బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే ఎలా? ఏమేం ఆప్షన్లు ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ ఎనలిస్ట్, బీబీసీ కోసం
బంగారానికి భారతీయులకూ విడదీయరాని బంధం ఉంది. బంగారం ఇప్పటికీ, ఎప్పటికీ దర్పానికి ప్రతీక. బలమైన ఫైనాన్షియల్ బ్యాకప్‌గానూ చెప్పుకోవచ్చు.
వ్యక్తులకే కాదు, దేశాలకు, వివిధ ఆర్థిక సంస్థలకు కూడా బంగారం ఓ రిజర్వ్ మెకానిజం. అందుకే పుత్తడిని దాచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఓ కల్చర్‌గా ఉంది.
ఇంతకీ బంగారం పెట్టుబడుల్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏది? ఖరీదైన ఎంపికల వెంట ఎందుకు పడుతున్నాం? చరిత్రలో బంగారం ఇచ్చిన రాబడులు ఎలా ఉన్నాయి? ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఇస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఈ కథనంలో అందిస్తున్నాం.


ఫొటో సోర్స్, Getty Images
ఈక్విటీ మార్కెట్ల కన్నా ఎక్కువ రాబడి
బంగారాన్ని కొని బాగుపడ్డ వాళ్లే కానీ, చెడిన వాళ్లు లేరని పెద్దలంటారు. కానీ ఎక్కువ ధరల వద్ద కొంటే, ఏ వస్తువైనా నష్టాలు చూడాల్సిందే. అందుకు బంగారం మినహాయింపేమీ కాదు.
కానీ, గత కొన్నేళ్ల నుంచి బంగారం మంచి రాబడులు ఇస్తోంది. డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో తనకి కూడా ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది.
నిఫ్టీతో పోలిస్తే బంగారం ఇచ్చిన వార్షిక రాబడి సగటు గత ఏడాది కాలంలో 30.7 శాతం, మూడేళ్ల కాలంలో 17.1 శాతం, ఐదేళ్లలో 14.3 శాతం, పదేళ్లలో 10.5 శాతంగా ఉంది.
అదే సమయంలో నిఫ్టీ ఏడాదిలో 25.6 శాతం, మూడేళ్లలో 12.1 శాతం, ఐదేళ్లలో 16.3 శాతం, పదేళ్లలో 12.3 శాతం రాబడులు ఇచ్చింది.
ఈ లెక్కన ఈక్విటీ మార్కెట్స్‌తో సరిసమానంగా... ఇంకా చెప్పాలంటే కొద్దిగా ఎక్కువ రాబడులు ఇచ్చింది బంగారం.
మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు, నష్టాలు, ట్రేడింగ్ రిస్కులు, ఒత్తిడులను భరిస్తూ వచ్చిన రాబడుల కంటే సింపుల్‌గా 'ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్' పద్ధతిలోనే బంగారం మంచి రాబడులు ఇస్తోందని రుజువవుతోంది.
చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్, వాళ్లు అన్వేషించిన ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ముందుగా రియల్ ఎస్టేట్, బంగారం... తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్స్ మాత్రమే మనకు తెలుసు.
అయితే, ఈ మధ్యే మెల్లిగా ఈక్విటీస్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ వైపు జనం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ స్టాక్స్, ఫండ్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం కేవలం 18.4 శాతం మాత్రమే.
దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 17 కోట్లు దాటింది.

ఫొటో సోర్స్, Getty Images
మన పెట్టుబడిలో బంగారం వాటా ఎంత?
పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల ప్రకారం పెట్టుబడి పెట్టాలనుకునేవారు అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అన్నిపెట్టుబడులూ ఒకేదానిపై ఉంచితే... అందులో ఏదైనా తేడా జరిగితే మొత్తానికే ప్రమాదం ఉంటుంది.
అందుకే మన దగ్గర మదుపు చేయడానికి వంద రూపాయలు ఉన్నాయనుకుంటే దాన్ని మూడు, నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. 100 నుంచి మీ వయసును తీసేస్తే ఎంత ఉంటుందో అంత శాతం ఈక్విటీస్‌కు మళ్లించవచ్చు.
ఉదాహరణకు మీ వయస్సు 35 ఏళ్లు అనుకుంటే 100-35= 65. అంటే 65 శాతం వరకూ స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెట్టొచ్చు. మిగిలిన 35 శాతంలో 10 శాతం వరకూ బంగారంలో పెట్టుబడులకు కేటాయించవచ్చు. 15 శాతం వరకూ రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వ స్కీముల్లో మదుపు చేయొచ్చు. మిగిలిన 10 శాతాన్ని నగదుగా ఉంచుకోవడం మంచిది.
మన ఆర్థిక అవసరాలు, రిస్క్ తీసుకోగలిగే సామర్థ్యం, అప్పులు, భవిష్యత్ అవసరాల ఆధారంగా కూడా అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజికల్ గోల్డ్ సురక్షితమేనా?
ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ల పెళ్లిళ్లకు బంగారాన్ని పోగేయాల్సి ఉంటుంది. ఒకేసారి ముప్ఫై, నలభై గ్రాముల బంగారు నగలు తీసుకోవడం మధ్యతరగతి కుటుంబాలకు భారమే. అందుకే చాలామంది ఏదో ఒక గోల్డ్ షాపులో అందిస్తున్న స్కీమ్స్ కడుతూ, ప్రతి ఏటా ఎంతో కొంత బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. దీన్నే ఇన్వెస్ట్‌మెంట్‌లా భావిస్తూ సంబరపడుతుంటారు.
కానీ, నిజంగా బంగారాన్ని నేరుగా కొనడం వల్ల ఎంత నష్టపోతున్నామో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నవంబర్ 11న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,220.
30 గ్రాముల బంగారు ఆభరణాన్ని మీరు కొన్నారని అనుకుందాం. దాన్ని ఆ రోజు ధరతో లెక్కిద్దాం.
91.6 గోల్డ్ ధర రూ.7,220 (7,220*30 గ్రాములు) - రూ.2,16,600
తయారీ, వేస్టేజ్ (వీఏ) కనిష్ఠంగా 16 శాతం - రూ.34,656
జీఎస్టీ 3 శాతం (గోల్డ్ ధరపై) - రూ.6,498
మొత్తం ధర - రూ.2,52,754
ఈ లెక్కన గ్రాము బంగారం ధరకు మీరు చెల్లించిన మొత్తం రూ.8,425 (2,52,754/30)
ఈ లెక్కను బట్టి చూస్తే మనం బంగారం కొంటున్నప్పుడు కనిష్ఠంగా సుమారు 16-19 శాతం అధికంగా ధరను చెల్లిస్తున్నాం. అలాంటప్పుడు ఇది ఏ లెక్కన ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలో మీరే అర్థం చేసుకోవాలి.
ఉన్న డిజైన్ మార్చి మరో డిజైన్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రముఖ సంస్థలు వెయిట్ టు వెయిట్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నప్పటికీ, కొత్త వాటిపై మళ్లీ మేకింగ్, వేస్టేజ్, వాల్యూ అడిషన్ పేరుతో మరో 20 శాతం వరకూ ధరను కోల్పోవాల్సి ఉంటుంది.
ఇలా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే అసలు బంగారమే కొనలేం అని నిట్టూర్చినా ఆశ్చర్యం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజికల్ గోల్డ్ ఎవరికి మంచి ఆప్షన్?
మేకింగ్, వాల్యూ అడిషన్ లేకుండా ఈ రోజుల్లో బంగారం ఎవరు అమ్ముతున్నారు? ఎక్కడ కొన్నా ఇవి తప్పవు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడో తేడాను గమనించాలి. పెట్టుబడి కోసం కొంటున్నామా.. పెట్టుబడి పేరు చెప్పి కొంటున్నామా అని.
భవిష్యత్‌లో పెట్టుబడి కోసమైతే మాత్రం ఇది ముమ్మాటికీ బెస్ట్ ఆప్షన్ కానే కాదు. బంగారం వ్యాపారుల ఆదాయాన్ని పెంచడానికి మీరు పడే కష్టమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
పెట్టుబడిపై రాబడి మొదట్లోనే 20 శాతం మైనస్ చూపిస్తుంటే ఇంకేమనాలి. మనం కొనే బంగారం.. ఈ మైనస్‌ను కవర్ చేస్తూ భారీ రాబడులు ఇచ్చినప్పుడే మనకు లాభం వచ్చినట్లు లెక్క.
దగ్గర్లో పెళ్లి ఉంది, మనం అప్పటి వరకూ దాచుకున్న బంగారం పెద్దగా లేదు. ఆ సమయంలో బంగారం కొనడం తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి వాళ్లకు మాత్రమే గోల్డ్ కొనడం సూటవుతుందని చెప్పొచ్చు.
బంగారం కొన్నామన్న తృప్తితో పాటు ఎంతో కొంత రాబడులు వస్తే చాలు అనుకునేవాళ్లు ఫిజికల్ గోల్డ్ కొనడం గురించి ఆలోచించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గోల్డ్ బిస్కెట్స్ కొనొచ్చా?
ఆర్థిక స్థోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్స్ రూపంలో తీసుకోవడం మంచిది. మార్కెట్లో ఉన్న హోల్‌సేల్ ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పైగా వాల్యూ అడిషన్ పేరుతో ఇక్కడ అదనపు బాదుడు దాదాపుగా ఉండదు. కాకపోతే దాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీల గురించి కూడా ఆలోచించాలి.
గోల్డ్ కాయిన్స్ కొనడం మంచిదేనా?
కొందరు అర గ్రాము, గ్రాము, రెండు గ్రాములు.. ఇలా బంగారం కాయిన్స్ కొంటుంటారు. వీటికి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీలు అత్యధికంగా ఉంటాయి. అందుకే వెయిట్ టు వెయిట్ మార్చుకునే సౌలభ్యం ఉన్నప్పుడే కాయిన్స్ కొనడం గురించి ఆలోచించండి. లేకపోతే ఇది చాలా కాస్ట్‌లీ ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఇతర ఆప్షన్స్ ఏం ఉన్నాయి?
పెట్టుబడిగా బంగారం గురించి ఆలోచించే వాళ్లకు మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటి వివిధ ఎంపికలు ఉన్నాయి. పేర్లు వేరైనా వీటి లక్ష్యం దాదాపు ఒకటే.. మంచి రాబడులు ఇవ్వడం.
గోల్డ్ ఈటీఎఫ్స్: ఇవి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బంగారాన్ని నేరుగా కొనుగోలు చేస్తాయి. ఇవి స్టాక్ మార్కెట్లో యూనిట్స్ రూపంలో ట్రేడ్ అవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రూ గోల్డ్ ఈటీఎఫ్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షణ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్‌కు ఉత్తమ ప్రత్యామ్నాయం ఇది.
గోల్డ్ ఫండ్స్: గోల్డ్ ఈటీఎఫ్స్ సహా గోల్డ్ మైనింగ్, ట్రేడింగ్ వంటి వాటిలో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఎస్బీఐ గోల్డ్ ఫండ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Value research online
సావరిన్ గోల్డ్ బాండ్స్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని విడుదల చేస్తుంది. వీటికి ఏటా 2.5 శాతం రాబుడులతో పాటు మెచ్యూరిటీ సమయంలో పన్ను లేకపోవడం మరో ప్రయోజనం. భారత ప్రభుత్వమే అందజేస్తోంది కాబట్టి జీరో రిస్క్. కానీ ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు ఈ బాండ్లను ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఈ బాండ్స్ కూడా ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతాయి. ఆ సమయంలో ఉన్న ధరను బట్టి యావరేజ్ చూసి ఆర్బీఐ ధర నిర్ణయిస్తుంది.
డిజిటల్ గోల్డ్: టాటా, రిలయన్స్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు మార్కెట్లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.78,820 (నవంబర్ 11) ఉంది. అదే టాటా డిజిటల్ గోల్డ్‌లో రూ.79,986 (వెబ్‌సైట్ ధర), రిలయన్స్ జ్యూవెల్స్‌లో రూ.79,330 (వెబ్‌సైట్‌లో నవంబర్11న ధర) ఉంది. మీ అకౌంట్‌లో ఈ గోల్డ్‌ను యూనిట్స్ రూపంలో ఉంచుతారు. మీకు అవసరమైన రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చూసుకుని అమ్మి క్యాష్ చేసుకోవచ్చు.
11 నెలల గోల్డ్ స్కీమ్స్: చిన్న చిన్న బంగారం షాపుల నుంచి ప్రధాన నగల వ్యాపార సంస్థలన్నీ 11 నెలల గోల్డ్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఒక్క నెల మొత్తాన్ని బోనస్‌గా ఇస్తే, మరికొందరు ఏ నెలకు ఆ నెల మనం కట్టిన మొత్తానికి తగ్గట్టు బంగారం మనం ఖాతాలో జమ చేస్తారు. చివరకు వాళ్ల దగ్గరే నగలను కొనాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు బంగారం కొనొచ్చా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు, చైనాలో ఉద్దీపన ప్యాకేజీలు, వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డీ రేట్లు, ప్రపంచంలో కరోనా తర్వాత మందగించిన వృద్ధి.. ఇలా చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ గోల్డ్‌కు పాజిటివ్ అంశాలు. బంగారం ధర పెరగడానికి ఇవన్నీ కలిసొచ్చే అంశాలు.
ముందే చెప్పినట్లు ఈ ఏడాది బంగారం సుమారు 30 శాతం లాభాలనిచ్చింది. గత మూడు నెలల్లోనే రూ.70 వేల నుంచి రూ.81 వేల వరకు వెళ్లింది. వెండి కూడా రిటైల్ మార్కెట్లో లక్ష మార్కును ఎప్పుడో దాటేసింది.
ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీతో పాటు ఇండస్ట్రియల్ అవసరాలకు వెండి వినియోగం పెరగడం కూడా రేటు పెరగడానికి కారణమవుతోంది.
అయితే, రూపాయి విలువ పతనం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. 2025లో కూడా పరిస్థితులు ఇప్పటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండే అవకాశాలు పెద్దగా కనిపించట్లేవు. పెళ్లిళ్లు వంటి తక్షణ అవసరాలున్న వాళ్లు ధర ఎంతున్నా బంగారం కొనక తప్పదు.
ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూద్దాం అనుకునేవాళ్లు ఈ పరిస్థితుల్లో బంగారంలో పెద్ద ఎత్తున డబ్బును పెట్టడం కొద్దిగా రిస్క్ అవుతుంది. డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని జనవరిలో చేపట్టిన తర్వాత అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై దాని ప్రభావం పడొచ్చు. ఈ నిర్ణయాలు డాలర్ బలపడటానికి దోహదపడొచ్చు. పరోక్షంగా బంగారం ధరలు తగ్గే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచన ఉన్నవాళ్లు ప్రస్తుతానికి వేచి ఉండటం ఉత్తమం.
సిప్ పద్ధతిలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మంచి ఆప్షన్ అవుతుంది. ఎప్పుడైనా ఆర్బీఐ ప్రకటన చేసినప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి గురించి ఆలోచించవచ్చు.
(గమనిక: ఈ సమాచారం అంతా అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలైనా ఆర్థిక నిపుణులను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














