యాహ్యా సిన్వార్: ఎవరీ ఈ హమాస్ అధినేత, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపుదాడిలో ప్రధాన సూత్రధారుడు, హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌ను గాజాలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆయన ఇజ్రాయెల్‌కు మోస్ట్ వాంటెడ్ మ్యాన్.
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన అనూహ్యమైన దాడులతో ఇరుదేశాల మధ్య మొదలైన ఘర్షణ తర్వాత, సిన్వార్ బయట ఎప్పుడూ కనిపించ లేదు. ఈ దాడుల్లో 1200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లింది హమాస్.
డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, ఇన్‌ఫార్మర్లు, ఇజ్రాయెల్ బలగాలు ఈయన ఆచూకీ కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.
‘యాహ్యా సిన్వార్ కమాండర్...ఆయనిప్పుడు చనిపోయారు’ అని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.
సిన్వార్ గత ఏడాది చాలా వరకు తన సమయాన్ని అండర్‌గ్రౌండ్‌లోనే గడిపారు.
తన బాడీగార్డులతో గాజాలోని సొరంగాల్లో రహస్యంగా జీవించారు. సిగ్నల్ ద్వారా ఎవరైనా తాను ఉండే ప్రాంతాన్ని కనిపెడతారని భావించి చాలా కొద్దిమందితో మాత్రమే ఆయన మాట్లాడేవారు.
దక్షిణ గాజాలో ఆపరేట్ చేస్తోన్న ఇజ్రాయెల్ బలగాలు ఒక భవనంపై దాడి చేశాయి. అందులో ఒకరు మరణించారని గుర్తించాయి. డెంటల్ రికార్డ్స్, వేలిముద్రల ఆధారంగా చనిపోయింది సిన్వారే అని ధ్రువీకరించుకున్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘యూదుల మారణహోమం తర్వాత ప్రజల చరిత్రలో అత్యంత దారుణమైన ఊచకోత చేపట్టి, వేలమంది ఇజ్రాయెలీలను హతమార్చి, వందల మంది మా పౌరులను బందీలుగా తీసుకెళ్లిన వ్యక్తిని మా వీరోచిత సైనికులు ఇవాళ చంపేశారు’’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
గాజాలో ఇతర ప్రముఖ హమాస్ సీనియర్ నేతలను ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. అక్టోబర్ 7 దాడుల తర్వాత ‘డెడ్ మెన్ వాకింగ్’గా ప్రకటించిన జాబితాలో హమాస్ మిలటరీ వింగ్ నేత మొహమ్ముద్ అల్ డేఫ్ కూడా ఉన్నారు. జూలైలో గాజాలో చేసిన వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
సిన్వార్, డేఫ్‌లు స్నేహితులు, సహవిద్యార్థులు.
ఇద్దరూ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలోనే పెరిగారు.
హమాస్ మరో అగ్రనేత ఇస్మాయిల్ హనియె కూడా ఇరాన్‌లో జరిగిన దాడిలో చనిపోయారు.
ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో జూలైలో ఆయన ఉన్న ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హనియె ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సిన్వార్ ఎవరు?
హమాస్ సంస్థ నాయకుడిగా, దాని పొలిటికల్ బ్యూరో అధినేతగా ఉన్న యాహ్యా ఇబ్రహీం అల్ సిన్వార్ గాజా స్ట్రిప్‌లో ఉన్న ఖాన్ యూనిస్ శరణార్థుల క్యాంపులో జన్మించారు.
ఖాన్ యూనిస్ సెకండరీ స్కూల్ ఫర్ బాయ్స్‌లో ఆయన చదువుకున్నారు. గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ లాంగ్వేజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
మజ్ద్ పేరుతో హమాస్ సెక్యూరిటీ సర్వీస్‌ను యాహ్యా సిన్వార్ ఏర్పాటు చేశారు.
ఈ విభాగం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది.
ఇప్పటివరకు సిన్వార్ మూడు సార్లు అరెస్టయ్యారు. తొలిసారి 1982లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు నాలుగు నెలల పాటు ఆయన్ని ఇజ్రాయెల్ బలగాలు అదుపులో ఉంచుకున్నాయి.
1988లో మూడోసారి అరెస్టైన సమయంలో ఇజ్రాయెల్ న్యాయస్థానం సిన్వార్‌కు నాలుగు జీవిత ఖైదులను విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
సిన్వార్ జైలులో ఉన్న సమయంలో హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన మిస్సైల్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్‌ను బందీగా పట్టుకుంది.
గిలాద్ షాలిత్ చాలా కీలకమైన వ్యక్తిగా చెబుతుంటారు. అందుకే ఆయన్ని విడిపించేందుకు ఇజ్రాయెల్ అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంది.
ఇందుకోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌తో చర్చలు జరిపింది. అయితే ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిన్వార్‌తోపాటు 1,000 మంది ఫతా, హమాస్ సభ్యులను విడుదల చేస్తేనే గిలాద్ షాలిత్‌ను వదిలేస్తామని హమాస్ డిమాండ్ చేసింది.

ఆ ఒప్పందం ప్రకారం 2011లో సిన్వార్ విడుదలయ్యారు. సిన్వార్ విడుదలైన తర్వాత, హమాస్ సంస్థలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు. దాని పొలిటికల్ బ్యూరో సభ్యుడయ్యారు.
2015 సెప్టెంబర్‌లో అమెరికా సిన్వార్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
2017 ఫిబ్రవరి 13న గాజా స్ట్రిప్‌లో హమాస్ మూవ్‌మెంట్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఆయన ఎంపికయ్యారు.
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియె హత్య తర్వాత ఆ గ్రూప్ తన పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌ను 2024 ఆగస్టులో ఎంచుకుంది.
సిన్వార్ ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది.
సిన్వార్ గురించి తెలిసిన వాళ్లు ఆయన ఏదో ఒక రోజు హమాస్‌కు నాయకత్వం వహిస్తారని భావించారు.
హమాస్ సాయుధ విభాగానికి సిన్వార్ అత్యంత సన్నిహితుడు. సిన్వార్ సోదరుడు మొహమ్మద్ హమాస్ అతిపెద్ద సైనిక బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
ఇరాన్‌కు సన్నిహిత వ్యక్తి
ఖైదీల మార్పిడిలో భాగంగా సిన్వార్‌ను బయటికి వదలడం తాము తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయమని ఇజ్రాయెల్ రక్షణ, భద్రతా స్థాపనలో చాలామంది భావిస్తారు.
2021 మేలో జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా గాజా స్ట్రిప్‌లో ఆయన ఇల్లు, ఆఫీసు లక్ష్యంగా సాగాయి.
2022 ఏప్రిల్‌లో టీవీలో ప్రసంగించిన ఆయన, అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌పై దాడులు జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత ఏడాది అక్టోబర్ 7న జరిపిన దాడులకు నేతృత్వం వహించిన ఇజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ అనే సాయుధ దళంతో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరోతో అనుసంధానమైన కీలక వ్యక్తి సిన్వార్.
ఇరాన్‌కు సిన్వార్ చాలా సన్నిహిత వ్యక్తి. అయితే షియా దేశమైన ఇరాన్‌కు, సున్నీ ఆర్గనైజేషన్ అయిన హమాస్‌కు మధ్య గొప్ప అనుబంధం ఏమీ లేదు. అయితే ఇజ్రాయెల్‌ను అంతం చేసి, దాని ఆక్రమణల నుంచి జెరూసలేంను విడిపించాలనేది ఇద్దరి లక్ష్యం. దీంతో వీరిద్దరూ కలిసి పని చేశారు.
హమాస్‌కు ఇరాన్ నిధులను, ఆయుధాలను అందిస్తూ వచ్చింది. హమాస్ సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తోంది. ఇజ్రాయెల్ పట్టణాలను లక్ష్యంగా చేసుకుని వేలాది రాకెట్లను ప్రయోగించే ఆయుధ సంపత్తి వీరిద్దరి వద్దా ఉంది.
యాహ్యా సిన్వార్ మరణించడం నిజంగా హమాస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














