COP29: ఈ సదస్సు ఎందుకు నిర్వహిస్తారు, ట్రంప్ గెలుపు దీనిపై చూపే ప్రభావం ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్, జార్జినా రన్నార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
స్పెయిన్‌లో ఇటీవల వచ్చిన భారీ వరదల్లాంటి వైపరిత్యాలకు కారణమవుతున్న పెరిగే భూతాపం సమస్య నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై చర్చించేందుకు ప్రపంచదేశాల అధినేతలు కాప్-29 సదస్సుకు హాజరు కాబోతున్నారు.
ఈ సంవత్సరం అజర్‌బైజాన్‌లో జరగబోతున్న ఈ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు సహకరిస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం ఎలా అందించాలన్నదే ప్రధానాంశం.
అయితే, క్లైమేట్ చేంజ్ అంశాన్ని పెద్దగా లెక్కచేయని డోనల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడు కావడం, కొనసాగుతున్న యుద్ధాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ఈ సమావేశంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
పైగా కొందరు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం లేదు.
ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న అజర్ బైజాన్ మానవహక్కుల ట్రాక్ రికార్డు మీద చాలామందికి అభ్యంతరాలున్నాయి. అలాగే ఈ సమావేశాన్ని తమ చమురు ఒప్పందాలకు ఉపయోగించుకునేందుకే నిర్వహిస్తోందన్న విమర్శలు కూడా అజర్ బైజాన్ మీద వస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
COP29 అంటే ఏమిటి?
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న అతి పెద్ద సదస్సు COP29. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరుగుతుంది.
రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఉండే మధ్య ఉండే ఆసియా దేశం అజర్‌బైజాన్. ఆ దేశ రాజధాని బాకు నగరం ఈ సదస్సుకు వేదిక.
‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ అనే మాటకు సంక్షిప్త రూపమే కాప్ (COP). ఈ యేడాది జరగబోతున్నది 29వ సదస్సు కావడంతో దీనిని కాప్29 అని అంటున్నారు.
ఈ సమావేశానికి సర్వసాధారణంగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరవుతారు. అయితే, కార్బన్ ఉద్గారాలు అత్యధికంగా ఉండే కొన్ని దేశాల అధినేతలు ఈ సంవత్సరం సమావేశానికి హాజరుకావడం లేదు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా నేత షీ జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్‌లు ఈ సమావేశానికి రావడం లేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌లాంటి కొందరు నేతలు హాజరవుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ సదస్సులో ఏం చర్చిస్తారు?
ఈ సంవత్సరం ప్రధానమైన చర్చనీయాంశం ఆర్థిక సాయం. 2015లో జరిగిన పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ పెరగకుండా నిరోధించడానికి ప్రపంచ నాయకులు కట్టుబడి ఉండాలి. దీనికి కట్టుబడి ఉండటమంటే అన్ని దేశాల అధినేతలు తమ దేశాలలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలి.
ఈ ఒప్పందంలో భాగంగా, 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నగదు సహాయం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకోవాలి. ఈ నగదు సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తాయి.
ఈ సదస్సు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో కీలకమని భావిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు అంత గొప్పగా ఏమీ లేవు.
2030 నాటికి వాతావరణ ఆర్థిక సాయం మొత్తాన్ని ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువగా ఉండేలా చూడాలని ఆఫ్రికన్ దేశాలు, చిన్న ద్వీప దేశాలు కోరుకుంటున్నాయి.
చైనాతోపాటు, కొన్ని గల్ఫ్ దేశాలను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో చేర్చారు. అందువల్ల ఈ సహకారం అందించడం నుంచి అవి మినహాయింపు పొందాయి.
అయితే, సహాయం మొత్తాన్ని పెంచడం ఈ దేశాలను కూడా ఆర్థిక సాయంలో భాగస్వాములను చేసినప్పుడే సాధ్యమవుతుందని యూరోపియన్ యూనియన్‌తోపాటు కొన్ని సంపన్న దేశాలు వాదిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అజర్‌బైజాన్‌లో సదస్సు ఎందుకు వివాదాస్పదమైంది?
వచ్చే పదేళ్లలో గ్యాస్ ఉత్పత్తిని మూడింతలు పెంచడానికి అజర్ బైజాన్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే, ఇలాంటి ప్లాన్‌లు ఉన్న దేశం శిలాజ ఇంధనాలను తగ్గించాలన్న లక్ష్యానికి సంబంధించిన సదస్సుకు ఆతిథ్యమివ్వడంపై కొందరు అభ్యంతరం చెబుతున్నారు.
అసలు శిలాజ ఇంధనాలే వాతావరణ మార్పులకు ప్రధాన కారణం.
తమ దేశంలోని జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో పెట్టుబడులను పెంచుకోవడానికి అజర్‌బైజాన్ అధికారులు ఈ వాతావరణ సదస్సును ఉపయోగించుకునే ప్రయత్నాలలో ఉన్నారని బీబీసీ గతంలోనే రిపోర్ట్ చేసింది. ఈ ఆందోళన కూడా కొందరిలో ఉంది.
రాజకీయ వ్యతిరేకతను సహించని, మానవ హక్కుల రికార్డు అంత గొప్పగా లేని ఈ దేశంలో జరిగే ఈ కీలక సదస్సుపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
డోనల్డ్ ట్రంప్ ఎన్నిక ప్రభావం సదస్సుపై ఉంటుందా?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్‌కు వాతావరణ మార్పులు విషయంపై పెద్దగా ఆసక్తి లేదు. గతంలో ఆయన ఈ వ్యవహారాలన్నింటినీ పెద్ద స్కామ్ అని కూడా అభివర్ణించారు. ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం తమ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బని వాతావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి డోనల్డ్ ట్రంప్ ఈ సదస్సుకు రావడానికి అవకాశం లేదు. జో బైడెన్ కూడా హాజరుకావడం లేదు. ఒకవేళ అమెరికా ఇక్కడ జరిగే సదస్సులో ఏవైనా ఒప్పందాలపై సంతకాలు చేసినా, రాబోయే ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ ఎన్నిక కావడంతో అసలు అమెరికా మొత్తంగా పారిస్ ఒప్పందం నుంచే బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
అయితే, ఆయన ఎన్నిక వల్ల దేశాల మధ్య సరికొత్తగా ఐక్య బంధాలు ఏర్పడి, పేద దేశాలకు ఆర్థిక సాయం విషయంలో ఒకే రకమైన ఆలోచనలున్నదేశాలు కొత్త కూటమిగా మారే అవకాశం కూడా ఉంది.
ట్రంప్ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా, ఈ సమష్టి ప్రతిస్పందన వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంవత్సరం జరిగిన వాతావరణ మార్పులు ఏంటి?
యూరోపియన్ క్లైమేట్ సర్వీస్ అంచనాల ప్రకారం, తీవ్రమైన హీట్‌వేవ్‌లు, తుపానుల కారణంగా 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నమోదుకానుంది.
సముద్రాలు వేడెక్కిన కారణంగా హెలెన్, మిల్టన్ లాంటి శక్తివంతమైన తుపానులను ప్రపంచం చవి చూసింది.
అక్టోబరులో స్పెయిన్‌లో వరదలు సంభవించి కనీసం 200 మంది మరణించారు. ఈ వరదలకు మధ్యధరా సముద్రంలో అధిక సముద్ర ఉష్ణోగ్రతలే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఈ చర్చలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
కాప్ సదస్సులో ఒప్పందాల కారణంగా వివిధ దేశాలు తమ కొత్త ఆర్థిక ప్రణాళికలను అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయడం లాంటివి.
మనం ఎంత పవర్‌ను ఉపయోగిస్తాము, మనకు వచ్చే బిల్లులు ఎంత అన్నది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది.
పేద దేశాలకు పెద్ద మొత్తంలో నిధులు చెల్లించడానికి ఈ సదస్సు వేదికగా మారుతుంది.
యూకేలాంటి దేశాలలో ఈ డబ్బు సామాన్యులు చెల్లించే ట్యాక్సుల నుంచి వస్తుంది. అయితే ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద మొత్తంలో సహాయం అందిస్తాయని భావిస్తున్నారు.
దీర్ఘకాలికంగా చూసినట్లయితే, వాతావరణ మార్పులకు కారణమయ్యే కాలుష్యాన్ని నిరోధించడం, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పరిశుభ్రమైన ప్రపంచాన్ని నిర్మించడం అన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














