వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్టేనా? గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్ ఏం చేశారు

ఫొటో సోర్స్, APLEGISLATURE.ORG/YSJagan/FB
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
‘ఏపీ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు.. ఒకటి అధికార కూటమి.. రెండోది ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ.
40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు.
అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించేందుకు సమయం ఇవ్వరు.
175 మందిలో ఒక సభ్యుడిగా రెండు నిమిషాలు మైక్ ఇస్తాం.. ఆ స్వల్ప సమయంలోనే చెప్పాల్సింది చెప్పమనే మైండ్ సెట్ ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లి లాభమేమిటి? అందుకే అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా సమయం ఇస్తారో .. అదే రీతిలో మీడియా ద్వారా ప్రతిరోజూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. మీడియా ప్రతినిధులనే స్పీకర్లుగా భావించి ప్రజల తరఫున ప్రశ్నిస్తాం’
ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాజాగా చేసిన వ్యాఖ్యలు.
దీంతో ఆయన ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదని అర్థమవుతోంది.


ఫొటో సోర్స్, facebook/Chandrababu, YS Jagan
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైఎస్ జగన్ నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి కాదు.
2014–19 మధ్య కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా రెండేళ్ల పాటు ఆయన ఇదే వైఖరిని అవలంబించారు.
ఆ తరువాత 2019–24 మధ్య నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండేళ్లకి పైగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.
అయితే, అసెంబ్లీ సమావేశాలను విపక్ష నేతలు బహిష్కరించడం మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు నుంచి మొదలైందని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు.
‘ప్రజాసమస్యలపై పట్టుబట్టే సందర్భంలో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ, సభలో స్పీకర్ వ్యవహారశైలిని ఖండిస్తూ.. విపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో రివాజు. 30 ఏళ్ల కిందట వరకు ఇలానే జరిగేది. కానీ శాసనసభ సమావేశాలను విపక్ష పార్టీల నేతలు బహిష్కరించడం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో మొదలైంది’ అని అమర్ చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
రెండుసార్లు ప్రతినబూనిన ఎన్టీఆర్
‘1994కి ముందు ఓసారి, 1995లో మరోసారి ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు’ అని దేవులపల్లి అమర్ గుర్తు చేశారు.
అప్పట్లో తరచుగా అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసే పాత్రికేయుల్లో ఆయన ఒకరు.
1993 ఆగస్టు 7న అప్పటి తెలుగుదేశం జమ్మలమడుగు ఎమ్మెల్యే పి.శివారెడ్డి హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు.
అప్పుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీ రామారావు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి విచారణ కోసం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ డిమాండ్‌ను తిరస్కరించారు.
దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శాసన సభలో తాను అడుగుపెట్టనని, తిరిగి ముఖ్యమంత్రిగానే శాసన సభకు వస్తానని ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.
1994 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి అసెంబ్లీలో ప్రవేశించారు.
అనంతరం1995లో.. ఎన్టీఆర్ పదవి కోల్పోయిన తరువాత అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నాడు స్పీకర్ సభలో ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా ఎన్టీఆర్‌ను తూలనాడుతూ టీడీపీ సభ్యులే అసెంబ్లీలో దూషణలకు దిగారు. దీంతో కలత చెందిన ఎన్టీఆర్ ఇక శాసనసభలో అడుగుపెట్టనని, ప్రజల వద్దకే వెళ్లి చెప్పుకొంటానని ప్రకటించి బయటకు వచ్చేశారు. సింహగర్జన పేరిట సభలు నిర్వహించారు’’ అని ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండేళ్లు అసెంబ్లీకి రాని వైఎస్ రాజశేఖరరెడ్డి
ఇక 1999–2004 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్ల కాలంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.
ఆయన సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు చెప్పలేదు కానీ ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానన్న జగన్
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో విజయం సాధించింది.
ఆ ఎన్నికల్లో వైసీపీకి 67 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
అప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచే తనకు సరిగ్గా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహారశైలిపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసేవారు.
జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోని 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, అందులో ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో 2017 అక్టోబర్ 25న నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష సమావేశంలో జగన్.. ఇక తాను అసెంబ్లీకి వెళ్లనని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు.
అప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్లని జగన్ 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లతో సీఎం అయిన తర్వాతే శాసన సభలో అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Screengrab
2021లో చంద్రబాబు శపథం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో దాదాపు రెండున్నరేళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు.
2021 నవంబర్ 19న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చ పక్కదారి పట్టింది.
వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర ఆగ్రహానికి, భావోద్వేగానికి గురైన చంద్రబాబు ఇక మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీకి రానని శపథం చేశారు.
164 సీట్లతో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో బాబు నాలుగోసారి సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడు నుంచి..
ఏపీకన్నా ముందుగా తమిళనాడు రాజకీయాల్లో శపథాల పర్వం నడిచింది.
1989లో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ కరుణానిధి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
కరుణానిధిని ‘క్రిమినల్’ అన్నారు. దాంతో డీఎంకే ఎమ్మెల్యేలు కొందరు జయలలితపై దాడి చేసి చీర లాగారన్న ఘటన తర్వాత, తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని జయలలిత ప్రతిజ్ఞ చేశారు.
1991లో గెలిచి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తరువాత తెలుగు నాట కూడా ప్రతిపక్ష నేతలు ఇలాంటి ప్రతిజ్ఞలు చేయడం రివాజుగా మారింది.
జగన్‌ను వెళ్లొద్దని మేమే విజ్క్షప్తి చేశాం: వైఎస్సార్‌సీపీ
ఏపీలో ఎన్నికలు జరిగి ఆర్నెల్లు కాకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాను అనే అర్థంలో జగన్ మాట్లాడటం మీద భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
సొంతపార్టీ వర్గాలు ఆయన్ను సమర్థిస్తుంటే అధికార పక్షం విమర్శిస్తోంది.
‘‘జగన్‌ను కావాలనే వేధిస్తారు. అందుకే ఆయన్ను అసెంబ్లీకి వెళ్లొద్దని మేమే కోరాం’’ అని తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి బీబీసీకి తెలిపారు.
అసలు వెళ్తే కదా.. ఎన్ని నిమిషాలిస్తారో తెలిసేది: మాజీ డిప్యూటీ స్పీకర్
‘‘ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకోవడం ఆయన విచిత్ర మనస్తత్వానికి అద్దం పడుతోంది. అసలు అసెంబ్లీకి వెళ్తే కదా.. రెండు నిమిషాలిస్తారో.. ఐదు నిమిషాలిస్తారో తెలిసేది. సహజంగా రెండు నిమిషాలిచ్చినా మాట్లాడే విధానం, ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి ఎన్ని నిమిషాలైనా స్పీకర్ సమయం ఇస్తారు. కానీ, ప్రొటోకాల్ లేదని బహిష్కరించడం సరికాదు’’ అని శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.
‘‘1994లో ఎన్టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న మొత్తం శాసన సభ సీట్లలో పది శాతం సీట్లు కూడా రాలేదు. మొత్తం 294 సీట్లు ఉంటే కాంగ్రెస్ 29 సీట్లలో కూడా గెలవలేదు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినా సరే కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత పి.జనార్ధనరెడ్డి ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించారు. అలాంటిది ఇప్పుడు జగన్ తనకు ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ప్రజలను సైతం అవమానించడమే’’ అని వేదవ్యాస్ అన్నారు.
తన కుటుంబ సభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై చంద్రబాబు సమావేశాలను బహిష్కరించారే తప్ప ప్రోటోకాల్ కోసం కాదని వేదవ్యాస్ అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.NCBN.OFFICIAL
‘ప్రజాతీర్పును శిరసావహించాలి... ఈ సంప్రదాయం సరికాదు’
‘‘అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు జగన్ .. గతంలో చంద్రబాబు బహిష్కరించడం సరైన పద్ధతి కాదు.. ఈ పోకడలు ప్రజాస్వామ్య పతనానికి నాంది. ప్రజాతీర్పును శిరసావహించాలి కదా.. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయని వెళ్లకపోవడం కరెక్ట్ కాదు’’ అని సీనియర్ పాత్రికేయుడు గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.
‘‘ప్రతిపక్షం అనేది ప్రజల గొంతుక.. సభలో విపక్షం లేకుంటే పాలక పక్షం ఇష్టారీతిన బిల్లులు పాస్ చేస్తుంది కదా.. వాటిల్లో ప్రజాభీష్టానికి వ్యతిరేకమైనవి కూడా ఉండొచ్చు. వాటిని అడ్డుకునే సంఖ్యా బలం కూడా ప్రతిపక్షానికి లేకపోవచ్చు. కానీ, సభలో వాటిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. బయట చేసే నిరసనకు, చట్టసభల్లో వ్యక్తం చేసే నిరసనకు తేడా ఉంటుంది. అలాంటి అవకాశాలను విపక్షం పోగొట్టుకోకూడదు. ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. అప్పుడే బహిష్కరణ నిర్ణయం సరైంది కాదు ’’ అని నాగరాజు అభిప్రాయపడ్డారు.
‘‘చట్టసభల్లో స్పీకర్లు రాజ్యాంగపరంగా వ్యవహరించాలి. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన గౌరవప్రదమైన పదవి అది. కానీ, దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలోనే కాదు చాలాచోట్ల స్పీకర్లు అధికార పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. ఏపీలో పదేళ్లుగా అలాంటి సంప్రదాయమే ఉంది. టీడీపీ హయాంలో స్పీకర్‌గా చేసిన కోడెల శివప్రసాదరావు విమర్శలను మూటగట్టుకుంటే, వైఎస్సార్‌సీపీ హయాంలో తమ్మినేని సీతారాం మరీ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడైనా ఏకపక్షంగా కాకుండా ప్రతిపక్షాలకూ సరైన ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని నాగరాజు అన్నారు.
జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమన్నారు?
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు.
జగన్ జీవితాంతం పార్లల్ అసెంబ్లీకే పరిమితం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విజయవాడలో సీ ప్లేన్ ప్రారంభ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ మాటలన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














