పాకిస్తాన్: క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలి 25 మంది మృతి

బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలింది
    • రచయిత, మొహమ్మద్ కాజిమ్
    • హోదా, బీబీసీ క్వెట్టా

పాకిస్తాన్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలి 25 మందికి పైగా చనిపోయారు.

శనివారం ఉదయం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఈ పేలుడు జరిగింది.

ఈ భారీ పేలుడు ధాటికి 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 53 మంది గాయపడ్డారని ‘బీబీసీ ఉర్దూ’ పేర్కొంది.

మృతుల సంఖ్య పెరుగుతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

నలుగురి మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తీసుకొచ్చారని బలూచిస్తాన్ హెల్త్ కోఆర్డినేటర్ ఆఫీసర్ వసీమ్ బేగ్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

క్వెట్టా ఎస్‌ఎస్‌పీ ఆపరేషన్స్ ముహమ్మద్ బలూచ్ బీబీసీతో మాట్లాడుతూ, "క్వెట్టా నుంచి రావల్పిండికి వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై వేచిఉన్న సమయంలో స్టేషన్‌లో ఈ పేలుడు జరిగింది'' అని చెప్పారు.

క్షతగాత్రులను క్వెట్టా సివిల్ ఆస్పత్రిలోని ట్రామా సెంటర్‌కు తరలించినట్లు ముహమ్మద్ బలూచ్ తెలిపారు.

రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు సృష్టించిన విధ్వంసం

'మాదే బాధ్యత'

క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు దాడికి తమదే బాధ్యతని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

పేలుడు జరిగిన సమయంలో దాదాపు 150 నుంచి 200 మంది ప్లాట్‌ఫాంపై రైలు కోసం చూస్తున్నారని ఎస్ఎస్‌పీ ఆపరేషన్స్ ముహమ్మద్ బలూచ్ బీబీసీకి తెలిపారు.

స్టేషన్‌లో సామాన్యులతో పాటు సైనికులు కూడా ఉన్నారని, ఈ పేలుడులో సైనికులు కూడా మరణించారని ఆయన అన్నారు.

బాంబు పేలుళ్లను బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

అమాయకులు, చిన్నారులు, కార్మికులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు సాగిస్తున్న దాడుల్లో ఇది కూడా భాగమేనని ఆయన అన్నారు. ఈ ప్రావిన్స్‌లో టెర్రరిస్టులపై చర్యలు కొనసాగుతాయని, పేలుళ్లకు కారణమైన వారిని అంతం చేసేవరకూ వదిలేది లేదని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)