దక్షిణ సూడాన్: మురికి నీటిని తాగడమా... దాహంతో చనిపోవడమా..?

దక్షిణ సూడాన్‌లో మంచినీళ్ల కోసం ప్రజల అవస్థలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ సూడాన్
    • రచయిత, మౌరా అజక్, స్టెఫానీ స్టాఫర్డ్
    • హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ

దక్షిణ సూడాన్‌లోని గడ్డిమైదానాల్లో ఒక చిన్న చెరువు నుంచి మురికి నీటిని తీస్తున్న పశువుల కాపర్లకు...వాటిని తాగితే కలిగే ప్రమాదాల గురించి చాలా బాగా తెలుసు.

‘‘ఈ నీళ్లు బాగా మురికిగా ఉంటాయి. ఎందుకంటే ఇది చమురు ఉండే ప్రాంతం’’ అని పశువుల కాపరుల ముఖ్య నాయకుడు చిల్‌హాక్ పౌట్ చెప్పారు.

‘‘ఈ నీటిని తాగితే దగ్గు, ఆయాసం వస్తాయి’’ అని చమురు నిల్వలకు కేంద్రప్రాంతమైన రాష్ట్రంలో ఆవులను కాచే సమాజానికి చెందిన మహిళ న్యాతాబా చెప్పారు.

‘‘ఇవి మంచినీళ్లు కాదని మాకు తెలుసు. కానీ ఇంకెక్కడా మాకు మంచినీళ్లు లేవు. దప్పికతో చచ్చిపోతున్నాం’’ అని న్యాతాబా అనే మహిళ అన్నారు.

ఈ ప్రాంతంలో వస్తున్న వరదలు నీటివనరుల్లోకి కాలుష్యాన్ని తీసుకొస్తున్నాయని మాజీ ఆయిల్ ఇంజినీర్ డేవిడ్ బోజో లెజూ బీబీసీకి చెప్పారు.

ఊహించని వరదలు ఈ దేశాన్ని ముంచెత్తిన తర్వాత పెద్ద పెద్ద ప్రాంతాలు చాలా సంవత్సరాల పాటు నీళ్లలోనే ఉండిపోయాయి. దీనికి తోడు వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత దిగజార్చాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

వరదలు విపత్తులా మారాయని బోజో లెజు చెప్పారు. దీనికి తోడు చమురు నిల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మురికి నీరు దేశమంతా సైలెంట్ కిల్లర్‌లా మారిందని ఆయన తెలిపారు.

ప్రపంచంలో అతి చిన్న, పేద దేశాల్లో దక్షిణ సూడాన్ ఒకటి. అక్కడి ప్రభుత్వం చమురు ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రొరియాక్ ప్రాంతం

ఫొటో సోర్స్, David Bojo Leju

ఫొటో క్యాప్షన్, చమురుతో కలుషితమయిన నీళ్లు

2019 నుంచి ఆగని వరదలు

దక్షిణ సూడాన్‌లో చమురు ఉత్పత్తి రాష్ట్రమైన యూనిటీ స్టేట్‌ను కొన్ని సీజన్లలో ఎప్పుడూ వరదలు ముంచెత్తుతుంటాయి. 2019లో మాత్రం తీవ్రాతితీవ్రమైన వర్షాలతో వరద ప్రళయం ఏర్పడింది.

గ్రామాలు, గడ్డిభూములు, అడవులను ఆ వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత ఏటా అతిభారీవర్షాలు కొనసాగాయి. ఈ నీళ్లు నేల పొరల్లో నిలిచిపోయాయి.

2022లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యూనిటీ స్టేట్‌లో మూడింట రెండో వంతు మునిగిపోయిందని, ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పీ) వెల్లడించింది. అందులో 40శాతం ఇప్పటికీ నీళ్లలోనే ఉందని తెలిపింది.

గ్రేటర్ పయోనీర్ ఆపరేటింగ్ కంపెనీ(జీపీఓసీ) అనే ఆయిల్ కన్సార్టియంలో బోజో లెజు ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. ఇది భారత్, మలేసియా, చైనా ఆయిల్ కంపెనీల జాయింట్ వెంచర్. ఇందులో దక్షిణ సూడాన్ ప్రభుత్వానికి 5 శాతం వాటా ఉంది.

వీడియో క్యాప్షన్, వీడియో: క్లైమేట్ చేంజ్ సిరీస్‌లో భాగంగా దక్షిణ సూడాన్‌‌లో నెలకొన్న పరిస్థితులపై బీబీసీ ప్రత్యేక కథనం

ఐదేళ్ల క్రితం ప్రధాన పైప్‌లైన్ పగిలిపోవడంతో బోజో లెజు చమురు కలిసిన చెరువులను, నల్లబారిన మట్టి దిబ్బలను ఫోటోలు తీయడం, చిత్రీకరించడం మొదలుపెట్టారు. పశువుల కాపరులు నివసించే రొరియాక్ దగ్గర ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి.

చమురు బావులు, పైప్‌లైన్ల నుంచి లీకేజీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. కలుషితమైన మట్టిని రోడ్ల నుంచి దూరంగా తరలించడంలో తానూ పాలుపంచుకొన్నానని, అందువల్ల అవి కనిపించకపోవచ్చని బోజో తెలిపారు.

తన ఆందోళనల గురించి ఆయన కంపెనీ మేనేజర్లకు తెలియజేశారు. కానీ వాళ్ళు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయనన్నారు. ‘‘మట్టిని బాగు చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవు’’ అని ఆయన తెలిపారు.

దక్షిణ సూడాన్
ఫొటో క్యాప్షన్, బెంటియుకు సమీపంలో 1,40,000 మంది నిరాశ్రయులకు చోటు కల్పించారు.

లక్షకు పైగా పశువులు మృతి

ప్రొడ్యూసర్ వాటర్ – అంటే చమురును వెలికితీసినప్పుడు భూమి నుంచి వచ్చే నీటిలోనూ హైడ్రోకార్బన్లు, ఇతర కాలుష్య పదార్థాలు ఉంటున్నాయని బోజో లెజు ఆందోళన వ్యక్తంచేశారు. నీళ్లను సరిగ్గా శుద్ధిచేయడం లేదన్నారు.

ప్రొడ్యూసర్ వాటర్‌లో చమురు అంతర్జాతీయ ప్రమాణాల కన్నా చాలా ఎక్కువగా ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం సమావేశంలో ఇవి మా దృష్టికి వస్తాయి. ఈ చమురు నీరు తిరిగి వాతావరణంలోనే కలుస్తుంది.

‘‘ఈ నీరు చివరకు ఎక్కడకు చేరుతుంది అనేదే సమస్య’’ అని ఆయనన్నారు.

‘‘ప్రజలు మంచినీళ్లు తాగే నదులు, చెరువుల్లోకి, చేపల చెరువుల్లోకి ఈ నీరు చేరుతుంది’’

‘‘బోరు బావిలోకి కూడా ఈ నీళ్లు చేరతాయి. చమురులోని కొన్నిరసాయనాలు భూగర్భజలాల్లోకి చొచ్చుకుపోతాయి’’ అని బోజో వివరించారు.

ఎక్కడినుంచి వచ్చే నీరైనా సరే అది కలుషితమైపోయిందని ఆయనన్నారు.

2019లో తీవ్రమైన వర్షాలు ప్రారంభమైనప్పుడు చమురు చిందిన ప్రాంతాల్లో చుట్టూ మట్టి గట్లు వేశారు. కానీ నీటి ఉధృతిని అవి తట్టుకోలేకపోయాయి.

రొరియాక్‌లో పశువుల కాపరులు తాగే నీళ్ల నాణ్యతకు సంబంధించిన సమాచారం లేదు. అయితే ఆ నీళ్లతో తమ పశువులు జబ్బులు బారిన పడుతున్నాయని వాళ్లు భయపడుతున్నారు.

తలలు, అవయవాలు లేకుండా దూడలు పుడుతున్నాయని వారు చెబుతున్నారు.

చమురు కాలుష్యం కలిసిన వరదల వల్ల గత రెండేళ్లలో లక్షకు పైగా పశువులు చనిపోయాయని వ్యవసాయశాఖమంత్రి ఆరోపిస్తున్నారు.

దక్షిణ సూడాన్
ఫొటో క్యాప్షన్, వరద నీటిలో కలువ పూల వేర్లు కోసం వెతుకుతున్న స్థానికుడు

‘ఆ నీరు తాగితే రోగాలు’

రొరియాక్‌కు దగ్గరగా ఉన్న ఓ అడవిలో బొగ్గు తయారుచేసేందుకు చెట్లు నరుకుతుంటారు. మహిళలు కూడా ఈ పనిచేస్తారు.

అడవికి చేరుకునేందుకు వాళ్లు వరదలతో నిండిపోయిన మురికి రోడ్ల మీద ఎనిమిది గంటల పాటు నడుస్తారు.

అంత కష్టపడి నడిచి వెళ్లిన తర్వాత వాళ్లకు అక్కడ దొరికేది కాలుష్యంతో నిండిపోయిన నీరే.వాటిని మరగబెట్టి తాగినప్పటికీ డయేరియా, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తున్నాయని న్యాకల్ అనే మహిళ చెప్పారు.

ఉపాధి కోసం తనకు బొగ్గు కావాలని, కానీ ఇందుకోసం వారం రోజుల పాటు తన ఏడుగురు పిల్లలను తన తల్లి దగ్గర వదిలిపెట్టి వెళ్లాల్సిఉంటుందని న్యేదా అనే మహిళ కన్నీరు తుడుచుకుంటూ చెప్పారు.

‘‘అది తప్ప నాకు చేయడానికి ఇంకేమీ లేదు’’ అని ఆమె అన్నారు. దేశరాజధాని బెంటియుకు సమీపంలో న్యేదా నివసిస్తున్నారు.

కల్లోల పరిస్థితులున్న ప్రాంతాలు, వరదలు ముంచెత్తిన ప్రదేశాల నుంచి వచ్చినవారితో నిండిపోయిన పునరావాస శిబిరంలో ఒక రెల్లుగుడిసెలో న్యేదా జీవిస్తున్నారు. ఇలా వచ్చిన 1,40,000 మంది ప్రజల్లో న్యేదా ఒకరు. ఈ ప్రాంతం మొత్తాన్ని వరదనీరు చుట్టుముట్టింది. మట్టిదిబ్బల వల్లే వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారు.

సహాయక శిబిరాల్లో కొంత ఆహారం ఇస్తారు. కానీ ఆ ప్రాంతంలో చాలా మంది నీటి కలువ వేర్లు, చేపల వేటపై ఆధారపడి జీవిస్తుంటారు.

సురక్షితమైననీళ్లు అస్సలు దొరకవు. దుస్తులు ఉతుక్కోవడానికి, వంటకు న్యేదా బోరు నీళ్లను ఉపయోగిస్తున్నారు. కానీ మంచినీళ్లు కొనుక్కోడానికి ఆమెకు డబ్బులు కావాలి.

 చమురు కాలుష్యం ప్రభావంతో పిల్లల్లో అంగవైకల్యం
ఫొటో క్యాప్షన్, చమురు కారణంగా నీరు కలుషితమైన ప్రాంతంలో ఈ బిడ్డ తల్లిదండ్రులు జీవిస్తున్నారని డాక్టర్లు బీబీసికి చెప్పారు

అవయవ లోపాల జననాలు

కాలుష్యం, పరిశుభ్రమైన నీళ్లు లేకపోవడం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఈ ప్రాంతానికి చెందిన ఆరోగ్య నిపుణులు, రాజకీయ నాయకులు బీబీసీతో ఆందోళన వ్యక్తంచేశారు.

బెంటియులోని ఓ ఆస్పత్రిలో ఒక మహిళ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చారు. ఆ పసికందు కన్ను, ముక్కు కలిసిపోయి ఉన్నాయి. ‘‘వాళ్లకు మంచినీళ్లు తాగే అవకాశం లేదు’’ అని బిడ్డకు వైద్యం చేస్తున్న డాక్టర్లలో ఒకరైన డాక్టర్ శామ్యూల్ పౌట్ చెప్పారు.

‘‘చమురు, నీళ్లు కలిసిపోయి ఉన్న నదిలోని నీటిని వారు తాగుతారు. అదే పెద్ద సమస్య కావొచ్చు’’ అని ఆయనన్నారు.

అవయవాలు లేకపోవడం, లేదా తల చిన్నగా ఉండడం వంటి లోపాలతో పిల్లలు పుడుతున్న కేసులు బెంటియు, రువెంగ్‌లో చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. యూనిటీ స్టేట్‌లో చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో రువెంగ్ ఒకటి.

లోపాలతో పుట్టే పిల్లలు రోజులు లేదా వారాల వ్యవధిలో చనిపోతారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

జన్యుపరీక్షల్లో అసాధారణలోపాలతో ఉన్న పిల్లల గురించి తెలుస్తుంది. కానీ ఆ ఆస్పత్రిలో అలాంటి సౌకర్యాలు లేవు.

ఇలాంటి కేసుల కోసం ప్రభుత్వం ఓ రిజిస్టర్ ఏర్పాటుచేయాలని డాక్టర్ పౌట్ కోరారు.

ఈ సమాచారాన్ని క్రమబద్ధంగా రికార్డు చేయకపోవడంతో అసాధారణంగా జన్మిస్తున్న పిల్లల వివరాల గురించి సరైన సమాచారం అందుబాటులో ఉండడంలేదు.

చమురు కాలుష్యం ప్రభావంతో పిల్లలు లోపాలతో పుడుతున్నారన్న సమాచారం నమ్మదగినదే అని యేల్ యూనివర్సిటీలో పర్యావరణ ఆరోగ్య నిపుణులు డాక్టర్ నికోల్ డేజియల్ చెప్పారు.

జన్యుపరమైన లోపాలు, తల్లి వయసు, పోషకాహారం, ఇతర ఇన్‌ఫెక్షన్లతో పాటు అసాధారణ జననాలకు పర్యావరణ కాలుష్యం ఓ కారణమని ఆమె తెలిపారు.

చమురు ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే కొన్ని వాయువులు గర్భస్థ శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని చెప్పారు.

పర్యావరణ ఆరోగ్య సమస్యలపై కొన్ని నివేదికలు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నాయని, అయితే క్రమబద్ధమైన డేటా లేకుండా ఈ విషయాన్ని ధ్రువీకరించడం కష్టమని ఆమె అన్నారు.

దక్షిణ సూడాన్‌లో కలుషిత నీరు
ఫొటో క్యాప్షన్, నీళ్లు మరగబెట్టితాగినా రోగాలు వ్యాపిస్తున్నాయి

కనిపించని మార్పు

జర్మన్‌కు చెందిన ప్రభుత్వేతర సంస్థ సైన్ ఆఫ్ హోప్ 2014, 2017లో యూనిటీ స్టేట్‌లోని చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇతర ప్రదేశాలపై అధ్యయనాలు నిర్వహించింది.

చమురు బావులకు దగ్గరున్న ప్రాంతాల్లో భారీ లోహాల సాంద్రత వారికి కనిపించింది. మనుషుల వెంట్రుకల శాంపిళ్లలో సీసం, బేరియం నమూనాలు కనుగొన్నారు.

చమురు ఉత్పత్తి నుంచి కాలుష్యం వస్తోందనడానికి వీటిని ఆధారాలుగా పరిశోధకులు భావించారు.

చమురు పరిశ్రమ ప్రభావంపై ప్రభుత్వం పర్యావరణ ఆడిట్ నిర్వహించింది. కానీ ఏడాది పైగా కాలం గడిచినా.. ఆ వివరాలు బయటకు రాలేదు.

చమురు కాలుష్యంపై దశాబ్దానికి పైగా కాలం నుంచి పాలకపక్షానికి చెందిన మేరీ అయెన్ మజోక్ ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు.

రువెంగ్‌కు చెందిన ఆమె ప్రభుత్వంలో సభ్యురాలు. దక్షిణ సూడాన్ పార్లమెంట్‌ ఎగువ సభ డిప్యూటీ స్పీకర్.

తన సొంత బంధువుల్లో ఒకరికి అంగవైకల్యంతో శిశువు జన్మించిందని ఆమె చెప్పారు. ఎవరేమన్నా అనుకుంటారేమోనన్న భయం, వైద్య సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో అసలు ఇలాంటివి చాలా కేసులు బయటకు రావడం లేదని ఆమె అంటున్నారు.

2011లో సూడాన్ నుంచి స్వాతంత్య్రం పొంది దక్షిణ సూడాన్ ఏర్పడింది. ‘‘ అయితే అనేక మూఢనమ్మకాలను, ఇతర చెడు సంప్రదాయాలను సూడాన్ నుంచి దక్షిణ సూడాన్ వారసత్వంగా పొందింది’’ అని మజోక్ చెప్పారు.

ఐదేళ్ల అంతర్యుద్ధానికి 2013లో తెరపడింది. సంక్షోభంతో ఉన్న దేశం చమురు నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

‘‘పర్యావరణ బాధ్యతను పెంచడమన్నది చివరి ప్రాధాన్యంగా మారింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

చట్టాలను, వ్యవస్థలను రూపొందించారు కానీ జవాబుదారీతనం అంత బలంగా లేదని ఆమె అన్నారు.

దక్షిణ సూడాన్‌లో మంచినీళ్ల కోసం ప్రజల అవస్థలు
ఫొటో క్యాప్షన్, డేవిడ్ బోజో లెజు

కాలుష్యంపై మాట్లాడితే..

‘‘చమురు గురించి మాట్లాడడం అంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యవహారాలను కదిపినట్టే’’ అని బోజో లెజు అన్నారు.

నిరాశ్రయునిగా స్వీడన్‌లో నివాసముంటున్న ఆయన అక్కడి నుంచి బీబీసీతో మాట్లాడారు.

చమురు కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వంపై దావా వేయాలని భావిస్తున్న దక్షిణ సూడాన్ లాయర్లు 2020లో ఆయన్ను సంప్రదించారు.

సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. కానీ భద్రతాసిబ్బంది ఆయన్ను నిర్బంధించారు. తన తలపై తుపాకీ పెట్టి తన సాక్ష్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డాక్యుమెంట్‌పై సంతకం చేయాలని బలవంతం చేశారని ఆయన తెలిపారు.

తర్వాత ఆయన దక్షిణ సూడాన్‌ను విడిచి వెళ్లిపోయారు. లాయర్లు ఆ కేసును కొనసాగించలేదు.ఈ ఆరోపణలపై స్పందించాలని బీబీసీ ఆయిల్ కన్సార్టియం జీపీఓసీ, దక్షిణ సూడాన్ ప్రెసిడెంట్ ఆఫీసును కోరింది. కానీ వారు స్పందించలేదు.

దక్షిణ సూడాన్

భవితపై ఆశ

వరదలు ఎప్పుడు తగ్గుతాయో దక్షిణ సూడాన్‌లోని శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.

పశ్చిమ హిందూమహాసముద్రంలో 2019లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని శాంటా బార్బరాలోని కరోలినా యూనివర్సిటీకి చెందిన వాతావరణ మార్పుల ప్రమాద సూచికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ క్రిస్ ఫంక్ చెప్పారు. అలాగే వాతావరణ మార్పులు లేకుండా ప్రపంచం ముందుకు వెళ్లడం అసాధ్యమని ఆయనన్నారు.

వేడిగాలుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. సముద్ర ఉష్ణోగ్రతలకు, 2019లో తూర్పు ఆఫ్రికాను ముంచెత్తిన అతితీవ్ర వర్షాలకు సంబంధముందని ఆయనన్నారు.

దక్షిణ సూడాన్‌లోకి నీటిని ప్రవహింపజేసే విక్టోరియా బేసిన్ చెరువు చుట్టూ అప్పటినుంచి అతిభారీవర్షాలు కొనసాగుతున్నాయని ఫంక్ చెప్పారు. అయితే ఈ కొత్త పద్ధతే ఎప్పటికీ కొనసాగుతుందా అన్నదానిపై స్పష్టత లేదన్నారు.

దక్షిణ సూడాన్‌లో ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఇంకా పెరుగుతాయని ఆయన అంచనా వేశారు.

వర్షాలు తీవ్రంగా కురవడం అనేది మరింత తీవ్రంగా ఉండబోతోందని, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల వేడి, తేమ పెరిగి దేశంలో కొన్ని ప్రాంతాలు నివాసానికి వీలులేని ప్రాంతాలుగా మారిపోతాయని ఆయన వివరించారు.

వరదలు, కాలుష్యం భయం ఉన్నప్పటికీ చాలామంది పశువుల పెంపకం, వ్యవసాయం వంటి పనులు తిరిగి చేయడానికి మళ్లీ ఇక్కడకు రావాలని భావిస్తున్నారు.

రొరియాక్ చిన్నారులు తమ ఆటల్లో భాగంగా ఆధునిక గుడిసెలు, ఆవులతో ఉన్న చిన్న గ్రామాన్ని తయారుచేస్తున్నారు.

బెంటియు దగ్గరలో ఓ మహిళ వరద నీటి పక్కన నీటి కలువ వేర్లను మెత్తగా చేస్తూ తాను ఎప్పటికైనా మళ్లీ ఓ ఆవును మేపాలనుకుంటున్నానని చెప్పారు.

‘‘వరద నీరు మొత్తం పోయాక నేను గడ్డిని పెంచుతాను. ఇందుకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాను’’ అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)