బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాలో కోత పెట్టిన అదానీ గ్రూప్... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అర్చనా శుక్ల
- హోదా, బీబీసీ న్యూస్
బంగ్లాదేశ్‌కు అదానీ గ్రూప్ విద్యుత్ సరఫరా తగ్గించింది. ‘‘అదానీ పవర్’’ ద్వారా అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌లో 10శాతం విద్యుత్ పంపిణీ చేస్తోంది.
అయితే బంగ్లాదేశ్ చెల్లించాల్సిన బకాయిలు 6వేల730కోట్లు ఉండడంతో విద్యుత్ సరఫరాను అదానీ పవర్ సగానికి తగ్గించింది. దీంతో బకాయి చెల్లింపు ప్రక్రియను బంగ్లాదేశ్ వేగవంతం చేసింది.
అదానీ సంస్థకు ఉన్న బకాయిలను పాక్షికంగా చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు బీబీసీకి చెప్పారు.
భారత్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. విద్యుత్ కొరతతో ఉన్న బంగ్లాదేశ్‌కు కరెంటు సరఫరాను తగ్గించడంపై బీబీసీ ప్రశ్నించగా అదానీ స్పందించలేదు.
"మేం ఇప్పటికే 1,430కోట్లకు సంబంధించి అదానీ గ్రూప్‌కు లెటర్ ఆఫ్ క్రెడిట్ (చెల్లింపుపై అమ్మకందారునికి కొనుగోలుదారుడిచ్చే హామీ పత్రం) అందించాం" అని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీనియర్ అధికారి బీబీసీకి చెప్పారు.
నవంబర్ 7లోగా బకాయిలు చెల్లించకపోతే సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని అదానీ పవర్ హెచ్చరించినట్టు అధికారులు చెప్పారు.
అయితే ‘‘విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేత ఉండబోదు’’ అని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారి ఒకరు విశ్వాసం వ్యక్తంచేశారు.

‘బెదిరింపులకు తలొగ్గం’
క్రమపద్ధతిలో చెల్లింపులు చేస్తున్నామని, ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బంగ్లాదేశ్ అధికారులు బీబీసీకి చెప్పారు.
‘‘మేం చెల్లింపు ప్రక్రియనును వేగవంతం చేసినప్పటికీ, విద్యుత్ సరఫరాను తగ్గించడం మాకు ఆశ్చర్యం కలిగించింది. చెల్లింపులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం’’ అని వారు తెలిపారు.
‘‘మమ్మల్ని బెదిరించడానికి, ఏ విద్యుత్ ఉత్పత్తిదారునికీ అవకాశం ఇవ్వబోం. వారు చెప్పినట్టల్లా చేయబోం’’ అని మధ్యంతర ప్రభుత్వానికి విద్యుత్ సలహాదారుగా ఉన్న ఫౌజుల్ కబీర్ ఖాన్ అన్నారు.
‘‘జూలైలో బంగ్లాదేశ్ 294కోట్లను ముందస్తుగా చెల్లించింది. సెప్టెంబర్‌లో ఆ మొత్తాన్ని 572కోట్లకు అక్టోబర్‌లో 815కోట్లకు పెంచింది’’ అని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ గందరగోళం
డాలర్ల చెల్లింపులో బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది. విద్యుత్, బొగ్గు చమురు వంటి ఖరీదైన దిగుమతులకు డాలర్ చెల్లింపులు చేయడానికి ఇబ్బందిపడుతోంది.
విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలు ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. ఆ రాజకీయ గందరగోళం సమయంలో విదేశీ మారక నిల్వలు కూడా పడిపోయాయి.
షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)నుంచి సహాయం కోరింది. ఇప్పటికే ఉన్న 4.7 బిలియన్ డాలర్ల రుణానికి అదనంగా 3 బిలియన్ డాలర్ల రుణం అందించాలని విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో 2015లో అదానీ పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. షేక్ హసీనా ఆమోదించిన అనేక ఒప్పందాలలో ఇది ఒకటి. ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వం ఆ ఒప్పందంలో పారదర్శకత లేదని విమర్శిస్తోంది.
జాతీయ కమిటీ 11 పాత ఒప్పందాలపై సమీక్ష జరుపుతోంది. వీటిల్లో అదానీ గ్రూప్ సహా వివిధ ఒప్పందాల కోసం అధిక ధరలు చెల్లించారని తరచూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అదానీ పవర్ కంపెనీతో పాటు, భారత ప్రభుత్వ యాజమాన్యంలోని కొన్ని కంపెనీలు కూడా బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను అమ్ముతున్నాయి. వీటిలో ఎన్‌టీపీసీ లిమిటెడ్, పీటీసీ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి. ఇతర భారతీయ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా పాక్షికంగా చెల్లిస్తున్నట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.
సొంత ఉత్పత్తిపై దృష్టి
విద్యుత్ కొరత పూడ్చేందుకు బంగ్లాదేశ్ కొన్ని గ్యాస్, చమురు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దీనివల్ల విద్యుత్ ఖర్చులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలం రావడంతో ఏసీలకు డిమాండ్ తగ్గుతుందని, అందుకే కరెంటు డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
"ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. డాలర్ సంక్షోభం కారణంగా, దేశం తగినంత బొగ్గును కొనుగోలు చేయలేకపోయింది. దీంతో అదానీ పవర్ నుంచి జరిగే విద్యుత్ సరఫరా బంగ్లాదేశ్‌కు చాలా కీలకం. స్థానికంగా ఉత్పత్తయ్యే దాని కంటే ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ అది చాలాముఖ్యం" అని ఇంధన నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అజాజ్ హొస్సేన్ అన్నారు.
బంగ్లాదేశ్ తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్‌ను డిసెంబర్‌లో ప్రారంభించాలని భావిస్తోంది. రష్యా సహకారంతో నిర్మించనున్న ఈ స్టేషన్‌కు 12.65 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














