భారత్‌లోని నగరాలు ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా ఎందుకు ఉంటున్నాయి?

దిల్లీలో వాయుకాలుష్యం

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దేశ రాజధాని దిల్లీలో కొద్దిరోజులుగా వాయుకాలుష్యం పెరిగిపోతోంది
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ హిందీ ఎడిటర్

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు తగ్గుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా నవంబర్ 9న దిల్లీలో గాలి నాణ్యత 'ప్రమాదకర స్థాయి'కి చేరింది.

దిల్లీలోని బవానా, మోతీబాగ్ ప్రాంతాల్లో 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే, దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో ఏక్యూఐ 300 నుంచి 400 మధ్య ఉన్నట్లు తెలిపింది.

ఏక్యూఐ సూచీ 400 కంటే ఎక్కువగా ఉంటే వాయుకాలుష్యం 'ప్రమాదకర స్థాయి'గా పరిగణిస్తారు.

ఈ వాయుకాలుష్యం కారణంగా దిల్లీలో ప్రజారోగ్యం విషయంలో అత్యవసర (హెల్త్ ఎమర్జెన్సీ) పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు మూతపడ్డాయి, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచనలు చేశారు.

శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు ఆస్పత్రుల బాటపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తుండడం వల్లే ఇలా జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

కోట్లాది మంది నివసిస్తున్న దిల్లీ నగరాన్ని 'గ్యాస్ చాంబర్‌'గా అభివర్ణిస్తున్నారు. అయితే, ఉత్తర భారతంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని నగరాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలైన గుర్‌గావ్, గాజియాబాద్, ఫరీదాబాద్, భివాడి, నోయిడా వంటి నగరాలన్నీ కూడా దిల్లీ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ 80 కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత అధ్వానంగా ఉంటుంది.

పర్యావరణ సంస్థ 'గ్రీన్‌పీస్' నగరాల్లో కాలుష్యంపై 2018లో ఒక అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం ప్రకారం, అప్పటికి ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 22 భారత్‌‌లోనే ఉన్నాయి.

ఈ నగరాల్లో గాలిలో ప్రమాదకర కణాల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది.

గాలిలోని ఈ విషపూరిత సూక్ష్మకణాలను పార్టిక్యులేట్ మేటర్ 2.5 (పీఎం 2.5) అంటారు. ఈ సూక్ష్మకణాలు పొగ, ధూళి కణాలు, కార్బన్ కణాలు కావొచ్చు. లేదంటే వాటి మిశ్రమం కూడా కావొచ్చు.

దిల్లీలో వాయు కాలుష్యం

డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం, పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారు.

ఇలాంటి పరిస్థితులు గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే ప్రమాదాలను పెంచుతాయి.

రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొగమంచుతో దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 3 కోట్ల మంది గత వారం రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇది ఇక్కడికే పరిమితం కాదు.

ఉత్తర భారతం, ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంత మైదానాలు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. పొరుగుదేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే, పశ్చిమంగా వీచే గాలులు ఈ దుమ్ము, పొగను హిమాలయాల వైపు మోసుకెళ్తాయి.

అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, భారత్‌లో గాలినాణ్యత ఎందుకింత దారుణంగా ఉంటోంది? మరీముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎందుకీ పరిస్థితి?

వాయుకాలుష్యం

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 అక్టోబర్ 15న అమృత్‌సర్ సమీపంలో ఓ రైతు పొలంలో పంట వ్యర్థాలను తగలబెడుతూ కనిపించారు

పంటవ్యర్థాలను తగులబెట్టడం..

దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుండడం వాయుకాలుష్యానికి ప్రధాన కారణంగా చెబుతారు.

పశ్చిమ గాలులు పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగతో దిల్లీ వైపు వీస్తాయి. దీనికారణంగా ఏటా ఈ సమయంలో దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది.

పంట వ్యర్థాలు కాల్చే విషయంలో నిబంధనలను పాటించకపోవడం వల్ల కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికితోడు ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద సమగ్ర విధానమంటూ లేదు.

వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో పంటలు చేతికొచ్చిన తర్వాత, ఆ వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. ముఖ్యంగా దిల్లీతో పాటు అత్యంత కాలుష్య నగరాలున్న ఉత్తర ప్రదేశ్, హరియాణా‌ వంటి రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది.

ఇటీవల ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు పంట వ్యర్థాలను తగలబెట్టడంపై నిషేధం విధిస్తూ, కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుండా చోద్యం చూసేందుకే పరిమితం అవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

వాయుకాలుష్యం

ఫొటో సోర్స్, Sakib Ali/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 అక్టోబర్ 27న గాజియాబాద్‌లో ఓ రోడ్డుపై తీసిన ఫోటో

వాహన ఉద్గారాలు

దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత కారణంగా కేంద్రం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ముందుగా వాహనాల నుంచి వెలువడే ప్రమాదకర ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

నగరంలో రోజుకు దాదాపు 30 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు దిల్లీ ప్రభుత్వం గతంలో సరి - బేసి విధానాన్ని తీసుకొచ్చింది.

అందులో భాగంగా, ఒకరోజు సరిసంఖ్య నంబర్ ప్లేట్లు ఉన్న ప్రైవేటు కార్లు, మరో రోజు బేసిసంఖ్య నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను రోడ్లపై తిరిగేందుకు అనుమతించేవారు.

ఈ విధానం పాటిస్తే నగరంలో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య 15 లక్షలకు తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది.

దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే, 2016లో 20 కోట్లకు పైగా వాహనాలు రోడ్లపై రాకపోకలు సాగించాయి. ఆ తర్వాతి కాలంలో ఈ సంఖ్య ఇంకొంత పెరిగి ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో వాహనాల రాకపోకలతో వెలువడుతున్న ఉద్గారాలు కూడా పంట వ్యర్థాల కాల్చివేత స్థాయిలోనే వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి.

వాయుకాలుష్యం

ఫొటో సోర్స్, Sakib Ali/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, కాలుష్య నియంత్రణ కోసం దిల్లీ ప్రభుత్వం యాంటీ స్మాగ్ గన్స్‌తో రోడ్లపై నీళ్లు చల్లిస్తోంది

డీజిల్ వినియోగం..

భారత్‌లో డీజిల్‌తో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కూడా వాయుకాలుష్యం పెరగడానికి కారణమవుతోంది.

పర్యావరణ హితంగా భావించే సీఎన్‌జీ, పెట్రోల్‌తో వంటి ఇంధనాలతో నడిచే వాహనాల కంటే దేశంలో డీజిల్‌తో నడిచే వాహనాలే ఎక్కువ. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా విజయవంతం కావడం లేదు.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2015లో దేశంలో డీజిల్‌తో నడిచే భారీ వాహనాలు (ట్రక్కులు మరియు బస్సులు) 1 కోటి 90 లక్షలు ఉన్నాయి. ఇవికాకుండా డీజిల్‌తో నడిచే ట్యాక్సీలు, ప్రైవేట్ కార్లు లక్షల్లో ఉన్నాయి.

సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో మానవుల కారణంగా వెలువడుతున్న మొత్తం నైట్రోజన్ ఆక్సైడ్‌లో రోడ్లపై నడుస్తున్న డీజిల్ వాహనాల వాటానే 20 శాతంగా ఉంది.

వాయుకాలుష్యం

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కాలుష్యం పెరిగినప్పుడు నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తారు

నిర్మాణ రంగ కార్యకలాపాలు

దిల్లీని విషపూరిత పొగమంచు కప్పేసిన ప్రతిసారీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని నిర్మాణ కార్యకలాపాలపై ప్రభుత్వం, కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.

దీంతో, నిర్మాణంలో ఉన్న నివాస భవన సముదాయాలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు నిలిచిపోతాయి.

భవనాలు, లేదా ఇతర నిర్మాణ ప్రాంతాల్లో వెలువడే దుమ్మూధూళి, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల కాలుష్య సమస్య తీవ్రతరమవుతోంది. వాటి నుంచి వెలువడే దుమ్ములో రసాయన అవశేషాలు ఉంటాయి. అవి గాలితో కలిసి శరీరంలోకి వెళ్లడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు కారణమవుతాయి.

కేంద్రం లెక్కల ప్రకారం, 2022 నాటికి దేశంలో నిర్మాణ రంగ మార్కెట్ విలువ 738.5 బిలియన్ డాలర్లుగా అంచనా. దాని అనుబంధ రంగాలైన ఉక్కు, పెయింట్, గ్లాస్ పరిశ్రమలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగ కార్యకలాపాలపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, చిన్నచిన్న నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ హవా కనిపిస్తోంది. నివాస భవన సముదాయాలు, వాణిజ్య భవనాలు, ఇతర కార్యకలాపాలతో భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా మారడానికి ఈ రంగం కూడా మరో కారణంగా నిలుస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)