విస్తారా: ముగిసిన 9 ఏళ్ల ప్రస్థానం, ఇక అంతా ఎయిర్ ఇండియానే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బిజినెస్ ప్రతినిధి
తొమ్మిదేళ్లుగా సేవలు అందించిన విస్తారా విమానయాన సంస్థ సోమవారం సాయంత్రం తన చివరి సర్వీసును నడిపింది.
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ విస్తారా.... టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనమైంది.
ఇక నుంచి విస్తారాకు సంబంధించిన హెల్ప్ డెస్క్, టిక్కెట్స్ వంటి అన్ని రకాల కార్యకలాపాలు ఎయిర్ ఇండియా చూసుకుంటుంది.
ఇప్పటికే విస్తారా బుకింగ్స్, లాయల్టీ ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రయాణికులను ఎయిర్ ఇండియాకు బదిలీ చేసే ప్రక్రియ కొన్ని నెలలుగా సాగుతోంది.
“విలీన ప్రక్రియలో భాగంగా భోజనం, సేవలు, ఇతర సున్నితమైన అంశాలు అప్‌గ్రేడ్ చేశాం. ఇందులో విస్తారా, ఎయిర్ ఇండియా రెండింటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.
విలీనంతో సర్వీసుల్లో ప్రమాణాలు తగ్గుతాయనే ఆందోళనలు ఉన్న నేపథ్యంలో.... మున్ముందు కూడా విస్తారా స్థాయి ప్రమాణాలను ప్రయాణికులకు అందిస్తామని టాటా గ్రూప్ హామీ ఇస్తోంది.
నాణ్యమైన ఆహారం, సర్వీస్, క్యాబిన్ ప్రమాణాల ద్వారా విస్తారా కస్టమర్ల విశ్వసనీయత చూరగొంది. అయితే, విస్తారా బ్రాండ్‌ను నిలిపివేయాలనే నిర్ణయాన్ని అభిమానులతో పాటు బ్రాండింగ్ నిపుణులు, విమానయాన విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
విస్తారా నష్టాలను తగ్గించే దిశగా ఈ విలీన ప్రక్రియ సమర్థవంతంగా జరిగిందని విమానయాన రంగ విశ్లేషకుడు మార్క్ మార్టిన్ అన్నారు. అయితే, నష్టాలను కలిగించే విమానయాన సంస్థను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడం నిరాశకు గురి చేసిందన్నారు.
"విలీనం అంటేనే విమానయాన సంస్థలను శక్తిమంతంగా మార్చడం. అంతేకాని, నష్టాలను పూడ్చటానికి ఒక మార్గంలా చూడకూడదు” అని ఆయన అన్నారు.
విస్తారా, ఎయిర్ ఇండియా నష్టాలు గతేడాదిలో సగానికిపైగా తగ్గాయి. ఇతర కార్యకలాపాల ప్రమాణాలు కూడా మెరుగయ్యాయి. అయినప్పటికీ, ఇప్పటి వరకు జరిగిన విలీన ప్రక్రియ గందరగోళంగానే ఉంది.
పైలట్‌ల కొరత కారణంగా భారీ విమాన సర్వీసులను రద్దు చేయడం, ఎయిర్ ఇండియాలోనూ తమ జీతాలు మంచిగా ఇవ్వాలనే డిమాండ్‌తో విస్తారా ఉద్యోగులు సామూహిక సిక్ లీవ్స్ తీసుకోవడం వంటి సమస్యలు ఉన్నాయి.
వీటితో పాటు ఎయిర్ ఇండియా సర్వీసులు నాసిరకంగా ఉంటాయనే ఫిర్యాదులు అనేకం. విరిగిపోయిన సీట్లు, సరిగ్గా పని చేయని పరికరాలు అంటూ అనేక వీడియోలు వైరల్ అయ్యాయి.


ఫొటో సోర్స్, Getty Images
అనేక సవాళ్లు
పాత విమానాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 400 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. అలాగే, వందలకొద్ది కొత్త ఎయిర్ బస్సులు, వందల కోట్ల విలువ గల బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చారు.
అయినప్పటికీ, ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయని మార్టిన్ అన్నారు. సాధారణంగానే విలీన ప్రక్రియ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తుందన్నారు.
'విలీనం' బ్రాండింగ్ విలువను కూడా దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారతీయ విమానయాన రంగంలో ప్రీమియం సేవలు అందిస్తున్న విస్తారా సేవలు నిలిచిపోవడంపై బ్రాండ్ వ్యూహాల నిపుణుడు హరీష్ బిజూర్ భావోద్వేగానికి గురయ్యారు. పరిశ్రమకు ఇదో పెద్ద నష్టమని అన్నారు.
విస్తారా లాంటి ఉన్నతస్థాయి సేవలను అందిపుచ్చుకోవడం ఎయిర్ ఇండియాకు అంత సులువేం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు ఎయిర్ ఇండియా కార్యకలాపాలు వేరుగా నిర్వహిస్తే బాగుంటుందని హరీష్ బిజూర్ సూచించారు.
ఎయిర్ ఇండియాలోని లోపాలను సరిదిద్దుకుంటూ, విస్తారా స్థాయి సేవలు అందిపుచ్చుకునేందుకు ఈ సమయం చక్కటి అవకాశంగా ఉపయోగపడుతుందని అన్నారు.
బ్రాండింగ్‌కు మించి విలీన సంస్థ అనేక రకాలైన కార్యనిర్వాహక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Shutterstock
ఒకేరకమైన సేవలు అందుతాయా?
“ఇక నుంచి విస్తారాలో వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా విమానాలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో సమాచారమనేది పెద్ద సవాలుగా మారనుంది. కాబట్టి, కొన్ని వారాల పాటు స్పష్టమైన సమాచారాన్ని అందించాలి” అని అజయ్ అవతానీ అన్నారు. ఈయన లైవ్ ఫ్రమ్ ఎ లాంజ్, ఏవియేషన్ పోర్టల్ ఎడిటర్.
విస్తారాలో ఒక రకమైన పని సంస్కృతికి అలవాటుపడిన ఉద్యోగులు, ఎయిర్ ఇండియాలోని పరిస్థితులకు అనుగుణంగా పని చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది.
విస్తారా, ఎయిర్ ఇండియా అనే తేడా లేకుండా విలీనంతో ఒకే రకమైన ప్రయాణ సదుపాయాల్ని అందించడం టాటా గ్రూప్ ముందున్న అతి పెద్ద సవాల్‌గా చెప్పుకోవచ్చు.
“విభిన్నమైన సర్వీసులు అందించే రెండు ఎయిర్ లైన్స్ ఏకమయ్యాయి. దీంతో సేవలు, క్యాబిన్‌లు, బ్రాండింగ్, ప్రయాణికుల అనుభవం తదితరాలు కలగూర గంపగా మారే అవకాశం ఉంది” అని మార్టిన్ అన్నారు.
అయితే, విస్తారా సర్వీసులను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించాల్సిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
పురాతనమైన బ్రాండ్ ఎయిర్ ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దాని గుర్తింపులోనే ‘ఇండియా’ ఉంది.
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడటం వల్ల టాటా గ్రూప్‌కు నష్టమే. అలా కాకుండా, విస్తారా- ఎయిర్ ఇండియాల సంయుక్త బలంతో టాటా గ్రూప్.... మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న ఇండిగోతో పోటీ పడేందుకు మెరుగైన స్థితిలో నిలబడే అవకాశం ఉంది.
“దాదాపు 300 విమానాలు, విస్తృతమైన నెట్‌వర్క్, బలమైన వర్క్ ఫోర్స్‌తో ఏకీకృత ఎయిర్ ఇండియా గ్రూప్ మెరుగైన స్థితిలో ఉంది” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
“ఈ విలీన ప్రక్రియ పూర్తైన తరువాత ఎయిర్ ఇండియా రాత్రికి రాత్రే పెద్ద సంస్థగా అవతరిస్తుంది. దీంతో, ఇన్నాళ్లు పోటీపడిన రెండు సంస్థలు ఇప్పుడు సహకరించుకుంటాయి. అయితే, విలీనానికి ఒక మంచి రోజు అంటూ ఏది ఉండదు. ఏదో ఒక రోజు పని మొదలుపెట్టాల్సిందే” అని అవతానీ చెప్పారు.
విస్తారా సేవలు నిలిచిపోవడంతో భారత్‌లో ప్రీమియం సేవలు అందించే రంగంలో శూన్యత ఏర్పడిందని ఆ సంస్థకు చెందిన కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఎయిర్‌లైన్ సర్వేలలో తరచుగా అట్టడుగులో ఉండే ఎయిర్ ఇండియా ఆ శూన్యతను విజయంవతంగా భర్తీ చేస్తుందో లేదో ఇప్పుడే అంచనా వేయలేం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














