పి.సుశీల: ఏఆర్ రెహమాన్ ఆరాధించే గాయని

ఫొటో సోర్స్, P.Suseela/FB
- రచయిత, పామర్తి హేమసుందర్
- హోదా, బీబీసీ కోసం
పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు. దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో వేలాది పాటలు పాడారు.
సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి.
ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది.
విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు.
సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులను, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు.
స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల.
తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.

సుశీల తొలి పాట
‘ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి..’ సినిమాలకు సంబంధించి సుశీల పాడిన తొలిపాట ఇదే.
సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు 1952లో తన కొత్త సినిమా ‘కన్నతల్లి’ కోసం కొత్త గాయకులను వెతికే పనిలో ఉన్నారు. ఆ సమయంలో సుశీల రేడియోలో పాడిన పాట విని సుశీలను పిలిపించి అవకాశం ఇచ్చారు. తన తొలిపాటను ఏ.ఎం. రాజాతో కలిసి పాడి నేపథ్య గాయనిగా సుశీల తెరంగేట్రం చేశారు.
అప్పటికే సినిమా రంగంలో రావు బాల సరస్వతీదేవి, పి. లీల, జిక్కీ, ఎం.ఎల్. వసంత కుమారి లాంటి దిగ్గజ గాయనీమణులున్నారు. వారందరి మధ్య ఉనికిని కాపాడుకోవడమంటే మాటలు కాదు వారిని మరిపించే పాటలు కావాలి.
1956 నుంచి 1980 వరకూ సుశీల హవా నడిచింది. ఆమె పాట లేని సినిమాలు అరుదు.
1956కు ముందు సుశీలకు చిన్న చిన్న పాత్రలకే పాడే అవకాశం దక్కేది. ‘తోడి కోడళ్లు’ చిత్రంతో ఆమెకు ఆ లోటు తీరిపోయింది. ఆ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. రెండు భాషల్లోనూ కథానాయిక సావిత్రినే.
‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ అనే కొసరాజు గీతానికి సుశీల స్వరం, సావిత్రి నటన తోడవడంతో ఆ పాట పెద్ద హిట్ అయింది.
బెంగాలీ నవలా రచయిత శరత్ రాసిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సాధించిన ఘన విజయం సుశీల జీవితాన్నే మార్చేసింది. ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు.
అంతకుముందు దొంగరాముడు సినిమా కోసం సుశీలతో పాడించాలని దుక్కిపాటి అనుకున్నారు. సుశీల గొంతు పీలగా ఉంటుందని, నూతిలోంచి వచ్చినట్టు వినిపిస్తుంటుందని ఆయనను కొందరు నిరుత్సాహ పరిచారు. అయినా ఆమెతోనే పాడించారు దుక్కిపాటి.
తొలిపాటగా ‘అనురాగము విరిసేనా ఓ రేరాజా.. ’ పాటను పాడించారు. ఆ పాట విన్న తర్వాత కూడా కొందరు తమను నిరుత్సాహ పరిచారని దుక్కిపాటి మధుసూదనరావు ఓ సందర్భంలో చెప్పారు.
ఆ సినిమాలోనే మరో పాట ‘భలే తాత మన బాపూజీ.. బాలల తాతా బాపూజీ’ కూడా పాడించారు. పీల గొంతు అన్నవారే తర్వాత నోరెళ్లబెట్టారు.
ఆమె పాటల ప్రత్యేకత చెప్పాలంటే గొంతులో మాధుర్యం, పదాల ఉచ్ఛరణలో స్పష్టత ఆమె ప్రత్యేకత. ఏ కథానాయికకు పాడినా ఆమె గొంతులానే అనిపించడం... ‘మనసే అందాల బృందావనం..’ అంటూ సాగే ఆ గాన మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
సావిత్రి, జమున, షావుకారు జానకి, వాణిశ్రీ మొదలుకుని జయప్రద, జయసుధల వరకూ ఎందరో అగ్రతారలకు ఆమె పాటలు పాడారు.

ఫొటో సోర్స్, Getty Images
నా ఆరాధ్య గాయని సుశీల: రెహమాన్
సుశీలను సినీ గాయనిగా పెండ్యాల పరిచయం చేశారు. పాటను భావగర్భితంగా ఎలా పాడాలో ఘంటసాల నేర్పారు. సాలూరి, కె.వి. మహదేవన్ లాంటి సంగీత దర్శకులు మధురమైన పాటలు పాడే అవకాశం ఇచ్చారు.
సినీ స్వర్ణ యుగంలో మహానుభావుల దగ్గర పాడటం తన అదృష్టం అంటారు సుశీల. అది యుగళ గీతం కావచ్చు.. భావ గీతిక కావచ్చు. అమ్మ ఒడిలో పలికించే లాలి పాట కావచ్చు.. వాన తడిలో మెరిపించే శృంగార గీతం కావచ్చు.. ఆ పాట ఆమె నోట పలికితేనే వీనులకు విందు.
తెలుగు సినిమాల్లో వీణపాటలతో సుశీల ఎంతో గుర్తింపు పొందారు.1961లో ‘భార్యాభర్తలు’ చిత్రం కోసం లలిత సంగీతానికి ఆద్యుడైన సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చి ‘ఏమని పాడెదనో ఈ వేళ...’ పాటను సుశీలతో పాడించి వీణ పాటకు నాంది పలికారు.
‘ఈ వీణకు శ్రుతి లేదు..’ ‘మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే’, ‘మ్రోగింది వీణా పదేపదే హృదయాలలోన..’ లాంటి వీణపాటలు సుశీలను చిరకాలం గుర్తుంచుకునేలా చేశాయి.
ఆత్రేయ వీణ పాటలు ఎక్కువగానే రాసినా వీణ పాట అంటే గుర్తుకు వచ్చేది మాత్రం దాశరథే. ఓ సందర్భాన్ని గుర్తు చేసుకుందాం.
ఆత్మీయులు చిత్రం కోసం మదిలో వీణలు మ్రోగే పాటను రికార్డు చేసే సమయమది. పదకొండు సార్లు రీటేక్ చేశారు. 12వ టేక్ విని పాట అద్భుతంగా వచ్చిందని ఓకే చేశారు సాలూరి రాజేశ్వరరావు. కానీ సుశీల ఒప్పుకోలేదు.. మరొకసారి పాడతానని పట్టుబట్టారు. అంతకన్నా బాగా రావడం అసాధ్యమని సాలూరి అన్నా ఆమె వినలేదు.
సుశీల పాట గురించి దాశరథి మాటల్లో చెప్పాల్సి వస్తే ‘నా పాటల్లో అత్యధికం సుశీల పాడినవే. ఆమె పాడుతుంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ ఏకమై బృందగానం చేస్తున్నట్టుంటుంది. చందమామ వీణ తీగలు పలికిస్తున్నట్టు ఉంటుంది’ అని అన్నారంటే ఆ కవి హృదయంలో ఆమె స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
‘నేను ఆరాధించే గాయని ఎవరైనా ఉన్నారంటే వారు సుశీల మాత్రమే’ అని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒక సమయంలో అన్నారు.
‘మరణానికి ముందు తనకు చివరి కోరిక ఇస్తే తలుపులు మూసి ఏకాంతంగా సుశీల పాట వినడమే అవుతుంది’ అంటూ తమిళ కవి వైరముత్తు ఓ సందర్భంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, P.Suseela/FB
రెండు తరాల వారితో..
ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వారితో కలిసి పనిచేశారు సుశీల.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతోనే కాదు ఆయన కుమారుడు చరణ్‌తోనూ పాడారు సుశీల. కేజే ఏసుదాసుతో పాటు ఆయన కుమారుడితోనూ పాడారు. ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు కార్తీక్ రాజా స్వరకల్పనలోనూ గళాన్ని అందించారు.
నటి జయచిత్రకూ ఆమె తల్లి అమ్మాజీకీ నేపథ్య గానం చేశారు. ఇక తన సహ గాయని ఎస్. జానకితో కలిసి దాదాపు 90 పైచిలుకు పాటలు పాడారు.
పల్లవిలో ‘పాట’ అనే పదం వచ్చిన పాటలు సుశీల ఎన్నో పాడారు. అందులో చాలా పాటలు పెద్ద హిట్టు.
నా పాట నీ నోట పలకాల సిలకా, పాడమని నన్నడగవలెనా, పాడనా తెలుగు పాట, పదే పదే పాడుతున్నా... పాడిన పాటే, పాడవోయి భారతీయుడా’ లాంటి మధుర గీతాలెన్నో ఉన్నాయి.
‘మూగమనసులు’ చిత్రం కోసం ఆత్రేయ మాను మాకును కాదు.. అనే పాట రాశారు. అందులో మాను, మాకు, రాయి, రప్ప అనే పదప్రయోగం చేశారు ఆత్రేయ. ఆ పదాలు కవితా వస్తువులు కాదని కొందరు వాదించారు. అయినా సుశీల గాత్రంలో ఆ పాట విన్నాక విమర్శలు ఆగిపోయాయి.
గాయని పి. లీలతో కలిసి సుశీల ‘లవకుశ’ చిత్రం కోసం పాడిన ‘రామకథను వినరయ్యా..’ పాటను ఎవరూ మరువలేరు.
1970 తర్వాత సినిమా దశ, దిశ మారింది. ఈ కాలంలో సుశీల పాడిన కొన్ని పాటలతో ఆమె బాధపడిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవలే ఆమె కాస్త అనారోగ్యానికి గురైనా తిరిగి కోలుకున్నారు. 90 ఏళ్ల వయసులోనూ ఆమె గాన మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు.
ఐదు జాతీయ అవార్డులు
భారత ప్రభుత్వం సుశీలను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా సుశీలకు ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కాయి.
గాయనిగా సుశీల ఏపీ ప్రభుత్వ నందులతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం పొందారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా పి. సుశీల సొంతమయ్యాయి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆమె పేరిట ఉంది.
2008లో పి. సుశీల ఒక ట్రస్టును ప్రారంభించారు. సంగీతకారులకు నెలవారీ పింఛను అందించడం, ప్రతి నవంబరులో నిధుల సేకరణకు సంగీత కచేరి నిర్వహించడం చేస్తున్నారు. జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. పీబీ శ్రీనివాస్, ఎస్. జానకి, వాణీ జయరాం, ఎల్ .ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.జె. ఏసుదాస్‌లాంటి వారు ఇప్పటిదాకా ఈ పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు.
తెలుగు శ్రోతలతో పెనవేసుకొన్న ఎన్నెన్నో జన్మల బంధం పి. సుశీలది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














