శ్రీలంక: పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధ్యక్షుడు దిసనాయకే కూటమికి భారీ విజయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్, స్వామినాథన్ నటరాజన్, ఇషార దానశేఖర
- హోదా, బీబీసీ ప్రతినిధులు
శ్రీలంక పార్లమెంటు ఎన్నికలలో అనురకుమార దిసనాయకే కూటమి భారీ విజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి 159 సీట్లను గెలుచుకుంది. ఇది పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ.
సెప్టెంబరులో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దిసనాయకే (55)కు అవినీతిపై పోరాడటానికి, ఆర్థిక సంక్షోభం తర్వాత దేశంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఈ స్పష్టమైన మెజారిటీ అవసరం.
దేశంలో అధిక జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) ఇక్కడి ఓటర్ల ప్రధాన ఆందోళన.
ఎన్‌పీపీ కూటమి ఎన్నికలలో గెలుస్తుందని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. అయితే కూటమి సంస్కరణలను ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సీట్లు సాధిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా ఉండేది.
మునుపటి పార్లమెంటులో దిసనాయకే పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ)కు కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎన్‌పీపీ కూటమిలో జేవీపీ కీలకం.
"ఇవి శ్రీలంకలో పెద్ద మార్పును తీసుకువచ్చే కీలకమైన ఎన్నికలు" అని ఎన్నికల ప్రచారంలో దిసనాయకే వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే చేతిలో ఓడిన సాజిత్ ప్రేమదాస ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించారు.


ఫొటో సోర్స్, Getty Images
ముందస్తు ఎన్నికలు..
దిసనాయకే అధ్యక్షుడు అయిన వెంటనే తన ప్రణాళికలకు మద్దతు పొందడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
"ప్రజలు కోరుకునే దానికి ప్రాతినిధ్యం వహించని పార్లమెంటుతో ప్రయోజనం లేదు" అని ఆయన అన్నారు.
గతంలో పాలించిన రాజపక్స కుటుంబానికి చెందిన ముఖ్యమైన సభ్యులతో సహా దాదాపు మూడింట రెండు వంతుల పాత ఎంపీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
పార్లమెంట్‌లోని 225 స్థానాల్లో 196 స్థానాలకు ఎంపీలను ఓటర్లు ఎన్నుకుంటారు. మిగిలినవి దామాషా ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగించి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే దాని ఆధారంగా పార్టీలకు కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
2022 అంతా మార్చేసింది..
శ్రీలంకలో 2022లో అధిక ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధనం కొరత కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయవలసి వచ్చింది.
ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే అధికారంలోకి వచ్చారు. అనంతరం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి శ్రీలంక 3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.25,000 కోట్లు బెయిలవుట్ ప్యాకేజీ పొందింది. అయితే చాలామంది శ్రీలంక వాసులు ఇప్పటికీ కష్టాల్లో ఉన్నారు.
‘‘మేము ఇప్పటికీ అదే సమస్యలను ఎదుర్కొంటున్నాం. మా రోజువారీ అవసరాలకు తగినంత డబ్బు కూడా లేదు’’ అని కొలంబో సమీపంలోని కటునాయకే ఫ్రీ ట్రేడ్ జోన్‌లో గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికురాలైన మంజుల దేవి(26) బీబీసీతో చెప్పారు.
గత నాలుగేళ్లలో శ్రీలంకలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 25.9 శాతానికి చేరింది. 2024లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
దిసనాయకేనే ఎందుకు గెలిపించారు?
శ్రీలంక ఓటర్లు సంప్రదాయ రాజకీయ నాయకులతో విసుగెత్తారు. ఇదే 2024 సెప్టెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో దిసనాయకేకు సహాయపడింది.
ఆయన పార్టీ బలమైన ప్రభుత్వ ప్రమేయం, తక్కువ పన్నులు, వామపక్ష ఆర్థిక విధానాలకు మద్దతుగా ప్రచారం చేసింది. దిసనాయకేకు శ్రీలంక ఓటర్లు పట్టం కట్టారు. 50 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలిచి శ్రీలంక అధ్యక్షుడైన మొదటి వ్యక్తి ఆయనే.
ప్రతిపక్షాలలోని చాలామంది నాయకులు, పార్టీలు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోవడం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం ఆయనకు కలిసొచ్చింది. దిసనాయకే కూటమి ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేస్తుందని పలువురు నమ్ముతున్నారు.
ప్రతిపక్షాలతో పోలిస్తే జేవీపీ నేతృత్వంలోని కూటమి మరింత శక్తిమంతమైన, సమర్థవంతమైన ప్రచారం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే, హామీలను నెరవేర్చడానికి ఇపుడు కూటమి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోనుంది. దేశ రుణం తీర్చుకుంటానని, ఇక్కడి రాజకీయ సంస్కృతిని మారుస్తానని, గత ప్రభుత్వాల అవినీతిపై చర్యలు తీసుకుంటానని దిసనాయకే ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేశారు.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీనమైన స్థితిలో ఉంది. ఇపుడైతే ప్రజలకు ప్రాథమిక వస్తువులు, సేవలు అందించడంపైనే ప్రధాన దృష్టి ఉంది. శ్రీలంకను ముందుకు తీసుకెళ్లడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














