ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదా, సుప్రీంతీర్పులో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ కోసం
ప్రతి ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట ఇచ్చిన తీర్పు కొత్త చర్చకు దారితీసింది.
1978లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును 9 మంది సభ్యులతో కూడిన తాజా ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం 7-2 మెజారిటీతో ఈనెల 5న తీర్పును వెలువరించింది.
ఈతీర్పుతో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లు ఏకగ్రీవంగా ఏకీభవించారు. జస్టిస్ బీవీ నాగరత్న పాక్షికంగా ఏకీభవించారు. జస్టిస్ సుధాన్షు ధులియా పూర్తిగా విభేదించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో "ప్రతి ప్రైవేట్ ఆస్తిని సమాజ ఆస్తిగా పరిగణించలేం. నిర్దిష్ట ఆస్తులను మాత్రమే ప్రభుత్వం సమాజ వనరులుగా పరిగణించి, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి" అని పేర్కొంది.
ఆ ఆస్తి స్వభావం, లభ్యత, కొరత, సమాజ వనరులపై దాని ప్రభావం తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చని 1978లో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పటి కాలమాన పరిస్థితుల ఆధారంగా ఆ తీర్పు వెలువడిందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
సాధారణంగా 9 మంది న్యాయమూర్తుల బెంచ్ ఉండటం చాలా అరుదు. ఇప్పటివరకు 17 కేసుల్లో మాత్రమే ఇలా జరిగింది. రాజ్యాంగపరంగా ప్రాముఖ్యత కలిగిన విషయాలను నిర్ణయించడానికి ఇటువంటి బెంచ్‌లను ఏర్పాటు చేస్తారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ ఆస్తి, దాని స్వాధీనంపై చాలా వివాదాలు ఉన్నాయి.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల వేళ ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రజల సంపదను స్వాధీనం చేసుకుని, పంచాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం అలాంటిది కనిపించలేదు.


ఫొటో సోర్స్, Getty Images
'ఇతర చట్టాలపై ప్రభావం'
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేలా 'సమాజం వనరుల' పంపిణీ విధానం ఉండాలి. దీన్ని అనుసరించి ప్రభుత్వం సంపద నియంత్రణకు అనేక చట్టాలు చేసింది.
‘’ఈ తీర్పు ఆస్తి విషయాలపైనే కాకుండా ఇతర చట్టాలపైనా ప్రభావం చూపుతుంది’’ అని ఈ కేసు వాదనలలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది అంధ్యారుజిన అన్నారు.
‘‘రాజ్యాంగ లక్ష్యాల సాధనకు గతంలో బొగ్గువనరుల జాతీయీకరణ, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ వంటి అనేక చట్టాలు రూపొందాయి. కాబట్టి ఈ తీర్పు ప్రభావం చాలా ఉంటుంది" అని మరో న్యాయవాది నిపున్ సక్సేనా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తి హక్కు
ఈ సంక్లిష్ట సమస్యను అర్థం చేసుకోవడానికి ఒకసారి చరిత్రను తిరిగి చూద్దాం.
ఆస్తి హక్కును మొదట్లో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎఫ్) పౌరులందరికీ ఆస్తిని కూడబెట్టుకోవడం, దాచుకోవడం, విక్రయించే హక్కును కల్పించింది.
అదేసమయంలో ఆర్టికల్ 31 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కును ప్రభుత్వానికి కల్పించింది. కాలక్రమేణా ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం రాజ్యాంగానికి అనేక సవరణలు చేసింది. మరోవైపు, పౌరుల ఆస్తి హక్కును పరిరక్షించేందుకు కోర్టులు కొన్ని కీలక తీర్పులు ఇచ్చాయి.
1978లో జనతా పార్టీ ప్రభుత్వం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించి రాజ్యాంగ హక్కుగా మార్చింది. ప్రాథమిక హక్కుతో పోలిస్తే రాజ్యాంగ హక్కు తక్కువ రక్షణను పొందుతుంది.
ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 300-A ప్రకారం రాజ్యాంగ హక్కు మాత్రమే. వివిధ పరిస్థితులలో ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. ఇందులో భూసేకరణ చట్టం ఒకటి.
సంపద స్వాధీనం విషయం ఎప్పుడూ వివాదాల్లోనే ఉంది. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అదేవిధంగా, ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని మార్చాలని భావించింది, కానీ, ముందుకెళ్లలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ కేసు?
మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ యాక్ట్- 1986 (ఎంహెచ్ఏడీఏ)కి చేసిన సవరణలకు సంబంధించినది ఈ కేసు.
మహారాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని ‘ముంబయి బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డు’ రాష్ట్రంలోని కొన్ని పాత ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సవరణలు తీసుకొచ్చారు.
యజమానులు మరమ్మతులు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఇందులో చేర్చారు. అటువంటి పాత భవనాలను మరమ్మతులు చేయడానికి, పునర్నిర్మించడానికి ఈ బోర్డుకు అధికారం ఇచ్చారు. తర్వాత బోర్డు ఈ ఆస్తులను అక్కడ నివసిస్తున్న కౌలుదారుల సహకార కమిటీకి అప్పగించవచ్చు.
అయితే, ఈ చట్టాన్ని 1991లో బాంబే హైకోర్టులో ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీవోఏ) సవాలు చేసింది. ముంబయిలోని 28,000 మంది గృహ యజమానులకు పీవోఏ ప్రాతినిధ్యం వహించింది. కానీ కోర్టు దాని అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వాత 1992లో సుప్రీంకోర్టుకు వెళ్లింది పీవోఏ.
ముంబయిలో ఇళ్ల సమస్య చాలా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
‘’భవన యజమానులు ఈ పాత భవనాలకు మరమ్మత్తులు చేయడంలేదు, ఎందుకంటే మరమ్మతులు చేస్తే వారికి నివసించడానికి ఆ సమయంలో వేరే స్థలం లేదు. కాబట్టి ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది’ అని వాదించింది.
తర్వాత కేసును 2002లో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి రిఫర్ చేయగా తాజాగా తీర్పు వెలువడింది.
ఇతర రాష్ట్రాలపై ప్రభావం?
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం మహారాష్ట్రలోని ఈ చట్టంపై మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుంది. అయినప్పటికీ, భూసేకరణ 2013 వంటి చట్టాల ప్రకారం ప్రభుత్వం ఇప్పటికీ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు.
ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 31వ అధికరణ ప్రకారం ఏదైనా ఆస్తిని ప్రజా సంక్షేమం కోసం స్వాధీనం చేసుకుంటే అది సమానత్వపు హక్కుకు భంగం కలిగించదు.
1969లో బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో ఈ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆర్టికల్ 31-సి పరిధిని పొడిగించాలని ప్రయత్నించింది. అయితే సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














