ఇజ్రాయెల్ - హమాస్ మధ్యవర్తిత్వం నుంచి తప్పుకున్న ఖతార్, ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో ఇన్‌వుడ్, రష్డీ అబ్యులౌఫ్
- హోదా, జెరూసలెం నుంచి
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో మధ్యవర్తిత్వం వహించడం నుంచి ఖతార్ వైదొలిగింది.
చర్చలకు ఇజ్రాయెల్ - హమాస్ ‘సుముఖత చూపినప్పుడు’ తిరిగి ఆ బాధ్యత తీసుకుంటామని ఖతార్ తెలిపింది.
గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు చేసిన తాజా ప్రతిపాదనలను పాలస్తీనా బృందం తిరస్కరించిందని ఆరోపిస్తూ అమెరికా అధికారులు.. ఇకపై హమాస్ ప్రతినిధులు ఖతార్‌లో ఉండేందుకు అమెరికా అంగీకరించబోదని పలుమార్లు ప్రకటనలు చేసిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.
మధ్యవర్తిత్తం నుంచి విరమించుకున్నట్లు తెలిపిన ఖతార్.. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయం ఇకపై కొనసాగదని వస్తున్న వార్తలు సరికాదని పేర్కొంది.

''చివరి ప్రయత్నంలో భాగంగా జరిగే చర్చల్లో ఒక ఒప్పందానికి రాలేకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని ఖతార్ పది రోజుల కిందట రెండు వర్గాలకు తెలియజేసింది'' అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
''ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు వర్గాలు సుముఖతను, సంసిద్ధతను వ్యక్తం చేసినప్పుడు ఖతార్ ఆ ప్రయత్నాలను పునఃప్రారంభిస్తుంది'' అని అందులో పేర్కొంది.
ఒబామా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2012లో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ రాజకీయ కార్యాలయం ఏర్పాటైంది.
''చర్చలపై విశ్వాసం ఉంచి ఒప్పందం చేసుకోవడానికి తిరస్కరించినందుకు'' దోహాలోని తన రాజకీయ కార్యాలయాన్ని మూసివేయాలని హమాస్‌కు చెప్పేందుకు, అమెరికా సూచనల మేరకు ఖతార్ అంగీకరించిందని వార్తాసంస్థలు శనివారం రిపోర్ట్ చేశాయి.
అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వాదనలను హమాస్ అధికారులు కూడా ఖండించారు.
ఖతార్ చిన్నదేశమే అయినప్పటికీ మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు కీలక మిత్రదేశం. ఇక్కడ అమెరికా వైమానిక స్థావరం కూడా ఉంది. ప్రభావవంతమైన ఈ గల్ఫ్ దేశం ఇరాన్, తాలిబాన్, రష్యా సహా అనేక సున్నిత అంశాలపై రాజకీయ చర్చలు నిర్వహించింది.
గాజాలో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఏడాదికిపైగా సాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో అమెరికా, ఈజిప్ట్‌తో పాటు ఖతార్ ప్రధానపాత్ర పోషించాయి.
అయితే, ఈ సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
హమాస్ నేత యాహ్యా సిన్వార్ హత్యానంతరం దోహాలో, ఒక చిన్న హాల్‌లో టెంటు కింద హమాస్ రెండు గంటల పాటు సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఇది హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణానంతరం జరిగిన మూడు రోజుల సంతాప కార్యక్రమాలకు పూర్తి భిన్నంగా, ఆ దేశ అధికారుల పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగింది.
అక్టోబర్ నెల మధ్యలో మరోమారు జరిగిన చర్చల్లోనూ ఒప్పందం కుదరకపోవడంతో, స్వల్పకాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని హమాస్ అంటోంది.
''దోహాలోని హమాస్ కార్యాలయానికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు సరికాదు. చర్చల కోసమే ఖతార్‌లో హమాస్ కార్యాలయ ఏర్పాటు జరిగింది, అది తొలిదశల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి దోహదపడింది'' అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
అయితే, శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కూడా తిరస్కరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భద్రతా దళాల చీఫ్‌ల సలహాలను తోసిపుచ్చి, శాంతి ఒప్పందాన్ని తిరస్కరించారని ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఆరోపించారు. నెతన్యాహు గత వారం ఆయన్ను పదవి నుంచి తొలగించిన కొద్దిరోజుల తర్వాత గాలంట్ ఈ ఆరోపణలు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














