రాజీవ్ గాంధీ హయాంలో ప్రధాని కార్యాలయంలోని అత్యంత రహస్య సమాచారం విదేశాలకు ఎలా చేరేది? ఏమిటి ఆ కుంభకోణం

కుమార్ నారాయణ్

ఫొటో సోర్స్, Bloomsbury India

ఫొటో క్యాప్షన్, కుమార్ నారాయణ్ అరెస్ట్(ఫైల్ ఫొటో)
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ హిందీ

భారత రాజకీయాల్లో 1985 జనవరి నెలకు ప్రత్యేకస్థానం ఉంది. ఆ సమయంలో రాజకీయాల్లో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రధాన కార్యదర్శి పీసీ అలెగ్జాండర్ తన పదవికి రాజీనామా చేశారు.

భారత్ విజ్ఞప్తి చేయడంతో దిల్లీ నుంచి ఫ్రాన్స్ తన రాయబారిని వెనక్కి పిలిపించింది. చెకోస్లొవేకియా, పోలండ్, తూర్పు జర్మనీ దౌత్యవేత్తలను దిల్లీ రాయబార కార్యాలయాల నుంచి బహిష్కరించారు.

వీటన్నింటి వెనక కారణం ఒక నిఘా కుంభకోణం. ఈ కుంభకోణానికి భారత ప్రధానమంత్రి కార్యాలయంతో సంబంధాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. దీన్ని భారత మీడియా ‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో ద్రోహం’’ అనే పేరుతో పిలిచింది.

ఈ కుంభకోణంలో రాజీవ్ గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీసీ అలెగ్జాండర్ వ్యక్తిగత కార్యదర్శి టీఎన్ ఖేర్, పీఏ మల్హోత్రా, ఆయన ప్యూన్ పేర్లు కూడా వినిపించాయి.

జనవరి 16 అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ టీఎన్ ఖేర్‌ను తొలుత అరెస్టు చేసింది.

ఉదయానికి పీఏ మల్హోత్రా, పీఎంవో ప్యూన్ కూడా అరెస్టయ్యారు.

ప్రభుత్వ రహస్య పత్రాలను భారతీయ వ్యాపారవేత్త కుమార్ నారాయణ్ ద్వారా ఆయన విదేశీ ఏజెంట్లకు పంపారని ఆరోపణలొచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిఘా కుంభకోణంపై పుస్తకం రాసిన కల్లోల్ భట్టాఛార్జీ

ఫొటో సోర్స్, Kallol Bhattacherjee

ఫొటో క్యాప్షన్, కుమార్ నారాయణ్ ద్వారా కొందరు కీలక ప్రభుత్వ సమాచారాన్ని విదేశాలకు చేరవేసేవారు.

స్టెనోగ్రాఫర్లు, ప్రైవేట్ సెక్రటరీల దగ్గర భారీగా సమాచారం

కుమార్ నారాయణ్ 1925లో కోయంబత్తూర్‌లో జన్మించారు. 1949లో దిల్లీ వచ్చిన ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్టెనోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించారు.

ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంజినీరింగ్ సామగ్రి తయారీ కంపెనీ ఎస్‌ఎంఎల్ మనేక్‌లాల్‌లో చేరారు.

‘‘లైసెన్స్ పర్మిట్ రాజ్ సమయంలో ప్రభుత్వంలో పనిచేసే స్టెనోగ్రాఫర్లకు అనేక మంత్రిత్వ శాఖల రహస్య సమాచారం బాగా తెలిసేది’’ అని ఇటీవల ప్రచురితమైన ‘ఏ సింగ్యులర్ స్పై: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కుమార్ నారాయణ్’ అనే పుస్తకంలో కల్లోల్ భట్టాచార్జీ రాశారు.

‘‘స్టెనోగ్రాఫర్లు కేవలం టైపిస్టులు కాదని నారాయణ్‌కు తెలుసు. వాళ్లు వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటే.... తమ దగ్గరున్న సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరికన్నా అందించవచ్చు’’ అని ఆయన పుస్తకంలో రాశారు.

1985లో సంచలనం సృష్టించిన నిఘా కుంభకోణం

ఫొటో సోర్స్, Kallol Bhattacherjee

ఫొటో క్యాప్షన్, భార్యతో కుమార్ నారాయణ్

ప్రతి మంత్రిత్వశాఖలో కుమార్ నారాయణ్‌కు స్నేహాలు

1959లో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిన తర్వాత నారాయణ్ ప్రభుత్వంలో చిన్న చిన్న స్థాయిల్లో పనిచేసే వారితో ఒక రహస్య నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశారు.

అంతేకాదు...ఆరు యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ, చెకోస్లొవేకియా, సోవియట్ యూనియన్, పోలండ్ రాయబార కార్యాలయాలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు.

తర్వాత రహస్య, సున్నిత సమాచారానికి సంబంధించిన పత్రాలను ఆ రాయబార కార్యాలయాలకు అందించడం ప్రారంభించారు.

రహస్య సమాచారాన్ని విస్తృతంగా సేకరించడానికి కుమార్ నారాయణ్ శిక్షణ కూడా ఇచ్చారని టైమ్స్ ఆఫ్ ఇండియా 1985 జనవరి 28న రాసిన కథనంలో పేర్కొంది.

1985లో అనేక కార్పొరేట్ కంపెనీలకు లైజన్ ఆఫీసర్లుగా దాదాపు 2వేల మంది పనిచేసేవారు. వాళ్లల్లో కుమార్ నారాయణ్ కూడా ఒకరు.

ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయంతో పాటు ప్రతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలో కుమార్‌కు స్నేహితులుండేవారు. అరెస్టునాటికి కుమార్ నారాయణ్ అనేక ఆస్తులు సంపాదించారు. సంపన్నుడిగా మారారు. తనకు సమాచారం అందించేవారితో కుమార్ నారాయణ్‌కు సన్నిహిత సంబంధాలుండేవి. తనకు బాగా దగ్గరయినవారికి ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుండేవారు.

కుమార్ నారాయణ్‌ను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే పి.గోపాలన్ తండ్రిలా భావించేవారని దర్యాప్తులో తేలింది.

తాను చనిపోతే కుమార్ నారాయణ్‌కు చెప్పాలని పాస్‌పోర్టు ఆఫీసులో సమర్పించిన డాక్యుమెంట్‌లో గోపాలన్ రాశారు.

1985లో సంచలనం సృష్టించిన నిఘా కుంభకోణం

ఫొటో సోర్స్, Kallol Bhattacherjee

ఫొటో క్యాప్షన్, కుమార్ నారాయణ్‌పై పుస్తకం రాసిన కల్లోల్ భట్టాచార్జీ

శ్రీలంకతో సమావేశంలో లీకైన రహస్య పత్రాలు

దిల్లీలో భారత్, శ్రీలంక అధికారుల మధ్య జరిగిన సమావేశంలో పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం లీకవుతోందన్న ఆధారం కనిపించింది.

సమావేశం మొదలుకాగానే భారత అధికారులకు.. శ్రీలంక అధికారులు ఒక డాక్యుమెంట్ చూపించారు.

అది ‘‘రా’’ విభాగానికి చెందిన అతిపెద్ద రహస్యానికి సంబంధించిన పత్రం. శ్రీలంక గురించి భారత ప్రభుత్వం ఏమనుకుంటోందో ఆ డాక్యుమెంట్ తెలియజేస్తోంది.

‘ఆ డాక్యుమెంట్‌ను అక్కడ అలా చూడడం భారత్‌కు చాలా చికాకు తెప్పించింది. భారత్‌లో ఉన్నత స్థాయి అధికారుల కోసం తయారుచేసిన ఆ డాక్యుమెంట్ శ్రీలంకకు ఎలా చేరిందో అర్ధం కాక ఇంటెలిజెన్స్ అధికారులు షాకయ్యారు’’ అని ద వీక్ మ్యాగజైన్‌లో 1985 ఫిబ్రవరి 17న వినోద్ శర్మ, జీకే సింగ్ రాశారు.

ఆ డాక్యుమెంట్‌కు సంబంధించి మూడు కాపీలు మాత్రమే తయారుచేశారు. ‘‘రా’’ ఉన్నతాధికారుల దగ్గర రెండు కాపీలు ఉన్నాయి. ఒక కాపీని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు.

అంత రహస్య పత్రం కొలంబో ఎలా చేరిందో తెలుసుకోవాలని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణయించుకున్నారు.

‘‘ఒక ఫ్రెంచ్ అధికారి నారాయణ్ నెట్‌వర్క్ ద్వారా ఆ డాక్యుమెంట్లు సంపాదించి, వాటిని శ్రీలంకకు పంపారని తర్వాత దర్యాప్తులో తేలింది’’ అని వినోద్ శర్మ, జీకే సింగ్ చెప్పారు.

నిఘా కుంభకోణంతో సంచలనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిమిత్రి ఉస్తీనోవ్, సోవియట్ యూనియన్ మాజీ రక్షణ మంత్రి

ఫ్రాన్స్ నిఘా సంస్థతో కుమార్ నారాయణ్ సంబంధాలు

ఫ్రాన్స్ నిఘా సంస్థ కోసం నారాయణ్ పనిచేస్తున్నారని ఆయన అరెస్టుకు ముందు దర్యాప్తు అధికారులు చెప్పారు.

భారత్‌లో ఫ్రెంచ్ కార్పొరేట్, రక్షణ విషయాల గురించి సమాచారం సేకరించే బాధ్యతను నారాయణ్‌కు అప్పగించారు.

‘‘ఆ సమయంలో రక్షణ అవసరాల కోసం ఆయుధాలు సమకూర్చుకోవడంపై భారత్ దృష్టిపెట్టింది. భారత రక్షణ రంగ మార్కెట్ అందరికీ అందుబాటులోకొచ్చింది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది’’ అని కల్లోల్ భట్టాచార్జీ రాశారు.

ఫ్రెంచ్ నిఘా సంస్థ డీజీఎస్‌ఈ కోసం నారాయణ్ ఏడేళ్లనుంచి పనిచేస్తున్నారు. అలెగ్జాండ్రె డెమరెన్చె కాలంలో డీజీఎస్‌ఈతో నారాయణ్ అనుబంధం మొదలయింది. పియర్ మారియో ఆ సంస్థ హెడ్‌గా ఉన్న సమయానికి ఆ సంస్థతో నారాయణ్ అనుబంధం చాలా ఎక్కువైంది.

46 మిరాజ్ 2000-హెచ్, 13 మిరాజ్ 200-టీహెచ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సరఫరా చేయడానికి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది.

భారత రక్షణ మంత్రిత్వశాఖపై తాను ఒత్తిడి తెచ్చానని, దీనివల్ల ఫ్రాన్స్ భారత్‌కు మిరాజ్ విమానాలు అమ్మగలుగుతోందని, తన నాయకత్వంలో ఇది అతిపెద్ద విజయమని...కొన్ని సంవత్సరాల తర్వాత పియర్ మారియో సొంత గొప్పలు చెప్పుకున్నారు.

ఈ మొత్తం కార్యక్రమానికి ‘‘ఆపరేషన్ నికోబార్’’ అని పేరు పెట్టారు.

భారత్ ఈ ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో కుదుర్చుకోవడంలో గూఢచర్య కుంభకోణం ఉందని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ ఒప్పందానికి ముందు ఫ్రెంచ్ విమానాలకు బదులు తమ విమానాలు కొనాల్సిందిగా భారత్‌కు నచ్చజెప్పేందుకు సోవియట్ యూనియన్ తన రక్షణమంత్రి దిమిత్రి ఉస్తీనోవ్‌‌ను దిల్లీ పంపింది. కానీ దిమిత్రి భారత్‌ను ఒప్పించలేకపోయారు.

దిల్లీలో దక్షిణ బ్లాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర బారికేడ్లు

కుమార్ నారాయణ్‌పై అనుమానం

ఇందిరాగాంధీ హత్య తర్వాత దిల్లీలో హై అలర్ట్ ఉండేది. అధికార కార్యాలయాల్లో ప్రతి ఒక్కరిని అనుమానాస్పదంగా చూసేవారు.

ఒకానొక సమయంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి కార్యాలయాల్లోని సీనియర్ అధికారుల కార్యకలాపాలను కూడా గమనిస్తుండేవారు.

అయినప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయంలో కుమార్ నారాయణ్‌కు ఉన్న సంబంధాల విషయం బయటకు రాలేదు. యాధృచ్ఛికంగానే పోలీసులు కుమార్ నారాయణ్‌ను పట్టుకున్నారు.

సీబీఐలో పనిచేసిన వేద్ ప్రకాశ్ శర్మ తన స్నేహితుడు సుభాశ్ శర్మ ఫొటోకాపీ షాప్‌కు తరచూ వెళ్తుండేవారు.

ఆ షాపులో చాలా వెలుతురుండేది. అకస్మాత్తుగా వేద్ ప్రకాశ్ శర్మ కళ్లు ఓ ఫొటోకాపీ పేజీపై పడ్డాయి. దానిమీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని రాసి ఉంది.

అంతర్గత పత్రాలు వేటినీ బయటకు తీసుకెళ్లేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమతి ఇవ్వదని తన అనుభవం ద్వారా వేద్ ప్రకాశ్‌కు తెలుసు.

ఇంటెలిజెన్స్ బ్యూరో ముఖ్యమైన డాక్యుమెంట్ల ఫొటోకాపీ

‘‘వేద్ ప్రకాశ్ గదిలో ఓ మూలన కూర్చున్నారు. ఫొటోకాపీ తీయించుకుంటున్న వ్యక్తి, తీస్తున్న సుభాశ్ శర్మ వేద్ ప్రకాశ్‌కు వెనక నుంచి కనిపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో పేపర్లలో ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన గుర్తులను వేద్ ప్రకాశ్ చూశారు. అవి అస్సాం, కశ్మీర్, పాకిస్తాన్‌కు సంబంధించిన పత్రాలు’’ అని కల్లోల్ భట్టాఛార్జీ రాశారు.

ఇది జరిగిన తర్వాత మరోసారి ఫొటోకాపీల కోసం వచ్చే వ్యక్తిని చూడాలన్న ఉద్దేశంతో వేద్ ప్రకాశ్ తన స్నేహితుడి దుకాణానికిరోజూ వెళ్లేవారు.

ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన రహస్య సమాచారం, భారత అంతర్గత, బాహ్య సవాళ్ల గురించి ఆ పత్రాల్లో ఉంది.

దిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్‌లో ఆ రహస్యపత్రాల కాపీ జరుగుతోందన్నది ఇందులో ఆశ్చర్యకరమైన విషయం.

ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చాక వేద్ ప్రకాశ్ తన మాజీ బాస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జేఎన్ రాయ్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని భట్టాఛార్జీ రాశారు.

దర్యాప్తు కోసం ఫొటోకాపీ షాప్‌కు రాయ్ కొంతమంది అధికారులను పంపించారు. కానీ అక్కడ ఎలాంటి సమాచారం లభించలేదు.

నిఘా కుంభకోణం, కుమార్ నారాయణ్

ఫొటో సోర్స్, x

నిఘా రాకెట్‌తో సంబంధాలున్నవారందరినీ ఎలా గుర్తించారంటే..

దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించాలని వేద్ ప్రకాశ్ అనుకున్నారు. ఒక రోజు ప్యూన్ తీసుకొచ్చిన ఒక పత్రాన్ని ఆయన దొంగలించి తన కోట్ జేబులో పెట్టుకున్నారు.

దాన్ని చదవగానే అది ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన పేపర్ అని ఆయనకు తెలిసింది. తన అనుమానం నిజమనేని ఆయనకు పూర్తిగా నమ్మకం కలిగింది.

అక్కడి నుంచి ఆయన నేరుగా తన మాజీ బాస్ జేఎన్ రాయ్ దగ్గరకు వెళ్లారు. ఆ పత్రం చూసి రాయ్ షాక్ తిన్నారు. మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయాలని ఆయన నిర్ణయించారు.

షాప్ ఓనర్‌కు దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన్ను ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని వేద్ ప్రకాశ్ వారికి చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులు సాధారణ దుస్తుల్లో వెళ్లి ఫొటోకాపీషాప్‌ దగ్గర నిఘా పెట్టారు.

‘‘మరుసటి రోజు కాపీ పేపర్లు తీసుకుని ప్యూన్ షాపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని వేద్ ప్రకాశ్ ఆయన వెనక పంపారు’’ అని భట్టాచార్జీ రాశారు.

‘‘హేలీ రోడ్డులోని ఎస్‌ఎల్‌ఎం మనేక్ లాల్ ఆఫీసు నుంచి ఆయన వచ్చారన్న విషయం గుర్తించగానే...ఆ ఆఫీసుపైనా 24 గంటలు నిఘా పెట్టారు. అనేకరోజుల పాటు సాగిన ఈ నిఘా తర్వాత ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్నవారందరినీ గుర్తించారు’’ అని భట్టాచార్జీ తెలిపారు.

13 మంది దోషులుగా నిర్ధారణ

ఫొటో సోర్స్, Kallol Bhattacherjee

ఫొటో క్యాప్షన్, కుమార్ నారాయణ్‌ను తీసుకెళ్తున్న దర్యాప్తు అధికారులు

నారాయణ్ కార్యాలయంపై దాడి

నిఘా సమాచారం గురించి తెలియని కుమార్ నారాయణ్ తన కార్యాలయంలో కూర్చుని ..పీఎంవో ఆఫీసులో పనిచేసే గోపాలన్ కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రి దాదాపు 11గంటల సమయంలో గోపాలన్ చేతిలో బ్రీఫ్ కేసుతో నారాయణ్ దగ్గరకు వచ్చారు.

గోపాలన్ కోసం నారాయణ్ విస్కీ బాటిల్ తీశారు. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన తలుపు చప్పుడవుతున్న శబ్దం విన్నారు.

‘‘తలుపు తెరుచుకున్న వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గదిలోకి వచ్చారు. అంతకు కేవలం గంటన్నర ముందు జరిగిన కేబినెట్ సమావేశానికి సంబంధించిన నోట్స్‌ నారాయణ్ డెస్క్‌పై ఉండడం గమనించారు. వారిద్దరినీ వారి సీట్లలోనే కదలకుండా కూర్చోవాలని ఆదేశించి మొత్తం కార్యాలయంలో సోదాలు మొదలుపెట్టారు. మరుసటిరోజు ఉదయం వరకు ఈ సోదాలు కొనసాగాయి.

ఇంటెలిజెన్స్ బ్యూరో బృందానికి 14 బాటిళ్ల ఖరీదైన స్కాచ్ విస్కీ కనపడింది. నారాయణ్, గోపాలన్‌ను విచారణ కోసం ఎర్రకోటకు తరలించారు.

జాతీయభద్రతకు సంబంధించిన డాక్యుమెంట్లను విదేశీయులకు అందిస్తున్న 8మందిపై తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 17రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదైంది’’ అని కల్లోల్ భట్టాచార్జీ రాశారు.

జైలుకు కుమార్ నారాయణ్ తరలింపు

అరెస్టయిన వారిలో ప్రధాన కార్యదర్శి పీసీ అలెగ్జాండర్ వ్యక్తిగత కార్యదర్శి, కశ్మీరీ అయిన టీఎన్ ఖేర్ ఉన్నారు. అలెగ్జాండర్ వ్యక్తిగత కార్యదర్శిగా టీఎన్ ఖేర్‌కు మొత్తం ప్రధానమంత్రి కార్యాలయంతో సంబంధాలుండేవి.

డిప్యుటేషన్‌పై ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన హోం మంత్రిత్వశాఖకు చెందిన కెకె మల్హోత్రాను కూడా అరెస్టు చేశారు.

రాష్ట్రపతి పత్రికా సలహాదారు తర్లోచన్ సింగ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఎస్ శంకరన్‌ను కూడా అరెస్టు చేశారు. మధురైకి చెందిన శంకరన్ 20 ఏళ్లగా రాష్ట్రపతి సిబ్బందిలో ఉన్నారు. ఆయన ప్రెసిడెన్షియల్ ఎస్టేట్‌లో నివసించేవారు.

కొన్నిరోజుల విచారణ తర్వాత నారాయణ్‌ను తిహాడ్ జైలుకు తరలించారు. జైలు వాతావరణం నారాయణ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జైలులో తనను హత్యచేస్తారేమోనని భయపడుతుండేవారు. రాత్రుళ్లు పెద్దపెద్దగా అరుస్తుండేవారు.

‘‘నారాయణ్ ఎప్పుడూ ఏడుస్తుండేవారు. అరెస్టయిన రెండు నెలలలోపే ఆయన బరువు 20కేజీలు తగ్గింది. బరువు తగ్గడం మంచి విషయమని, ఎక్కువకాలం జీవిస్తావని మేం ఆయనతో సరదాగా అనేవాళ్లం’’ అని మాజీ ప్రెస్ అధికారి సునీల్ గుప్తా చెప్పారు.

నేరాన్ని అంగీకరించిన కుమార్ నారాయణ్

ఈ అరెస్టుల విషయం బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ‘‘ద హిందూ’’కు చెందిన జీకె రెడ్డికి ఈ వార్త తెలిసింది. ఆయనే మొదటగా ఈ వార్తను ప్రచురించారు.

1985 ఫిబ్రవరి 4న ఎస్‌ఎంఎల్ మానెక్‌లాల్ కంపెనీ కుమార్ నారాయణ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.

గూఢచర్యం కేసులో కనీసం మూడు దేశాల ప్రమేయం ఉందని, గత 25 ఏళ్లగా వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ తాను రహస్య పత్రాలు అందిస్తున్నానని 15 పేజీల నేరాంగీకార ప్రకటనలో నారాయణ్ తెలిపారు.

తానిచ్చే సమాచారంతో తాను ఉద్యోగం చేసే కంపెనీ మానెక్‌లాల్ కూడా లాభపడిందని నారాయణ్ చెప్పారు.

ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీసీ అలెగ్జాండర్

పీసీ అలెగ్జాండర్ రాజీనామా

ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీసీ అలెగ్జాండర్ రాజీనామా చేశారు.

‘‘ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్‌లో 1985 జనవరి 18 చీకటి రోజుగా నిలిచింది’’ అని తన స్వీయచరిత్ర ‘‘థ్రూ ద కారిడార్స్ ఆఫ్ పవర్’’లో రాశారు.

‘‘నా ఆఫీసుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కొన్ని వ్యాపార సంస్థలకు లీక్ చేశారన్న ఆరోపణలపై నా వ్యక్తిగత కార్యదర్శి, ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్‌లను అరెస్టు చేశారన్న వార్త నాకు షాక్ కలిగించింది’’ అని ఆయన రాశారు.

‘‘ఈ విషయం తెలిసిన వెంటనే నేను స్పందించాను. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నా పదవికి రాజీనామా చేయాలనుకున్నా’’ అని ఆయన పుస్తకంలో తెలిపారు.

‘‘మూడు గంటల సమయంలో నేను ప్రధాన మంత్రిని కలిశాను. ఆ సమయంలో పీవీ నరసింహారావు, వీపీ సింగ్, ఎస్‌బీ చవాన్ ప్రధాని దగ్గర కూర్చుని ఉన్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నాను అని నేను రాజీవ్ గాంధీకి చెప్పాను. వాళ్లు వెళ్లిన వెంటనే నేను ప్రధానమంత్రికి అన్ని విషయాలు చెప్పాను. రాజీనామా సంగతి తెలియజేశాను’’ అని ఆయన రాశారు.

ఫ్రాంకోయిస్ మిట్టరాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రాంకోయిస్ మిట్టరాండ్

రాయబారిని వెనక్కి పిలవాలని ఫ్రాన్స్‌ను కోరిన భారత్

ఫ్రాన్స్ విదేశాంగమంత్రిని కలవాలని అప్పటికి పారిస్‌లో భారత రాయబారిగా ఉన్న నరేంద్రసింగ్‌ను కేంద్రం ఆదేశించింది. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారిని వెనక్కి పిలవాలని, పారిస్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉంటారో, దిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో అంతమంది సిబ్బందే ఉండాలని ఫ్రాన్స్ విదేశాంగమంత్రికి చెప్పాలని కేంద్రం నరేంద్రసింగ్‌కు తెలిపింది.

‘‘జరిగినదాన్నంతటినీ మర్చిపోవాలని కోరుతూ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ భారత ప్రధాని రాజీవ్ గాంధీకి లేఖ రాశారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ విషయం ఎలాంటి విఘాతం కల్పించకూడదని కోరారు’’ అని చిన్‌మే గరేఖాన్ తన స్వీయచరిత్ర సెంటర్స్ ఆఫ్ పవర్‌లో రాశారు.

రాజీవ్ గాంధీని కలిసేందుకు 1985 జనవరి 22న మిట్టరాండ్ తన సోదరుడిని దిల్లీ పంపారు. ఈ విషయంలో తాను బాధగా ఉన్నానన్న విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మిట్టరాండ్ ప్రయత్నం ఫలించలేదు.

ఈ రాకెట్‌లో ప్రమేయమున్న చెకోస్లొవేకియా, పోలండ్, తూర్పు జర్మనీ రాయబారులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు.

పీవీ నరసింహారావు సలహా కారణంగా సోవియట్ యూనియన్ కార్యాలయానికి ఎలాంటి ఆదేశాలూ వెళ్లలేదు.

నారాయణ్ మరణం

13మంది నిందితులపై 17ఏళ్ల పాటు విచారణ సాగింది.

విదేశీ ప్రతినిధులకు రహస్య సమాచారాన్ని చేరవేశారన్న కేసులో వారందరినీ దోషులుగా తేల్చారు. వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులే.

వారిలో నలుగురు ప్రధానమంత్రి కార్యాలయంలో రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసేవారు.

వారందరికీ పదేళ్ల జైలు శిక్ష విధించారు. తీర్పు వెల్లడించడానికి రెండేళ్లముందు 2000, మార్చి 20న కుమార్ నారాయణ్ చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)