మెలానియా ట్రంప్: ఈసారి కూడా ఒక ‘అంతు చిక్కని మహిళ’గానే కనిపిస్తారా?

మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండోసారి ప్రథమ మహిళ కాబోతున్న మెలానియా ట్రంప్
    • రచయిత, నదైన్ యూసిఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతి రోజు ప్రజలనుద్దేశించి సోషల్ మీడియాలో మెలానియా ప్రసంగించారు. “మెజారిటీ అమెరికన్లు మా మీద విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతల్ని కట్టబెట్టారు” అని అన్నారు.

“మేము స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కాపాడతాం” అని మెలానియా హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి కలిసి రావాలని కోరారు.

ఇది సంక్షిప్త సందేశం అయినప్పటికీ ఈసారి అమెరికా ఫస్ట్ లేడీగా ఆమెలో ఎలాంటి మార్పు ఉండవచ్చో సూచిస్తుంది.

2016లో డోనల్డ్ ట్రంప్ తొలిసారి గెలిచినప్పుడు, ఆయన భార్య మొదట్లో వైట్‌హౌస్‌లో కనిపించలేదు. తన కుమారుడితో కలిసి న్యూయార్క్‌లో ఉన్నారు. ఆమె కంటే ముందున్న ప్రథమ మహిళలు అనుసరించిన సంప్రదాయాలతో పోలిస్తే మెలానియా చాలా నిరాడంబరంగా కనిపించారు.

అయితే ఈసారి అమెరికా ప్రథమ మహిళగా ఆమె వ్యవహార శైలిని నిర్వచించడం కొంచెం కష్టమేనని, ఆమె ఎప్పటిలాగే తనదైన లైఫ్‌స్టైల్‌ను అనుసరించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

స్లోవేకియాలో పుట్టిన మెలానియా నవ్స్, మోడల్‌గా ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించి తర్వాతి కాలంలో మన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్‌లో ఆకర్షణీయ జీవితాన్ని గడుపుతూ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఓవల్ ఆఫీసులోకి అడుగు పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెలానియా ట్రంప్

మెలానియా ఎక్కడ?

మెలానియాను కొంతమంది ‘అంతు చిక్కని మహిళ’గా అభివర్ణించారు. తన ముందున్న ఫస్ట్ లేడీస్‌కు భిన్నంగా, ప్రజల్లో కనిపించడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. వైట్‌హౌస్‌లోనూ, ఎన్నికల ప్రచారాల్లోనూ పెద్దగా ప్రసంగించేవారు కాదు.

“ఆధునిక ప్రథమ మహిళలతో పోల్చుకుంటే ఆమె ప్రత్యేకమైన వ్యక్తి” అని మిషెల్ ఒబామా, మెలానియా ట్రంప్ పుస్తకాల రచయిత, బోస్టన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ టమ్మీ విజల్ అన్నారు.

“ఆమె చేయాల్సిన పనులను తాననుకున్న విధానంలో చేస్తారు. తాను అనుకున్నదాంట్లో చాలా వరకు సాధిస్తారు.” అని విజిల్ చెప్పారు.

ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతూ అనేక కేసులు ఎదుర్కొంటున్న సమయంలో ఆమె ఎవరి దృష్టిలో పడకుండా జాగ్రత్తపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో ఆమె కనిపించకపోవడంతో అనేక వార్తా కథనాల్లో “మెలానియా ఎక్కడ” అన్న ప్రశ్నలు వినిపించాయి.

అయితే కీలక సందర్భాల్లో అంటే 2022లో తాను మరోసారి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నానని ట్రంప్ ప్రకటించినప్పుడు ఆమె తెరపైకి వచ్చారు.

2024 జులైలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సమావేశాలకు మెలానియా హాజరయ్యారు. అయితే ఆమె ఆ సమావేశంలో ప్రసంగించకుండా గత సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారు.

ఆమె మాట్లాడేటప్పుడు మాత్రం, పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు.

మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గతంలో వివాదాల్లో చిక్కుకున్న మెలానియా ట్రంప్‌

ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని దెయ్యంతో పోల్చిన భార్య

ఎన్నికలు రోజుకు కొన్ని వారాల ముందు మాడిసన్ స్క్వేర్‌లో భర్త ఎన్నికల ప్రసంగానికి ముందు ఆమె చిన్న ప్రసంగం చేశారు. అందులో న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న నేరాల వల్ల నగర ప్రతిష్ట దెబ్బ తింటోందని దాన్ని కాపాడేందుకు ట్రంప్ ప్రస్తావిస్తున్న శాంతి భద్రతల గురించి ఆమె పాయింట్ల వారీగా వివరించారు.

ట్రంప్ మీద జరిగిన తొలి హత్యా ప్రయత్నం గురించి కూడా ఆమె మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిని దెయ్యంగా పోల్చిన మెలానియా, అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు.

ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు, మీడియా విషపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారని, దీని వల్లే ట్రంప్ మీద దాడి జరిగిందని ఫాక్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెలానియా చెప్పారు. ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం చాాలా అరుదు.

అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలతో మెలానియా విభేదించారు. అబార్షన్‌కు అనుకూలంగా తన వైఖరిని ప్రకటించారు. అయితే రో వర్సెస్ వేడ్ చట్టాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆమె ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఊహాగానాలకు దారి తీసింది.

తన మోడలింగ్ కెరీర్, భర్త పట్ల తనకున్న ఆరాధన, తమ మధ్య గతంలో ఉన్న రాజకీయ విభేధాలు లాంటి అంశాల గురించి మెలానియా ఒక పుస్తకం రాశారు. అయితే ఆ వివాదాలకు సంబంధించిన వివరాలను వ్యక్తిగతంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.

రెండోసారి ప్రథమ మహిళ కాబోతున్న మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్

2021లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మెలానియా

2020 ఎన్నికల్లో ట్రంప్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినప్పుడు, మరి కొన్ని వివాదాస్పద సందర్బాల్లో మెలానియా బహిరంగంగా ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు.

“ఫలితాలను ప్రశ్నించింది నేనొక్కరినే కాదు” అని ఆమె తన పుస్తకంలో రాశారు. 2021 జనవరి 6న అమెరికన్ కాంగ్రెస్‌పై దాడి గురించి “ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు” అని రాశారు. ఎందుకంటే అప్పుడు తాను తన పనుల్లో ఉన్నానని చెప్పారు.

2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు అమెరికన్ కాంగ్రస్ మీద దాడి చేయడాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేయాలని తాను మెలానియాను కోరారని, అయితే అందుకు ఆమె తిరస్కరించారని మెలానియా మాజీ ప్రెస్ సెక్రటరీ స్టీఫెన్ గ్రీషమ్ చెప్పారు. ఈ అంశం గురించి తన పుస్తకంలో రాశారు.

మెలానియా ప్రకటన జారీ చేసేందుకు తిరస్కరించడంతో తాను రాజీనామా చేసినట్లు గ్రీషమ్ చెప్పారు. అసలు మెలానియా అమెరికా ప్రథమ మహిళ అనే పాత్రను ఎంజాయ్ చేశారా లేదా అని కొంత మంది వ్యాఖ్యాతలు ప్రశ్నించారు.

“మొదట కొంత అయిష్టతతో ఉన్నప్పటికీ ప్రథమ మహిళ అనే హోదాను ఆమె ఎంజాయ్ చేశార”ని ఆమె ఆత్మకథ రాసిన వారిలో ఒకరైన సీఎన్ఎన్ రిపోర్టర్ కేట్ బెన్నెట్ చెప్పారు.

“వైట్‌హౌస్‌లో నివసిస్తూ ప్రథమ మహిళగా లభించే అన్ని సౌకర్యాలను ఆమె ఇష్టపడ్డారు. ఆమె వాటన్నింటినీ ఆనందించారనే నేను అనుకుంటున్నాను.” అని బెన్నెట్ 2021లో పీపుల్ మేగజైన్‌కు తెలిపారు.

మెలానియా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండోసారి అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న మెలానియా

ప్రథమ మహిళ హోదాను ఎలా ఉపయోగించుకుంటానంటే...

“ప్రథమ మహిళ అనే వేదికను మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలనే దానికి చాలా బలమైన అవగాహన ఉంది” అని ఆమె తన ఆత్మకథలో రాసుకున్నారు. 1999లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటి తన బాయ్‌ఫ్రెండ్ డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడితే, తాను మాజీ ప్రథమ మహిళలైన జాక్విలైన్ కెనడీ, బెట్టీ ఫోర్డ్‌‌లను తనకు మార్గదర్శకులుగా భావిస్తానని, వాళ్లు “చాలా సంప్రదాయబద్దంగా” జీవించారని మెలానియా చెప్పారు.

మిసెస్ కెనడీ ఫ్యాషన్ ఐకాన్. ఆమె వైట్‌హౌస్‌ను తనదైన శైలిలో మార్చేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. మిస్సెస్ ఫోర్డ్ మాత్రం హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి హక్కుల కోసం పోరాడేవారు. అబార్షన్ హక్కులు, మహిళల హక్కుల కోసం ఆమె గళమెత్తారు.

ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెలానియా ప్రథమ మహిళగా వాషింగ్టన్ చేరుకున్నారు. ప్రథమ మహిళ విధుల్లో భాగంగా అమెరికా వచ్చే వివిధ దేశాల నేతలకు లంచ్ ఏర్పాటు చెయ్యడం, అధికారిక విందుల నిర్వహణ లాంటి కార్యక్రమాలను చూసేవారు.

వైట్ హౌస్ ఎలా ఉండాలి, వైట్‌హౌస్‌లో ఎలాంటి మార్పులు చేయాలి లాంటివాటి గురించి ఆదేశాలు జారీ చేసేవారు. వీటితో పాటు క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. (కొన్నిపనులు సరిగ్గా చేయకపోవడంపై ఆమె ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలను వైట్ హౌస్ సిబ్బంది చిత్రీకరించారు కూడా.)

మెలానియా వస్త్ర ధారణ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండేది. అలాగే వివాదాస్పదం కూడా అయ్యేది. ప్రత్యేకంగా ఆమె 2018లో వలసదారుల పిల్లల్ని చూడటానికి వెళ్లినప్పుడు ఆమెధరించిన జాకెట్ మీద రాసిన సందేశం వివాదాస్పదంగా మారింది. ‘ఐ డోంట్ కేర్, యు? (నేను దేన్నీ లెక్క చెయ్యను, మరి మీరు?) అని రాసి ఉన్న కోటును ధరించారు.

ఆమె జాకెట్ మీద రాసిన ఆ సందేశం ‘నన్ను వ్యతిరేకించే వారిని, తరచుగా విమర్శించే వామపక్ష మీడియాను ఉద్దేశించి’’ అని తర్వాత చెప్పారు.

మెలానియా ఒక సందర్భంలో మాట్లాడుతుండగా ఆమె మాజీ స్నేహితురాలు, సీనియర్ సలహాదారు రహస్యంగా చిత్రీకరించారు. ఈ వీడియోతో మెలానియా ఇబ్బంది పడ్డారు. వలసదారుల పిల్లల్ని వారి కుటుంబాల నుంచి వేరు చేయాలన్న ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఆ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆమె తర్వాత చెప్పారు. తాను వలసదారుల పిల్లల్ని వారి కుటుంబాల నుంచి వేరు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ట్రంప్‌తో చెప్పానని తెలిపారు.

ఇక మీదట ఈ విధానాన్ని అమలు చెయ్యడం లేదని 2018 జూన్‌లో డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

మెలానియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భర్త, కొడుకులతో మెలానియా

సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు

ప్రథమ మహిళగా అనుభవం లేకపోవడంతో తొలి రోజుల్లో మెలానియా ఇబ్బందిపడ్డారని ప్రొఫెసర్ విజిల్ చెప్పారు. ఆమె టీమ్‌కు కూడా రాజకీయంగా అనుభవం లేదని, వారు ఆమెకు విధేయులుగా లేరని అన్నారు.

అయినప్పటికీ మెలానియా పిల్లల సమస్యల్ని లేవనెత్తడం, తన సంస్థ ‘బి బెస్ట్’ ద్వారా ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాటడం ద్వారా ఎప్పుడూ బిజీగా గడిపేవారని ప్రొఫెసర్ విజిల్ చెప్పారు.

ట్రంప్ సోషల్ మీడియాను దూకుడుగా ఉపయోగిస్తూ ఉంటడంతో, ఆమె ఆన్‌లైన్ విమర్శలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. 2016లో సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్‌లైన్‌లో తాను నిర్వహించిన కార్యక్రమాలు, తన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపాయని, తనను ఇబ్బందుల్లో పడేశాయని ట్రంప్ చెప్పారు.

ఓపియోడ్ ఔషధాన్ని పిల్లలకు ఎక్కువగా ఉపయోగించం వల్ల ఏర్పడిన సంక్షోభానికి వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ఆనాథలైన పిల్లల విద్య కోసం ఫౌండేషన్ ఏర్పాటుచేశారు.

ఆమె మరోసారి వాషింగ్టన్‌లో అడుగు పెడితే ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారని అనేక మంది భావిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పూర్తి సమయం ఉంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

ఇటీవలి కాలంలో ప్రథమ మహిళ పాత్ర విస్తృతం అయిందని ప్రొఫెసర్ విజిల్ అన్నారు. “ప్రజా జీవితంలో తాను ఎంత వరకు ఉత్సాహంగా పాల్గొనాలనే దాని గురించి మిసెస్ ట్రంప్ నిర్ణయం తీసుకుంటారు.” అని ఆయన చెప్పారు.

“అంతే కాకుండా ఆమె మరింతగా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాల్గొంటారని అనుకుంటున్నాను.” అని విజిల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)