లైట్‌హౌస్ క్యాప్సుల్: గోడలో దాచిన 132 ఏళ్ల నాటి ఆ సీసాలో ఏం రాసి ఉంది?

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Ross Russell

ఫొటో క్యాప్షన్, అడుగున కూడా కుంభాకారంగా ఉన్న సీసాలో సందేశాన్ని రాసి దాచి కార్క్‌ బిగించిన ఇంజనీర్లు
    • రచయిత, అంగే బ్రౌన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ స్కాట్లండ్‌లోని లైట్‌హౌస్‌లోని గోడ లోపల 132 ఏళ్ల నాటి మెసేజ్ ఉన్న ఒక సీసాను ఇంజనీర్లు గుర్తించారు. ఈ బాటిల్‌ను లైట్‌హౌస్ ఉత్తరం వైపున్న రిన్స్ ఆఫ్ గాలోవే వద్ద ఉన్న పురాతన గోడ దగ్గర కనుక్కున్నారు.

స్కాట్లండ్‌లోని లైట్‌హౌస్‌లో ఒక సందేశం రాసి ఉన్న ఇలాంటి సీసా దొరకడం చాలా అరుదైన విషయం.

1892 సెప్టెంబర్ 4న ఇంక్ ఉపయోగించి, ఈకతో రాసిన ఉత్తరం ఒకటి ఈ బాటిల్‌లో ఉంది. 30 అడుగుల ఎత్తున్న టవర్‌లో విద్యుత్ దీపాన్ని అమర్చిన ముగ్గురు ఇంజనీర్ల పేర్లు ఈ లేఖలో రాసి ఉన్నాయి.

వారితో పాటు లైట్‌హౌస్ సెక్యూరిటీ సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇన్‌స్పెక్షన్ సందర్బంగా 20 సెంటీమీటర్లు పొడవున్న ఈ సీసాను నార్తర్న్ లైట్‌హౌస్ బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ రాస్ రస్సెల్ కనుక్కున్నారు.

లైట్‌హౌస్‌లోని కప్‌బోర్డు ప్యానెల్స్ తొలగించినప్పుడు అక్కడ ఆయనకు ఈ సీసా కనిపించింది. కప్ బోర్డులో చేతికందేంత దూరంలోనే బాటిల్ ఉంది. సీసా లోపల ఉన్న లేఖను ఇంజనీర్ల బృందం చాలా జాగ్రత్తగా బయటకు తీసింది.

సీసాను తెరవడానికి ముందు వారు లైట్‌హౌస్ సెక్యురిటీ ఆఫీసర్ బారీ మిల్లర్ వచ్చే వరకు వేచి చూశారు.

“ఇది నా అదృష్టం. వాళ్లు అలా చేసినందుకు వారికి నేను రుణపడి ఉన్నాను” అని బారీ మిల్లర్ చెప్పారు.

ఈ బాటిల్ పీఠం కుంభాకారంలో ఉంది. అంటే దీన్ని నిలబెట్టడం కుదరదు. ఈ సీసాను నాసిరకం గ్లాస్‌తో తయారు చేసినట్లుగా. గ్లాసు గోడలలో చిన్న చిన్న గాలి బుడగలు ఉన్నాయి.

సీసాలో అంతకు ముందు ఆయిల్ ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

బాటిల్‌ మూతిని కార్క్‌తో బిగించారు. చాలా కాలంగా సీసాలో ఇరుక్కుపోయి ఉండటంతో కార్క్ కొంత ఉబ్బింది. దానికి చుట్టి ఉన్న ఇనుప తీగ తుప్పు పట్టి కనిపించింది.

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Ross Russell

ఫొటో క్యాప్షన్, సీసాలో ఉన్న కాగితం బయటకు తీస్తున్నప్పుడు తన చేతులు వణికాయని కోర్స్‌వాల్ లైట్‌హౌస్ సెక్యూరిటీ ఆఫీసర్ బారీ మిల్లర్ అన్నారు.

ఇంజనీర్లు కార్క్‌ను సీసా మూతి వరకు కట్ చేశారు. తర్వాత చాలా జాగ్రత్తగా డ్రిల్ చేసి కార్క్‌ను బయటకు తీశారు.

అందులో ఉన్న పేపర్‌ చాలా పెద్దగా కనిపించింది. దీన్ని సీసా మూతి ద్వారా బయటకు తీయడం కష్టంగా మారడంతో, ఒక వైరుని మడిచి దాని రెండు అంచుల్ని లోపలకు పెట్టి జాగ్రత్తగా బయటకు తీశారు.

‘ఆ కాగితాన్ని బయటకు తీస్తున్నప్పుడు నా చేతులు వణికాయి’ అని మిల్లర్ బీబీసీకి చెప్పారు.

“అది చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది. చరిత్రలో కలిసిపోయిన నా సహచరులను కలిసినట్లుగా ఉంది. అసలు వాళ్లు అక్కడే ఉన్నారనిపించింది” అని ఆయన అన్నారు.

“ఆ ముగ్గురు కూడా మా బృందంలో భాగంగా ఇక్కడే ఉన్నారు. వాళ్లు రాసిన దాన్ని అందరం కలిసి చదువుతున్నట్లుగా ఉంది. వారి చేతిరాత ఎంత బావుందో మీరు చూడవచ్చు” అని మిల్లర్ చెప్పారు.

“వాళ్లు దాన్ని చాలాకాలం పాటు ఎవరూ కనుక్కోలేని ప్రాంతంలో దాచారు” అని ఆయన అన్నారు.

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Ross Russell

ఫొటో క్యాప్షన్, లైట్ హౌస్ లేఖను 1892లో రాశారు

ఆ లేఖలో ఏముంది?

కోర్సెవాల్ లైట్ & ఫాగ్ సిగ్నల్ స్టేషన్, సెప్టెంబర్ 4, 1892

ఈ లైట్‌హౌస్‌ను ఎడిన్‌బ్రాలోని జేమ్స్ మిల్నే అండ్ సన్ ఇంజనీర్స్, మిల్టన్ హౌస్ సంస్థకు చెందిన జేమ్స్ వెల్ల్ ఇంజనీర్, జాన్ వెస్ట్‌ఉడ్ మిల్‌రైట్, జేమ్స్ బ్రాడీ ఇంజనీర్, డేవిడ్ స్కాట్ లేబరర్ 1892 మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్మించారు. 1892 సెప్టెంబర్ 15న గురువారం రాత్రి దీపాన్ని వెలిగించారు.

ఈ సమయంలో జాన్ విల్సన్ ప్రిన్సిపల్, జాన్ బి హెండర్సన్ ఫస్ట్ అసిస్టెంట్, జాన్ లోకార్ట్ సెకండ్ అసిస్టెంట్ లైట్‌హౌస్‌కు కాపలాదారులుగా ఉన్నారు.

లైట్‌హౌస్ నుంచి పర్యవేక్షణకు అవసరమైన లెన్స్, మెషీన్లను ఎడిన్‌బ్రాకు చెందిన జేమ్స్ డవ్ అండ్ కో ఇంజనీర్స్ గ్రీన్‌సైడ్ వారు సరఫరా చేశారు. వాటిని అదే సంస్థకు చెందిన విలియం బర్నెస్, జాన్ హారోయర్, జేమ్స్ డాడ్స్ అనే ఇంజనీర్లు బిగించారు.

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Jane Murray

ఫొటో క్యాప్షన్, లేఖలో పేర్కొన్న వారిలో జాన్ విల్సన్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి), రాబర్ట్ ముర్రే, జార్జ్ క్రెయిగ్‌తోపాటు ఆ సమయంలో లైట్‌హౌస్‌ను సందర్శించడానికి వచ్చిన మరో వ్యక్తి.

‘నేను చాలా ఆశ్చర్యపోయా’

తన సహచరులు మోర్గాన్ డెన్నిసన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిసి బాటిల్‌ను కనుగొన్న రాస్ రస్సెల్, ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు.

“సీసాలో ఉన్న కాగితం సంచలనాత్మకమైనది. నేను చాలా ఆశ్చర్యపోయా” అని రాస్ చెప్పారు.

132 ఏళ్ల నాటి బాటిల్‌ను తాకిన తొలి వ్యక్తిని కావడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఇలాంటిది జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది” అని రాస్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Ross Russell

ఫొటో క్యాప్షన్, ఎడమ నుంచి వరుసగా రాస్, మోర్గాన్ డెన్నిసన్, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్,

ఈ లైట్ హౌస్‌కు అమర్చిన ఐదు టన్నుల బరువున్న లెన్స్‌ను తిప్పేందుకు అమర్చిన బేరింగ్‌ తిరుగుతుందో లేదో తనిఖీ చేయడానికి ఏడాది కాలం సాగే ప్రాజెక్టులో పని చేయడం కోసం ఈ ఇంజనీర్ల బృందం 209 ఏళ్ల నాటి లైట్ హౌస్ దగ్గరకు వెళ్లింది.

లెన్స్‌ను ఏర్పాటు చేయదలిచిన ప్రాంతంలో నేల ఐదు టన్నుల బరువుని భరించగలదా లేదా అనే దాన్ని పరిశీలిస్తూ ఉన్న సమయంలో ఈ బాటిల్ వాళ్ల కంటబడింది.

1892లో ఈ నోట్‌ను రాసిన వ్యక్తులు టవర్ పైభాగంలో మరో లైట్‌ను, అద్దాలను అమర్చేందుకు అక్కడకు వచ్చారు.

“లేఖలో రాసిన పరికరాల గురించి పని చేస్తున్నప్పుడే ఆ లేఖను కనుక్కోవడం విచిత్రం” అని రాస్ అన్నారు.

తాము గుర్తించిన బాటిల్‌ను ఎక్కడుందో అక్కడే పెట్టాలని భావిస్తున్నామని ఈ బృందం చెప్పింది. అలాగే తాము చేసిన పని గురించి కూడా ఒక నోట్ రాసి అందులో పెడతామని రాస్ చెప్పారు.

స్కాట్లండ్, లైట్ హౌస్, పురాతన కాగితం, నౌకలు, సముద్రయానం

ఫొటో సోర్స్, Euan Murray

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ ముర్రే ముని మనవడు ఇయున్ ముర్రే

ఈ లేఖలో పేర్కొన్న ముగ్గురు లైట్‌హౌస్‌ కాపలాదారుల్లో ఒకరి వారసుడు ఈ బాటిల్‌ను కనుక్కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

స్ట్రాన్రేర్‌లోని లైట్‌హౌస్‌కు 16 కిలోమీటర్ల దూరంలో పెరిగిన ఇయున్ ముర్రే కోర్స్‌వాల్ వద్ద పని చేసిన ముగ్గురు కాపలాదారుల్లో ఒకరైన రాబర్ట్ ముర్రే ముని మనవడు.

“కుటుంబ చరిత్రను ఈ విధంగా చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది” అని ఆయన చెప్పారు.

“వాళ్లు అప్పట్లో చేసిన పని ఈ శాటిలైట్ నేవిగేషన్ యుగంతో సంబంధం ఉండటం ఆశ్చర్యంగా ఉంది” అని ఆయన అన్నారు.

“నౌకలు సురక్షిత ప్రయాణం కోసం రోజువారీ ప్రాతిపదికిన ఇప్పటికీ ఈ లైట్‌హౌస్‌ను ఉపయోగిస్తున్నాయి” అని రాయల్ నేవీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)