ఝార్ఖండ్ ఎన్నికలు: యూనిఫాం సివిల్ కోడ్ నుంచి గిరిజనులకు మినహాయింపు ఇస్తామని అమిత్ షా ఎందుకు అన్నారు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
- హోదా, రాంచీ నుంచి బీబీసీ హిందీ కోసం
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) అంశంపై చర్చ జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ''ఝార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే యూసీసీ అమలు చేస్తాం. కానీ, గిరిజనులకు మినహాయింపు ఉంటుంది'' అన్నారు.
షా వ్యాఖ్యలపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందిస్తూ.. ''ఝార్ఖండ్‌లో చోటా నాగ్‌పూర్ టెనెన్సీ (సీఎన్‌టీ), సంథాల్ పరగణ టెనెన్సీ(ఎస్‌పీటీ) చట్టాలు మాత్రమే అమలవుతాయి. యూసీసీ, ఎన్‌ఆర్‌సీ కాదు'' అన్నారు.
అయితే, ఈ విషయంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ యూసీసీ అంశాన్ని తెరపైకి తెస్తోందనే వాదన ఒకటి కాగా, గిరిజనులకు మినహాయింపు ఎందుకు? అనేది రెండోది.

నిపుణులు ఏం చెబుతున్నారు?
యూసీసీపై సీనియర్ న్యాయవాది షాదాబ్ అన్సారీ మాట్లాడుతూ, ''యూసీసీ అమలు చేస్తే వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాల వంటి విషయాల్లో వారి కులం, మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది'' అన్నారు.
అయితే, దేశంలోని అన్ని రకాల సమాజాలకూ ఒకే చట్టం లేదా నిబంధనలు వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
''ప్రతి కులం లేదా మతంలోనూ వారికి ప్రత్యేకమైన జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఏ కులం కానీ, మతం కానీ యూసీసీ పేరుతో వాటిలో జోక్యాన్ని అంగీకరించదు. ఆదివాసీలను యూసీసీ నుంచి మినహాయిస్తామని అమిత్ షా చెప్పడానికి ఇదే కారణం, వారి నుంచి వ్యతిరేకత రాకూడదని'' అన్నారాయన.
అమిత్ షా వ్యాఖ్యలపై ఝార్ఖండ్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆదివాసీ నాయకుడు ప్రభాకర్ తిర్కీ స్పందిస్తూ, ''యూసీసీ నుంచి ఆదీవాసీలకు మినహాయింపు అమిత్ షా ఇచ్చింది కాదు, 1996లో భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పెసా చట్టం (PESA) ఆదీవాసీలను యూసీసీ నుంచి మినహాయిస్తుంది'' అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఏమిటీ PESA చట్టం?
పెసా అంటే, పంచాయత్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్.
పంచాయతీరాజ్ వ్యవస్థను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ 1996లో ఈ పెసా చట్టాన్ని తీసుకొచ్చారు.
పెసా చట్టం ప్రకారం, గిరిజన ప్రాంతాల పరిధిలోకి వచ్చే ఏరియాల్లో దేశంలోని సాధారణ చట్టాలు వర్తించవు, పెసా మాత్రమే వర్తిస్తుంది.
ఈ చట్టం ప్రకారం, గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, వారి సాంస్కృతిక గుర్తింపు, ఆ ప్రాంతాల్లోని సహజ వనరులు, సంప్రదాయ వివాద పరిష్కార పద్ధతులను పరిరక్షించే బాధ్యత గ్రామ సభకి అప్పగించారు.
''పెసా చట్టం కారణంగా, యూసీసీ నుంచి ఆదివాసీలకు మినహాయింపు ఉంటుంది. అయితే, భవిష్యత్తులో యూసీసీని ఆదివాసీలపై బలవంతంగా రుద్దరని ఎంతవరకూ విశ్వసించగలం?'' అని ప్రభాకర్ తిర్కీ అన్నారు.
ఆదివాసీ నేత ప్రభాకర్ తిర్కీ అభిప్రాయంతో గిరిడీహ్ ఎమ్మెల్యే సుదివ్య కుమార్ సోను ఏకీభవించారు. యూసీసీ నుంచి గిరిజనులను మినహాయిస్తామని బీజేపీ ఎంత చెప్పినా, ఒక్కసారి యూసీసీ అమలైతే దాని ప్రభావం గిరిజనులపై, గిరిజన సంప్రదాయ చట్టాలపై తప్పకుండా ఉంటుందని సోను చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ మాట్లాడుతూ, ''గిరిజనులు యూసీసీ పరిధిలోకి రారని మేం ఇప్పటికే చెప్పాం. అందువల్ల, వారి సంప్రదాయ చట్టాల్లో జోక్యం ఉండదు'' అన్నారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
ఝార్ఖండ్ హైకోర్టు న్యాయవాది షాదాబ్ అన్సారీ మాట్లాడుతూ.. ''యూసీసీని కనుక సిద్ధం చేస్తున్నట్లయితే, కొన్ని వర్గాలు, మతాలను దాని నుంచి ఎలా మినహాయిస్తారు, అలా మినహాయిస్తే అది యూనిఫాం సివిల్ కోడ్ ఎలా అవుతుంది?'' అని ప్రశ్నించారు.
దీనికి బీజేపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ, ''ఆదివాసీలకు పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ, ఇప్పటికీ వారు పురోగతి సాధించలేకపోయారు.''
''ఈ పరిస్థితుల కారణంగా, వారు స్వేచ్చాయుత జీవనం సాగించేందుకు, అభివృద్ధి చెందేందుకు సంప్రదాయ చట్టాలు అవసరం. అయితే, మిగిలిన పౌరులను ఏకీకృతం చేసే ప్రయత్నమే యూసీసీ'' అన్నారు.
అయితే, ఈ తీవ్ర చర్చల నడుమ తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే.. ఝార్ఖండ్‌లో యూసీసీ ఎందుకు?

ఫొటో సోర్స్, ANI
ఇది జన్ సంఘ్ కాలం నుంచి బీజేపీ జాతీయ అజెండాలో ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రతుల్ చెప్పారు.
''ఝార్ఖండ్‌లో యూసీసీ చట్టం లేకపోవడం వల్ల, బంగ్లాదేశ్ చొరబాటుదారులు లవ్ జిహాద్‌కి పాల్పడుతూ అమాయక గిరిజన బాలికలను ఆకర్షించి నాలుగేసి వివాహాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజనుల భూములతో ల్యాండ్ జిహాద్ చేస్తారు. వాటితో పాటు, గిరిజనులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో తమ భార్యలను పోటీకి నిలపడం ద్వారా పొలిటికల్ జిహాద్‌కి పాల్పడతారు'' అని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఝార్ఖండ్‌లో యూసీసీని అమలు చేయడం చాలా అవసరమని ప్రతుల్ అన్నారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సుదివ్య కుమార్ సోను మాట్లాడుతూ, ''బంగ్లాదేశీయులుగా చెబుతున్న సంథాల్ పౌరులు చేసిన తప్పేంటంటే, వాళ్లంతా ముస్లింలు కావడం.. అందులోనూ వారంతా బెంగాలీ మాట్లాడడం. అందుకే వారిని బంగ్లాదేశీయులు అని సంబోధిస్తున్నారు. అయితే, వారు తరతరాలుగా సంథాల్‌లోనే నివస్తిస్తున్నారు. వారు బంగ్లాదేశీయులు కాదు'' అన్నారు.
ప్రభాకర్ తిర్కీ మాట్లాడుతూ, ''ఝార్ఖండ్‌లో యూసీసీ అవసరం లేదు. యూసీసీ పేరుతో ముస్లింలను టార్గెట్ చేసి, ముస్లిమేతర ఓట్లను బీజేపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం'' అన్నారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
అక్కడి ముస్లింలు ఏమంటున్నారు?
సున్నీ ముస్లిం సంస్థ అయిన ఇదారా - ఇ - షరియాకి చెందిన నాయబ్ ఖాజీ, మౌలానా శంషాదుల్ ఖాద్రీ మాట్లాడుతూ ''ఇది యూసీసీ సాకుతో ఝార్ఖండ్ ముస్లింలను భయపెట్టే ప్రయత్నం మాత్రమే'' అన్నారు.
ట్రిపుల్ తలాక్‌పై ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిందని, అలాంటప్పుడు ఏ ముస్లిమైనా నాలుగేసి పెళ్లిళ్లు ఎలా చేసుకోగలడని ఆయన ప్రశ్నిస్తున్నారు. యూసీసీ పేరుతో ముస్లింల జీవనోపాధిలో జోక్యం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ నేత ప్రతుల్ స్పందిస్తూ ''జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా యూసీసీ తీసుకొచ్చారని, అదేమీ ఎలక్షన్ స్టంట్ కాదు'' అన్నారు.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ముస్లిం జనాభా దాదాపు 15 శాతం.
వాటిలో, 20కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు 20 నుంచి 40 శాతం వరకూ ఉన్నారు. ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ముస్లిం జనాభా ఉంది.
సోషల్ యాక్టివిస్ట్ షమీమ్ అలీ మాట్లాడుతూ, ''జామ్‌తారా, పాకూర్, రాజ్‌మహల్ వంటి స్థానాల్లో ముస్లిం జనాభా 35 శాతానికి పైగా ఉందని అంచనా. గోడ్డా, మధుపూర్‌లలో దాదాపు 26 శాతం, టుండీ, గాండేయ్ వంటి స్థానాల్లో 23 శాతం ఉంటుందని అంచనా''
అయితే, ఈ యూసీసీ వంటి పదాలు వాడడం రాజకీయంగా కొన్నివర్గాల ఏకీకరణకు ఉపయోగపడుతుందని షమీమ్ అలీ అభిప్రాయపడ్డారు.
''దానికి భయపడి సెక్యులర్ పార్టీలు ముస్లింలకు టికెట్లు ఇచ్చేందుకు భయపడుతున్నాయి. అందుకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి 8 మంది ముస్లింలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కేవలం ఐదుగురు ముస్లింలకు మాత్రమే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చింది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
స్థానికులు ఏమంటున్నారంటే..
యూసీసీ ప్రకటన ముస్లిం - గిరిజనుల మధ్య చీలిక కోసం చేస్తున్న ప్రయత్నమని, అది ఫలించబోదని ఖుంటీ జిల్లాకు చెందిన గులాం గౌస్ అంటున్నారు. ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
దుమ్కా నివాసి సునీల్ కుమార్ మరాండీ మాట్లాడుతూ, ''ఈ ఎన్నికల్లో యూసీసీని తెరపైకి తెచ్చి ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. అది అమలైతే భవిష్యత్తులో గిరిజనులకు కూడా ప్రమాదమే. ఎందుకంటే, యూసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత సీఎన్‌టీ - ఎస్‌పీటీ వంటి చట్టాలనూ తారుమారు చేసే అవకాశం ఉండడంతో, మన ఖనిజ సంపద తరలించుకుపోయే ప్రమాదం ఉందన్న భయాందోళనలు ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా గిరిజనులుగా వాటిని నమ్మడానికి మేం సిద్ధంగా లేం'' అన్నారు.
ఈ ఎన్నికల్లో యూసీసీ అంత బలమైన అంశం కాబోదని, యూసీసీ వల్ల ఓటర్లు ఏకమయ్యే అవకాశం లేదని హజారీబాగ్‌కు చెందిన ప్రొఫెసర్ గజేంద్ర కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే, ఝార్ఖండ్‌లో చొరబాటుదారుల సంఖ్యను తగ్గించేందుకు యూసీసీ అమలు చేయాలని కూడా ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














