రష్యా, యుక్రెయిన్ డ్రోన్ యుద్ధం

రష్యా-యుక్రెయిన్ యుద్ధం, డ్రోన్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ డ్రోన్ దాడిలో కాలిపోతున్న ఇల్లు
    • రచయిత, అలెక్స్ బోయిడ్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా, యుక్రెయిన్‌లు పరస్పరం డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో డ్రోన్ దాడులు ఎప్పుడు జరగలేదు.

తమ దేశంలోని ఆరు ప్రాంతాల్లో యుక్రెయిన్‌కు చెందిన 84 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాటిలో కొన్ని రాజధాని మాస్కోను టార్గెట్ చేశాయి. దీంతో, మాస్కోలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్ నుంచి విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యుక్రెయిన్‌లోని ప్రతి భూభాగం వైపు శనివారం రాత్రి రష్యా 145 డ్రోన్లను ప్రయోగించగా, అందులో చాలా వాటిని ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.

ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రెండు దేశాలపై అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డోనల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశమున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘రోజూ 1500 మంది రష్యా సైనికులు మృతి’

మాస్కోపై యుక్రెయిన్ దాడికి ప్రయత్నించడాన్ని.... యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ‘అతిపెద్ద దాడి’గా ఆ ప్రాంత గవర్నర్ అభివర్ణించారు.

చాలా వరకు డ్రోన్లను రామెన్‌స్కోయ్, కొలోమ్నా, డొమోడెడోవో జిల్లాల్లో కూల్చివేశామని అధికారులు తెలిపారు.

రష్యా రాజధాని మాస్కోకు నైరుతి దిశలో ఉన్న రామెన్‌స్కోయ్‌లో జరిగిన డ్రోన్ దాడిలో నాలుగు ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. అయిదుగురు గాయపడ్డారు. 34 డ్రోన్లు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక మహిళ చనిపోయారు. గతేడాది మే నెలలో మాస్కోలో క్రెమ్లిన్‌కు సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేశారు.

అంతేకాదు, మాస్కో నగరంలో బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌పై అనేక డ్రోన్ దాడులు జరిగాయి.

యుక్రెయిన్‌లోని ఒడెసా ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ఇద్దరు గాయపడ్డారు. కొన్ని భవనాలపై నుంచి మంటలు చేలరేగుతున్నట్లు ఫొటోలలో కనిపించాయి.

రష్యా ప్రయోగించిన 62 మేడ్ ఇన్ ఇరాన్ డ్రోన్లను కూల్చివేశామని యుక్రెయిన్ వైమానిక దళం స్పష్టం చేసింది.

మరో 10 డ్రోన్లు తమ గగనతలాన్ని వీడి, రష్యాతో పాటు పొరుగున ఉన్న బెలారస్, మోల్డోవా వైపు తిరిగి వెళ్లాయని వైమానిక దళం తెలిపింది.

‘ఇనిస్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ డాటా’ సమాచారం మేరకు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదించిన వివరాల ప్రకారం.. 2022 మార్చి నుంచి ఈ అక్టోబర్‌లో అతిపెద్ద భూభాగాలను రష్యా పొందే క్రమంలో భారీగా డ్రోన్ దాడులు జరిగాయి.

“యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్టోబర్‌ నెలలోనే రష్యాకు అధిక ప్రాణ నష్టం వాటిల్లింది” అని యూకే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సర్ టోనీ రాడాకిన్ తెలిపారు. సండే విత్ లారా కున్స్‌బర్గ్‌ ప్రోగ్రామ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ నెలలో రోజూ సగటున 1500 మంది రష్యా సైనికులు చనిపోయారని ఆయన వెల్లడించారు.

యుక్రెయిన్, రష్యా, డ్రోన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా డ్రోన్ దాడిలో గాయపడిన యుక్రెయిన్ వాసులు

అమెరికా నుంచి పాజిటివ్ సిగ్నల్స్ : రష్యా

ఈ వివాదానికి ట్రంప్ ఎలా ముగింపు పలుకుతారు? అన్న దానిపై అనేక ఊహాగానాలున్నాయి.

అయితే, ఎలా చేస్తారు? వంటి వివరాలను ఆయన స్పష్టంగా చెప్పలేదు.

రష్యా నుంచి తమ భూభాగాల్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్న యుక్రెయిన్‌కు మద్దతివ్వడం కంటే శాంతి స్థాపన వైపే ట్రంప్ మొగ్గు చూపే అవకాశం ఉందని ట్రంప్ మాజీ సలహాదారు బ్రయాన్ లాంజా బీబీసీతో చెప్పారు.

అయితే, బ్రయాన్ వ్యాఖ్యలతో ట్రంప్‌కు సంబంధం లేదని ఆయన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బ్రయాన్ లాంజా ఇప్పుడు ట్రంప్ కోసం పని చేయటేద్లని ఆయన అన్నారు.

అమెరికా ప్రభుత్వం నుంచి ‘పాజిటివ్ సిగ్నల్స్’ అందుతున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియా ద్వారా తెలిపారు.

రష్యాను ఓడించాలనే తపన కంటే శాంతి స్థాపనకే మొగ్గు చూపుతామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో ట్రంప్ మాట్లాడారు.

ఆ సంభాషణ దాదాపు అరగంట సేపు సాగిందని బీబీసీకి సమాచారం అందింది.

రష్యాకు ఎదురెళ్తున్నప్పటికీ అమెరికా సాయం లేకుండా ఈ యుద్ధంలో గెలవలేమని జెలియెన్‌స్కీ గతంలో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)