మోదీ, ట్రంప్ స్నేహం భారత్‌కు ఎంత మేలు చేస్తుంది?

ప్రధాని మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, ట్రంప్
    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధాని మోదీ తన స్నేహితుడని ట్రంప్ చెబుతారు. ట్రంప్ తన స్నేహితుడని ప్రధాని మోదీ కూడా చెబుతారు.

దాదాపు నెలన్నర క్రితం సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. తాను ప్రధాని మోదీని కలుస్తానని అప్పుడు ట్రంప్ చెప్పారు.

ట్రంప్ అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయితే ట్రంప్‌తో సమావేశం కాకుండానే ప్రధాని మోదీ భారత్‌కు తిరిగి వచ్చేశారు.

‘‘మోదీ వచ్చే వారం అమెరికా వస్తున్నారు. నేను ఆయన్ను కలుస్తాను. ఆయన అద్భుతమైన వ్యక్తి’’ అని ట్రంప్ సెప్టెంబరు 17న చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అనేకసార్లు ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. మోదీ నాయకత్వాన్ని పలుమార్లు పొగిడారు.

నవంబరు 6న ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారైన తరువాత ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్తూ ట్రంప్‌ను తన స్నేహితుడిగా పేర్కొన్నారు.

2019 సెప్టెంబరులో హూస్టన్‌లో జరిగిన ఈవెంట్ మోదీ, ట్రంప్ మధ్య స్నేహం ఎంత బలంగా ఉందో తెలియజేసింది.

ఆ ఈవెంట్‌లో మోదీ, ట్రంప్ దాదాపు 50 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ మరోసారి ట్రంప్ ప్రభుత్వం(అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్)అనే నినాదం ఇచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత 2020లో అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం నిర్వహించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన కార్యక్రమానికి ట్రంప్ హాజరయ్యారు. మోదీ అద్భుతమైన వ్యక్తి అని, తన స్నేహితుడని ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, ట్రంప్

మోదీ స్నేహితుడిని అంటూనే భారత్‌పై విమర్శలు

నరేంద్ర మోదీ తన స్నేహితుడని ట్రంప్ చెబుతారు. అదే సమయంలో భారత్ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తారు.

అమెరికా వస్తువులపై భారత్ పన్నులు విధిస్తోందని, కానీ తమ వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేటప్పుడు పన్ను మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోందని ట్రంప్ చాలాసార్లు ఆరోపించారు.

‘‘భారత్‌తో చాలా కష్టం. బ్రెజిల్‌తో కూడా చాలా కష్టం’’ అని సెప్టెంబరు 17న ట్రంప్ అన్నారు.

‘‘మనం చైనాలో ఏమైనా చేయాలనుకుంటే.. ఇక్కడ వస్తువులు తయారుచేసి అక్కడకు ఎగుమతి చేయాలని వారు కోరుకుంటారు. తర్వాత వారు దానిపై 250 శాతం టారిఫ్ విధిస్తారు. అంత అవసరం మనకు ఉండదు. అప్పుడు తమ దేశం వచ్చి ప్లాంట్ పెట్టమని ఆహ్వానిస్తారు. అప్పుడు ఈ కంపెనీలు అక్కడకు వెళ్తాయి’’ అని ఈ ఏడాది జులైలో అన్నారు ట్రంప్.

‘‘హార్లీ డేవిడ్‌సన్ విషయంలో భారత్ కూడా ఇలాగే చేసింది. 200 శాతం పన్ను విధించడంతో హార్లీ డేవిడ్‌సన్ సంస్థ తన బైకులు అమ్మలేకపోయింది’’ అని ట్రంప్ చెప్పారు.

భారత్‌తో రక్షణ సంబంధాలపై ట్రంప్‌కు స్పష్టత ఉంది. భారత్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో వాణిజ్య సంబంధాలు, వలసలపై ట్రంప్ భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు.

ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ నినాదం మోదీతో స్నేహానికి పరిమితులు విధిస్తోంది. ఈ విధానంలో ఐటీ, ఫార్మా, వస్త్రాల ఎగుమతులపైనా టారిఫ్ విధించే అధికారం ట్రంప్‌కు ఉంది.

భారత్ ‘‘టారిఫ్ కింగ్’’ అని ఇప్పటికే ట్రంప్ విమర్శించారు. భారత్ టారిఫ్ విధించినట్టుగానే తమకు కావాల్సిన వస్తువులపై అదే తరహా పన్ను అమెరికా విధించాలన్నది ట్రంప్ ఉద్దేశం.

భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వాణిజ్య లోటు లేకుండా భారత్‌తో వ్యాపార భాగస్వామ్యం ఉన్న ఏకైక దేశం అమెరికానే.

తన వస్తువుల్లో భారత్ ఎక్కువ భాగం అమెరికాకు అమ్ముతుంది. అమెరికా నుంచి భారత్ కొనే వస్తువులు తక్కువగా ఉంటాయి.

2022లో భారత్, అమెరికా మధ్య రూ.16 లక్షల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. భారత్ రూ.10 లక్షల కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి చేసింది. సుమారు రూ. 6 లక్షల కోట్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంది.

అమెరికా ఫస్ట్ పాలసీ కింద ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తే.. పరిస్థితులు మారిపోతాయి.

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో పలుమార్లు మోదీ గురించి మాట్లాడిన డోనల్డ్ ట్రంప్

అమెరికా అసలు సమస్య ఏంటంటే...

‘‘మోదీని ట్రంప్ స్నేహితుడు అంటుంటారు. మరి ఈ స్నేహానికి పరిధులున్నాయా... లేక ఎలాంటి పరిమితులు లేని స్నేహమా?’’ అని మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి, రష్యాలో భారత మాజీ రాయబారి కన్వాల్ సిబల్ ప్రశ్నించారు.

‘‘స్నేహం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోజనాలు నెరవేరినంత కాలం స్నేహానికి ఎలాంటి పరిధులుండవు. ఎప్పుడైతే ఈ ప్రయోజనాలకు భంగం కలుగుతుందో దానికి పరిమితులున్నాయని అర్థమవుతుంది’’ అని కన్వాల్ సిబాల్ చెప్పారు.

‘‘పన్నుల విషయంలో అమెరికా భారత్‌తో ఎలా పోల్చుకుంటుంది ? తనకు పైచేయి ఉందని భావించినప్పుడే అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడిది రక్షణాత్మకమైన విషయం కాదు. డాలర్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశం భారత్‌తో సమానత్వం ఎలా డిమాండ్ చేస్తుంది? అమెరికాకు సమస్య చైనా.. భారత్ కాదు’’ అని సిబల్ విశ్లేషించారు.

కొన్ని సందర్భాల్లో ట్రంప్ వైఖరి భారత్‌కు మేలు చేస్తుంది. అప్పుడు ఇద్దరు నేతల స్నేహం బలంగా ఉంటుంది. ఉదాహరణకు, భారత రాజకీయాల్లో ట్రంప్ జోక్యం చేసుకోరు. మానవ హక్కులు, మతపరమైన సమానత్వం, ప్రజాస్వామ్యం గురించి బైడెన్ యంత్రాంగం మాట్లాడినట్టుగా ట్రంప్ మాట్లాడరు. హిందూత్వ రాజకీయాలపై ట్రంప్ అసలెలాంటి వ్యాఖ్యలు చేయరు. అయితే, అమెరికా కాంగ్రెస్ నియంత్రణలో పనిచేసే సంస్థలను నియంత్రించే సామర్థ్యం ట్రంప్‌కు ఉండదు.

జిన్‌పింగ్, పుతిన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిక్స్ సదస్సు కోసం గత నెలలో రష్యాలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్

రష్యాతో శతృత్వం, చైనా అంటే నిర్లక్ష్యం

రష్యాతో శతృత్వం కొనసాగించే క్రమంలో చైనా బెదిరింపులను అమెరికా పట్టించుకోవడం లేదని భారత విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. అమెరికా విధానాల వల్ల రష్యా, చైనా బాగా దగ్గరవుతున్నాయని అంటున్నారు.

అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు నిజమైన ప్రమాదం రష్యా నుంచి కాదు.. చైనా నుంచి ఉందని, ఈ విషయంలో ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లాని ట్రంప్ విజయం తర్వాత ఓ ఇంగ్లీష్ మేగజైన్‌లో రాశారు. రష్యా తన చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైతే.. చైనా మాత్రం అమెరికా స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోందని అందులో పేర్కొన్నారు.

''జనాభా పరంగా, ఆర్థిక వ్యవస్థపరంగా రష్యా కన్నా చైనా పదిరెట్లు పెద్దది. చైనా మిలటరీ బడ్జెట్ రష్యా కన్నా నాలుగు రెట్లు పెద్దది. అలాగే చైనా అణ్వాయుధాలను పెంచుకుంటోంది. మిలటరీ కార్యకలాపాలను విస్తరిస్తోంది. కానీ, బైడెన్ యంత్రాంగం తప్పుడు ప్రత్యర్థిపై దృష్టి పెట్టింది.''

''యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాతో బైడెన్ కఠినంగా వ్యవహరించడం వల్ల చైనాకు నేరుగా లాభం కలిగింది. రష్యాపై అమెరికా కఠినమైన నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఒక ఆయుధంగా మార్చుకుంది. ఇది చైనాకు అనుకూలంగా మారింది. రష్యా బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో చైనా కరెన్సీ యువాన్‌ను అంతర్జాతీయంగా ఉపయోగించడం పెంచాయి. రష్యా తన అంతర్జాతీయ వ్యాపారంలో ఎక్కువభాగం యువాన్‌లలో చేస్తోంది. తన యువాన్‌లన్నింటినీ రష్యా చైనా బ్యాంకుల్లో దాస్తోంది. దీనివల్ల చైనా లాభపడుతోంది'' అని బ్రహ్మ చెల్లాని విశ్లేషించారు.

ప్రధాని మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, పుతిన్

వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండేందుకే స్నేహం

ఈ విషయంలో ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంటుందని, ఆయన రష్యాకు బదులుగా చైనాపై దృష్టిపెడతారని బ్రహ్మ చెల్లాని విశ్లేషిస్తున్నారు.

‘‘భారత్, రష్యా మధ్య స్నేహం పెరగడంపై ట్రంప్ యంత్రాంగం నుంచి భారత్‌కు ఎలాంటి ఒత్తిడీ ఉండదు’’ అని బ్రహ్మ చెల్లాని చెప్పారు.

‘‘వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోడానికి స్నేహితుడని పిలవడం ఓ మార్గం’’ అని లండన్ కింగ్స్ కాలేజీలో అంతర్జాతీయ వ్యవహారాల మాజీ ప్రొఫెసర్ హర్ష్ పంత్ చెప్పారు.

‘‘ఒకరు ఒకరిని స్నేహితుడిగా చెప్పినంత మాత్రన విధానపరమైన విషయాల్లో వెసులుబాటు ఉంటుందని అర్థం కాదు. మోదీకి సొంత దౌత్య విధానం ఉంది. ఇలా వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండడమనే పద్ధతి కూడా కొన్నిసార్లు ఉపయోగపడుతుంది’’ అని ప్రొఫెసర్ పంత్ చెప్పారు.

‘‘ట్రంప్ సంగతి చూసుకుంటే.. తాను ఎవరిని ఇష్టపడతారు.. ఎవరిని ఇష్టపడరు అనే విషయంపై చాలా స్పష్టతతో ఉంటారు. ట్రంప్ ఇష్టపడే ప్రపంచ నాయకుల్లో నరేంద్ర మోదీ కూడా ఒకరు. అంటే దీనర్థం, మోదీ కోసం తన ప్రయోజనాలను ట్రంప్ పట్టించుకోరని కాదు’’ అని పంత్ విశ్లేషించారు.

‘‘వాణిజ్యం, వలసల విషయంలో భారత్‌పై ట్రంప్ వైఖరి చాలా కఠినంగానే ఉండబోతోంది. భారత రాజకీయాల్లో ఏం జరుగుతోందనేది ట్రంప్ పట్టించుకోరన్నది మాత్రం స్పష్టం. అయితే, భారత్‌లోని క్రైస్తవులకు ఏదన్నా ఇబ్బంది కలిగితే.. ట్రంప్ దాని గురించి మాట్లాడతారు. తన దేశంలో మెజార్టీగా ఉన్న క్రైస్తవుల మనోభావాలకు ఆయన విలువనివ్వాల్సిన పరిస్థితి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

2019 జులైలో అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌కు స్వాగతం పలికారు.

ఆ సమయంలో కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ మాట్లాడారు. కశ్మీర్‌ మధ్యవర్తిత్వం గురించి అమెరికా అధ్యక్షుడొకరు మాట్లాడడం కొన్ని దశాబ్దాల తర్వాత అదే మొదటిసారి.

కశ్మీర్‌పై తాను మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ సైతం కోరుకుంటున్నారని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్‌తో ప్రధాని మోదీ ఆ తరహా మాటలు మాట్లాడలేదని స్పష్టం చేసింది.

భారత్‌కు అభ్యంతరాలున్నప్పటికీ ట్రంప్ ప్రకటనను పాకిస్తాన్ స్వాగతించింది. కశ్మీర్‌ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్నీ అంగీకరించేది లేదన్నది భారత్ అధికారిక విధానం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)