ఆమ్‌స్టర్‌డామ్: 15 ఏళ్ల కిందట హత్యకు గురైన సెక్స్ వర్కర్ ‘నన్ను రక్షించండి’ అని ఎలా అంటున్నారు?

ఫొటో సోర్స్, Dutch police
- రచయిత, ఆనా హొలిగన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ సెక్స్ వర్కర్‌కు సంబంధించిన హాలోగ్రామ్ ఒకటి ఆమ్‌స్టర్‌డామ్‌లోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌ను వెంటాడుతోంది.
రంగు వెలసిపోయిన డెనిమ్ చెడ్డీ, చిరుతపులి మచ్చల్ని పోలిన రంగులున్న బ్రా, పొట్ట మీద నుంచి ఛాతీపైకి పాములా వంపులు తిరిగిన టాటూతో కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటోను కంప్యూటర్ సాయంతో త్రీడీ చిత్రంగా తయారు చేసి, ఓ విండో ముందు పెట్టారు. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ త్రీడి బొమ్మ లేచి ముందుకు వచ్చి గ్లాస్ డోర్ మీద తట్టి, శ్వాస బయటకు వదులుతోంది. ఆమె శ్వాస నుంచి వచ్చిన ఆవిరి అద్దం మీద పరుచుకుంటోంది. దాని మీద ఆమె ‘హెల్ప్‘ అనే పదాన్నిరాసి వెనక్కి వెళ్లి కూర్చుంటోంది.
ఈ త్రీడీ చిత్రాన్ని బెర్నాడెట్టే బెట్టీ సబో అనే 19 ఏళ్ల మహిళకు ప్రతిరూపంలా డిజైన్ చేశారు. హంగేరికి చెందిన ఈ సెక్స్ వర్కర్ 2009లో హత్యకు గురయ్యారు.
ఆమెపై క్రూరంగా సాగిన కత్తిపోట్ల దాడి 15 ఏళ్లుగా పోలీసుల్ని కలవపరపెడుతూనే ఉంది. ఈ కేసును పరిష్కరించేందుకు డచ్ డిటెక్టివ్‌లు తొలిసారిగా త్రీడీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
హత్యకు గురైన యువతి చిత్రాన్ని కిటికీ వెనక వైపు నుంచి కనిపించేలా పెట్టారు. ఇలాంటి మహిళలు ఎందరో ఇక్కడి క్రూరమైన ప్రమాదకరమైన సెక్స్ వర్క్ పరిశ్రమలో జీవనాన్ని సాగించారు.
ఎటూ తేలకుండా మిగిలిపోయిన ఈ హత్యకేసును పరిష్కరించేందుకు ఈ నిలువెత్తు ఛాయా చిత్రం సహకరిస్తుందని దర్యాప్తు అధికారులు ఆశిస్తున్నారు.
బెట్టీని హత్య చేసిన వ్యక్తి ఇప్పటికీ చట్టం చేతులకు చిక్కలేదు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ డ్రీజర్ హీమ్స్‌కెర్క్ ‘19 ఏళ్ల యువతిని క్రూరంగా చంపి ఆమె జీవితాన్ని తీసుకెళ్లారు’ అనే పరిస్థితిని మార్చాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.
సబో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ జీవించారు. అన్ని రకాల కష్టాలను ఎదుర్కొన్నారని డిటెక్టివ్ చెప్పారు.


ఫొటో సోర్స్, Amsterdam police
18 ఏళ్ల వయసులో సబో ఆమ్‌స్టర్‌డామ్ వచ్చారు. తర్వాత కొంత కాలానికే గర్భం దాల్చారు. గర్బంతో ఉండి కూడా ఆమె సెక్స్ వర్క్‌లో కొనసాగారు. కొడుకు పుట్టిన కొన్ని రోజులకే తిరిగి పనిలో చేరారు.
2009 ఫిబ్రవరి 19 ఉదయం కస్టమర్లు వెళ్లిపోయిన తర్వాత బ్రేక్ సమయంలో ఇద్దరు సెక్స్ వర్కర్లు ఆమెను కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె గది నుంచి రెగ్యులర్‌గా వినిపించే మ్యూజిక్ వినబడటం లేదని వాళ్లు గుర్తించారు.
వాళ్లు ఆమె చిన్న గదిలోకి ప్రవేశించగానే అక్కడ బెట్టీ సబో మృత దేహం కనబడింది. ఆ గదిలో ప్లాస్టిక్ కవర్ కూడా తియ్యని పరుపు, చిన్న రాత బల్ల, పక్కనే సింక్ ఉన్నాయి.
అప్పటికి ఆమె బిడ్డకు జన్మనిచ్చి మూడు నెలలు అయ్యుంటుంది. అంతలోనే దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆమె బిడ్డను సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ బిడ్డకు ఇప్పటికీ తన తల్లి గురించి తెలియదు. హంతకులెవరో కనుక్కోవాలని డిటెక్టివ్‌లు పట్టుదలతో ఉన్నారు.
హత్య జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ హంతకుడు ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ అంతా వెతికారు. అనేకమంది కీలక సాక్షులను ప్రశ్నించారు.
హంతకుడు విదేశీయుడై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హంతకుడిని ఎలా కనిపెడతారు?
ఎర్రటి నియాన్ కిటికీ వెనుక కవ్వించేలా పొట్టి బట్టలు వేసుకున్న ఈ మహిళ ఎవరా అని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. అలా చూస్తున్న వారిలో ఎక్కువమంది టూరిస్టులే.
ఆ సమయంలో ఆమ్‌స్టర్‌డామ్‌ను సందర్శించిన వారు ఎవరో గుర్తు చేసుకుని చెప్పినవారికి 30వేల యూరోలు(సుమారు రూ. 27 లక్షలు) బహుమతిగా ప్రకటించారు. ఈ బహుమతితో సాక్షులు ముందుకు వస్తారని భావిస్తున్నారు.
నగరంలో ఉన్న వేశ్యావాటికల్ని నగరం బయట ఏర్పాటు చేసిన ఎరోటిక్ జోన్‌లకు తరలించాలని ఆమ్‌స్టర్‌డామ్ సిటీ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, ఇది వివాదాస్పదంగా మారింది. ఈ లోగానే ఏర్పాటు చేసిన బెట్టీ సబో హాలోగ్రామ్ ఆ ప్రాంతంలో సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంత దుర్భలంగా ఉన్నాయో చెప్పే ఉదాహరణగా నిలుస్తోంది.
తమను నగరం బయటకు పంపించడం వల్ల మరిన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సెక్స్ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు.
నెదర్లాండ్స్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే వేశ్యావాటికలో జరిగిన ఈ ఘోరమైన నేరానికి సాక్షులు ముందుకు రాకపోవడం దర్యాప్తు అధికారులను కలవర పెడుతోంది.
ఒకప్పుడు తాను జీవించిన, పని చేసిన చారిత్రక రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌లో ఆ యువ సెక్స్ వర్కర్ డిజిటల్ అవతారం, ఆమె హత్య కేసు ఇంకా పరిష్కారం కాలేదని వచ్చే పోయే వారికి గుర్తు చేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














