‘నా భర్తను బలవంతంగా సైన్యంలో చేర్చారు, కొన్ని నెలలకే ఆయన చనిపోయారు’

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్ అంతర్యుద్ధంలో సైన్యం కోసం పోరాడేందుకు బలవంతంగా సైన్యంలో చేర్చుకునే సమయంలో, తన భర్తను చివరిసారి మార్చిలో చూశారు చావ్-సు .
ఆ తర్వాత నాలుగు నెలలకు యుద్ధంలో తన భర్త మరణించినట్లు చావ్-సు తెలుసుకున్నారు.
‘‘మేం చాలా పేదోళ్లం. బతకడం కోసం రోజూ ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ, ఆయన లేని జీవితం భరించలేనిది.’’ అని ఆమె అన్నారు.
జీవనాధారం కోసం పూర్తిగా భర్తపైనే ఆధారపడిన 25 ఏళ్ల చావ్-సు, ఇప్పుడు ముగ్గురు పిల్లలను తానే పోషించాలి.
వ్యక్తిగత గోప్యత కోసం ఈ కథనంలో పేర్లను మార్చి రాశాం.

ఫొటో సోర్స్, Reuters
18 నుంచి 35 ఏళ్లున్న పురుషులు, 18 నుంచి 27 మధ్య వయసున్న మహిళలు తప్పనిసరిగా రెండేళ్ల పాటు మియన్మార్ సైన్యంలో పనిచేయాలని అక్కడ పాలనలో సాగిస్తున్న జుంటా సైన్యం ఫిబ్రవరిలో ప్రకటించింది.
2021లో తిరుగుబాటు చేసి ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని దించేసినప్పటి నుంచి వాలంటరీ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్(పీడీఎఫ్‌లు), జాతి సాయుధ సమూహాలతో సహా పలు గ్రూప్‌ల నుంచి జుంటా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

వివిధ జాతి సాయుధ సమూహాలు, రెసిస్టెన్స్ గ్రూప్‌ల నుంచి సైనిక పాలనపై నెలకొన్న తిరుగుబాటుతో మియన్మార్ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటోంది.
గత ఏడాది తిరుగుబాటుదారుల నుంచి సరికొత్త దాడులను జుంటా చవిచూసింది. ఈ దాడులతో సైనిక పాలన విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్లింది.
ఫలితంగా, దశాబ్దాలుగా సైనిక పాలన, అణచివేతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మూడింట రెండు వంతుల మంది జనాభా, రెసిస్టెన్స్ గ్రూప్స్ నియంత్రణ కిందకు వచ్చింది.
దేశ అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చునుందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రజల్ని నిర్బంధంగా సైన్యంలో చేర్చుకుంటూ జుంటా తన పోరాటాన్ని మరింత పెంచుతోంది.
నిర్బంధంగా సైన్యంలో చేర్చుకున్న వారి శిక్షణ తొలిసారి ఏప్రిల్‌లో మొదలైంది.
‘ నేను పూర్తిగా స్థిమితం కోల్పోయాను’
జూలై నెలలో చావ్-సు కు ఆమె భర్త కాల్ చేశారు. అప్పుడు గ్రామంలో ఇద్దర్ని ఈ శిక్షణకు పంపుతున్నారని, వారిలో ఒకరు తానని చావ్-సు భర్త చెప్పారు.
కరెన్ రాష్ట్రానికి తనని పంపుతున్నట్లు చెప్పారని ఆమె తెలిపారు. జుంటాకు, జాతి సాయుధ సమూహాలకు మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్న ప్రాంతం అది.
‘‘రెండు వారాల పాటు ఫ్రంట్‌లైన్‌కు తనను పంపుతున్నారని ఆయన చెప్పారు. బేస్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాల్ చేస్తానన్నారు’’ అని చావ్ బీబీసీకి చెప్పారు. ఆయన తొలి, చివరి సందేశం ఇదేనని కన్నీళ్లు పెట్టుకున్నారు.
జూలై చివరిలో సైనిక అధికారి ఒకరు తన భర్త చనిపోయినట్లు చావ్‌కు చెప్పారు.
‘‘ఆ మాట విన్న తర్వాత, నేను పూర్తిగా స్థిమితం కోల్పోయాను. అధికారి తన మాటల ద్వారా నన్ను ఓదార్చాలని చూశారు. కానీ, నా జీవితం అయిపోయిందని అనిపించింది’’ అని చావ్ అన్నారు.
చాలామంది మాదిరిగానే, ఆమె భర్త సేవలకు సంబంధించిన వేతనాన్ని చావ్-సుకి ఇస్తామని అధికారులు చెప్పారు.
కానీ, తనకు కేవలం గ్రామ అధికారుల నుంచి 70 వేల క్యాట్‌లు (సుమారు రూ.1,772) అందినట్లు చావ్ సు తెలిపారు.
తొలిసారి ఆమె భర్తను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకున్నప్పడు ఎంతైతే ఇచ్చారో అంతే మొత్తం ఇది.
తొలి చెల్లింపు తర్వాత, ఆమెకు ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. నెలల తరబడి ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సర్వీసులో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే, సైనికుల మాదిరిగానే పరిహారం, వేతనం అందుతుందని సైన్యం చెప్పింది. కానీ, అవసరమైన డాక్యుమెంట్లు సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ ఉంటుందని జుంటా సైన్య అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ చెప్పారు.
మియన్మార్ వ్యాప్తంగా ప్రజల్ని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుని సరైన శిక్షణ ఇవ్వకుండానే, తక్కువ సపోర్టుతో ఘర్షణ జరిగే ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీంతో, తరచూ వీరి కుటుంబాలు చీకట్లోకి మగ్గిపోతున్నాయి.
ఆరు నెలల కిందట నిర్బంధంగా సైన్యంలో చేరిన తన కొడుకు గురించి 60 ఏళ్ల వయసున్న సో సో ఆయ్‌కు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. తన కొడుకుకు అసలు సైన్యంలో పనిచేయాలనే ఆలోచనే లేదన్నారు.
‘‘తల్లి ఆకలి తీర్చేందుకు నా కొడుకు సైన్యంలో చేరాడు’’ అని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన కొడుకుని సైన్యంలోకి వెళ్లనిచ్చినందుకు చాలా బాధపడినట్లు చెప్పారామె.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. చిన్న కూతురే ఆమెను చూసుకుంటున్నారు. కొడుకు తిరిగి వస్తాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘‘నా కొడుకును చూడాలనుకుంటున్నా. ఈ బాధను భరించేందుకు నా దగ్గర శక్తి లేదు’’ అని సో సో ఆయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Kan Htoo Lwin Facebook
‘సైన్యాన్ని ద్వేషిస్తున్నాను’
బలవంతంగా సైన్యంలో చేర్చుకునే విధానాన్ని అడ్డుకునేందుకు చాలామంది బర్మీస్ యువత గట్టిగా పోరాడుతున్నారు.
యాంగూన్‌లోని మియన్మార్ కమర్షియల్ క్లబ్ చెందిన 20 ఏళ్ల కాన్ టూ ల్విన్ 30 మందితో కలిసి మూడు నెలల పాటు సైనిక శిక్షణ తీసుకున్నారు.
ఆ శిక్షణ చాలా కఠినంగా ఉందని, ఎవరైనా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే, వారి ఇళ్లను కాలబెడతామని బెదిరించారని ఆయన చెప్పారు.
‘‘శిక్షణ తర్వాత, నేను సైన్యాన్ని ద్వేషిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
దేశంలోని తూర్పు ప్రాంతంలో ఫ్రంట్‌లైన్‌కు వెళ్లేటప్పుడు, వారి కాన్వాయ్ మధ్యలో ఆగినప్పుడు మరో ఇద్దరితో కలిసి కాన్ టూ ల్విన్ తప్పించుకున్నారు.
‘‘చీకటి పడగానే మేం తప్పించుకున్నాం. వారు ఆ సమయంలో భద్రతా తనిఖీల్లో ఉన్నారు’’ అని కాన్ టూ ల్విన్ గుర్తుకు చేసుకున్నారు.
‘‘కొంతదూరం పరిగెత్తాక మాకు అలసటగా అనిపించింది. విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగాం. ఎవరైనా వస్తారేమోనని గమనించుకుంటూ వంతులు వంతులుగా నిద్రపోయాం.’’ అని చెప్పారు.
తెల్లారిన తర్వాత, ఈ ముగ్గురు ఒక ట్రక్కు డ్రైవర్ సాయంతో, దక్షిణాన ఉన్న షాన్ రాష్ట్రంలోని ఆంగ్ బాన్ అనే పట్టణానికి చేరుకున్నారు.
అక్కడే కాన్ టూ ల్విన్ రెసిస్టెన్స్ గ్రూప్‌లలో ఒకటైన పీడీఎఫ్‌లో చేరారు.
జుంటా సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు చాలా మంది యువత ముందుకు వచ్చి, ఆయుధాలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం మరో ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారని, భద్రతా కారణాల చేత వారేం చేస్తున్నారో తాను చెప్పలేనని కాన్ టూ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నా ఇబ్బందుల వర్ణించడం చాలా కష్టం’
బలవంతంగా సైన్యంలో చేర్చుకునే విధానంతో పురుషులతో పాటు, మహిళలు కూడా ప్రభావితులవుతున్నారు.
పీడీఎఫ్‌లో ఒక యూనిట్ అయిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్(ఎస్ఓఎఫ్)లో చైనీస్ ట్రాన్స్‌లేటర్‌గా చేరారు యాంగాన్‌కు చెందిన 20 ఏళ్ల జ్యూ జ్యూ.
‘‘ప్రస్తుతం నా లక్ష్యం ఈ సైనిక నియంతృత్వ పాలను అంతమొందించి, మా తరానికి శాంతిని చేకూర్చాలి’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.
ఇతరులు దేశం విడిచి పారిపోతే, జ్యూ జ్యూ మాత్రం అక్కడే ఉండాలనుకున్నారు.
బలవంతంగా సైన్యంలో చేర్చుకునే విధానం ప్రారంభమైన తర్వాత ఇంజనీర్ మిన్ మిన్ దేశం విడిచి థాయ్‌లాండ్ పారిపోయారు.
ప్రస్తుతం ఆయన ఎడ్యుకేషన్ వీసాపై అక్కడ ఉంటున్నారు. కానీ, బ్యాంకాంక్‌లో ఆయన అర్హతకు తగ్గ పనిని వెతుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
మిన్ మిన్ మాదిరిగా చాలామంది దేశం విడిచి థాయ్‌లాండ్ పారిపోయి, తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు.
అక్రమ వలసదారులను పట్టుకునేందుకు థాయ్‌లాండ్ అధికారులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే, వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే.
తన వీసా కాలం తీరుతుందేమోనని మిన్ మిన్ ఆందోళన పడుతున్నారు. అలా జరిగితే, ఆయన అక్రమంగా ఆ దేశంలో ఉండాల్సి వస్తుంది.
‘‘ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చాలా భయంగా ఉంది’’ అని ఈ 28 ఏళ్ల యువకుడు చెప్పారు. ‘‘నాకు మరో దారి లేదు. వలస కార్మికుల మాదిరిగా పని చూసుకోవాల్సిందే’’ అని తెలిపారు.
‘‘చట్టవిరుద్ధంగా అక్కడ పనిచేసే బర్మీస్ ఇంజనీర్లను చూశాను. వారికి కేవలం సుమారు 12 వేల థాయ్ బట్ (రూ.29,441)ను చెల్లిస్తారు. వలస కార్మికులకు ఇచ్చే జీతానికి అది సమానం’’ అని ఆయన తెలిపారు.
ఇక మియన్మార్‌లోని తన గ్రామంలో ఏవో పనులు చేసుకుంటూ, చావ్-సు తన పిల్లల్ని పోషిస్తున్నారు.
‘‘నేను పడుతున్న ఇబ్బందులను ఇతరులకు వివరించడం చాలా కష్టం’’ అని చావ్-సు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














