్ జేమ్స్ తమ ఆర్టికల్ ''13 ఫ్యాక్ట్స్ అబౌట్ ముస్సోలిని''లో ఇలా రాశారు. ''ముస్సోలిని వ్యక్తిత్వం చాలా భిన్నం. ఆయన్ను గాడిలో పెట్టేందుకు తల్లిదండ్రులు కఠిన నిబంధనలు ఉండే క్యాథలిక్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. అక్కడి పాఠశాల సిబ్బంది కూడా ఆయన్ను క్రమశిక్షణలో పెట్టలేకపోయారు.''
''పదేళ్ల వయసులో ఆయన ఒక విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో స్కూల్ నుంచి బహిష్కరించారు. 20 ఏళ్ల వయసు వచ్చేప్పటికి, తన ప్రియురాలితో సహా పలువురిపై కత్తితో దాడి చేశారు.''
స్టాలిన్ కూడా తన యవ్వనంలో చాలా దూకుడుగా ఉండే వ్యక్తి. ఎన్నో దుకాణాలకు నిప్పుపెట్టారు.
పార్టీ కోసం డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్‌లు కూడా చేశారు. ఆ తర్వాత తనకు తాను స్టాలిన్ అని పేరు పెట్టుకున్నారు. స్టాలిన్ అంటే 'ఇనుముతో చేసినది' అని అర్థం.
అయితే, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బాల్యం మాత్రం వీటికి విరుద్ధంగా సాగింది. విలాసవంతంగా, వైభవంగా గడిచింది. బాల్యంలో ఓ పెద్ద సేవకుల బృందం ఆయన్ను చూసుకుంది.
యూరప్‌లో ఉన్న ఏ బొమ్మల దుకాణంలో లేనన్ని బొమ్మలు ఆయన వద్ద ఉండేవి. ఆయన వినోదం కోసం కోతులను, ఎలుగుబంట్లను వారి ఇంటి తోటలో బోన్లలో ఉంచేవారు.
చాలా గారాబంగా పెరిగినప్పటికీ, కిమ్ ఇప్పటికీ ఇతర నియంతల మాదిరిగానే చాలా అభద్రతా భావంతో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారం కాపాడుకోవడం కోసం గిమ్మిక్కులు
ఒక్కసారి అధికారం చేతికొచ్చిన తర్వాత, అది చేజారిపోకుండా ఎలాగైనా కాపాడుకోవడమే నియంత తొలి ప్రాధాన్యం.
రాజీవ్ డోగ్రా ఇలా రాశారు, ''అధికారాన్ని కాపాడుకునే విషయంలో నియంత ప్రవర్తనను అంచనా వేయలేం. అధికారంలో కొనసాగాలంటే, మీడియాపై పూర్తి నియంత్రణ ఉండాలి''
''భగవంతునిలా తనను సర్వాంతర్యామిగా చూపించుకోవాలి, ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వెంటనే అణచివేయాలి.''
దాదాపు ప్రపంచంలోని నియంతలందరూ ప్రచారంలో దిట్టలే.
2019 సెప్టెంబర్ 20 నాటి న్యూ స్టేట్స్‌మెన్‌లో సియు ప్రొదో రాసిన 'ది గ్రేట్ పెర్ఫార్మర్స్: హౌ ఇమేజ్ అండ్ థియేటర్ గివ్ డిక్టేటర్స్ దెయిర్ పవర్' ఆర్టికల్‌లో ''తన గురించి రాసే ఎడిటోరియల్స్ కంటే తాను ఎగరడం నేర్చుకుంటున్న ఫోటో ఎక్కువ ప్రభావం చూపుతుందని ముస్సోలినికి తెలుసు'' అని రాశారు.
1925లో తన తొలి రేడియో కార్యక్రమం తర్వాత, దాదాపు నాలుగు వేల రేడియో సెట్లను పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం ఎనిమిది లక్షల రేడియో సెట్లను పంపిణీ చేసి, రేడియో ప్రసారాలను వినేందుకు కూడళ్లలో లౌడ్ స్పీకర్లను కూడా ఏర్పాటు చేశారు.
''స్నానం చేయడానికి వాడే సబ్బులపైనా ఆయన బొమ్మ ఉండేది. అలా ఆయన బాత్‌రూమ్‌లలోనూ తన ముద్ర ఉండేలా చేసుకున్నారు. ఆయన కార్యాలయంలో రాత్రిళ్లు కూడా లైట్లు వెలిగి ఉండేవి, అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నారని ప్రజలు భావించాలని అలా చేసేవారు'' అని సియు ప్రొదో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
విచిత్రమైన ఆహారపు అలవాట్లు
అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంత శుద్ధ శాఖాహారి అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన చివరి రోజుల్లో, భోజనంలో సూప్, బంగాళదుంపలు మాత్రమే ఉండేవి.
కిమ్ జోంగ్ II సొరచేప రెక్కలని, కుక్క మాంసంతో చేసిన సూప్ తీసుకోవడానికి ఇష్టపడతారు.
''కిమ్ వద్ద మరో ఏర్పాటు కూడా ఉంది. ఆయన ఆహార ఏర్పాట్ల కోసం మహిళల బృందం ఉంది'' అని బార్బరా డెమిక్ తన 'ది డైలీ బీస్ట్' 2017 జులై 14 నాటి సంచికలో ''ది వే టు అండర్‌స్టాండ్ కిమ్ జోంగ్ II వజ్ త్రూ హిజ్ స్టమక్'' అనే వ్యాసంలో రాశారు.
''ఈ బృందం ఆయన భోజనంలోని ప్రతి గింజ పరిమాణం, ఆకారం, రంగు అన్నీ ఒకేలా ఉండేలా చూసుకుంటుంది. ఆయనకు నచ్చిన పానీయం కాగ్నాక్ (ఒక రకం బ్రాందీ), ఆయన హెన్నెస్సీ కాగ్నాక్‌ను భారీగా కొనుగోలు చేస్తారు'' అని రాశారు.
పోల్ పాట్ కోబ్రా గుండెను తినడానికి ఇష్టపడేవారు. పోల్ పాట్ వంటమనిషి డోగ్రాతో, ''పోల్ పాట్ కోసం కోబ్రాని వండాను. ముందుగా కోబ్రాని చంపి, దాని తల నరికి అందులోని విషం బయటికి వచ్చేలా చెట్టుకు వేలాడదీశా'' అని చెప్పారు.
''ఆ తర్వాత కోబ్రా రక్తాన్ని ఒక కప్పులో వైట్ వైన్‌తో కలిపి సర్వ్ చేశా. అనంతరం పామును ముక్కలుగా కోసి.. లెమన్ గ్రాస్, అల్లం కలిపిన నీళ్లలో గంటసేపు ఉడకబెట్టి పోల్ పాట్‌కి వడ్డించా'' అని చెప్పారు.
ముస్సోలినీకి పచ్చి వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్‌తో చేసిన సలాడ్ అంటే చాలా ఇష్టం. అది తన గుండెకు మంచిదని ఆయన భావించేవారు.
డోగ్రా ఇలా రాశారు, ''దాని వల్ల ఎప్పుడూ ఆయన నోటి నుంచి వెల్లుల్లి వాసన వచ్చేది, దీంతో భోజనం తర్వాత ఆయన భార్య మరో గదిలోకి వెళ్లిపోయేవారు.''

ఫొటో సోర్స్, Getty Images
హిట్లర్ భోజనాన్ని ముందే రుచిచూసే 'ఫుడ్ టెస్టర్'
యుగాండా అప్పటి అధ్యక్షుడు ఈదీ అమీన్ బతికున్నప్పుడు, తన ప్రత్యర్థులను చంపి వారి మాంసం తినేవారన్న ప్రచారం ఉండేది.
''మనిషి మాంసం తిన్నారా అని ఆయన్ను అడిగినప్పుడు, మనిషి మాంసమంటే నాకిష్టం లేదు, ఎందుకంటే, అది చాలా ఉప్పగా ఉంటుందని ఒకసారి సమాధానమిచ్చారు'' అని అనిత షురెవిక్జ్ తన ఆర్టికల్ ''డిక్టేటర్స్ విత్ స్ట్రేంజ్ ఈటింగ్ హ్యాబిట్స్''లో రాశారు.
ఈదీ అమీన్ రోజుకు 40 నారింజ పండ్లు తినేవారు, అవి కామోద్దీపనగా పనిచేస్తాయని ఆయన నమ్మేవారు.
హిట్లర్ భోజనం చేసే ముందు, ఆ ఆహారాన్ని ఫుడ్ టెస్టర్ తొలుత రుచి చూసేవారు.
'ది డెన్వర్ పోస్ట్' 2013 ఏప్రిల్ 27 సంచికలో హిట్లర్ ఫుడ్ టెస్టర్లలో ఒకరైన మార్గోట్ వోల్ఫ్ ఇలా రాశారు, ''హిట్లర్ భోజనం చాలా రుచికరంగా ఉండేది. తాజా కూరగాయలు వాడేవారు.''
''పాస్తా, లేదా అన్నంతో వాటిని వడ్డించేవారు. కానీ, అందులో విషం కలిపారేమోనన్న భయంతో తినేవాళ్లం, కాబట్టి ఆ ఆహారాన్ని ఆస్వాదించలేం. అదే మా చివరి రోజు అన్నట్లుగా ఉండేది.''

ఫొటో సోర్స్, Getty Images
బ్రష్ చేయని నియంత
చైనాకు చెందిన మావో తన జీవితంలో పళ్ళు తోముకోలేదని చెప్తారు.
''మావో బ్రష్ చేసుకోవడానికి బదులు గ్రీన్ టీతో పుక్కిలించేవారు. చివరి దశలో ఆయన దంతాలన్నీ పచ్చగా మారిపోయి, చిగుళ్లు చీముతో నిండిపోయాయి'' అని మావోకి వైద్యుడిగా పనిచేసిన జిసుయి లీ తన పుస్తకం 'ప్రైవేట్ లైఫ్ ఆఫ్ చైర్మన్ మావో'లో రాశారు.
ఒకసారి డాక్టర్ బ్రష్ చేసుకోమని ఆయనకు సలహా ఇస్తే.. ''సింహం పళ్లు తోముకోదు, అయినా దాని పళ్ళు ఎందుకంత పదునుగా ఉంటాయి?'' అని సమాధానమిచ్చారు.
జనరల్ నే విన్ 1988 వరకూ, దాదాపు 26 ఏళ్లు బర్మా(ఇప్పుడు మియన్మార్)ను పాలించారు. గోల్ఫ్, జూదం, ఆడవాళ్లంటే బాగా ఇష్టపడే జనరల్ విన్‌కి వెంటనే కోపం వచ్చేది.
''ఆయనకు ఒక జ్యోతిష్కుడు 9వ నంబర్ అయితే మీకు అదృష్టమని చెప్పాడు. దీంతో ఆయన దేశంలో చలామణిలో ఉన్న 100 క్యాట్ నోట్లు మొత్తం ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. వాటి స్థానంలో 90 క్యాట్ నోట్లను ప్రవేశపెట్టారు''
"ఫలితంగా బర్మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, ప్రజలు తాము జీవితాంతం సంపాదించనదంతా కోల్పోయారు'' అని రాజీవ్ డోగ్రా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అల్బేనియా నియంతకు 'బాడీ డబుల్'
అల్బేనియాకు చెందిన ఎన్వర్ హోక్జా 1944 నుంచి 1985 వరకు అధికారంలో ఉన్నారు.
తమ దేశంపై దాడి జరుగుతుందేమోనని ఆయనెప్పుడూ భయపడేవారు. దాడి జరిగితే రక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా 75 వేల బంకర్లను నిర్మించారు.
బ్యాంకు నోట్లపై తన చిత్రాన్ని ముద్రించేందుకు కూడా ఎన్వర్ నిరాకరించారు. అది తనపై క్షుద్ర ప్రయోగాలు చేసేందుకు దారితీస్తుందేమోనన్న భయం ఆయనకు ఉండేది.
బ్లెండీ ఫెవ్‌జివూ తన పుస్తకం ''ఎన్వర్ హోక్జా, ది ఐరన్ ఫిస్ట్ ఆఫ్ అల్బేనియా'లో ఇలా రాశారు.
''తనను హత్య చేస్తారేమోనని ఆయన చాలా భయపడేవారు. తన కోసం బాడీ డబుల్‌ని సిద్ధం చేశారు. ఆయనకు దగ్గరి పోలికలున్న వ్యక్తిని గుర్తించి, తీసుకొచ్చారు. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించి, ఎన్వర్‌లా సిద్ధం చేశారు. ''బాడీ డబుల్‌కి ఆయనలాగే నడవడం నేర్పించారు. ఆ బాడీ డబుల్ అనేక ఫ్యాక్టరీలను ప్రారంభించారు, ప్రసంగాలు కూడా ఇచ్చారు'' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తుర్క్‌మెనిస్తాన్, హైతీ నియంతలు
పేద దేశమైన తుర్క్‌మెనిస్తాన్ నియంత సపర్మురత్ నియాజోవ్, బంగారు పోత పోయించిన 50 అడుగుల ఎత్తైన తన విగ్రహాన్ని దేశ రాజధానిలో ఏర్పాటు చేశారు.
అలాగే, రుహ్నామా అనే పుస్తకం కూడా రాశారు. తన పుస్తకం పూర్తిగా చదివి గుర్తుపెట్టుకున్న వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
బహిరంగ సభలు, టీవీల్లో మ్యూజిక్ ప్లే చేయడాన్ని నిషేధించారు.
హైతీ నియంత ఫ్రాంకోయిస్ డువాలియర్‌కి మూఢనమ్మకాలు ఎక్కువ. తన దేశంలోని నల్ల కుక్కలన్నింటినీ చంపమని ఆదేశాలిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈదీ అమీన్, ఎన్వర్ హోక్జా క్రూరత్వం
''1970లలో, తన రాజకీయ ప్రత్యర్థుల తలలు నరికి ఫ్రిజ్‌లో ఉంచేవాడినని యుగాండాకి చెందిన క్రూరమైన నియంత ఈదీ అమీన్ పేర్కొన్నారు'' అని రాజీవ్ డోగ్రా రాశారు.
''అమీన్ ఎనిమిదేళ్ల పాలనలో 80 వేల మందిని చంపేశారు. వారిలో బ్యాంకర్లు, మేధావులు, జర్నలిస్టులు, కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధాని కూడా ఉన్నారు''
అలాగే, అల్బేనియన్ నియంత ఎన్వర్ హోక్జా కూడా తన ప్రత్యర్థులను వదల్లేదు.
''ఆయన ఎంతమంది మేధావులను హత్య చేశారంటే, తాను చనిపోయే సమయానికి పొలిట్‌బ్యూరోలో హైస్కూల్ దాటి చదివిన వారు ఒక్కరు కూడా లేరు'' అని బ్లెండీ ఫెవ్‌జివూ రాశారు.
అల్బేనియా పౌరులు తమ పిల్లలకు, తమకు ఇష్టం వచ్చిన పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
సద్దాం హుస్సేన్ ఫైరింగ్ స్క్వాడ్
అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల తర్వాత ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, 1979 జులై 22న బాథ్ సోషలిస్ట్ పార్టీ నాయకుల సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆయన ఆదేశాల మేరకు, ఈ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఆ సమావేశంలో ఉన్న 66 మంది పార్టీ నేతలు దేశద్రోహులుగా తేలిందని సద్దాం హుస్సేన్ ప్రకటించారు.
"నాయకుడి పేరు పిలవగానే, గార్డులు వెనుక నుంచి వచ్చి వారిని ఆ హాల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. చివరికి, ఆ హాల్‌లో మిగిలిపోయిన వారు భయంతో వణికిపోయారు" అని కాన్ కఫ్లిన్ తన పుస్తకం 'సద్దాం ది సీక్రెట్ లైఫ్'లో రాశారు.
''వారు లేచి నిల్చుని సద్దాం హుస్సేన్‌కు తమ విధేయతను ప్రకటించారు. అయినా, 22 మందిని ఫైర్ స్క్వాడ్ ముందు వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. ఆ తర్వాత దేశమంతా సద్దాం హుస్సేన్ వశమైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన విజయం సాధించారు" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














