వివేక్ రామస్వామి ఎవరు? అమెరికాలో కీలక స్థానానికి ఎలా ఎదిగారు?

వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు ప్రయత్నించిన భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీఈ) అధిపతిగా భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని నియమిస్తున్నట్టు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి వివేక్ రామస్వామి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డీఓజీఈ అధిపతులుగా వీరిద్దరిని ట్రంప్ నియమించారు.

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక స్థానాల భర్తీపై సన్నాహాలు ముమ్మరం చేశారు. తాజాగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిల నియామకానికి సంబంధించిన ప్రకటన చేశారు.

ఈ ప్రకటన చేసే క్రమంలో ఎలాన్ మస్క్‌ను ‘ గ్రేట్ ఎలాన్‌ మస్క్’ అని, వివేక్ రామస్వామిని ‘అమెరికా దేశభక్తుడు’ అని ట్రంప్ అభివర్ణించారు.

ఎలాన్ మస్క్‌తో కలిసి ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణంపై వివేక్ రామస్వామి దృష్టిసారించనున్నారు. అనవసరమైన నియమ నిబంధనలు తొలగించేందుకు, ప్రభుత్వం చేసే దుబారా ఖర్చులను నియంత్రించేందుకు వీరు కృషి చేయనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, Reuters

వివేక్ రామస్వామి నేపథ్యం ఏంటంటే..

అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో జన్మించిన వివేక్ రామస్వామి వయసు 39 ఏళ్లు. ఆయన రచయిత, పారిశ్రామికవేత్త. హార్వర్డ్, యేల్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. బయోటెక్నాలజీ రంగంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. 'Woke, Inc.' అనే పుస్తకాన్ని రాశారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు మొదట్లో ఈయన ప్రయత్నించారు. కొన్ని నెలల పాటు ప్రచారం కూడా చేశారు. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని, ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు 2024 జనవరిలో ప్రకటించారు.

‘సరికొత్త అమెరికా’ కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు పెట్టాలని వివేక్ రామస్వామి అనుకున్నారు.

వివేక్ స్థాపించిన బయోటెక్ కంపెనీ పేరు ‘రోవాంట్ సైన్సెస్’. ఈ సంస్థ విలువ సుమారు ఏడు బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 59,068 కోట్లు.

గొంతు శస్త్రచికిత్స నిపుణురాలు అపూర్వను వివేక్ రామస్వామి వివాహం చేసుకున్నారు. ఒహయో స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ ఆమె పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

వివేక్ రామస్వామి కుటుంబం

ఫొటో సోర్స్, RAMASWAMY CAMPAIGN

వివేక్ రామస్వామి కుటుంబం

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, కేరళ నుంచి అమెరికా వెళ్లిన దంపతులకు వివేక్ రామస్వామి జన్మించారు.

ఆయన తండ్రి వి. గణపతి రామస్వామి. కేరళలోని కాలికట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి గీతా రామస్వామి అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పని చేశారు.

“మా అమ్మ అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. మా నాన్న మాత్రం ఇంకా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు” అని వివేక్ రామస్వామిలో 2023లో జరిగిన అయోవా స్టేట్ ఫెయిర్‌లో తెలిపారు.

వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, Vivek2024.com

ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామి ఒక పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు

రాజకీయ పదవులు చేపట్టిన అనుభవం లేకుండానే..

ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ ) విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు. సమాజంపై, పర్యావరణంపై ఒక కంపెనీ ఎలాంటి ప్రభావం చూపిస్తోందనే దానికి ఈఎస్‌జీ ఒక సూచిక.

అంతే కాకుండా, ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా అర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని వివేక్ అభిప్రాయపడ్డారు.

విశ్వాసం, దేశభక్తి, కఠోర శ్రమల స్థానాల్లో కొత్తగా కోవిడిజం, క్లైమేటిజం, జెండర్ ఐడియాలజీ వంటివి వచ్చి చేరాయని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యానించారు.

డీఓజీఈ పదవి కంటే ముందు వివేక్ రామస్వామికి ఎలాంటి రాజకీయ పదవి చేపట్టిన అనుభవం లేదు.

హెచ్1బీ వీసాపై వివేక్ రామస్వామి వైఖరి

తాను అధికారంలోకి వస్తే హెచ్‌1బీ వీసా పద్ధతిని రద్దు చేస్తానని అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు అంటే నిరుడు వివేక్ రామస్వామి అన్నారు.

హెచ్‌1బీ వీసాలు లాటరీ పద్ధతిలో కాకుండా మెరిట్ ద్వారా ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పారు.

కుటుంబ సభ్యులుగా అమెరికా వస్తున్న వలసవాదులందరూ ఈ దేశానికి నైపుణ్యం అందించడానికి వచ్చే తెలివైన వ్యక్తులు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి వలసలను అమెరికా అడ్డుకోవాలని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)