రెండు రోజులుగా భర్త కూర్చుంటున్న సోఫా కిందే భార్య మృతదేహం

హత్య, సోఫా, నిందితులు
    • రచయిత, ప్రియాంక జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పనికి వెళ్లి తిరిగి వచ్చిన భర్తకు ఇంట్లో భార్య కనిపించలేదు. ఆమె కోసం ఆయన చాలా వెతికారు. రెండు రోజులైంది. కానీ తాను రోజూ కూర్చుని, పడుకునే సోఫా కిందే తన భార్య విగతజీవిగా పడి ఉన్నారని ఆయనకు తెలియదు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి, మృతదేహాన్ని సోఫా కమ్ బెడ్‌లో దాచి ఉంచాడు ఓ దుండగుడు. పుణెలో హడాప్సర్ ప్రాంతంలోని ఫుర్సుంగిలో ఈ ఘటన జరిగింది.

హత్యకు గురైన స్వప్నాలి వయస్సు 24 ఏళ్లు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్నాలి భర్త పని కోసం ఊరికి వెళ్లారు. స్వప్నాలి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆమె భర్త బయటికి వెళ్లగానే ఇంట్లోకి వచ్చిన ఓ దుండగుడు స్వప్నాలిని హత్య చేసి, మృతదేహాన్ని దాచిపెట్టాడు.

నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు బీబీసీకి తెలిపారు.

స్వప్నాలి భర్త ఉమేష్ పవార్ ఒక క్యాబ్ డ్రైవర్. ప్రయాణికులను బీడ్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు ఉమేష్. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు భార్య కనిపించలేదు. చాలా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. ఉమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హడాప్సర్, పోలీస్ స్టేషన్, పోలీసులు

ఫొటో సోర్స్, punepolice.gov.in

ఫొటో క్యాప్షన్, హడాప్సర్ పోలీస్ స్టేషన్

అసలు ఏమైంది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్నాలి, ఉమేష్‌ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హడాప్సర్ ప్రాంతంలో ఫుర్సుంగిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

క్యాబ్ డ్రైవర్ అయిన ఉమేష్ 7వ తేదీన బీడ్ ప్రాంతానికి వెళ్లారు. ఆ రోజు స్వప్నాలితో ఉమేష్ మాట్లాడారు.

మరుసటి రోజు స్వప్నాలికి పదే పదే ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఉమేష్ తన స్నేహితుల్లో ఒకరికి ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లి స్వప్నాలి గురించి తెలుసుకోవాలని అడిగారు.

ఆయన స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా స్వప్నాలి ఇంట్లో లేరని తెలిసింది. దీంతో ఉమేష్ 8వ తేదీన బీడ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. తలుపు బయటి నుంచి గడియ వేసి ఉంది.

తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులను స్వప్నాలి గురించి అడిగారు. కానీ ఆమె గురించిన సమాచారం లభించలేదు. దీంతో ఉమేష్ తన భార్య కోసం వెతకడం మొదలుపెట్టారు.

మృతదేహం, క్రైమ్

ఫొటో సోర్స్, Getty Images

మృతదేహం ఎలా దొరికింది?

"ఉమేష్ తన భార్య కోసం రెండు రోజులు వెతికారు. ఆ తర్వాత 9వ తేదీన నగలేమైనా పోయాయా అని ఇంట్లో వెతకడం ప్రారంభించారు" అని ఫుర్సుంగి పోలీస్ ఇన్‌స్పెక్టర్ మంగళా మోద్వే బీబీసీతో చెప్పారు.

ఆ సమయంలోనే సోఫా కమ్‌ బెడ్‌లోని కంపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉన్న స్వప్నాలిని గుర్తించారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు ఉమేష్.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం స్వప్నాలిని గొంతు నులిమి హత్య చేశారని, ఆమె మెడపై గోళ్ల గీతలు కూడా ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ మంగళా మోద్వే తెలిపారు.

ఉమేష్‌ నిద్రిస్తున్న సోఫా కిందే ఆయన భార్య శవాన్ని దుండగుడు దాచిపెట్టాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

మృతదేహం, హత్య, వివాహేతర సంబంధం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు చంపారు?

7వ తేదీన జరిగిన స్వప్నాలి హత్య వెనుక వారి కుటుంబానికి తెలిసిన వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

"ఒక వ్యక్తి స్వప్నాలి ఇంటికి తరచుగా వస్తుండేవారని, అతను వచ్చాక ఇంట్లో గొడవలు జరుగుతుండేవని ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఆయనను అంకుల్ అంటూ ఉమేష్ పిలిచేవారని చెప్పారు. అయితే ఆయన వారి బంధువు కాదని విచారణలో తేలింది" అని మంగళా మోద్వే చెప్పారు.

వివాహేతర సంబంధం కారణంగానే స్వప్నాలి హత్యకు గురయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘‘స్వప్నాలి భర్త ఉమేష్ పవార్ మద్యానికి బానిసై ఇంటిపట్టున ఎక్కువగా ఉండేవారు కాదు. అలాగే క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుండటం వల్ల ఇంటికి దూరంగా ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చేది. దీంతో ఆ వ్యక్తి స్వప్నాలి ఇంట్లో వచ్చి చాలాసేపు ఉండేవారు. స్వప్నాలి మరొక పురుషుడితో ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం అనుమానితుడు గమనించి, ఆమెతో గొడవపడి ఉండవచ్చు. ఆ కోపంతోనే స్వప్నాలి గొంతు నులిమి హత్య చేసుంటాడు’’ అని మంగళా మోద్వే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

"అయితే, అసలు ఏం జరిగిందన్నది ఖచ్చితంగా చెప్పడం కష్టం. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది" అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

"అనుమానితుడి పేరు ఇప్పుడే చెప్పలేం. రెండు పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. బీడ్ జిల్లాలోని గెవ్రాయ్‌లో మా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. స్వప్నాలి మృతదేహం దొరికినప్పటి నుంచి ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అందుకే నిందితుడి ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతోంది" అని ఆమె తెలిపారు.

హత్య జరిగిన సమయంలో ఆ భవనంలో సెక్యూరిటీ గార్డు లేరు. అక్కడ సీసీటీవీ కూడా లేదు. భవనానికి వెళ్లే దారిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)