ఏపీ బడ్జెట్: హామీలకు, కేటాయింపులకు పొంతన కుదిరిందా? తల్లికి వందనం, నిరుద్యోగ భృతిపై ఏం చెప్పారంటే...

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్

ఫొటో సోర్స్, APDeputyCMO

ఫొటో క్యాప్షన్, ఏపీ బడ్జెట్ ప్రతులతో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు.

ఏపీలో ఇప్పటికే రెండుసార్లు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సోమవారం నాడు సభలో పెట్టింది పూర్తి స్థాయి బడ్జెట్‌. అయితే ఇది చివరి నాలుగు నెలల కాలానికి మాత్రమే.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

  • రెవెన్యూ వ్యయం రూ.2,35,916.99 కోట్లు
  • మూల ధన వ్యయం రూ.32,712.84 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు
  • ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు
  • రెవెన్యూ లోటు 4.19 శాతం
  • ద్రవ్యలోటు 2.12 శాతం

మరోవైపు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.

గడిచిన 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రూ.2,12,450 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.23,330 కోట్లు. రెవెన్యూ లోటు రూ.38,682 కోట్లు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ కేబినేట్

ఫొటో సోర్స్, X/AndhraPradeshCM

ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ సమావేశానికి ముందు ఏపీ కేబినేట్ భేటీ జరిగింది.

'ప్రత్యక్ష నగదు బదిలీ' మాటేమిటి?

2024 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు హామీలు ఇచ్చింది. అయితే బడ్జెట్‌లో వాటికి పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదని రాజకీయ పరిశీలకులు చెవుల కృష్ణాంజనేయులు అన్నారు.

సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

సూపర్‌ సిక్స్‌ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి హామీలు ఇందులో ఉన్నాయి.

ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడానికి మొదటి విడతలో రూ.895 కోట్లను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే 5 లక్షల మందికి గ్యాస్‌ రాయితీ చెల్లించినట్లూ పేర్కొన్నారు.

ఏపీ విద్యార్థులకు 'తల్లికి వందనం'

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘తల్లికి వందనం’ ఇచ్చారా?

తల్లికి వందనం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామని కూటమి ఉమ్మడి మేనిఫెస్టో- 2024లో ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రస్తావించారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం కింద ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు.

ఈ పథకానికి బడ్టెట్‌లో రూ.2,491 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

నిరుద్యోగ భృతిపై ప్రకటన?

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. కానీ ఇంతకు మించి వివరాలు చెప్పలేదు.

రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతి నెల రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ–జనసేనలు హామీ ఇచ్చాయి.

18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1,500 చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీలకు సంబంధించిన కార్యాచరణ బడ్జెట్‌ ప్రసంగంలో కనిపించలేదు.

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

రైతులకు పెట్టుబడి సాయం పూర్తిగా వస్తుందా?

సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు.

ఈ హామీ మేరకు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన బడ్డెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.4,500 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

''రాష్ట్రంలోని దాదాపు 52 లక్షల మంది రైతులకు ఎన్నికల హామీ ప్రకారం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇవ్వాలంటే రూ. 10,000 కోట్లకు పైగా అవసరం. ఈ లెక్కన సగం కంటే తక్కువ కేటాయింపులతో రైతులకిచ్చిన హామీ ఎలా అమలవుతుంది?'' అని రాజకీయ పరిశీలకులు చెవుల కృష్ణాంజనేయులు ప్రశ్నించారు.

అయితే కేంద్రం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు కలిపి రైతులకిచ్చిన హామీని నెరవేరుస్తుందని అధికార కూటమి నేతలు చెబుతున్నారు.

మొత్తంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ముడిపడి ఉన్న ఎన్నికల హామీల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనే చర్చ నడుస్తోంది.

శాఖల వారీగా కేటాయింపులిలా..

  • పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్ల కేటాయింపు
  • పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లు
  • జలవనరుల శాఖకు రూ.16,705 కోట్లు
  • రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15వేల కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లు
  • వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు రూ.9,554 కోట్లు
  • ఇంధన శాఖకు రూ.8,207 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.3,127 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ.4,102 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖకు రూ.2,326 కోట్ల కేటాయింపు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.1,215 కోట్ల కేటాయింపు
  • మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.4,285 కోట్ల కేటాయింపు
  • బీసీ సంక్షేమానికి రూ.39,007 కోట్లు,
  • షెడ్యూల్‌ కులాల సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు
  • షెడ్యూల్‌ తెగల కోసం రూ.7,557 కోట్లు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,376 కోట్లు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)